అమ్మల మీద పద్యాలు, కవిత్వాలూ తెలుగు సాహిత్యానికి కొత్త కాదు. ప్రాచీన సాహిత్యం మొదలుకుని, ఆధునిక సాహిత్యం దాకా అమ్మల మీద కవులు సృజించిన కవితలు కొల్లలుగా కనిపిస్తాయి. అందులో చాలా కవితలు అమ్మను దేవుడికి ప్రతిరూపంగా వర్ణిస్తాయి. బహుశా, ఒకప్పటి సాహిత్య సృజన అంతా బ్రాహ్మణీయ భావజాలంతో నిండిపోయివుండడం వలన ఆ రచనలలో అమ్మకు ‘దేవునికి ప్రతిరూపం’ అనే స్థానం లభించి వుంటుంది.
మరి, అట్టడుగు కులాల లోని తల్లుల పరిస్థితి ఏమిటి?
మొగుళ్ళు, మత్తు పదార్థాలకు బానిసలై ఇళ్ళను వొదిలేసి బలాదూర్లు తిరిగితే, పిల్లల్ని సాకడం కోసం భూస్వాముల పొలాలలో కూలీ పనులకు వెళ్లి అవమానాల పాలైన తల్లుల దుఃఖం, ఫ్యాక్టరీల కాలుష్యపు కోరలకు చిక్కి అనారోగ్యాల పాలై, పుట్టిన బిడ్డల్ని అనాధల్ని చేసిన తల్లుల దుఃఖం… ఇదంతా సాహిత్యం లోనికి తెచ్చేది ఎవరు?
బహుశా, ఆ జీవితాన్ని అనుభవించిన, ఆ తల్లుల కడుపున పుట్టిన సృజనకారుల వల్లే అది సాధ్యమేమో ?!
అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి ఊర్లో అమ్మి పొట్ట పోసుకునే తల్లి పైన అద్భుతమైన కవిత ఒకటి ప్రముఖ మరాటీ కవి వామన్ నింబాల్కర్ రాసాడు. అందులో ఇట్లా అంటాడు –
‘ సాయంత్రం అమ్మ కోసం మా గుడిసె గుమ్మం ముందు ఎదురు చూస్తూ వుండగా
చుట్టూ వున్న ఇళ్ళల్లో నుండి మా ముక్కులు అదిరిపోయే వంటల వాసన
మా కడుపుల్లో మాత్రం భయంకర చీకటి కల్లోలం’
నింబాల్కర్ ఈ కవితలో ఇంకా అంటాడు –
‘ఒక రోజు పాము కాటుకు అమ్మ చనిపోయింది
మేము అనాథలం అయిపోయాం
ఇప్పటికీ తలపై కట్టెల మోపుతో నల్లని బక్కపలచని స్త్రీ ఎవరు కన్పించినా
వెళ్లి ఆ మోపునంతా కొనేస్తాను’
తెలుగు సాహిత్యంలో దళిత కవిత్వం ఒక సునామీలా వొచ్చింది. అది స్వీకరించిన వస్తువులు, ఎంచుకున్న భాష, తెలుగు సాహిత్యానికి కొత్త సవాళ్లు విసిరాయి. తరాల అవమానాల దుఃఖాన్ని చెప్పడానికి అగ్ర కులాలను అవహేళన చేస్తూ కవితలు కట్టింది. ముఖ్యంగా, అప్పుడప్పుడే కవులుగా రంగప్రవేశం చేసిన మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు కవితలలో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది.
తెరేష్ బాబు ఈ ధోరణిలో రాసిన కవితల నడుమ తన తల్లి పైన రాసిన ‘మట్టి బలపం’ కవిత ఒక అపురూపమైన కవిత. పైకి అమ్మ గురించే చెబుతున్నట్టు కనిపించినా ఇది తెరేష్ రాసుకున్న ఆత్మ కథాత్మక కవిత! బహుశా, అట్టడుగు దళిత వాడల లోని తల్లులందరి వెతల కథ!
తెరేష్ తన ఈ ‘మట్టి బలపం’ కవితలో ఏమంటున్నాడో చదవండి!
మట్టి బలపం
భూగోళానికి వున్న ఒకే ఒక్క జీవ లక్షణం అమ్మల్ని కనడం
కదుల్తూ కూడా కదలనట్టుండే జీవనది పేరు అమ్మ
1963 వ సంవత్సరం నవంబర్ 3 వ తేదీన
పైడి సుబ్బులు అమ్మ అయిందిజాము పొద్దు కాడనే లేచి
జానెడు ఆకల్ని గుప్పిట్లో పెట్టుకుని
చెప్పుల్లేని కాళ్ళు రెండు వరి నాట్ల కోసం పరుగెత్తినట్లు జ్ఞాపకం
బొట్టు బొట్టుగా పొదుపు చేసుకున్న రక్తాన్ని
టుబాకో కంపెనీ పొగాకు బేళ్ళ మీద చిలకరించిన జ్ఞాపకం
ఆరుగాలం అరవచాకిరీకి
బోనసుగా అందిన కుచ్చి నరాల పోట్లకి
ఉతుకుతున్న చీరెని మెలేసి పిండినట్లు
శరీరం లోంచి బాధను పిండుకుంటూ విల విల్లాడిన జ్ఞాపకం
పుగాక్కాడ ఈనెను చీల్చినట్లు
దారిద్ర్యం అమ్మను రెండు చీకటి తుంపులుగా చీల్చిన జ్ఞాపకం
చీకటి పడ్డాక ఇంటి దారి పట్టిన గ్రేడింగ్ కార్మికుల బిడారులో
అమ్మ ముఖాన్ని గుర్తు పట్టడం నాకు రోజువారీ పరీక్ష
దూరంగా కన్పించే అమ్మను నా నవ్వుతోనే కావిలించుకోవడం కోసం
రోడ్డువార లైబ్రరీ బేస్ మట్టం మీద నా రెండు కళ్ళూ కాయలై రాలిన జ్ఞాపకం
అమ్మ తెచ్చే తాయిలాలు నాకెందుకు
సాయంకాలానికి భద్రంగా ఇల్లు చేరే అమ్మే ఒక అద్భుతమైన తాయిలంఅమ్మను రెక్కల కష్టం మింగేసింది
పొగాకు పరిశ్రమ అమ్మను సిగరెట్టూ చేసి కాల్చుకుంది
ఒంగోలు కట్టుకున్న బాధల గది పేరు అమ్మ
సుబ్బులమ్మ ధీమా అంతా తన కొడుకు అచ్చరాలు దిద్దుతున్నాడనేనా బాల్యమ్మీద అల్లుకున్న రాత్రుల్లన్నీ ఆంప శయ్యలె
సారా సీసాలు నాన్నల్ని తాగేక
నాన్నలు అమ్మల్ని కాల్చుకు తింటుంటారు
అమ్మలు ఎదురుచూపుల్ని నములుతూ చాప మీద మూడంకెలేసాక
కూటి కుండలు కుక్కల పాలైన జ్ఞాపకంచిల్ల కంపలు ఎండుమోపులయ్యేది అమ్మల కోసం
దిగడానికి చోటు దొరకదేమని
ఒంటి మీద తుమ్మ ముళ్ళు ఎన్నో సార్లు అలిగిన జ్ఞాపకం
ఆసామి గారి చేను పరిగలయ్యేది అమ్మల కోసం
ఏరుకున్న వేరు శనగల్తో గాక ఆసామి నాలుక
చరుపులతో పైట చెంగు మూటలు బరువెక్కినట్టు జ్ఞాపకంనా ఒంట్లో వున్న ప్రతి జీవకణం
అమ్మ నుండి కోసుకొచ్చుకున్నదే
నేననే వాడిని ప్రత్యేకించి ఎట్లా ఉంటానో నాకిప్పటికీ అంతు పట్టదు
అమ్మను చూడాలనుకున్నపుడల్లా
నన్ను నేను అద్దంలో చూసుకుంటాను
అద్దంలో కనబడని గుండెకాయ మాత్రం
ఒంగోలు గుమ్మంలో కొడుకు ఉత్తరం కోసం ఎదురు చూస్తూ వుంటుంది
నేను అక్షరాన్నైతే అమ్మ మట్టి బలపం!
‘భూగోళానికి వున్న ఒకే ఒక జీవ లక్షణం అమ్మ/జీవనది అమ్మ’అంటూ కవిత ప్రారంభించడం లోనే, తనకు, తన తల్లికీ, మట్టికీ, నదికీ వున్న ఒక అవిభాజ్య సంబంధాన్ని చెప్పాడు. పదునైన వ్యంగ్యం తెరేష్ కవిత్వంలో ప్రస్పుటంగా కనిపించే లక్షణం. ఈ లక్షణం, ఒక్కోసారి కవి లక్ష్యంగా చేసుకున్న అగ్ర వర్ణాలను బెంబేలు ఎత్తించిన దాఖలాలు కూడా వున్నాయి. తెరేష్ వ్యంగ్యానికి మరొక వైపు కూడా ఎంత పదును వుందో ఈ ‘మట్టి బలపం’ కవిత చెబుతుంది.
‘తల్లి పొట్ట చేత పట్టుకుని పొద్దున్నే కూలీ పని కోసం వెళ్ళేది’ అని చెప్పడానికి, ‘ జానెడు ఆకల్ని గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళేది’ అంటాడు. ‘టొబాకో కంపెనీ పని తల్లి రక్తాన్ని పీల్చి వేసింది’ అని చెప్పడానికి ‘బొట్టు బొట్టుగా పొదుపు చేసుకున్న రక్తాన్ని టుబాకో కంపెనీ పొగాకు బేళ్ళ మీద చిలకరించిన జ్ఞాపకం’ అంటాడు. మరింత ముందుకు వెళ్లి, ‘పుగాక్కాడ ఈనెను చీల్చినట్లు దారిద్ర్యం అమ్మను రెండు చీకటి తుంపులుగా చీల్చింది’ అంటాడు.
‘పొగాకు పరిశ్రమ అమ్మను సిగరెట్టూ చేసి కాల్చుకుంది ‘ అని దుఖ పడతాడు.రోజూ కూలి పని కోసం పొద్దున్నే ఇల్లు వొదిలి వెళ్ళే తల్లిని చూసే పిల్లవాడి మానసిక స్థితి ఎట్లా వుంటుంది? వాడు, సాయంత్రం ఇంటికి వొచ్చిన తల్లి చేతిలో తాయిలం కోసం వెతుక్కుంటాడా? ‘అమ్మ తెచ్చే తాయిలాలు నాకెందుకు/ సాయంకాలానికి భద్రంగా ఇల్లు చేరే అమ్మే ఒక అద్భుతమైన తాయిలం’ అని త్రుప్తి పడతాడు కదూ! ఈ కవిత చదివే క్రమంలో ఈ పాదాల దగ్గర అనుకోకుండా మీరు ఒక కుదుపుకు గురై వుంటారు కదూ!
చివరికి, ‘అమ్మను చూడాలనుకున్నపుడల్లా / నన్ను నేను అద్దంలో చూసుకుంటాను ‘ అంటూ ఈ కవితని పతాక స్థాయికి తీసుకు వెళ్ళాడు తెరేష్!
కవీ, మమ్మల్నిట్లా అర్థాంతరంగా వొదిలి వెళ్ళిన నిన్ను చూడాలనుకున్నపుడల్లా మేమేం చేయాలి?
బహుశా, నీ కవితను ఒక దాన్ని ఇట్లా మననం చేసుకుంటాము!
(నవంబర్ 3, పైడి తెరేష్ బాబు జయంతి సందర్భంగా)
**** (*) ****
ఇరవైయ్యొవ శతాబ్ధంలో తెలుగు సాహిత్యం కనిన ఒక అద్భుతం పైడి తెరేష్ బాబు. ఆయనను కనిన ‘ఒంగోలు సుబ్బులమ్మ’ ఆవిష్కరణ అతి మనోహరంగా ఉంది
గు0డె బరువెక్కింది మిత్రమా…
అద్భుతమైన విశ్లేషణ విజయ కుమార్ గారూ. తెరేష్ బాబుని చక్కగా ఆవిష్కరించారు. జీవితంనుంచి ఎంచుకున్నవిశేషణాలు చెప్పినంత గాఢంగా బయటనుండి ఎరువుతెచ్సుకున్న మెటఫర్లు చెప్పలేవు. తనలో అమ్మని చూసుకోగలగడం కంటే గొప్ప నివాళి ఏముంటుంది?
హృదయపూర్వక అభినందనలు.
రమా సుందరి గారు – వర్మ గారు – మూర్తి గారు – కృతజ్ఞతలు !
కవిత్వం గురించి నా కంతగా తెలియదు. కానీ ఈ కవితా చాలా బాగుంది.
కవిత పరిచయం చాలా బాగుంది
తెరేషన్న గుర్తొచ్చినపుడల్లా కవితొకటి వెతుక్కుని చదూకుంటున్నాం. మంచి ట్రిబ్యూట్ అన్నయ్య గారూ