మిసెస్ మలార్డ్ కి గుండెజబ్బు ఉందని తెలియడం వల్ల, ఎన్ని జాగ్రత్తల్ని తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఎంతో సున్నితంగా ఆమె భర్త మరణవార్త తెలపడం జరిగింది.
చెప్పలేక చెప్పలేక, పొడి పొడి మాటల్తో ఆమె సోదరి జోసెఫీన్ చెప్పింది; సగం దాస్తూ, సగం విషయాన్ని సూచనప్రాయంగా చెబుతూ. ఆమె భర్త స్నేహితుడు రిచర్డ్స్ పక్కనే ఉన్నాడు. బ్రెంట్లీ మలార్డ్ పేరు మొట్టమొదటగా పేర్కొంటూ రైలు ప్రమాదంలో మరణించిన వారి సమాచారం వార్తాసంస్థల ద్వారా అందినప్పుడు అతను పత్రిక కార్యాలయంలోనే ఉన్నాడు. కానీ, అది నిజమని నిర్థారించుకుందికి రెండవసారి తంతివార్త వచ్చే వరకూ ఆగి, సున్నితత్త్వం లేని ఏ మిత్రుడయినా అజాగ్రత్తగా ఆమెకు ఈ విచారకరమైన సమాచారాన్ని తెలియజెసే అవకాశం ఇవ్వకుండా ఉండడానికి తనే పరుగుపరుగున వచ్చేడు.
ఇంతకుముందు ఇటువంటి వార్తని చాలా మంది విని ఉన్నప్పటికీ, వాళ్లలా దాని ప్రాముఖ్యతని అర్థం చేసుకోలేని మనోదౌర్బల్యంతో ఆమె ఈ వార్తని వినలేదు. ఆమె తన సోదరి చేతుల్లో ముఖం పెట్టుకుని భోరున వెంటనే రోదించింది. తుఫానువంటి ఆ దుఃఖపు తీవ్రత తగ్గగానే, ఆమె ఒంటరిగా తనగదిలోకి పోయి ఎవరినీ లోనికి రానివ్వకుండా తలుపేసుకుంది.
తెరిచిఉన్న కిటికీకి ఎదురుగా సుఖంగా కాళ్లుజాపుకుని కూర్చుందికి విశాలంగాఉన్న కుర్చీ ఒకటి ఉంది. ఆమె శరీరాన్ని ఆవహించి, మనసుకి ప్రాకుతున్న గుదిబండలాంటి నిస్సత్తువతో అందులోకి ఆమె కూలబడింది.
ఆమె తన ఇంటికి ఎదురుగా విశాలమైన బయలులో వసంతపు తొలిచాయలకి అక్కడి ఎత్తైన చెట్ల కొనలు మెల్లగా అల్లల్లాడడం గమనించింది. గాలిలో వాన రాకడ సూచించే సుగంధం వీస్తోంది. ఎవరో చిల్లర సరుకులు అమ్ముకునే వ్యక్తి తన సామాన్లు పేర్లు చెబుతూ అరుస్తున్నాడు. దూరంగా ఎక్కడినుండో ఎవరో పాడుతున్న పాట ఆమె చెవులను సన్నగా తాకుతోంది, ఇంటి చూరులో లెక్కలేనన్ని పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి.
కిటికీకి ఎదురుగా పడమర దిక్కున ఒకదాన్నొకటి ఒరుసుకుని, గుమిగూడుతున్న మేఘాల మధ్యలోంచి అప్పుడప్పుడు వినీలాకాశపు తునక తొంగిచూస్తోంది.
తలని కుర్చీ మెత్తమీదకి వెనక్కి వాల్చి, ఏ చలనమూ లేకుండా కూర్చుంది… ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయిన బిడ్డ నిద్రలో కూడ ఎక్కిళ్ళు పెట్టినట్టు, ఉండి ఉండి ఆమెకి దుఃఖంతో గొంతు పూడుకుపోయి కుదిపేసినపుడు తప్ప.
ఆమె ప్రాయంలో ఉన్నది. అందంగా, ప్రశాంతమైన ఆమె ముఖంలో అక్కడక్కడ అణచివేతకు గురైన జాడలు కనిపిస్తున్నాయి. దానితోపాటు కొంత తెగువకూడా కనిపిస్తోంది. కానీ, కాంతిహీనమైన ఆమె కన్నులు … దూరంగా అక్కడెక్కడో కనిపిస్తున్న నీలాకాశపు ఖాళీని రెప్పవేయకుండా చూస్తున్నాయి. అది ఏదో తీవ్రంగా ఆలోచించడం కాదు; అన్నిరకాల వివేకవంతమైన ఆలోచనలనూ బహిష్కరించడం
ఆమెకు ఏదో అయిపోతోంది. ఆమె దానికే నిరీక్షిస్తోంది, భయపడుతూ భయపడుతూ. అదేమిటి? ఏమో, ఆమెకే తెలీదు; అది చాలా సూక్ష్మమైన విషయం. దాని పేరు నోటిమీద ఆడుతోందిగాని గుర్తురావడం లేదు. ఆమె దానిని అనుభూతి చెందగలుగుతోంది… ఆకాశంలోంచి ఊడిపడి, ధ్వనులద్వారా ఆమెని చేరుకుని, దాని వాసనలతో రంగులతో వాతావరణాన్ని చైతన్యవంతం చేస్తూ.
అల్లకల్లోలానికి గురైన ఆమె గుండెలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. ఆమెని ఆవహించడానికి వస్తున్న ఆవేశాన్ని ఆమె అర్థం చేసుకుంది. సుకుమారమైన ఆమె చేతుల్లా బలహీనమైన మనోనిబ్బరంతో దాన్ని నిలువరించడానికి తీవ్రప్రయత్నం చేస్తోంది. ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నాక, ఆమెకి తెలియకుండానే తెరిచిఉన్న పెదాలగుండా ఒక మాట బయట పడింది. ఆమె నిట్టూర్పుతోపాటు పదే పదే ఆమె మననం చేసుకుంది… “స్వేఛ్ఛ! స్వేఛ్ఛ!! స్వేఛ్ఛ!!!”. చేష్టదక్కిన ఆ చూపులూ, వాటిని అనుసరించి ఉన్న భయమూ ఇప్పుడు ఆమె కళ్ళలోంచి తొలగిపోయాయి. ఆమె కళ్ళు ఇపుడు స్పష్టంగా తేటగా ఉన్నాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోనారంభించింది. ఆ రక్తప్రవాహపు వేడిమి ఆమె శరీరంలోని అణువణువునూ సేదదీర్చింది.
ఆమె ఇపుడు అలా సంతోషపడడం అమానుషమా? కాదా? అని వితర్కిస్తూ కూచోలేదు. స్పష్టమైన, వివేకవంతమైన ఎరుక అటువంటి ఆలోచనలు అర్థరహితమని తోసిపుచ్చింది. ఆమెకు తెలుసు మృత్యువుతో ముడుచుకున్న ప్రేమపూరితమైన అతని లేతచేతుల్ని చూడగానే మళ్ళీ ఏడుపు వస్తుందని. అతని ముఖం ఎప్పుడూ ప్రేమగా తప్ప మరొకలా తనని చూడలేదు. ఇపుడది వివర్ణమై, నిర్జీవమైపోయింది. ఆ బాధాకరమైన క్షణం దాటితే, తనముందు ఆమెకే స్వంతమైన ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తు కనిపించింది. ఆమె రెండు చేతులూచాచి మనసారా దానిని స్వాగతించింది.
ఇక భవిష్యత్తులో ఆమె ఎవరికోసమూ బ్రతకనక్కరలేదు. తనకోసం తను బ్రతుకుతుంది. స్త్రీ పురుషులు తమ స్వంత అభిప్రాయాలను రెండవవారి మీద రుద్దే హక్కు ఉందని నమ్మి గుడ్డిగా దాన్ని అనుసరించేవారు, ఆమె అభిప్రాయాలను బలవంతంగా మార్చేవాళ్ళెవరూ ఇకపై ఉండరు. ఆ విషయాన్ని మరింత విచక్షణతో లోతుగా పరిశీలించినపుడు, ఆ పని అభిమానంతో చేసినా, అధికారంతో చేసినా, దాని నేరస్వభావం మారదని అనిపించింది.
అయినా, అతన్ని అప్పుడప్పుడు అభిమానంగానే చూసేది. ఎక్కువసార్లు అలా అనిపించకపోయినా. అయినా, దానివల్ల తేడా ఏముంది? తనను ఆవహించిన స్వయంనిర్ణయశక్తే, తన వ్యక్తిత్వంలో బలమైన ప్రేరణ అన్న సత్యం ఆమె అకస్మాత్తుగా గుర్తించిన ఆ క్షణంముందు, ఇంతవరకు ఎవరూ అంతుకనుక్కోలేకపోయిన అద్భుత రహస్య ఆవేశం … ప్రేమ … ఎందుకు పనికి వస్తుంది?
“స్వేఛ్ఛ! శరీరానికీ, మనసుకీ స్వేఛ్ఛ !” అన్నమాటలు గుసగుసలాడినట్లు పదే పదే ఆమె పెదవులనుండి వెలువడసాగినై.
జోసెఫీన్ తలుపుముందు మోకాళ్లమీద కూచుని, తాళంఉంచే కన్నందగ్గర పెదాలు ఉంచి బ్రతిమాలుతోంది, “లూయీ! తలుపు తియ్యి! బ్రతిమాలుకుంటున్నాను; తలుపుతియ్యి. ఇలా అయితే నువ్వు అనారోగ్యం పాలవుతావు. లూయీ, నువ్వక్కడ ఏంచేస్తున్నావు? దయచేసి తలుపుతియ్యి!” ఆ మాటల్లో ఆందోళన స్పష్టంగా ధ్వనిస్తోంది.
“వెళ్ళు! వెళ్ళు! నేనేం అనారోగ్యం పాలవట్లేదు.” అవును. ఆ తెరిచిఉన్న ఆ కిటికీనుంచి జీవనసారాన్ని గ్రహిస్తోంది ఆమె నిజంగానే.
ఆమె ఆలోచనలు ముందున్న రోజులు గురించి విశృంఖలంగా విహరిస్తున్నాయి. ఇకనుండి వసంతం, గ్రీష్మం, అన్ని ఋతువులూ తనవే! ఆమె అటువంటి జీవితం చాలాకాలం కొనసాగేలా అనుగ్రహించమని భగవంతునికి తొందర తొందరగా ఒక ప్రార్థన ముగించింది. అంతకు ముందురోజే ఆమె భయం భయంగా జీవితం ఇంకా ఎన్నాళ్లు కొనసాగించాలిరా భగవంతుడా అని బాధపడింది.
ఆమె సోదరి బతిమాలగా బతిమాలగా, చివరకి ఎలాగైతేనేం లేచి తలుపు తీసింది. ఆమె కళ్లలో ఏదో తెలియని విజయ గర్వపు రేఖలున్నాయి. ఆ స్పృహ లేకుండానే ఆమె విజయాన్నందించే దేవతలా ప్రవర్తించింది. ఆమె సోదరి నడుము పొదువుకుని ఇద్దరూ మెట్లు దిగేరు. క్రింది మెట్టు దగ్గర రిఛర్డ్స్ వాళ్ళకోసం నిరీక్షిస్తున్నాడు.
బయటనుండి ఎవరో తాళపెట్టి వీధితలుపు తెరుస్తున్నారు. ప్రశాంతంగా తన పెట్టే, గొడుగూ పట్టుకుని ప్రయాణ బడలిక స్పష్టంగా కనిపిస్తూ, లోపలికి అడుగుపెట్టేడు బ్రెంట్లీ మలార్డ్! అతను రైలు ప్రమాదం జరిగినచోటుకు చాలా దూరంలో ఉన్నాడప్పుడు. అతనికి ప్రమాదం జరిగిందన్న విషయం కూడా తెలీదు. ఒక్క సారి కెవ్వుమని గుండెలవిసేలా జోసెఫీన్ పెట్టిన కేకకీ, తనభార్య దృష్టిలో పడకుండా తొందరగా తనకి అడ్డుగా నిలబడడానికి రిచ్గర్డ్స్ చేసిన ప్రయత్నానికీ నిశ్చేష్టుడై నిలబడిపోయాడతను.
డాక్టర్లు వచ్చి పరీక్షించి, గుండెజబ్బు కారణంగా అకస్మాత్తుగా వచ్చిన ఆనందం పట్టలేక ఆమె చనిపోయిందని ప్రకటించారు.
**** (*) ****
బాగుందండి ట్రాన్సలేషన్. మంచి కధ. ఇంతకు ముందు కృష్ణవేణి గారు అనే రైటర్ రాసిన అనువాదం ఇంతే చక్కగా ఉంది. వీలైతే చూడండి: http://magazine.maalika.org/2016/03/05/%E0%B0%92%E0%B0%95-%E0%B0%97%E0%B0%82%E0%B0%9F-%E0%B0%95%E0%B0%A5/
వెంకట్ సురేష్ గారూ ,
అనువాదం లంకె అందించినందుకు కృతజ్ఞతలు. నిజానికి ఈ కథ ముందే అనువాదం అయిందని తెలియకపోవడం వలన, నాకు పత్రికలూ , జాలపత్రికలూ విరివిగా చదివే అలవాటూ లేకపోవడం వలన జరిగిన పొరపాటు. కృష్ణవేణి గారి అనువాదం ఎంతో బాగుంది. లంకె చదివిన తర్వాత అంతకు ముందే అనువాదం అయిందన్న సంగతి కూడా తెలిసింది. ఒక కథకి గాని, కవితకిగాని , ఎక్కువ అనువాదాలు వస్తున్నాయంటే అది గొప్పది అయిఉండాలన్న భావనతో ఏకీభవిస్తున్నాను.
అభివాదములతో