కవిత్వం

సామాన్యుడి ప్రేమగీతం

జనవరి 2013

నిన్ను ప్రేమిద్దామని అనుకుంటాను కానీ, ఈ పాడు ఈగలే…

సరే. నువ్వు చెప్పు -ఎవరైనా
ఎలా ప్రేమించగలరు, చుట్టూ రయ్మని ఎగిరే ఈ ఈగలతో?

మరే, ఒకదానిని ఒకటి అతుక్కుని ఎం చక్కగా
ప్రేమించుకుంటున్నాయి ఈ ఈగలూ, దోమలూ:
ఎందుకంటే మరి వాటికి మన అవసరాలు లేవు

మరి మనం ప్రేమించుకోవాలంటే చాలా కావాలి-

సమయానికి నీళ్ళు రావాలి, గ్యాస్ రావాలి
కరెంట్ కావాలి రాళ్ళు లేని బియ్యం కావాలి
సమయానికి జీతం రావాలి పిల్లల ఫీజు కట్టి
ఉండాలి, కేబుల్వాడి బిల్లూ పాలవాడి బిల్లూ

పనిమనిషి జీతం అన్నీ తీరి ఉండాలి. కూరగాయలూ
కందిపప్పూ రిన్నూ లక్సూ సర్ఫూ పొద్దు పోకముందే
పిల్లల నిద్రా, టీవీ సీరియళ్ళూ ముఖ పుస్తకపు
అలజడీ…అన్నీ సద్దుమణగాలి, అన్నీ కుదరాలి

పగలంతా పనితో అలసిన నీకూ నాకూ ఓపిక ఉండాలి
రేపంటే భయంలేని తొందర లేని
అటువంటి సమయమూ కావాలి

మరి, ఇవేమీ లేని ఈ పాడు ఈగలతో దోమలతో ఎట్లా మనం?

సరేలే. వస్తూ తెస్తాను
ఇంట్లోకి, నిండుకున్న
ఫినాయిలూ, జెట్ మాట్లూ ఎప్పటినుంచో నువ్వు అడుగుతున్న
కొత్త చీపిరీనూ- మరిక

ప్రేమించుకుందామా మనం ఈ రాత్రికి?