అనువాదం

మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 2

జూన్ 2016

ఆత్మ తత్త్వం

తాబ్దాల ఆలోచనా స్రవంతితో మానవ స్వభావం గురించీ, విశ్వం స్వభావం గురించీ తత్త్వశాస్త్రం ఒక సత్యాన్ని ప్రకటించింది, ఆ పని ఒక్క తత్త్వశాస్త్రం మాత్రమే చెయ్యగలదు. ఆ సత్యం అందరికీ చెప్పాలి అందరూ తెలుసుకోవాలి. పిల్లలలకి చిన్నప్పటినుండీ క్రమంగా పరిచయం చెయ్యాలి; అది వాళ్ళకి చెబుతున్నకొద్దీ, దానిమీద వాళ్ళు పరిశ్రమ చేస్తున్న కొద్దీ వాళ్ళకి దానిమీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం చదువుని అర్థం అయ్యేలా చేస్తుంది; జీవితం అంటే అవగాహన కలిగిస్తుంది; అది సవ్యంగా ఆలోచించగలిగిన ప్రతి వారూ ఆహ్వానిస్తారు, కారణం అది మానవాళి ఆకాంక్షలకి సమాధానాలు చెబుతుంది. దాన్నే మనం “ఆత్మ తత్త్వం” అంటాము.

తత్త్వశాస్త్రం ‘మన’లోని ఒక భాగానికి “ఆత్మ” అని పేరుపెట్టింది… దానికీ కొన్ని కోరికలుంటాయిగాని, అవి శరీరానికి ఉండే కోరికలవంటివి కావు. ఈ ఆత్మని దాని కోరికలద్వారా తెలుసుకోవచ్చు; వాటిని సంతృప్తి పరచడానికి వేరే మార్గాలు కావాలి. ఆత్మకీ ఒక స్వభావం ఉంది, అది దాని ప్రాధాన్యతని స్థిరపరచుకుని, మానవ స్వభావం గురించీ, ఈ సృష్టి స్వభావం గురించీ కొన్ని నిర్దుష్టమైన సత్యాల్ని ప్రకటించింది… వాటిని ఎవరికి వారు స్వయంగా పరీక్షించి నిర్థారించుకోవచ్చు. ఈ ఆత్మతత్త్వం ఏమిటి చెబుతుందంటే, ఆత్మ మూడు ముఖ్యమైన విషయాలు కోరుకుంటుందనీ… ఆ కోరుకోవడం వాటిని అందుకోవడం కోసమే తప్ప వేరే ఇతర ప్రయోజనాలు ఆశించి కాదనీ. అది మంచిపని చెయ్యడంకోసం ఏది మంచో తెలుసుకోవాలనుకుంటుంది, ఏది సత్యమో తెలుసుకుందికి సత్యం స్వభావం ఏమిటో తెలుసుకోవాలనుకుంటుంది; ఆ మూడవకోరికని ఇంత స్పష్టంగా చెప్పలేను గాని, ప్రస్తుతానికి వేరే వ్యాఖ్యానాలేవీ చెయ్యకుండా సౌందర్యాన్ని కోరుకుంటుందని మాత్రం చెబుతాను (65-నుండి 68 పేజీలలో దీన్ని నిర్వచించడానికి ప్రయత్నించేను). ఈ మూడు కోరికలూ, ఈ మూడే మూడు కోరికలు … ఆత్మ కోరుకునే కోరికలు; వీటికీ మిగతాకోరికలకీ ఉన్న తేడా ఏమిటంటే, ఈ కోరికలని అవిగా అందుకుందికీ, లేదా తీర్చుకుందికీ తప్ప వేరే ప్రయోజనం ఆశించి ప్రయత్నం చెయ్యకూడదు, నిజానికి చెయ్యలేము కూడా. ఉదాహరణకి, నాకు లాభం కలుగుతుంది కదా అని నేను మంచిని కోరుకుంటే, నేను మంచిని కోరుకుంటున్నట్టు కాదు, కోరుకుంటున్నది దానివల్ల పొందబోయే లబ్దిని. నేను ఏది సరియైనదో అది చేస్తాను. కాసేపు, అలా చెయ్యడానికి కారణం ‘సరిగా చెయ్యడానికి’ మించి ఏదో స్వలాభం ఉంది అనుకుందాం. అప్పుడు నా లక్ష్యం అపసవ్యంగా ప్రవర్తించడం వల్ల నెరవేరుతుందనుకుంటే దాన్ని సాధించడానికి నేను అపసవ్యంగా కూడా ప్రవర్తించి ఉండొచ్చు, కనుక నేను సత్యాన్ని కనుక్కోవడం దానివల్ల పొందబోయే లాభకోసం అయినప్పుడు, నా లక్ష్యం సత్యం తెలుసుకోవడం కాదు, దానివల్ల పొందబోయే ప్రయోజనం. పొందబోయే ప్రయోజనం ఆధారంగా సత్యాన్ని నమ్మవలసి వచ్చినప్పుడు, నా లక్ష్యం ఏది అసత్యమో దాన్ని నమ్మమని చెబుతుంది, దానివల్ల నాకు లాభం చేకూరుతుంది కనుక. నిజానికి సత్యాన్ని తెలుసుకుందికి ఒకటే మార్గం: దాని ప్రయోజనం సత్యాన్ని తెలుసుకోవడమేనా లేక వేరే ప్రయోజనం ఆశించా అన్నదానిబట్టి; అలాగే సరియైన మార్గంలో నడవడం దానికోసమే, వేరే ప్రయోజనం కోసం కాదు.

ఆత్మకి మూడే మూడు కోరికలు కాబట్టి, దానికి అనుగుణంగా మూడే మూడు కార్యాచరణలు కూడా ఉన్నాయి:అవి, నైతికవర్తన, మేధోపరిశ్రమ, సౌందర్యాన్వేషణ. మనిషి ఆత్మ తత్త్వపు ఈ మూడు కోరికలూ తీర్చుకుందికే కృషిచేస్తాడు, దానికి వేరే కారణం అంటూ ఏదీ ఉండదు. జీవితం గురించి చెప్పే ఏ ఇతర సిద్ధాంతమైనా, దానిని ఎలా నిర్వచించినా, దాని అంతరార్థం ఇదే: మనిషి జీవించాలి కాబట్టి జీవిస్తాడు, నిరంతరం అతని కార్యకలాపాలనన్నిటినీ ఈ ఉన్నతమైన విలువలు ఖండిస్తూనే ఉంటాయి. అయితే, ఈ ఉన్నతమైన విలువలూ, కార్యాచరణలూ జీవించడానికి అవి అంత ముఖ్యమైనవి కానపుడు, ఎందుకు వీటిని ఉన్నతమైనవిగా మనిషి పరిగణిస్తున్నాడో చెప్పలేము. కాని ఆత్మతత్త్వం … “జీవించడమనే ప్రక్రియ” వీటిని అందుకునే పరిశ్రమకంటే దిగువస్థాయి కార్యకలాపమనీ, మనిషి కేవలం బ్రతకడం కాకుండా, ఈ మూడుకోరికలనీ తీర్చుకుందికి ప్రయత్నించినపుడు, అతని జీవితం కూడా సంతృప్తికరంగా ఉంటుందనీ… చెబుతుంది.

ఇది తత్త్వశాస్త్రపు ముసుగులో ఉన్న వేదాంత సిద్ధాంతం కాదు. ఇది అనుభవం నుండివచ్చినది, కనుక, అనుభవానికి హత్తుకుంటుంది. మంచిని మంచికోసమే అనుసరించినపుడు, మనిషి మంచిగా ఉండడమే గాక, మంచితనం అంటే ఏమిటో అర్థం చేసుకోగలడని ప్రయోగాత్మకంగా ఋజువుచెయ్యబడ్డది. మనిషికి స్వతహాగా మంచిని కోరుకునే గుణం ఉంది, అది కేవలం మంచిని మంచికోసం అనుసరించినపుడే ఆ కోరిక ఈడేరుతుంది. సత్యం విషయంలోనూ అంతే. అలాగే ఆత్మతత్త్వానికి చెందని కార్యకలాపాలు కొనసాగించినపుడు దీనికి విరుద్ధమైన అభిప్రాయం కూడా నిజమని అనుభవం చెబుతోంది. అవి ఎప్పుడూ సాధనాలే తప్ప, లక్ష్యాలు కాకూడదు; మన ఆత్మ అభిలషించే కార్యకలాపాలని వాటిని సాధనాలుగా భావించి పరిశ్రమించినపుడే మనం సరిగ్గా ప్రయత్నించగలం, మనకి కావలసిందీ దొరుకుతుంది. మనం జీవించడం కోసం జీవిస్తే, మనం సరిగా జీవించనూ లేము, మనకి జీవితం సంతృప్తిగానూ అనిపించదు. జీవించడంకోసం జీవించడమన్నది, మనకి ఎలా జీవించాలో చెప్పదు. అతని ఆత్మగతమైన కోరికలు తీర్చుకోవాలంటే, మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. బదులుగా, ఆరోగ్యంగా ఉండడంకోసం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తే, దాని గురించి అతను ఎంతగా ఆలోచిస్తాడంటే, అనారోగ్యం పాలవుతాడు. అలాగే, తన ఆత్మకోరుకునే కోరికలు నెరవేర్చుకుందికి తినాలి. కానీ, తినడం కోసం తింటూ కూచుంటే, అతను అతిగా తిని, దాని వల్ల అతని శరీరమూ, మనసూ పాడయి, తను తినడంలోని ఆనందాన్నికూడా ఆస్వాదించలేకపోతాడు.

పాఠకుడికి ఈ చెప్పినదాంట్లో విశేషం ఏమీలేదనీ, అందరికీ తెలిసిందే అనిపించవచ్చు. కానీ, ఆ చదువరి, ఉపాధ్యాయుడైతే, ముఖ్యంగా ఈ సత్యాన్ని గుర్తించమని చెప్తాను: ఆత్మకి మూడు ముఖ్యమైన కార్యకలాపాలున్నాయి. అవి ఆత్మకి సంబంధించినవి గనుక వాటినన్నిటినీ సమపాళ్లలో, వాటి సాధనకోసమే సాధన చెయ్యాలి. మన తత్త్వ చింతనలోనూ, మన విద్యావిధానంలోనూ ఈ సత్యాన్ని మరిచిపోతున్నాము. ఉన్నంతలో, మన విద్యావిధానం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల అటు విద్యార్థుల్నీ సంతృప్తిపరచలేకపోతోంది; మన తత్త్వచింతన మనల్నీ సంతృప్తిపరచలేకపోతోంది. ఇంగ్లండులో ఉపాధ్యాయులకీ, నైతికవాదులకీ ఒక నిశ్చితాభిప్రాయం ఉంది, అది ఆత్మకి ఒకటే కోరిక ఉందనీ, అది మంచికోసం మంచి చెయ్యడం తప్ప మరే లక్ష్యం ఆశించకూడని నైతిక వర్తనమనీ, మేధో పరిశ్రమ, సౌందర్యాన్వేషణ నైతిక వర్తనకి ఉపకరణాలు తప్ప అవి ఆత్మకు సంబంధించినవి కావనీ. దాని అంతరార్థం, పైకి అలా చెప్పకపోయినప్పటికీ, మన విద్యా విధానంలో సత్యాన్ని అన్వేషించాలి, ఎందుకంటే దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది గనుక; సౌందర్యాన్ని సృష్టించడమో, అనుభవించడమో చెయ్యాలి, అది మనకి ఆనందాన్ని ఇస్తుంది గనుక. నైతిక వాదులు, వాళ్ళు నిజంగా నైతిక వాదులయితే, ‘ఉపయోగకరంగా ఉండడమూ’, ‘ఆనందాన్నివ్వడమూ’ నీతికి ఆనుషంగికాలని సరిగ్గా గ్రహిస్తారు. కానీ, అతను ఎక్కడ తప్పుతున్నాడంటే, ఉపయోగకరమవడాన్ని బట్టి నీతినీ, ఆనందం ఇవ్వగలగడాన్ని బట్టి సౌందర్యాన్నీ పరీక్షిస్తున్నాడు. మేధోపరమైన పరిశ్రమ చాలా ఉపయోగకరం, అలాగే నైతిక వర్తన కూడా. కానీ, వాటి లక్ష్యం ఉపయోగకరంగా ఉండడమూ, ఆనందం ఇవ్వడమూ అయినప్పుడు, వాటిని సరిగా సాధించలేము. సౌందర్యాన్వేషణ ఆనందాన్నిస్తుంది, మేదోపరమైన పరిశ్రమలాగే; కానీ ఆనందం ఇవ్వడమే దాని లక్ష్యం అయినప్పుడు, దానిని సరిగా సాధనచెయ్యలేము. ఈ మూడు ఆత్మతత్త్వాలలో ఏ ఒక్కటీ దాన్ని దానికోసం సాధించలనుకుంటే తప్ప, అవి అవి కాలేవు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తేతప్ప, ఈ తాత్త్విక కార్యకలాపాలు మనం అనుసరించనూ లేము, ఇంకొకరికి అనుసరించమని చెప్పనూ లేము.

ఏ తత్త్వచింతనా లేకపోవడం వల్ల ఇంగ్లీషు ఆలోచనా విధానంలో వచ్చిన పెద్ద లోపం: ప్రతి దాన్నీ మరొకదానితో ప్రామాణీకరించుకుని, మనం దాని గురించి అంతా పూర్తిగా చెప్పేసేమనుకోవడం. కాని నిజానికి మనం చేసినది ప్రామాణికంగా తీసుకున్నదానితో సరిపోల్చడం మాత్రమే. అందుకే, మనం “నిజాయితీ అన్నిటికంటే ఉత్తమమైన మార్గము” అన్నప్పుడు, మన మనసులో ‘నిజాయితీ’ అనగానే వేరొకదాన్ని ఊహించుకుంటూ, మెచ్చుకుంటున్నాము. మనం ఊహించుకుంటున్నది నిజాయితీ కాదు, ప్రయోజనకారిత్వం. నిజాయితీ ప్రయోజనకారిత్వం ఒకటి కాదు; అదొక నైతిక లక్షణం. అది అదే. దాని కోసమే దాన్ని అభిలషించాలి. మీరు దాన్ని ప్రయోజనకారిత్వంగా భావించుకుంటే, నిజాయితీ ఏమిటో తెలుసుకో లేరు. కనుక మీరు విద్యార్థికి “నిజాయితీ అన్నిటిలోకీ ఉత్తమమైన మార్గం అన్నప్పుడు” మీరు తరచు ‘ఏది నిజం కాదో’ అది చెబుతున్నారు. త్వరలోనే అన్నివేళలా నిజాయితీ ఉత్తమమార్గం కాదని అతను స్వయంగా తెలుసుకుంటాడు; అపుడు అతను నిజాయితీకి బదులు తంత్రము ఎన్నుకోవచ్చు, ఎందుకంటే అతనికి నిజాయితీ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేదు, కాపట్యానికి బదులుగా నిజాయితీ ఎందుకు ఎంచుకుని అనుసరించాలో ఎవరూ బోధించలేదు. అతనిలో ఒక ఆత్మ (అంతర్గతమైన వ్యక్తిత్వం) ఉందనీ, అది నిజాయితీని వేరేదీ అపేక్షించకుండా కోరుకుంటుందనీ; అతని వ్యక్తిత్వంతోనూ అదే సత్యమనీ, దాన్ని తనపై ప్రయోగం చేసుకోవడం ద్వారా ఆ సత్యాన్ని ఋజువుచేసుకోవచ్చనీ విద్యావిధానం అతనికి అవగాహన అయేలా స్పష్టంగా బోధించాలి. అతను నిజాయితీ కోసం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినపుడు, అతనికి ఆత్మసంతృప్తి కలుగుతుంది; కానీ అతను ఏ ప్రయోజనం ఆశించి చేసినా నైతిక వర్తన సంతృప్తి కలిగించదు. అతను నైతిక వర్తనని వేరే ప్రమాణాలతో ఊహించుకుంటున్నప్పుడు, అతనికి నైతికత, నైతికతగా కనిపించదు, అతనికి ఆత్మ సంతృప్తి దొరకదు. మనకి నైతికతని వేరే ప్రమాణాలతో చూడడం తప్పని తెలుసు గాని … మనం అనునిత్యం చేసే పని అదే. ఆత్మయొక్క ఇతర కార్యకలాపాలని గుర్తించే దాకా ఈ రకమైన ప్రవృత్తినుండి తప్పించుకోలేము. అంతే కాదు, ఈ కార్యకలాపాలు ఆత్మప్రేరితాలు గనుక ఏదీ రెండో దానికంటే తక్కువది కాదన్నది కూడా గ్రహించాలి. మనం గ్రహించవలసిందీ, బోధించవలసిందీ, సత్యం విలువ అత్యంతమనీ, అది మంచితనానికి ఏమీ తీసిపోదనీ, అలాగే సౌందర్యం విలువకూడా అత్యంతమూ, మిగతా రెండింటికీ తీసిపోదనీ. ఈ విషయం తత్త్వవేత్తలు చర్చించడానికి ఇది కేవలం ఒక వాదము కాదు. ఇది అందరికీ తక్షణావసరమైన ఒక సత్యం, కనుక అన్ని రకాల విద్యావిధానాలలోనూ ప్రవేశపెట్టవలసినది. సత్యాన్ని సత్యం కోసం విలువైనదిగా గణించకపోతే, నేను సత్యాన్ని కనుక్కోలేను. సౌందర్యానికి సౌందర్యంకోసం విలువనివ్వకపోతే, నేను సౌందర్యాన్ని, చూడలేను, వినలేను, ఏ రకంగానూ అనుభూతి చెందలేను. నైతికవాది మరోలా భావించవచ్చు గాక, గానీ, మనం సృష్టి తత్వాన్నీ, మానవుని మనస్సునీ అతని లక్ష్యాలకి అనుగుణంగా మార్చలేము. జీవిత సత్యాలని ఎదుర్కోవడం నైతికవాదంలోని అంతర్గత సమస్య. ఒక వ్యక్తి ఇతరులకి ఉన్న సత్యాల్ని లేనట్టు చెబితే అతను నైతికతకోసం అనైతికంగా ప్రవర్తిస్తున్నట్టు; దానర్థం అతను నైతిక విలువల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడని.

‘ఒక నైతిక లక్ష్యంకోసం నేను ఏ సత్యాన్నైనా కనుక్కోవడానికి ప్రయత్నిస్తే, బహుశా నేను సత్యాన్ని కనుక్కోలేకపోవచ్చు’ … అన్నది యదార్థం. దానికి కారణం, నా లక్ష్యం నేను ఉన్నవి ఉన్నట్టుగా చూడలేకుండా చేస్తుంది; నేను వాటిని నా నైతిక లక్ష్యానికి అనుగుణంగా ఎలా చూడాలని అభిలషిస్తానో అలా చూడడం ప్రారంభిస్తాను. లక్ష్యం అనుభవానికి ప్రతిబంధకమౌతుంది. అందుకే సౌందర్యాన్ని ఒక నైతికలక్ష్యంకోసం చూడలేమన్నది రూఢం. ఇది అందమైన కళారూపాల్ని తయారుచేసే సందర్భంలో ఇంకా స్పష్టంగా అవగాహన అవుతుంది. ప్రపంచాన్ని మంచిగా చేద్దామన్న లక్ష్యంతో కళాకారుడు పనిచేస్తే, అతను సృష్టించేది కళాఖండం కాదు. నైతిక అంతఃకరణ ఉన్నట్టే, మనందరిలోనూ ఒక మేధోపరమైన అంతఃకరణా, సౌందర్యాత్మకమైన అంతఃకరణా ఉన్నాయి. నేను నైతికంగా ఉండాలని అనుకున్నప్పుడు నా నైతిక అంతఃకరణకి విధేయుడిగా ఉన్నట్టు, నేను మేధోపరంగా, సౌందర్యాత్మకంగా సరిగ్గా ఉండాలంటే, నేను నా మేధోపరమైన అంతఃకరణకీ, సౌందర్యాత్మకమైన అంతఃకరణకీ విధేయుడినై ఉండాలి. అన్ని అంతఃకరణలూ ఆత్మకు సంబంధించినవి కనుక ఏ ఉత్తరోత్తర ప్రతిఫలాన్నీ ఆశించకుండా వాటికి విధేయులమై ఉండాలి. ఈ ఆత్మకి సంబంధించిన విలువలన్నీ “పరమ” (supreme) విలువలు; మన ఆత్మ చెప్పినట్టు వాటికి ఆ విలువ ఇవ్వకపోతే, మనం మన జీవితాలనీ, ఈ విశ్వాన్నీ విలువకట్టడంలో విఫలమౌతాము. ఈ సృష్టిని ఎందుకు విలువైనదిగా పరిగణించాలంటే, ఇందులో సత్యమూ, సుందరమూ రెండూ ఉన్నాయి; మన చేతలలో మంచిని ఎలా గుర్తించగలుగుతున్నామో, జీవించడమనే ప్రక్రియద్వారా అలాగే సత్యాన్నీ సౌందర్యాన్నీ కూడా గుర్తించగలం. నిజానికి, ఈ సృష్టిలోని సత్య, సౌందర్యాల ఎరుకలేకుండా, చేసేవన్నీ సహజంగా మంచిచేయగల మానసిక స్థితికి చేరుకోలేము. మన నైతికశక్తి మిగతా రెండు ఆత్మశక్తులవల్ల సంపన్నమై, వాటి ఆదేశానుసారం నడుచున్నపుడు మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది.

కనుక, సత్యం విలువ అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని నమ్మని వ్యక్తి, నిజాయితీగా ఉండడంలో విఫలమౌతాడు, ఎందుకంటే దాని విలువ పట్ల అతనికున్న అపనమ్మకం వల్ల. మనం మంచిగా ఉండదలుచుకున్నప్పుడు మనకున్న మేధోశక్తులన్నీ వాటి పూర్తి పరిమితులకు వినియోగించుకోవాలన్నది వాస్తవం. ప్రకృతిసిద్ధంగా ఎక్కువ తెలివితేటలులేని వ్యక్తి సైతం మంచిగా ఉండడానికి అవకాశం ఉందన్నది కూడా వాస్తవమే. కనుక వ్యక్తి మంచిదనాన్ని ప్రభావితం చేసేది ఈ తెలివితేటల్ని ఉపయోగించే విధానమే గాని వాటి సహజమైన శక్తి కాదు. తెలివి ఒక సాధనం మాత్రమే. దాన్ని సవ్యంగా ఉపయోగించాలి. సవ్యంగా ఉపయోగించలేనపుడు, తప్పుగా ఉపయోగించబడి, మొత్తం వ్యక్తిత్వానికి చెడుపు చేస్తుంది. తెలివితేటల వెనుకనున్న నైతికాంశం అది. తన తెలివితేటల్ని గుడ్డలో చుట్టి, వాటిని సక్రమమైన మార్గంలో వినియోగించడానికి ఇష్టపడని వ్యక్తిని లోకం నైతికంగా గర్హిస్తుంది. నిజానికి ఈ మేధో శక్తి ఏ ఇతర ఆసక్తులూ లేకుండా సత్యాన్ని సత్యంకోసం కనుక్కోడానికి చేసే ప్రయత్నంలోనే సవ్యంగా ఉపయోగించబడుతుంది. ఇక్కడ ప్రశ్న మేధో శక్తిని ఏ లక్ష్యం ఆశించి ఉపయోగిస్తున్నామన్నది. మంచిదనాన్ని ఆకాంక్షించి నైతికవర్తన ఎలాగైతే మనం అనుసరిస్తామో, సత్యాన్ని కనుక్కోవాలన్న తపనకోసమే సత్యాన్వేషణ చెయ్యాలి. సత్యాన్ని కనుక్కోవడం ఒక లక్ష్యం కోసం తోవ తప్పించినపుడు, అది పూర్తిగా తోవతప్పి మన నైతిక వర్తనని కూడా దారితప్పిస్తుంది.

మనందరం అంతరాంతరాల్లో మంచిదనానికీ, సత్యానికీ, సౌందర్యానికీ ఒక అనుబంధం ఉందనీ భావిస్తూ ఉంటాము. అటువంటి అనుబంధం ఉందని అనుకునే భావన ఏదో శుష్కవాదం కాదు. అది విశ్వవ్యాప్తంగా మానవాళి అనుభవం మీద ఆధారపడినదీ, ఆ అనుభవం యొక్క వాస్తవికతని నొక్కి చెబుతూ, వివరించడానికి ప్రయత్నం చేసేదీను. మనందరం ఎప్పుడూ సత్యంలో ఏదో ఒక మంచి ఉంటుందనీ, మంచిదనంలో కొంత సత్యం ఉంటుందనీ, సౌందర్యంలో సత్యం ఉంటుందనీ అనుభూతిచెందుతుంటాము. దానికి కారణం ఈ మూడూ ఆత్మగతమైన చర్యల లక్ష్యాలు, ఆ మూడూ వాటిని వాటికోసం తప్ప వేరే ఇతరమైనవి సాధించడానికి ఉపకరణాలు కావు. మరో లక్ష్యాన్ని ఆశించి వాటిలో దేనిని సాధించ ప్రయత్నించినా, ఆశించినట్టు అవదు సరిగదా, దాని మౌలిక తత్త్వాన్ని గ్రహించగలిగే స్థితిలో మనం ఉండము.

ఈ వాస్తవాన్ని గ్రహించడంలోని వైఫల్యమే, నైతిక బోధనననంతటినీ పాడు చెయ్యడమేగాక, యువత దానిపై తిరుగుబాటు చేసేలా చేస్తోంది. యువత వాళ్ళ అనుభవపు పరిధిలో, దైనందిన జీవితంలో నైతిక ప్రవర్తన ప్రాముఖ్యత అవగాహనచేసుకోగలిగే స్థితిలో ఉండదు. కానీ, ఈ అనుభవ రాహిత్యమే తరచు పెద్దవాళ్ళకంటే ఎక్కువగా పిల్లలు మేధోపరమైన, కళాత్మకమైన కార్యకలాపాల విలువ ఇతర లౌకికవ్యాపారాల విలువకంటే ఉత్కృష్టమైనదని గ్రహించగలిగేలా చేస్తుంది. దాని విలువని ఉన్నతంగా ఊహించడంలో వాళ్ళకి అవగాహనతో కూడిన జ్ఞానం ఉందని అనలేముగాని, ఎక్కువ సందర్భాలలో వాళ్ళు ఆ విలువని చాలా తీవ్రంగా అనుభూతిచెందగలరు; వాళ్ళకి ‘ఒక్క నైతిక వర్తనకే’ అటువంటి ఉత్కృష్టమైన విలువ ఉందని చెప్పినప్పుడు దానితో ఏకీభవించక ఎదురుతిరుగుతారు. వాళ్ళ ప్రవర్తన సబబు కూడా; వాళ్ళ అంతరాంతరాల్లో ఆత్మప్రేరణమైన కార్యకలాపాలన్నిటిలో ప్రతి ఒక్క దానికీ అంతే ఉన్నతమైన విలువ ఉన్నప్పుడు, వాటిని గుర్తించక, నిరోధించి, నిర్బంధించినపుడు వాళ్ళలోని ఆత్మకూడా వాళ్ళతో పాటే తపిస్తుంది. దాని అన్ని శక్తులకీ ఉత్కృష్టమైన విలువ ఇవ్వడానికి నిరాకరించినందుకు, అలా తిరుగుబాటు చేస్తున్నది వాళ్ళ ఆత్మే. ఈ తిరుగుబాటునే అటు పిన్నలూ, ఇటు పెద్దలూ నైతిక వర్తనకి వ్యతిరేకంగా తిరుగుబాటుగా పొరపడుతుంటారు.

కనుక ఇప్పుడు కావలసింది, కేవలం నైతిక బోధన కాదు; అది దానంతట అది యువతరాన్ని సంతృప్తి పరచడంలో విఫలమౌతుంది, వాళ్ళకి ఆత్మకి సంబంధించిన మూడు కార్యకలాపాల్లోనూ బోధన కావాలి. యువతకి, వాళ్ళ ఆత్మకి మూడు శక్తులున్నాయనీ, మూడింటినీ, దేనికదే లక్ష్యంగా పరిశ్రమించాలనీ బోధించాలి.

ఆధ్యాత్మికబోధన… నీతి, బుద్ధి, కళ… ఈ మూడింటిలోనూ నిరపేక్షమైన బోధన. జీవితం లక్ష్యం ఈ మూడు శక్తుల్నీ దేనిమట్టుకు అదే లక్ష్యంగా చేసుకుని అభ్యసించాలని నొక్కి చెబుతూ, అలా అభ్యసించని మనిషి జీవితం జీవితంకాదని కూడా చెప్పాలి. ఆచరణలో నైతికతని మిగతా రెండింటికంటే స్థిరంగా అనుసరించవలసి వస్తుందనీ, కానీ మిగతా రెండూ పలచబడినపుడు, నైతికతని సరిగా అభ్యసించలేమనీ, కనుక సత్య, సౌందర్యాల రెండింటి ప్రేరణ ఎప్పుడు కలిగినా నైతికతకి విలువ ఇచ్చి ఎలా తల ఒగ్గామో, సత్య, సౌందర్యాలకి కూడా తలొగ్గి అభ్యసించాలని బోధించాలి.

ప్రతి వ్యక్తిలోనూ ఈ మూడు శక్తుల్నీ … నీతి, సత్యం, సౌందర్యం… అభ్యసించాలన్న కోరిక సహజంగా ఉంటుంది. విద్యావిధానం ఆ కాంక్షని పూర్తిగా అవగాహన చేసుకోగలిగేట్టు చేసి, శారీరకమైన అవసరాలన్నికంటే ఆత్మకి సంబంధించిన కోరికలని విద్యార్థి ఉన్నతమైనవిగా పరిగణించేలా ప్రోత్సహించాలి. ఆ చెయ్యడం కూడా ఏకపక్షంగా కొన్ని ఆదేశాలుగా కాకుండా, విద్యార్థికి ఆత్మ స్వభావాన్ని ఎంత సులభగ్రాహ్యంగా చెప్పగలిగితే అంత సులభంగా చెప్పి, అతని అనుభవంలోని ఋజువులతో అనుసంధానం చేస్తుండాలి.

అనుభవం లేకపోవడం వల్ల యువతకి వేటికి విలువ ఇవ్వాలో తెలియక, తమలో ఉన్న ఉత్తమమైన లక్షణాలని అవమానకరంగా భావిస్తుంటారు. ఒక కుర్రాడు మంచిపట్ల, అందంపట్ల, సత్యంపట్ల తనకు సహజంగా ఉండే కోరికకి సిగ్గుపడతాడు; అతనిని అవహేళన చేసినపుడు ఆ కోరికని అణచుకోడానికో, ఎవరికీ తెలియకుండా ఉంచడానికో ప్రయత్నిస్తాడు. తనకి తన గురించీ, వాటి విలువగురించి ఖచ్చితమైన అవగాహన లేకపోవడంతో, ఈ అవహేళన ప్రభావం అతని మీద ఎక్కువగా ఉంటుంది. అతనికి కవిత్వం అంటే గొప్ప ఇష్టం ఉండవచ్చు. బహుశా, ఇంకో కుర్రాడు “కవిత్వం అంతా చెత్త” అని అనొచ్చు. ఆ కుర్రాడు చెప్పిన అభిప్రాయమే లోకం అభిప్రాయంగా ఊహించుకుని, తనకి కవిత్వం పట్ల ఉన్న ఇష్టాన్ని తనకున్న బలహీనతగా భావించడమూ, కవులందరూ తనలా విలక్షణంగా ఉండి ఏదో పిచ్చి రాతలు రాసుకుంటారనీ, తెలివైనవాళ్ళకు అందులో కుతూహలం ఉండదనీ అనుకోవచ్చు. అందులో దౌర్భాగ్యం ఏమిటంటే, తనకి బోధించే ఉపాధ్యాయులకే అటువంటి అభిప్రాయం ఉండవచ్చు. వాళ్లకి కూడా లాటిన్ లోనో, గ్రీకులోనో రాస్తే తప్ప, కవిత్వం చేపట్టవలసిన వ్యాపకం కాదు; ఆ రెండు భాషలయితేనే వాళ్ళు కవిత్వంద్వారా నేర్చుకుంటారు. కాబట్టి కవిత్వం అంటే ఇష్టపడే కుర్రాడు ఈ మూర్ఖపు, ప్రతికూల ప్రపంచంలో తనో విచిత్రమైన వ్యక్తినని అనుకుంటాడు. తన ప్రేమని అదేదో అపరాధంలా ప్రపంచానికి కనిపించకుండా గోప్యంగా ఉంచుకుంటాడు; అదే సమయంలో అదంటే గర్వపడతాడు కూడా, బహుశా అహంకారిగా మారినా మారవచ్చు. లేదా, ప్రపంచాన్ని మరికొంచెం ఎక్కువ అవగాహన చేసుకున్న తర్వాత, తనలాగే చాలామందికి కవిత్వం అంటే ఇష్టమనీ, అందులో తన తోటి విద్యార్థులున్నారనీ ఆశ్చర్యపడినా పడవచ్చు. అతను చిత్రమైన వ్యక్తి కానే కాడు అన్నవిషయం కుర్రాడిగా ఉన్నప్పుడే తెలిసి ఉంటే అతను ఆనందంగా ఉండడమే గాక, చాలామందికి ప్రీతిపాత్రుడయి ఉండేవాడు. తనకి తెలియదు కనుక, కవిత్వం పట్ల తనకున్న ప్రేమ వెర్రిగా, భయంగా మారి, (ఎప్పటికైనా ఆ భయాన్ని ఒదుల్చుకోగలిగితే,) అది ఒదుల్చుకోడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

కానీ అతని ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ కవిత్వం పట్ల అభిమానం ఏ కొద్దిమందికో పరిమితమైన విచిత్ర పోకడకాదనీ, అది ఆత్మకి సంబంధించిన సహజ లక్షణమని తెలియజెప్పాలి; కవిత్వాన్నీ, సత్యాన్నీ, సౌందర్యాన్నీ ప్రేమించడం వల్ల ఆ కుర్రాడు మూర్ఖుడూ కాదు, అసాధారణమైన వాడూ కాదని చెప్పాలి. పిల్లల్లో ఆత్మకి సంబందించిన ఈ ఆకాంక్షలు బలీయంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ ఆశ్చర్యపడడం సహజం. వాళ్ళు అది అనారోగ్యకరమని బావిస్తారు, అది తరచుగా అలాగే పరిణమిస్తుంది; ఎందుకంటే, ఈ కుతూహలం ఉన్నవ్యక్తి తన్నొక ప్రత్యేకవ్యక్తిగా, ప్రపంచమంతా తనకి వ్యతిరేకంగా ఊహించుకుంటాడు. ఈ అనారోగ్యానికి మందు అప్పుడప్పుడు అతని కుతూహలంపై వేసే తుంటరి పరిహాసాలు కాదు; అతనికి కవిత్వం స్వభావాన్నీ, విలువనీ చెప్పి అతనికి అది ప్రత్యేక లక్షణం కాదని గ్రహించేలా చెయ్యడం. మన పాఠశాలల్లోనూ, మన సమాజంలోనూ, చాలవరకు అసంకల్పితంగా జరిగినప్పటికీ, అనూచానంగావస్తూ, ఇప్పటికీ కొనసాగుతున్న తప్పుడు అలవాటు ఒకటి ఉంది: ఆత్మగతమైన కోరికలని విస్మరించడం. దీన్ని మించిన చిత్రం మరొకటి ఉండదు. వాటిపట్ల మనకి అవసరంలేని సిగ్గు, ఒకరకమైన బిడియం ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా పొరపాటున మాటాడవలసి వస్తే, అక్కడికి మనం మాటాడుతున్న విషయం అసభ్యకరమైనట్టు, గుసగుసలు పోతూనో, పరిహాసంగానో మాటాడుతుంటాం. మిగతా విషయాల్లాగే వాటి గురించి కూడా ఉన్నదున్నట్టు మాటాడాలి, డబ్బు సంపాదించడం అన్న విషయం గురించి నలుగురికీ ఎంత అభిరుచి ఉంటుందో, ఆత్మగతమైన కోరికలమీద కూడా అంత కుతూహలంగా మాటాడాలి. అది నిజం కూడా. అవి విశ్వవ్యాప్తంగా ఇష్టమైనవే కాదు, మనం గంభీరంగా రోజూ మాటాడుకునే చాలా విషయాలకంటే ఎక్కువ ఆసక్తికరమైనవి. ఆత్మతత్త్వంగూర్చి మన ఈ అక్కరలేని సిగ్గూ బిడియమూ మనకున్న అజ్ఞానానికి ప్రతిఫలితం. ఆత్మ కార్యకలాపాలని అవి అందుకోవడమే ధ్యేయంగా మనిషి పరిశ్రమించాలనీ, అసలు ప్రతి వ్యక్తిలోనూ ఉన్న ఆత్మ వాటిని వాటికోసం అనుసరించడానికి ప్రయత్నిస్తుందన్న విషయాన్ని మనకు మనం ఎన్నడూ చెప్పుకోము. మనదృష్టిలో ఇవి యుక్తమైన వ్యవహారాలు కావు; కాని అవే నిజమైన వ్యవహారాలూ; ఎంపిక చేసిన ఏ కొద్దిమందికోగాక యావత్ మానవాళీ అనుసరించవలసిన యోగ్యమైన వ్యవహారాలూ అవే; కానీ, దీన్ని అర్థం చేసుకోలేక, ఈ కార్యకలాపాలు అనుసరిస్తున్నప్పుడు మనం ఏదో ప్రత్యేక వ్యక్తులమనో, లేక కాలాన్ని వృధా చేస్తున్నామనో అనుకుంటాము; మన పిల్లలచే అలా ఆలోచించంపజేస్తాము. అందువల్ల చదువుకి ప్రామాణికంగా నిలబడవలసిన వీటిపట్ల, మనలో, కనీసం ధనికవర్గాల్లో, ఇవి ఎందుకూ కొరగానివనే చులకనభావం ఏర్పడిపోయింది. అవసరంలేని లజ్జాహేతువయింది. ప్రత్యేకంగా నైతికవిలువలపట్ల కూడా మనకి అటువంటి చులకన స్వభావమే ఉంది; దానికి కారణం, మనకు తెలియకుండానే, ఆత్మతత్త్వం కేవలం నైతికతకే పరిమితమైనదని మనకున్న దురభిప్రాయం. మనకు నైతిక విలువలు మాత్రమే చాల గంభీరంగా తీసుకునే వ్యక్తి చాలా గంభీరమైన వ్యక్తి అనే దురభిప్రాయం ఉంది. నిజానికి కేవలం నైతిక విలువలు మాత్రమే గంభీరంగా తీసుకునే వ్యక్తి గంభీరత చాలా సంకుచితమైనది. మనం ఆత్మకి సంబంధించిన అన్ని కార్యకలాపాలూ గంభీరంగా తీసుకోవాలి, వాటిని వాటికోసం తప్ప ఏ ఇతర లక్ష్యాలకోసం ప్రయత్నించం గనుక. అసలు వాటితో పోల్చినపుడు ఏ ఇతరవ్యాపకమూ గంభీరమైనది కాదు అని గుర్తించడమే నిజమైన మనోధర్మం. నైతికవిలువలే గంభీరమైనవి అనుకోవడం మనలోనూ, ఇతరుల్లోనూ, గంభీరతని తప్పుగా అన్వయించడం వల్ల వచ్చినది. నిజమైన గంభీరత ఏమిటో తెలిస్తే ఒక్క సారి మన అకారణభయాలూ, మిధ్యాగంభీరత పటాపంచలై మనకు నవ్వు వస్తుంది. కాని, ఆ మాయ పటాపంచలవాలంటే, ముందు మనకు నిజమైన గంభీరత ఉండాలి. అన్ని నిజమైన మనోధర్మాల వెనుకా ఆత్మతత్త్వం ఇమిడి ఉంది. కానీ నైతిక విలువల్ని అతిగా ఉన్నాయని పరిహసించే మిధ్యామనోధర్మం వెనుక, వాటిని అర్థంచేసుకోలేని గందరగోళం మాత్రమే ఉంది. దీనికారణంగానే, మిగతా ఆత్మకార్యకలాపాలనీ పరిహసించడం జరుగుతుంది. ఎక్కడో తప్పు ఉందని తెలిసినా, ఆ తప్పేమిటో తెలియకపోవడం వల్ల, వెనుక ఏ తాత్త్విక చింతనా లేని కారణంగా, అన్ని ఆత్మ కార్యకలాపాలూ గంభీరమైనవే అన్న విషయం గుర్తించము.

సహజంగా, నైతికప్రవర్తన మాత్రమే ఆధ్యాత్మిక కార్యకలాపంగా అందరూ అనుకోవడం వల్ల, మేధోపరమైన అభ్యాసం, కళాత్మకమైన అభ్యాసం, ఆత్మకార్యకలాపాలుగా అనుసరించేవారికి దీనిపై వ్యతిరేకత ఉంటుంది. నీతే సర్వస్వంగా చెప్పే వారిలోని చెడుని వారు వేలెత్తి చూపిస్తారు; దానికి ప్రతిగా వాళ్ళు వీరిలోని మేధోపరమైన అసంబద్ధతలూ, కళాత్మకతలోని దోషాలూ చూపిస్తారు. నైతిక, సత్య సౌందర్యాలు మూడింటిలో ఏ ఒక్క ఆధ్యాత్మిక కార్యకలాపాన్ని సహజంగానూ, సరియైన రీతిలోనూ అభ్యసించాలన్నా, అనుసరించాలన్నా, ఈ మూడింటి ఉనికినీ ముందు గుర్తించాలి, సాధన చెయ్యడానికి ప్రయత్నించాలి. అంతరాత్మలేని వ్యక్తి కళాకారుడు కాలేడు, సంస్కారం లేని వ్యక్తి ఋషికాలేడు. కళాకారుడికి కళాత్మక అంతఃకరణ ఉండాలి, అందులో ఎప్పుడూ ఎంతోకొంతమేరకి నైతిక అంతఃకరణ ఉంటుంది పవిత్రతలోని సౌందర్యాన్ని దర్శించగలిగేలా. అలాగే, ఋషిలో కూడా ఎంతో కొంతమేరకు సౌందర్యంలోని పవిత్రతని గ్రహించగలిగే కళాత్మక అంతఃకరణ ఉంటుంది. నిజానికి ప్రతి అంతఃకరణకీ మిగతా రెండింటితో తనకున్న సోదరభావం గ్రహించగలశక్తి ఉంటుంది; ఒకటి మిగతా రెండింటికీ దారి తీస్తుంది కూడా.

కానీ అలా కాకుండా, సంకుచితంగా, తాత్త్వికచింతనలేకుండా దేనికదే ఉన్న నాడు, దేనికదే ఏదీ కాకుండా పోతాయి. నైతికవాది మిగతా రెండు ఆత్మ కార్యకలాపాలని గుర్తించకుంటే, అనివార్యంగా ఈ ప్రపంచంలో గాని, ఉత్తరలోకాల్లో గాని సుఖంగా జీవించడానికి నైతికత ఒక్కటే మార్గమని అనుకుంటాడు అతనికి ఈ నైతికతతో ఏమి చెయ్యాలో తెలీక. అలాగే, కేవలం సౌందర్య పిపాసి భోగలాలసుడుగా మారుతాడు; కేవలం మెధావి కుతర్కం చేసే వాడుగానో, పాండిత్య ప్రదర్శించే వాడిగానో మిగిలిపోతాడు. అలా ఏది జరిగినా అది విద్యావిధానంయొక్క వైఫల్యమే. కేవలం ఆత్మతత్వ్వాన్ని స్పష్టంగా, పరిపూర్ణంగా బోధించడం ద్వారా మాత్రమే అటువంటి వైఫల్యాన్ని అరికట్టవచ్చు.

**** (*) ****