కిటికీలో ఆకాశం

‘సుస్తీ’ స్థితిలో అంతరంగ ఆవిష్కరణ – శ్రీకాంత శర్మ పద్యం

సెప్టెంబర్ 2015

చిన్న విరామం అన్నది కూడా ఎరుగక, జీవితమంతా ఒక ఉరుకుల పరుగులమయంగా మారిన కాలం ఎంత దుర్భరంగా వుంటుంది! ఉరుకులు పరుగులతో విసిగిపోయినపుడు ‘జ్వరం లాంటిది వొచ్చినా బాగుండును – ఒక రెండు రోజులు ఇంటి పట్టున ఉండ వొచ్చును’ అని కూడా అనిపిస్తుంది కదా!

మరి, అకస్మాత్తుగా జబ్బు పడి, ఇంట్లోని ఒక గదికీ, ఆ గది లోని మంచానికీ పరిమితం కావలసిన ఒక అగత్యం లోనికి నెట్టబడినపుడు ఆ స్థితి ఇంకెంత దుర్భరంగా వుంటుంది?

అట్లాంటి ఒక స్థితిలో మనిషి- ఒక దిగులు దిగుడు బావిలోకి జారిపోతాడా? తాను నడిచి వొచ్చిన దారులను పునర్మూల్యాంకనం చేసుకుంటాడా? లేక, తన గది కిటికీలో నుండే మొత్తం బాహ్య ప్రపంచాన్ని దర్శించే ఒక ప్రయత్నం చేస్తాడా? అసలివన్నీ ఎందుకు గానీ, భావుకుడైన ఒక పండిత కవి ఈ స్థితిని ఒక కవితగా చెబితే ?!

జబ్బు చేసి మంచాన పడి వున్నప్పటి స్థితిని వర్ణించిన కవితలు తెలుగులో చాలా తక్కువ! అట్లాంటి కొద్ది కవితలలో, అద్భుతమైన కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ‘సుస్తీ ‘ కవిత కూడా వుంది.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు తెలుగు కవిత్వ లోకంలో అనుభూతి కవిగా ప్రసిద్ధులు. ఒక్క కవిత్వం మాత్రమే కాదు – నవలలు, విమర్శా వ్యాసాలూ, రేడియో కోసం ఎన్నో నాటికలు, యక్షగానాలు కూడా రాసారు. ఇవే కాకుండా, ‘చిన్నారి నవ్వు – చిట్టి తామర పువ్వు’ లాంటి మంచి సినిమా పాటలు కూడా కొన్ని రాసారు.

‘సుస్తీ’ కవిత, ‘విరామ చిహ్నాల విశేషార్థాలు లేవు – విశ్రాంతే విష్కంభం ‘ అన్న వాక్యంతో మొదలవుతుంది. ఉరుకుల పరుగుల కాలంలో ‘కొంత విశ్రాంతి దొరికితే చాలు’ ఆశపడే జీవితం – సుస్తీ చేసి మంచాన పడినపుడు దొరికే విశ్రాంతిని పెద్ద బాధగా భావించడమే ఐరనీ!

సుస్తీ

విరామ చిహ్నాల విశేషార్థాలు లేవు
విశ్రాంతే విష్కంభం
ముగిసిన నాటకాంకంలో క్రిక్కిరిసిన ఘటనలు
అంతరంగం ఇంత రణరంగాన్ని ఎన్నడూ ఎరగదు
ఎదుట ఎదురయే అంకం
సూత్రప్రాయంగా కూడా తెలియదు
నెలల తరబడి బల్లపరుపు దృశ్య సంచయాన్ని
భరిస్తోంది నా ఉనికి
గోడకి ఒక్కటే కిటికీ కన్ను
సూర్యాస్తమయాలలో రవ్వల జడి వెలుగులు
సవ్వడి చేయని మబ్బుల ఆకృతి నీడలూ ….
కిటికీలో నుంచి పచ్చగా వాలిన
చెట్టుకొమ్మ మాటు నుంచి
బయటి ప్రపంచం కాసేపు ధ్వని మాధ్యమంలో పలకరిస్తుంది
దీపాల వేళ కాగానే నా చెంపలు నిమిరి ధైర్యం చెప్పి
తను తన పని మీద వెళ్ళిపోతుంది
ఒంటరి తనపు తెల్ల గోడ మీద
నా నీడ కదలికలు చూసుకుంటూ
రాత్రంతా మేలుకుని కలలు కంటాను
దిండు కింద పెట్టుకున్న
కడచిన రోజుల జాబితాలో నుండి
మరో రోజుని కొట్టేసుకుంటాను
ఏదో మగత కమ్ముతుంది
కంటి మీద సూర్య కిరణం సుతారంగా తట్టగా మేలుకుని
తెల్ల వారినందుకు కృతజ్ఞతగా
మరొక రోజుని ఆహ్వానించుకుంటాను

సుస్తీ చేసి, మంచాన పడి, ఇంట్లోని గదికి పరిమితం అయినపుడు, దేహానికైతే విశ్రాంతిని ఇవ్వగలము గానీ అంతర్లోక ఆలోచనల ప్రవాహానికి విశ్రాంతి వుండదు కదా! ఒక్కోసారి, ‘అంతరంగం ఇంత రణరంగాన్ని ఎన్నడూ ఎరగదు’ అన్నంతగా ఈ ప్రవాహ ఉద్ధృతి వుంటుంది అని బాధపడుతున్నాడు కవి. ఊహలకు ఏ మాత్రం అందకుండా సాగిపోయే జీవిత వైచిత్ర్యాన్ని ప్రస్తావిస్తూ ‘ఎదుట ఎదురయే అంకం సూత్రప్రాయంగా కూడా తెలియదు’ అంటున్నాడు.

రోజుల తరబడి గదిలోని మంచానికి పరిమితమైన ఆ స్థితిలో, బయటి ప్రపంచాన్ని దర్శించడానికి మిగిలే ఆలంబన, గోడకు వున్న కిటికీ కన్ను తప్ప ఇంకేమి మిగిలి వుంటుంది? సూర్యాస్తమయాలలో కిటికీ లోనుండి గదిలోకి రాలి పడే కిరణాల వెలుగుల జడి తప్ప, కిటికీలోంచి కనిపించే చెట్టు కొమ్మల మాటు ప్రపంచం చేసే ధ్వనులు తప్ప గది లోని మంచానికి పరిమితమైన ఆ స్థితిలో పలకరించేది ఎవరు?

పగలు అట్లా పలకరించిన ప్రపంచం ‘దీపాల వేళ ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది’ అంటున్నాడు కవి. కిటికీలో నుండి కనిపించే దృశ్య సంచయం మార్పులేమీ లేకుండా బల్లపరుపుగా వుందని వాపోతున్నాడు. సుస్తీతో మంచానికి పరిమితమైనపుడు పగళ్ళను ఈదడం కన్నా రాత్రులని ఈదడమే చాలా కష్టం!

అప్పటిదాకా ధైర్యంగా ఎదుర్కొన్న ఒంటరితనం ఒక్క సారిగా ఆక్రమించి వేస్తుంది. అందుకే, ‘ఒంటరి తనపు తెల్ల గోడ మీద/నా నీడ కదలికలు చూసుకుంటూ/రాత్రంతా మేలుకుని కలలు కంటాను’ అంటున్నాడు కవి. రాత్రులను గడపడం ఎంత భారమో చెప్పేందుకు ‘రాత్రంతా మేలుకుని కలలు కంటాను’అనీ, ‘దిండు కింద పెట్టుకున్నకడచిన రోజుల జాబితాలో నుండి మరొక రోజుని కొట్టివేసుకుంటాను’ అనీ, ‘తెల్లవారినందుకు కృతజ్ఞతగా మరొక రోజుని ఆహ్వానించుకుంటాను’ అనీ అంటున్నాడు.

మరి, వృద్ధాప్యంలో, తీవ్ర అనారోగ్య సమస్యలతో, రోజుల తరబడి మంచం లోనే బతుకుని వెళ్ళ దీసే దురదృష్టవంతుల స్థితి ఏమిటి?

**** (*) ****