నీరెండ మెరుపు

హేమంతపు ఉదయం… రాధిక

ఫిబ్రవరి 2013

హేమంతపు ఉదయం…

వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు
దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు

ఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలు

మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు

ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు

ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో.

***

కవిలాగే, ఆధునిక కవిత్వం కూడా ఏ ఇతరేతర ఛాయలూ, వాసనలూ లేకుండా ఒంటరిగా ఉండగలిగే వస్తువు కాదు (Just as the poet himself, modern Poetry is not an isolated entity in itself). కారణం, రచనా ప్రక్రియలో అంతర్లీనంగా అతని ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్య ప్రభావం పనిచేస్తూంటుంది. ఉపమలూ, రూపకాలూ, ధ్వనులూ, వ్యంగ్యోక్తులూ కవి కల్పనలైనప్పటికీ, ఆ కల్పనల ఎంపిక, సమకాలీనత, సందర్భమూ పూర్వంకంటే భిన్నంగా ఉండడానికి గలకారణం, ఇప్పటి కవిత్వ పరమార్థం పాఠకుడిని రంజింపజేయడానికి బదులు, ఆలోచింపజేసేవానిగా చెయ్యాలనుకోవడమే. ఈ దృష్టితో చూసినపుడు రాధిక గారి కవిత పైకి మనకి కనుమరుగైపోయిన లేదా దాదాపు కనుమరుగైపోయిన గ్రామీణ వాతావరణాన్ని చిత్రించడంలో ఒక Nostalgic Memory నిrecord చెయ్యడం కంటే, అలా కనుమరుగైపోవడానికిగల కారణాలని పాఠకుడు ఆలోచించుకోవాలనే…అని నా ఉద్దేశ్యం. కనుక ఆ మేరకు నా వ్యాఖ్యలు prejudicedగా గుర్తించవలసిందని మనవి చేస్తున్నాను.

(రాధిక)

మంచికవిత లక్షణం దానితో పాఠకుడు మమేకమవగలగడం. ఇప్పుడు సుమారు ముఫై ఏళ్ళు దాటినవారందరికీ ఈ కవిత నచ్చుతుంది. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క సమయంలో శోభ. ఈ కవితని వాక్యంలో చెపితే ఇలా ఉంటుంది: హేమంతం సూర్యోదయానికి ముందు అనుభూతి చెందవలసిన ఋతువు. వణికించేచలి. దేవాలయాల్లో పాశురాల పఠనం. వెచ్చవెచ్చగా మిరియాలు వేసిన కటిపొంగలి ప్రసాదం నైవేద్యం. దుప్పట్లు కప్పుకున్నా వదలని చలి;చలిమంటలకు కరుగుతున్న మంచుతెరలు; పొద్దుపొడిచినా వాడిలేని కిరణాలతో, వెండిబిళ్లలా కనిపించే సూరీడు. రాత్రి విరిసి గుట్టలుగా పోగుపడ్డ పారిజాతాలు.

 

ఈ కవితలో రెండు అందమైన వాక్యాలు ఉన్నాయి. అవి

ఎంత పొద్దెక్కినా

సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో

 

చలిగిలికి ఇంకా

విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో

 

అసలే రాత్రిప్రమాణం ఎక్కువకావడంతో, సూర్యోదయమయేటప్పటికే ఆరు గంటలు దాటుతుంది. పదిగంటలైనా పొగమంచుతెర తొలగదు. అసలే కిరణాలు ఏటవాలుగా పడటంతో వాటిలో వేడిమి తగ్గిపోతుంది. దానికి తోడు మంచుతెర ఒకటి. అందుకని సూర్యుడు ప్రయోజనం లేదని తనకిరణాలని దాచుకుంటున్నాడు. (బహుశా వేసవిలో వడ్డీతో సహా వడ్డించవచ్చునని)

రెండో దాంట్లో “చలిగిలి” అన్నప్రయోగం గమనించదగ్గది. చలికి ముడుచుకుపోయేది మనఒక్కళమేనేమిటి? తోటలోని రంగు రంగులపూలుకూడా చలికి భయపడి విచ్చుకోవటం లేదట.

అదే చమత్కారం. ఒక ప్రకృతి సహజమైన ధర్మానికి అందమైన కారణాన్ని ఉత్ప్రేక్షించడమే కవిత్వం.