కథ

నాన్నొస్తే..!?

ఏప్రిల్ 2015

డమటి పొద్దు వాలిపోతోంది. సూర్యుడి సిందూరపు రంగు సాయంత్రపు చీకటితో కలిసి విచిత్రమైన వర్ణాన్ని పులుముకుంటోంది. గూళ్ళను చేరుకోవడం ఆలస్యమైన పక్షులు ఎదురుచూస్తున్న బిడ్డల కోసం వడిగా పరుగిడుతున్నై. పగలంతా పొదల్లో అఙాత వాసం చేసిన కీచురాళ్ళు రాత్రి సంగీతపు కచేరీకి గొంతు సవరించుకుంటున్నై. ఊరంతా సాయంత్రపు కట్టె పొయ్యిల పొగ చుట్టబెడుతోంది.

చిన్ని కల్పన తన నేస్తాలతో గుడిసె ముందట ఆడుకుంటోంది. ఆనందంతో మెరిసిపోయే కళ్ళు, ఎగిరిపడే పిలకజళ్ళతో కల్పన పేదరికాన్ని వెక్కిరించే మహలక్ష్మి లాగుంటుంది. ఎనిమిదేళ్ళ కల్పనకు నాన్నంటే ప్రాణం.

పూరింటిని ఆవరించిన చీకటిని తరమడానికై కల్పన తల్లి లాగే చిన్ని దీపం కొట్టుమిట్టాడుతోంది. పగలంతా ఆనందంగా నాన్న కోసం ఆశగా ఎదురుచూసే కల్పన, నాన్నను ఇంటికి తెచ్చే చీకటితో పొద్దు తిరుగుడు పువ్వులా ముడుచుకు పోతుంది.

‘ అమ్మలూ ఎక్కడున్నావ్?’ వెళ్ళి స్నానం చెయ్యి.’ అమ్మ అరుస్తోంది.

‘ ఒక్క నిముషం అమ్మా’ కల్పన సమాధానం చెప్పింది కానీ కదల్లేదు.

‘ కదులమ్మా, నాన్నొస్తాడూ’ కల్పన కిష్టమైన నానమ్మ గారాబుగా వారించింది.

నాన్న పేరు వినగానే కల్పన భయంతో వణికి పోయింది. పరిగెత్తుకుంటూ స్నానానికి వెళ్ళింది. గబ గబా అన్నం తిని ఆరుబయట నులక మంచం మీదకు చేరింది. పడుకుందే కానీ నిద్ర రావడం లేదు. నానమ్మ వచ్చి కధ చెప్పాలిగా మరి. కానీ నానమ్మ ఎందుకో రావడం లేదు.

చీకటి ఇంకా దట్టంగా ముసిరింది. ఆకాశంలోని నక్షత్రాలు మరింత ప్రకాశంగా మెరుస్తున్నై. అడవికి దగ్గరగా ఉన్న ఆ చిన్ని పల్లెకు ఒకటే బస్సు. బస్సు దిగాక ఐదారు మైళ్ళు నడిచి వెళ్ళితే గానీ ఆ గ్రామాన్ని చేరుకోలేరు. చుట్టుపక్కల పెట్రోలు బంకులు కూడా లేకపోవడంతో ఆటోలు కూడా తిరగవు. ఒంటెద్దు బళ్ళు జోడెద్దుల బళ్ళే గత్యంతరం. పట్నం నుండి ఆఖరి బస్సు దిగి వస్తున్న బళ్ళ గంటల చప్పుళ్ళు దూరం నుంచీ వినవస్తున్నై. కల్పనకు నాన్న గుర్తొచ్చాడు. నాన్న కూడా వస్తూ వుండి వుంటాడు.

కల్పనకు అందరిపిల్లల లాగే నాన్నంటే చాలా ఇష్టం. ఆమె చిన్న తనం చాలా ఆనందంగా గడిచింది. కల్పన వాళ్ళ నాన్న చాల కధలు చెప్పేవాడు. చిన్న పిల్లవాడిలాగే ఎగురుతూ, దూకుతూ, ఆడుతూ, పాడుతూ కల్పనను కవ్వించేవాడు. కల్పనను వీపునెత్తుకుని పొలానికి తీసుకెళ్ళేవాడు. కల్పనను విడిచి క్షణం కూడా వుండే వాడు కాదు. పొలం దగ్గర కాలవలో కాళ్ళు పెట్టించి తెప్పలు కొట్టించేవాడు. తిరిగి వచ్చేటప్పుడు అమ్మ, నానమ్మ మొక్కజొన్న తట్టలు మోస్తుంటే, నాన్న కల్పనను భుజాలపైకెత్తుకుని నవ్విస్తూ పరుగెత్తే వాడు.

‘అప్పట్లో నాన్నెంత నవ్వించేవాడో?’ అంతలో బయట వినిపించిన కేకలకు మంచం దిగి బయటకు పరుగెత్తుకొచ్చింది కల్పన. నాన్నే! కల్పనకు పరుగెత్తుకుంటూ వెళ్ళి నాన్న కాళ్ళను చుట్టేసుకోవాలనిపించింది. ఈ రోజు నాన్నను ఆశ్చర్య పరిచే విషయం ఒకటి ఉంది. స్కూల్లో పద్యాల పోటీ, ఆటల పోటీల్లో ప్రైజులొచ్చాయి. టీచరైతే పాటలు బాగా పాడినందుకు చాలా మెచ్చుకుంది. ఒక మంచి బొమ్మను కూడా బహుమతిగా ఇచ్చారు. ఆటల పోటీల్లో గెలిచినందుకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా నాన్నకు చూపుదామనుకొంది. నాన్న ఎత్తుకుని గిర గిరా తిప్పి హత్తుకుని ముద్దు చేస్తాడనుకుంది. బయటకు తీసికెళ్ళి చాక్లెట్లు కొనిపెడతాడనుకుంది.

కానీ నాన్నను చూస్తే చాలా భయమేసింది. కల్పన గబాల్న మంచం మీదకు చేరి ముఖం మీదకు దుప్పటి లాక్కుని సంభాషణను వినసాగింది. తాను దుప్పటి లోంచీ జరుగుతున్న తతంగమంతా కూడా చూడగలదు. నాన్న లోపలకొచ్చి గడప దగ్గర కూలబడ్డాడు. బాగా తాగి ఉన్నాడేమో లేచి నిలబడలేకపోతున్నాడు. పిచ్చిగా ఆవేశంతో మాట్లాడుతున్నాడు.

‘ మళ్ళీ వచ్చారా యెదవ నాయాళ్ళు ‘ అన్నాడు. మామూలుగా ఉంటే నాన్న ఎంత చక్కగా చదువుకున్న వాడిలా మాట్లాడతాడో? అనుకుంది కల్పన. నాన్ననలా చూస్తుంటే దుఃఖం ముంచుకొస్తోంది కల్పనకు.

‘ సరిగా కూర్చో’, ‘ఎవరూ? ఎవరొచ్చారు? ఎందుకట్లా రచ్చ చేస్తున్నావు?’ అనునయంగా అడుగుతోంది నానమ్మ.

‘ వాళ్ళేనే, దాని తమ్ముళ్ళు ‘ కల్పన తల్లిని చూపిస్తూ చెప్పాడు. లేచి నిలబడ లేక కూలబడి పోయాడు.

‘మళ్ళీ ఆ కొత్త అంగడిలో కూర్చుని తాగొచ్చి ఉంటాడు,’ అనుకున్న కల్పనకు ఈ మధ్యనే తెరిచిన ఆ అంగడిపై చాలా కోపమొచ్చింది. ఆ రోజు ఏం జరిగిందో తనకు బాగా గుర్తుంది. మల్లి గాడితో కలిసి తానూ చూడ్డానికి వెళ్ళింది. ఎవరో పెద్ద లీడరట వచ్చాడు. ఊరుకు రోడ్డు వేయిస్తామనీ, బస్సులొస్తాయనీ, ఆరో తరగతి స్కూలు కట్టిస్తామనీ అన్నీ చెప్పాడు. ఏవీ రాలేదు కానీ ఈ అంగడి మాత్రం వచ్చింది. సాయంత్రమయేసరికల్లా నాన్నలందరూ అక్కడే ఉంటారు. నానమ్మ ఎప్పుడూ ఆ అంగడిని తిడుతూనే ఉంటుంది. ఇంతలో మళ్ళీ పెద్ద శబ్దం రావడంతో మళ్ళీ అటువైపు చూసింది కల్పన.

కల్పన తల్లి వంట గదిలోంచీ పరిగెత్తుకొచ్చింది. తన తమ్ముళ్ళ ప్రసక్తి ఆమెకు ఆనందాన్నీ, బాధనూ సమానంగా పంచి పెట్టింది. నానమ్మ అమ్మను లోనికి పొమ్మని సైగలు చేస్తోంది. తన భర్త నలా చూసి లోపల కుములుతున్న కల్పన తల్లి అప్పుడే వెనక్కు తిరగ బోయింది.

‘ఏయ్ ఆగు.’ తండ్రి లేచినుంచుని ఆమెను ఆపబోయే ప్రయత్నం చేశాడు. పట్టుకున్న తలుపు లోనికి ఊగడంతో అదుపు తప్పి కల్పన తల్లి పాదాలపై పడిపోయాడు. కల్పనకు చాలా భయమేసింది. తర్వాత జరగబోయేదేంటో కల్పనకు తెలుసు. భయంతో వణికి పోతున్న తల్లిని తలుచుకుని బాధపడింది కల్పన. తండ్రి మళ్ళీ లేవబోయే ప్రయత్నం చేశాడు. కానీ నీరసంతో కృశించి ఉన్న తల్లి శరీరం వూతం ఇవ్వలేక పోయింది. ఇంట్లో గోడమీద లాంతరు నీడలో మైకంతో ఊగుతున్న తండ్రి నీడ పెద్ద దయ్యంలా కనిపించింది కల్పనకు.

నానమ్మ పరుగెత్తికెళ్ళి ఆప చూసింది. కానీ నాన్న మైకంలో తోసివేశాడు. ఈ రోజు యేం జరిగి ఉంటుందో కల్పనకు అర్ధమయింది. ‘తాగి డబ్బు వృథా చేసికోవద్ద’ని మామయ్యలు చెప్పి ఉంటారు.

అవును. అమ్మ కూడా యింట్లో డబ్బు లేదని చెప్తూనే ఉంది. వర్షాలు సరిగా పడక పోవడంతో ఉన్న రెండెకరాల పొలాన్ని తనఖా పెట్టి నాన్న అప్పు తెచ్చిన సంగతి అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. పొలం రెండేళ్ళుగా సరిగా పండటం లేదు. కూలి చేసి సంపాదించినదంతా తనఖా కట్టడానికే సరిపోతోంది. ఓ ఆరు నెలలనుంచీ నాన్న పక్క టౌన్లో ఉన్న మార్బుల్ ఫాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళు మళ్ళీ బాగానే గడిచాయి. మళ్ళీ మంచి రోజులొచ్చాయనుకునే సమయంలో నాన్న ఇలా అవడం అందర్నీ కలచి వేస్తోంది. అసలు మల్లీ వాళ్ళ నాన్న స్నేహం వల్లనే నాన్న ఇలా అయ్యాడు.

మంచి స్కూల్లో చేర్పిస్తానని, అమ్మ, నానమ్మకు మంచి బట్ట్లు కొనిస్తాననీ చెప్పిన నాన్న ఇలా అవడం , అమ్మ, నానమ్మ ఇప్పుడు కూలి పనికి కూడా పోతున్నారు. కల్పనకు దుఃఖం పొంగివస్తోంది. ఛీ, మల్లీ వాళ్ళ నాన్న లాగే నాన్న కూడా ఇంక మారడేమో! వాళ్ల ఇంట్లో జరిగిన విషయాలు తలచుకుని భయపడి పోయింది. పాపం !మల్లికి వాళ్ళ తాత తప్ప ఎవరూ లేరు. కప్పుకున్న దుప్పటి తీసి విసిరేసి మల్లిని చూసేందుకు పరిగెత్తింది.

ఇంట్లోని గొడవ సర్దుమణిగాక కల్పన తల్లీ, నానమ్మ నిట్టూరుస్తూ మంచం దగ్గరికి వచ్చారు. కల్పన లేకపోయేసరికి వాళ్ళకు కొంత కంగారు వేసింది. నానమ్మ వెంటనే కల్పనను వెతికేందుకు బయల్దేరింది. కల్పన అలిగితే, బాధ కలిగితే ఎక్కడకు వెళుతుందో నానమ్మకు తెలుసు. వెంటనే మల్లీ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అక్కడ కల్పన లేదు. మల్లిగాడు కూడా లేడు. దగ్గరలో ఉన్న గుట్ట మీదున్న గుడికి వెళ్ళింది. మల్లీ, కల్పన అక్కడ ఆడుకుంటూ కనిపించారు. ఎనిమిదేళ్ళ మల్లిగాడు కల్పనకు మంచి స్నేహితుడు. వాళ్ళనక్కడ చూసి ‘హమ్మయ్యా’ అనుకుంది.

‘ఏరా మల్లీ, ఈ మధ్య కనిపించడం లేదు?’ అంటూ ఇద్దరినీ బయల్దేర దీసింది. మల్లి గాడిని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వచ్చేదారిలో గుడ్డిగా వెలుగుతున్న వీధి దీపాల క్రింద కల్పనను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. బయటకెందుకు వచ్చిందో అడిగింది.

‘భయమేసింది నానమ్మా, మల్లిగాడిని చూడాలనిపించింది. పాపం వాడికెవరూ లేరు గదా. ఇద్దరం కలిసి దేముడికి దణ్ణం పెట్టుకున్నాం.’ అంది.

‘అమ్మలూ,దేముడ్ని ఏమని అడిగావు. నన్నడిగినట్లే నాన్నను కొట్టమని అడిగావా ?’ అంది నవ్వుతూ.

దానికి కల్పన ‘లేదు నానమ్మా, నాన్న మంచివాడే! నాన్న చేత తాగకుండా చేయించమని మన ఊళ్ళో పెట్టిన ఆ అంగడి తీసేయించమని అడిగాను. మళ్ళీ నాన్న మనతో సరిగా ఉండేట్లు చేయమని అడిగాను. నానమ్మా, నాకు నాన్నంటే చాలా ఇష్టం. నా తెలుగు వాచకం లోని నాన్నలా ఉండేవాడు. కథలు చెప్పేవాడు. నవ్వించేవాడు కదా. కానీ ఇపుడేమో రోజూ అందర్నీ తిడుతున్నాడు. అమ్మను కొడుతున్నాడు. అమ్మ దాచుకున్న డబ్బులూ దొంగతనం చేస్తున్నాడు. మల్లిగాడి వాళ్ళ నాన్న కూడా అంతే. నాన్నలు ఇంటి కొచ్చేది ఇందుకేనా. మన ఇంటి చూరులో పిచ్చికలు గూడు పెట్టుకున్నై చూశావా? వాటికీ బుజ్జి బుజ్జి పిల్లలున్నై. వాటిని ఎంతముద్దు చేస్తాయో తెలుసా? పొద్దున,సాయంత్రం అన్నీ కలిసి ఎంత సంతోషంగా ఉంటాయో తెలుసా? నాన్న అలా ఉన్నాడా నానమ్మా? మనమంటే ఇష్టముందా? ఈ వేళ స్కూల్లో పద్యాల పోటీల్లో ఫస్ట్ ప్రైజు ఇచ్చారు తెలుసా? నాన్నకు చూపించుదామని ప్రొద్దుట్నించీ దాచాను. నాన్న అసలు నన్ను చూశాడా? ఎత్తుకున్నాడా? ముద్దుకూడా పెట్టలేదు. నాన్నంటే నాకిష్టం. కానీ నాన్నే…’ కల్పన గుండె ద్రవించేలా వెక్కిళ్ళు పెడుతూ ఏడ్వ సాగింది.

నానమ్మకూ ఏం మాట్లాడాలో,ఎలా ఊరడించాలో తెలీడం లేదు. ఎండిన గుండె లాంటి పొలాన్నీ, తనఖా విడిపించుకోలేని తనాన్ని, కొడుకు నిస్సహాయతనూ, వ్యసనాన్నీ తలచి బరువెక్కిన హృదయంతో కదలలేక కల్పనను అక్కున చేర్చుకుంది. బాధల ఆకాశాన్ని అనంత కాలాల్నించీ మోస్తున్నఆమె ముసలి గుండె మూగపోయింది. నాన్నకు చూపించుదామని కల్పన ఆశతో దాచిన చిన్న బొమ్మ మరో మూగ సాక్షిగా దిండుక్రిందే నిద్ర పోతోంది.

**** (*) ****