“మేడం గారు, మీకు నిద్ర రావట్లేదా! టీ తీసుకురానా?”
“ఒరై అబ్దుల్! ఈ సమయానికి నువ్విక్కడా! నీక్కూడా నిద్ర రావట్లేదా?”
“మీరు టెర్రెస్ పై పచార్లు చేస్తూంటే నా గదిలోంచి చూసి వచ్చాను. మీకేమైనా…?”
“సరే. రా ఇలా కూర్చో…”
“నేనా…హి…హి…”
“పర్లేదు. నాకు బోర్ కొట్టుతూంది. నీతో బాతాఖానీలు కొట్టైన నా బోర్ను దూరం చేద్దామనుకొంటున్నాను”
“అలాగేనండీ!”
“అరే…రే …నేల పై కూర్చుటున్నావెందుకు?”
“మరే…మేడం గారు?”
“ఇక్కడ ఈ కుర్చీ మీద కూర్చో.”
“సారు చూస్తే…?”
“భయపడకు. మీ సారు లేచేది తెల్లారకనే”
“సరే. మీరు కూర్చోమంటే కుర్చుంటాను.”
“ఊరుకున్నావేమిటి? ఏదైన మాట్లడవయ్యా.”
“ఏం మాట్లాడనండి?”
“ఏదైనా…”
“ఏదైనా అంటే ఏమిటండి?”
“సరే…నేను నీకెలా కనిపిస్తున్నాను?”
“మీరాండి…చాలా బాగుణ్ణారండి.”
“నేనైతే బాగున్నాను. కాని నీకెలా అనిపిస్తున్నాను?”
“నాక్కూడా…అండి.”
“అరే నువ్వు అమ్మాయిల్లా సిగ్గుపడుతావేమిటీ?”
“నేనానండి…మిమ్మల్ని తరచుగా టి.వి.లో చూసేవాడిని. అప్పుడు కూడా నాకు బాగా అనిపించే వారు”
“మరిప్పుడో?”
“ఇప్పుడైతే…ఇంకా బాగున్నారు.”
“ఎందుకు అలా?”
“ఎందుకంటే…మీరున్నారే అలా!”
“నేనే గాకా వేరే అమ్మాయిళ్లు కూడా వస్తుంటారు కదా?”
“అవునండి. వస్తూంటారు.”
“వాళ్లు కూడా బాగుంటారేమో?”
“వాళ్లు మీ లాగా నాతో మాట్లాడరండి. ఎంత సేపుంటారో అప్పటివరకు నాపై రువాబు కొడ్తుంటారు.”
“అల్లాగా!”
“మేడం గారు. మీతో విషయం అడగాలనుకొంటున్నాను…”
“ఒ.కె. అడుగు.”
“అదేమిటంటే…మీరైతే కోప్పడరుగా?”
“కోప్పడను.”
“మేడం గారు మీరు…చూడండి మీరు సారు తో షికాయతైతే చేయరుగా?”
“అరే చేయనయ్యా…సంగతేమిటో చెప్పు!
“చూడండి. మీరిక్కడికి వస్తూంటారు. అలాగే మరోచోటికి కూడ వెళ్లుతుంటారేమో?”
“అవును.”
“మా సారు లాంటి మరో సార్ లు కూడా ఉన్నారేమో?”
“అవును. చాలా మంది ఉన్నారు.”
“ఇక్కడికొచ్చే అమ్మాయిలు కూడా వేరే చోట్లకు వెళ్లుతూంటుంటారేమో?”
“అవును. వెళ్లుతుంటారు. కాని నువ్వివ్వన్నీ అడుగుతున్నావెందుకు?”
“వాళ్లందరితో ఇంతే డబ్బు తీసుకొంటారేమో?”
“ఆ…కొందరితో ఎక్కువ…కొందరితో కొంచం తక్కువ…గిరాకి బట్టి ఉంటుంది. సార్ లా మూడ్ బట్టి కూడా ఉంటుంది.”
“మరి మేడం మిమ్మల్ని ఇంటికి పిలిపించి… మందుకొట్టి పడుకొంటారు?”
“అవును. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కాని ఇన్ని ప్రశ్నలు ఎందుకడుగుతున్నావ్? ”
“అదే…మీతో చెప్పాను కదా ఓ విషయం అడగాలని.”
“అయితే ఆ విషయం నువ్వింకా అడగనే లేదా? మరింకెప్పుడడుగుతావ్? ”
“ఆ విషయం ఏమిటంటే…నాకో ఫ్రెండ్…”
“ఏమైంది నీ ఫ్రెండ్ కు?”
“వాడు కూడా నా లాగే ఓ సార్ దగ్గర పని చేస్తూన్నాడు.”
“అంటే ఈ లాంటి సారేనా?”
“ఆ…అవునండి…మేడంగారు.నా ఫ్రెండ్ పెండ్లైన వాడు.”
“మరి, అతని సార్ కూడా…”
“కాదండి. మీరు అప్పార్ధం చేసుకుంటున్నారు. వాడు కూడా నాలాగే అమ్మాయిలు రావడం సార్ వాళ్ల మీద డబ్బులు ఖర్చు పెట్టడం చూస్తూంటాడు.”
“ఓ …అలాగ…అయితే…”
“అయితే…మేడం గారు. వాడి పెండ్లం చాలా అందంగా ఉంటుంది. ఫిల్మ్ ఆక్ట్రెస్ లా.”
“మరి అతని భార్యకేమైంది?”
“ఆమెకైతే ఏమి కాలేదండి. ఆమె రోజల్లా క్వార్టెర్ లోనే ఉండేది. అయింది వాడికే.”
“ఏమైందతనికి? ”
“పేరాశ!”
“నాకర్ధం కాలా!”
“అదేనండి. వాడు ఇంటికొచ్చే ప్రతి ఆడదానితో తన పెండ్లాన్ని తూచే వాడు. వాడికి తన పెండ్లం ఉన్న పళ్ళెమే భారిగా అనిపించేది.”
“మరి…?”
“ఆ పేరాశే వాడిని పెనుభూతంలా పట్టుకుంది. ఇలా డబ్బు సంపాదించడం చాలా తేలిక అనిపించింది.”
“ఆ… నేను వింటున్నాను. ఆ తర్వాత.”
“వాడు ఛాన్స్ కోసం ఎదురు చూడడం మొదలెట్టాడు. కాని…”
“కాని!…అంటే…?”
“వాడి భార్య సహకరించడం లేదు.”
“ఎందుకు?”
“అవే…బీదోళ్ళ సమస్యలు. వాళ్ళకుండే మానం, గౌరవం, లజ్జా…”
“మరి నీ ఫ్రెండ్ ఆ సమస్యలను ఎలా నివారించాడు. ఉపాయం ఏం చేశాడు.”
“మొదట్లో వాడు తన పెండ్లాన్ని మాటలతో నచ్చ జెప్పడానికి ప్రయత్నించాడు. ఈ మాటల గారడీలో ఏమి లేదని. ఓ సారి తన దగ్గర డబ్బు వచ్చిందంటే ఎవ్వడు పట్టించుకోడు ఎక్కణుంచి వచ్చిందని, ఎలా సంపాదించావని.”
“మరి ఆమె ఒప్పుకుందా?”
“లేదు. కాని ఆమె ఒప్పుకునే ముందే ఓ ఛాన్స్ దొరికింది.”
“అదేలా?”
“నా ఫ్రెండ్ సార్ వాడిని ఓసారి ఒక చోటికి పంపించి…ఇంతకు క్రితం మొదటి సారి వచ్చిన అమ్మాయిని తీసుకురమ్మని పంపించాడు.”
“ఓ.కే. వింటూన్నాను.”
“నా ఫ్రెండ్ ఆ అమ్మాయిని తీసుకురావడానికి దగ్గరికి వెళ్లగా ఆమె తనకు ఒంట్లో బాగులేనందుకు రాలేనని చెప్పిందట. కాని అసలు సంగతి అది కాదని వాడికి తెలిసిపోయింది.”
“అసలు సంగతేమిటి?”
“అసలు సంగతేమిటంతే వాడి సార్ కన్న గొప్ప సార్ ఆమె ఇంట్లో ఉన్నాడు. ఆతడి కార్ బయట ఉంది.”
“మరి వాడు ఉత్త చేతులతో వచ్చాడా?”
“అంతే గదా! ఉత్త చేతులతోనే వచ్చాడు. కాని ఇంటికి వచ్చాక ఓ ఐడియా వచ్చిందతనికి.”
“అదేమిటి?”
” నా ఫ్రెండ్ సార్ తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి బాగ తాగి, బోర్ల పడిపోయాడు.”
“ఇందులో మరి నీ ఫ్రెండ్ ఐడియ ప్రసక్తెక్కడ?”
“నా ఫ్రెండ్ ఆలోచించాడు. సార్ బాగా తాగి మైకంలో తెలివి తప్పి పడి ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఒకరిని గుర్తించే తెలివెక్కడ ఉంటుంది. అతడు తన పెండ్లాం దగ్గరికి వెళ్లాడు. కాని ఆమె ఒప్పుకో లేదు.”
“మంచి అవకాశం చేయి జారిపోయింది.”
“లేదు. ఆమె ఈ అత్యాశకు ఒప్పుకోకపోతే, బలవంతంగా ఆమెను లాక్కుంటూ తీసుకువెళ్లి తన సార్ గదిలో తోసోచ్చేశాడు.”
“మరి అతడు పోల్చుకోలేదా?”
“లేదు. కాని అతనికి ఉదయం తెలివొచ్చాక…ఇద్దరిని ఇంట్లోనుంచి గెంటేశాడు.”
“ఎందుకు?”
“ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఇవ్వాలి మేడం!”
“జావాబు నీకెందుకు? బహుశ ఇది నీ కథేనేమో!”
“మీరు చాలా తెలివైన వారు.నిజంగా…ఆమె నా పెండ్లామే…”
“సరే. నువ్వే చెప్పు. నేనామెకంటే అందంగా ఉన్నానా”
” లేరు.”
“కాని…నేనిక్కడికి రావడానికి పదివేల రూపాయలు తీసుకున్నాను.”
“అలాగా!”
“నేనొచ్చిన అరగంట తర్వాత మీ సార్ కు నిద్రొచ్చేసింది.”
“అలాగా! మరి ఆ పది వేల….”
“మీ సార్ ఇచ్చిన ఆ పది వేలకు కారణం…రేపుదయం నాతో రాత్రంతా గడిపారని తన ఫ్రెండ్స్ తో గొప్పలు చెప్పుకోవాడానికే. అర్ధమైందా?”
“కాలేదు.”
“అతను ఇచ్చిన ఈ ఖరీదు నా కోసం కాదు. నా గ్లామర్ నటన కోసం. ఇప్పుడైన అర్ధమైందా?”
“అర్ధమైంది. కాని ఆమె బహుశా నా కంటే ముందుగానే అర్ధం చేసుకుంది.”
“ఆమె అంటే ఎవరు?”
“ఎవరినైతే ఇంటిలో నుంచి బయటికి పంపించేశాడో.”
“ఆమెకెలా అర్ధమైంది?”
“ఆమే ఈ రోజుల్లో రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా వస్తూంది.”
“మరి నువ్వు ఆమెను కలుసుకో లేదా?”
“స్టూడియోలో నన్నెవ్వరు లోనికి రానివ్వనే లేదు.”
“అలాగైతే ఇంటికెందుకు వెళ్లలేదు?”
“అసలు సంగతేమిటంటే…”
“ఆమె నిన్ను గుర్తుపట్ట లేదేమో”
“గుర్తు పట్టింది. కాని ఇక్కడ ఉండదలుచుకుంటే నా అన్నగా ఉండాలి. ఎందుకంటే నేనింకా అవివాహితను అని అందరికీ చెప్పానంది.”
“అలాగే చేయలేక పోయావ మరి…!”
“లేదండి. అలా కుదరదు.”
“ఎందుకు?”
“ఈ మాట నాకు అవమానంగా ఉంటుంది. నా మనసు ఒప్పుకోదు.”
“మరి నీ భార్యను నువ్వు బలవంతం చేసినప్పుడు ఈ మాటెక్కడికి పోయింది?”
“అప్పుడు ఎవరికి తెలిసేదని…కొన్ని డబ్బులు కూడా చేతికి అందేవి. నలుగురిలో గౌరం, మర్యాదలు కూడా ఉండేవి.
“మరిప్పుడేం చేస్తావ్?”
“ఆమె మొహం పై ఆసిడ్ పోసి…ఆమె మొహాన్ని అందవికారం చేస్తాను.”
“దానితో నీకొచ్చే లాభం ఏమిటి?”
“మీరే చూడండి…మా వంశంలో లో నా ధైర్యానికెలాంటి వహ్వాలొస్తాయో…అబ్దుల్ కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడాడోనని.”
*
మూలం: గులాం ఖాదర్ (ఉర్దూ). అనువాదం: అమ్జద్
**** (*) ****
Manava stree purusha sambandhalani chalam chakkagaa tana rachanalalo pondu paricharu. Alanti taraha kadha idi ani anipinchindi. Dhanyadalu.
మీ కామెంట్స్ కు ధన్యవాదాలు బాబు గారు.
కథ చాలా బాగుంది. మహిళ ఏ సామాజిక వ్యవస్థలోనయినా పురుషుల గౌరవాన్ని కొనుక్కోడానికి, వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే వస్తువేనని చక్కగా చెప్పేరు.
శ్రీనివాస్ గారు థాంక్సండి.