కళ్ళు మిరిమిట్లు గొలిపేలా
చంద్రుడు ఆకాశంలో మెరిస్తే నేమిటి
ఆ చిట్టడవి చివర చెట్లగుబురులతో
చుక్కలు దోబూచులాడితే నేమిటి?
తుప్పలునరికి, చదునుచేసీ కలుపుతీసీ
మనిషి విత్తు నాటవలసిందే,
దానికి రక్షణగా దడికట్టినపుడు
హెచ్చరికగా తెల్లగీత గీయవలసిందే.
.
అందమైన వయిలెట్ పువ్వులగురించీ
మనుషులు చేసే పనులు చెప్పడానికీ
వానలా పెద్దచప్పుడు చేసుకుంటూ
దేముడు వస్తేనేమిటి?
నా మెదడుకి పదునుపెడుతూ
నా పాట్లు నే పడవలసిందే
నాకు తెలిసిన అన్న మాటల్లోంచి
ఒక సత్యాన్ని ఆవిష్కరించవలసిందే.
***
ఓరిక్ గ్లెండన్ జాన్స్
జూన్ 2, 1887 – జులై 8, 1946.
అమెరికను కవి, నాటక కర్తా
ఓరిక్ జాన్స్, టీ ఎస్. ఏలియట్, స్కాట్ ఫిజెరాల్డ్, ఎర్న్ స్ట్ హెమింగ్వే మొదలయిన హేమా హేమీల సాహిత్యవేత్తల కూటమిలో ఒకడు. అతను 5 కవిత్వ సంకలనాలు వెలువరించేడు. 1912 లో The Lyric Year అన్న పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ఎడ్నా సెంట్. విన్సెంట్ మిలే పై గెలుపొందాడు. కాని తర్వాత విషయాలు తెలుసిన తర్వాత తనకి అనుకూలంగా వచ్చిన నిర్ణయం న్యాయబద్ధమైనది కాదు అని చెప్పిన ఔదార్యుడు.
ఇక్కడ కవి వ్యవసాయంలోంచి ఉపమానం ఇస్తున్నట్టు కనిపించినా, అది నిజమైన వ్యవసాయానికి సంబంధించినది కాదు. ఇక్కడ దేముని ఉనికితో సంబంధంలేకుండా,(ఉన్నా లేకపోయినా), మనిషికి ఉన్న పెద్ద సమస్య అల్లా “సత్యాన్ని” ఆవిష్కరించడం. దానిని నిర్వచించుకోడానికి సరియైన పదాలని, ఎంచుకోవడం. సరియైన పదం దొరకనపుడు కొత్తపదాలని సృష్టించుకోవడం. వాటి పరిమితులు నిర్ణయించుకోవడం. ఇక్కడ తుప్పలూ డొంకలూ నరకడం, మొట్టమొదటి తరం వారు జ్ఞానమనే రహదారి ఏర్పరచడానికి పడే పాట్లు. మాటలనీ, ఆలోచనలనీ ఒక గాడిలో పెట్టి, తమకి తెలిసిన విజ్ఞానమనే విత్తు నాటాలి. దానికి ఉన్న అర్థాల పరిమితులను దడిలా గీసి చెప్పాలి. కొంతకాలంపోయిన తర్వాత పాతమాటలకి కొత్త అర్థాలు వస్తాయి. గాని, పాత వాటిని అర్థం చేసుకుందికి, పాత అర్థంలోనే వాటిని గ్రహించాలి తప్ప కొత్త అర్థాలతో అన్వయించకూడదు. అదే దడి కట్టడం. దేముడు ఎన్ని సందేశాలు చెప్పినా, మనిషి, తనకున్న పదసంపద పరిథిలోనే సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. ఇంకెవ్వరూ వచ్చి సత్యాన్ని ఆవిష్కరించరు.
మంచి పద్యం మూర్తిగారూ..డెఫినిట్ గా మూలాన్ని ఆమూలాగ్రం అనువదించారనే అనుకుంటున్నాను. కానీ ముగింపుచదివాక టైటిల్ మార్చాల్సిందేమోనన్న భావనకలగక తప్పదు. ఎలాగూ సత్యాన్ని ఆవిష్కరించే మార్గం తెల్సినప్పుడు ఇక విషమపరిస్థితి ఏముంది? మరేదైనా జస్టిఫికేషన్ ఉంటె తప్ప…రెండో స్టాంజా నచ్చిందినాకు అన్నింటికంటే
వాసుదెవ్ గారు,
మీ స్పందనకి కృతజ్ఞతలు. శీర్షిక విషయంలో నా ఉద్దేశ్యం కవి ఏమిటిచెయ్యాలో తెలుసు కాని అది ఎలాచెయ్యాలో తెలియని విషమ పరిస్థితి గురించి చెప్పాడని. ఉదాహరణకి, కాళహస్తి మాహాత్యంలో ధూర్జటి ఇలాంటి పరిస్థితే నత్కీరుడు ఎదుర్కొన్నప్పుడు ఈ క్రింది పద్యం రాస్తాడు. సందర్భం ఒకసారి పాండ్యదేశంలో చెప్పరాని కరువొస్తుంది. ఒక ఊరు ఊరంతా చెట్టో పుట్టై ఖాళీ అయిపోతుంది. ఊర్లో శివుడ్ని నమ్ముకుని గుడిలో సేవచేసుకునే పూజారికూడా, దేముడికి భద్రం చెపుతూ స్వామీ నీ సంగతి ఇక నువ్వుచూసుకో కరువు తీరిన తర్వాత మళ్ళీ వస్తానని అని శలవుతీసుకోబోతుంటే, శివుడు తానొకపద్యం రాసి అతనికిచ్చి,పాండ్యరాజు కవిహృదయుడనీ, దాన్ని చూపిస్తే కరువుతీరేదాకా తగినన్ని మాడలిస్తాడనీ చెప్పి పంపిస్తాడు. తీరావెళ్తే అక్కడ నత్కీరుడు ఈ పద్యం బాగులేదు పొమ్మని ఆక్షేపించి తగిలేస్తాడు. ఆ విషయం వెనక్కి వచ్చి శివుడితో మొరపెట్టుకుంటే ఆ పూజారిని తీసుకుని శివుడే స్వయంగా రాజసభకు వెళతాడు. అక్కడ రసవత్తరమైన రస చర్చ జరుగుతుంది.శివుడు వాదనలో గెలవలేక నత్కీరుడిని తక్షణమే కుష్టురోగపు బారిని పడమని శపిస్తాడు. అప్పుడు నత్కీరుడు కాళ్ళమీదపడి బ్రతిమలాడితే, శివుడు కైలాస శిఖరం చూస్తే శాపవిమోచనమౌతుందని చెప్పి మాయమౌతాడు. అప్పుడుచెప్పిన పద్యం:
ఎన్ని మహానదుల్, వనములెన్ని, గిరీంద్రములెన్ని, బోయవీ
ళ్లెన్ని, మృగంబులెన్ని, జనహీనములైన పథంబులెన్ని, నే
నిన్నియుదాటి ఏ కరణి నీశ్వరు శైలము చూడబోయెదన్,
కన్నదిగాదు విన్నయదిగాని సదాశివ! ఏమిచేయుదున్.
అలాగ కొన్ని సందర్భాలలో గమ్యం తెలుస్తుంది కాని చేరేమార్గమే దొరకదు. అదే విషమపరిస్థితి.