ఇరుగు పొరుగు ఆకాశాలు

ముహమ్మద్ ఫెతుల్లా గిలెన్

ఫిబ్రవరి 2015

ముహమ్మద్ ఫెతుల్లా గిలెన్ (27 ఏప్రిల్ 1941) టర్కీ దేశస్థుడు. ఒకప్పటి ఇమాం. అతను గిలెన్ ఉద్యమానికి ఆద్యుడు. ( దీన్ని హిజ్మత్ ఉద్యమం అని కూడా పిలుస్తారు) ఇప్పుడు అతను పెన్సిల్వేనియాలో తనకుతాను విధించుకున్న ఏకాంతవాసం గడుపుతున్నాడు.

సున్నీ మేధావి సయ్యద్ నుర్సీ (1877 – 23 మార్చి 1960) బోధనలకు ప్రభావితుడైన గిలెన్ ఇస్లాం లోని హనాఫీ శాఖకు చెందిన భావజాలాన్ని అనుసరిస్తాడు. తనకి సైన్సు పట్ల నమ్మకం ఉందనీ, జుడాయిజం, క్రిస్టియానిటీ లతో సంభాషణ, అనేకపార్టీల ప్రజా స్వామ్యం పట్ల నమ్మకం ఉందని ప్రకటించాడు. తగ్గట్టుగా వాటికన్ తోనూ, జ్యూయిష్ మేధావులతో చర్చలు జరిపేడు కూడా.

ఆధునిక ప్రపంచంలో ఇస్లాం, టర్కీ భవిష్యత్తు గురించి సామాజిక చర్చల్లో చాలా చురుకుగా పాల్గొన్నాడు. ఇంగ్లీషు మాధ్యమాలు అతన్ని ” విద్య, కష్టించి పనిచెయ్యడం, పరహితత్వాన్ని ప్రోత్సహించే సహనశీలమైన ఇస్లాం ను బోధించే ఇమాం గానూ, ప్రపంచంలోని ముఖ్యమైన ముస్లిం మేధావిగానూ,” వర్ణిస్తుంది. టర్కీ విషయంలో గిలెన్ ని మతపరంగా సంప్రదాయవాదిగానే పరిగణించాలి.

టర్కీ మేధావులూ, పండితులూ ప్రకటితంగానో, అప్రకటితంగానో 20 వశతాబ్దపు టర్కీ మేధావుల్లోనే గాక ముస్లిం ప్రపంచం అంతటిలోనూ ముఖ్యమైన గంభీరమైన రచయిత, తత్త్వవేత్తగా గుర్తిస్తున్నారు. ముస్లిం మేధావిగా, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని ఉత్తమమైన ఆలోచనలను ఇముడ్చుకోగల సామాజిక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి అతని నాయకత్వంపై చేసిన ప్రశంశలు, అతను దైవానికి మరింత వినమ్రుడైన సేవకుడిగానూ, అందరికీ స్నేహితుడిగా చేశాయి. కీర్తికోసం ప్రాకులాటా, “మనసుయొక్క సుకుమారమైన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని హరించే “తీయని విషం”, అహంకారం, భేషజాల ప్రదర్శనా ఒక్కలాంటివే” అన్న సూత్రాన్ని ఆయన అక్షరాలా పాటిస్తాడు.

“సూఫిజం ఇస్లాం యొక్క అంతర్ విస్తృతి. ఈ అంతర్, బహిర్ విస్తృతులు రెండిటినీ ఎడబాటు చెయ్యకూడదు ” అన్నది అతని బోధనల సారాంశం.

అతను Pearls of Wisdom ( సూక్తిముక్తావళి) పేరుతో చాలా సూక్తులు రాసేడు. అందులోంచి, ఆతని ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే ఒక ఇరవై సూక్తులు:

1. అశక్తత అంటే శక్తీ, అధికారం లేకపోవడం ఒక్కటే కాదు. మహా బలవంతులూ, తెలివైనవాళ్ళూ కూడా అశక్తులవడం చూస్తూనే ఉన్నాము. దానికి కారణం వాళ్ల బలమునుండీ, తెలివి నుండీ ఎవరూ లబ్దిపొందవచ్చునని అనుకోకపోవడం వల్లనే.

2. చీకటి గాని, లేదా మరో వెలుగు గాని స్వయం ప్రకాశముగల వారి తేజస్సుని అణచలేవు. అటువంటి వారి వెలుగు వాళ్ల జీవిత పర్యంతమూ ఎన్ని అవరోధాలు వచ్చినా వెలగడమే కాక, వాళ్ళ పరిసరాల్ని కూడా ప్రకాశింపజేస్తుంది.

3. తాము చూసినదాన్నిబట్టి పనిచేసేవాళ్ళు, తమకు తెలిసినదానిబట్టి పనిచేసేవాళ్లకంటే ఎక్కువ సఫలత సాధించలేరు. రెండో వాళ్ళు, తమ అంతరాత్మ చెప్పినదాన్నిబట్టి ప్రవర్తించేవాళ్ళ కంటే ఎక్కువ సఫలురు కాలేరు.

4. పేదరికం అంటే, డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు. అది జ్ఞానం, ఆలోచన, నైపుణ్యం మొదలైనవి లేకపోవడం కూడా ఈ విషయంలో, బాగా డబ్బుండి విజ్ఞానమూ, ఆలోచనా, నైపుణ్యమూ లేనివాళ్ళు పేదవాళ్ళక్రిందే జమ.

5. మానవాళి ఒక వృక్షం, దేశాలు దాని కొమ్మలు. పెనుగాలుల వంటి సంఘటనలు వాటిని ఒకదానితో ఒకటి రాపిడి చేసుకునేలా చెయ్యవచ్చు. దాని పరిణామాలు చెట్టు అనుభవించేమాట నిజం. “మనం ఏమి చేసినా, అది మనకుమనం చేసుకుంటున్నాం” అన్న మాటకి తాత్పర్యం అదే.

6. రాత్రులు … మానవాళి సంతోషానికీ, ప్రశాంతతకీ కావలసిన వాటిని కనుగొని, అభివృద్ధిచేసి, సంసిద్ధంచేసే రంగస్థలాలు. మానవాభ్యుదయానికి చీకటిగర్భంలోనే గొప్ప గొప్ప ఆలోచనలూ, సృష్టీ జరిగింది.

7. కడుపు … అరిగించుకోలేని పనికిరాని పదార్థాన్నీ బయటకి కక్కి దాని ముఖం మీదే ఉమ్మేస్తుంది. పనికిమాలిన వ్యక్తులపట్ల కాలమూ, చరిత్రా కూడా అలాగే ప్రవర్తిస్తాయి.

8. ఇనుముకి తుప్పు శత్రువు, వజ్రాలకి సీసము శత్రువులా ఉత్సాహానికి దుష్ప్రవర్తన శత్రువు; ఇవాళ అది నష్టం, వినాశం కలిగించకపోయినప్పటికీ, రేపు తప్పకుండా చేసితీరుతుంది.

9. అనుభవం లేని వారికీ, సభ్యత తెలియని వారికీ సత్యం గురించీ, జ్ఞానం గురించీ విశదీకరించడం మతిలేని వాళ్ళకి చెప్పడమంత కష్టం అయినప్పటికీ, జ్ఞానులు ఆ పని ఇష్టపూర్వకంగా చెయ్యాలి.

10. స్పష్టమైన సత్యాన్ని అందరూ ఒకే స్థాయిలో అర్థం చేసుకోలేరు గనుక, నిగూఢమైన పదజాలానికి బదులు ప్రత్యక్ష నిరూపణలనీ, పోలికలనీ, మూర్తభావనలనీ ఉపయోగించాలి.

11. మనుషులు సాధారణంగా స్థలకాలాదులగురించి ఫిర్యాదులు చేస్తుంటారు. కాని అసలు పొరపాటల్లా అజ్ఞానంలో ఉంది. స్థలకాలాదులు నిరపేక్షమైనవి. మనిషే … అజ్ఞానీ, కృతజ్ఞతా శూన్యుడూ.

12. కొన్ని చక్కని, మెత్తని పచ్చికగల, వెలుగుదారులు దారిపొడవునా రంగురంగులపువ్వులతో అలంకరించబడి మృత్యులోయల్లోకి కొనిపోతాయి. మరికొన్ని దారులు చాలా నిటారుగా ఉండి, కంటకమయమైనప్పటికీ అవి స్వర్గపు అంచులకి తీసుకుపోతాయి.

13. చాలా గొప్ప సూక్తి ఏమిటంటే: “ప్రతి స్త్రీ పురుషులూ తమ తమ నాలుకల క్రింద దాగుంటారు.” అంతకంటే గొప్ప సూక్తి, ” నీకు స్నేహితుడు కావాలంటే, భగవంతుడు చాలు; నీకు జోడు కావాలంటే, ఖురాను….”

14. ఏది “చూస్తోందో” దాన్ని మనం చూడలేము; చూపుకి లక్ష్యమైన వస్తువునీ, చర్యనీ మాత్రమే చూడగలము. ఆత్మ ఎరుకకి మనసు వాహిక; ఆత్మ చూడడానికి కన్ను వాహిక.

15. భౌతిక అవేశాలవల్ల గాని, మానసిక ఆవేశంవల్ల గాని ఒక చర్య చేపడితే అది జంతు ప్రవృత్తి; అదే ఆత్మప్రేరణవల్లగాని, బుద్ధిపూర్వకంగాగాని చేపడితే, అది అధ్యాత్మికమూ, మానవీయమూ అవుతుంది.

16. అనస్తిత్వం అన్నది భయానకమైన శూన్య స్థితి; ఎటువంటిదంటే, మనసుని శంకాకులముచేసే, అణుమాత్రపు అస్తిత్వంకూడా కనరాని అనంత క్షేత్రం.

17. గుడ్డివాళ్ళు ఎంత ఎక్కువమంది గుమిగూడినప్పటికీ, ఒక వస్తువు రంగు నిర్థారించలేరు. వాళ్ళ ఏకగ్రీవ తీర్మానాన్ని పూర్వపక్షం చెయ్యడానికి ( తప్పని నిరూపించడానికి) కేవలం రెండు కళ్ళు చాలు.

18. ప్రతిచెట్టూ కలపతో చెయ్యబడినా పండును బట్టి చెట్టుని వేరుగా గుర్తించినట్టే, శరీరం ఒకే పదార్థంతో చెయ్యబడ్డా, మనిషులని వాళ్ళ ధర్మనిష్ఠ నుబట్టి వేరుగా గుర్తించవచ్చు.

19. ఎవరి బుద్ధి అయినా ఒకే ఉక్కునుండి చేసిన కత్తి లాంటిది. వాటిలో ఏవైనా తేడాలు కనిపిస్తే, అవి కేవలం వాటి అంచుల పదును బట్టే.

20. పదార్థానికి అవగాహనగాని, స్మృతి గాని, అనుభూతిగాని, సంకల్పముగాని ఉండవు. అది కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండే అణువుల సముదాయం మాత్రమే. అస్తిత్వం అంటే అదే అని అనుకోవడం చెప్పలేనంత సిగ్గుతెప్పించే పొరపాటు.

**** (*) ****