అనువాద కథ

సలహా!

ఏప్రిల్ 2015

దురుతున్న తన పైపెదవిని పండ్ల మధ్య అదిమి పట్టుకుంది చంప. హృదయపు లోతుల్లోంచి అవ్యక్తమైన దుఃఖం పొంగుకొస్తుంటే ఆమె దాన్ని అణచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఓ బాధ ఆమె నరనరాల్లో ప్రాకసాగింది. ఆ వేదనకు కారణం సొంత జీవితం గురించి తను చేస్తున్న నిశితమైన దీర్ఘాలోచన కావచ్చుననుకుంది ఆమె. సమాజంలో తన స్థానమేమిటి? ఒంటరితనమే తనకు తోడయిందెందుకు? ఇలాంటి ఆలోచనలతో ఆమె మెదడు వేడెక్కింది.

తను మొదట్నుంచి బ్రాహ్మణులూ నిమ్నకులాల వాళ్ళూ జీవించే వాడకు దగ్గర్లోనే, తక్కువ జాతికి చెందిన బీదవాళ్ళుండే బస్తీలోనే ఉంటోంది. ఈ బస్తీలోని ఆడవాళ్ళు ఒకప్పుడు వేశ్యలుగా ఎంచబడేవాళ్ళు. కాని వాళ్ళు ఆ వృత్తిని విడిచి ఎన్నో ఏళ్ళైంది. అయినా వాళ్ళు బ్రాహ్మణుల ఇండ్లలో ఇప్పటికీ పనిమనుషులుగా పని చేస్తూ కూలి పనులకు కూడా వెళ్తున్నారు. అయినప్పటికీ సమాజంలో వారికి ఎలాంటి గుర్తింపూ లేదు. ఇక ఆ ఉన్నత కులాలవారి మస్తిష్కాల్లో ఇంకా పాత ఆలోచనా విధానమే నెలకొని ఉంది.

దళిత జాతులకు చెందిన స్త్రీలు ఇప్పుడు బజారులో అమ్ముడుపోయే వస్తువులుగా లేకపోయినా ఉన్నత కులాల్లోని పురుషులు గుడిసెలలోని అందమైన బీద అమ్మాయిలను తమ పడకగదుల్లోకి రప్పించుకుని, రహస్యంగా కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. అయినా ఆ స్త్రీలకు తమ దీనావస్థల పట్ల అంతగా దుఃఖం లేదు. సమాజం తమకు ఇచ్చిన యోగ్యత ఎలాంటిదైనా ఓర్పుతో తృప్తితో జీవితాలను గడుపుతున్నారు. అటువంటి జీవితం తమకు ఎప్పుడు ఎలా ఏ క్రమంలో మొదలైంది అన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. పైగా దాని గురించి ఆలోచించాలని వాళ్ళకు గుర్తు కూడా రాలేదు. తన అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ, ముత్తాతమ్మల కన్న ముందు నుంచే తమ కుటుంబాల్లో వ్యభిచారం నడుస్తూ వస్తున్నదేమో అనుకున్నది చంప. లేదా తేనెటీగలు రాణి తేనెటీగ కోసం తేనె ప్రోగు చేయడం మొదలైనప్పట్నుంచి ఈ ఆచారం ఉందేమో అనుకుంది.

రఘునాథ్ తో చంపకు ఉన్న పరిచయం నిన్నమొన్నటిది కాదు. చిన్నప్పట్నుంచే వాళ్ళిద్దరు కలిసి పెరిగారు. వాళ్లు కలిసి తిరిగేవారు, కలిసి ఆటలు ఆడేవారు, కలిసి పాటలు పాడేవారు. ఆ విధంగా వాళ్ళు యుక్త వయస్సులోకి వచ్చారు. చంప మర్యాదస్తులైన స్త్రీలు నివసించే ఇంటిలో ఉండేది. రఘునాథ్ గొప్పింటి బిడ్డ. పైగా ఏకైక పుత్రరత్నం, వంశోద్ధారకుడు.

రఘునాథ్ నాన్న చంప తల్లితో శృంగార కలాపాల్లో మునిగి తేలుతున్న సమయాల్లో చంప, రఘునాథ్ ఇద్దరూ కలిసి తోటలో ఆడుకుంటూ రంగురంగుల పూలను కోసుకుంటుండే వారు.

రఘునాథ్ పైచదువుల కోసం పట్టణం వెళ్ళిపోయాడు. సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. చంప దేనికోసమైతే ఎదురు చూస్తోందో దాని సమయం ఇంకా రాలేదు. కాని రఘు తన చదువును పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినప్పట్నుంచి తన మనసులో గిలిబిలి మొదలైంది. రఘునాథ్ చంప పట్ల తన ప్రేమను వెల్లడించాడు. చంపకు అతడప్పుడు మెరుస్తున్న భానుడిలా కనిపించాడు. తను ఆకాశాన్ని చుంబించే కలలు కన్నది. అతడు జీవితాంతం తన ఒడిలో సంతోషాన్ని నింపుతాడనీ, తన బతుకు సాఫీగా హాయిగా సాగిపోతుందనీ ఆశించింది. కాని కొన్ని నెలల నుంచి తన మనసులో వ్యాకులత, భయం చోటు చేసుకున్నాయి. జవాబులు లేని కొన్ని ప్రశ్నలు చెదపురుగుల్లాగా మెదడును తొలచడం మొదలెట్టాయి. క్రితంలోలా ఇప్పుడు తనలో ఆనందం లేదు. తన ఇంటి పెరట్లోని మామిడిచెట్టు కొమ్మకు వీపును ఆనించి ఇలా ఆలోచిస్తూ వాపోతుండగా ఎవరో వెనుకనుంచి భుజాన్ని చేయితో తట్టారు. చంప గబుక్కున వెనుదిరిగి చూసి “రఘూ, నువ్వా?” అంది. రఘు కొన్ని నెలలుగా పట్నం నుండి రావడం లేదు. అతడిని చూడగానే చంపలోని బాధ, విషాదం దూరమైపోయాయి. ఆమెలోని అణువణువు పులకరించింది.

రఘునాథ్ “అవును, నేనొచ్చేశాను” అని చిరునవ్వుతో మళ్ళీ ఇలా అన్నాడు. “నా సూట్ కేసూ వగైరా ఇంట్లో పెట్టి నేరుగా నీ దగ్గరికే వచ్చాను”. తర్వాత ఏదో గుర్తొచ్చినవాడిలా మళ్ళీ “మీ అమ్మగారు పోయారని తెలిసి నాకు ఎంతో దుఃఖం కలిగింది” అన్నాడు. చంప కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆమె మొహం తిప్పేసుకుంది. “నా వైపు చూడు. అలా ఏడ్వకు” అన్నాడు రఘు. ఆమెను తనవైపు తిప్పుకుని, రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని ప్రేమతో “చూడు, ఇప్పుడు నీవు ఏడ్చే అవసరం లేదు. నేనొచ్చేశానుగా” అంటూ ఆమెను నఖశిఖ పర్యంతం చూశాడు.

“నువ్వు మునుపటికన్న ఎక్కువ ఒళ్ళు చేశావు. చూడడానికి బాగున్నావు” అని ఆమెను పొగిడాడు. చంప తన దుఃఖాన్నీ అనుమానాలనూ మరిచిపోయి, అతడిని తన బాహువుల్లో బంధించి, అతని చెవిలో ఓ సంతోషకరమైన వార్తను చెప్పింది. దాన్ని వినగానే రఘు మొహం పాలిపోయింది.

“నిజమా? నువ్వు చెబుతున్నది నిజమేనా?” తడబడుతున్న పదాలు అతని గొంతులోంచి అతి కష్టంగా బయటికి వచ్చాయి.

స్త్రీలకు ఉండే సహజమైన సిగ్గుతో ఆమె తల దించుకుంది. బుగ్గలు కెంపులయ్యాయి. చంప చిన్నగా ఇలా అన్నది. “ఇందులో అబద్ధమేముంది? మనం ఎన్నో రోజుల్నుంచి ఇలా…” సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది.

“లేదు చంపా, లేదు. ఇదంతా అబద్ధమని చెప్పు. నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పకు” అన్నాడు రఘు, భయకంపిత స్వరంతో.

“అంతగా భయపడుతున్నావెందుకు రఘూ? ఈ కబురును విన్నాక నీకు సంతోషం కలుగలేదా?” చంప తల పైకెత్తి అడిగింది.

“సంతోషమా? ఎలాంటి సంతోషం?” రఘులో భయం పెరిగింది.

“నన్ను పెండ్లి చేసుకుంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. ఇప్పడు పెండ్లి చేసుకునే సమయం వచ్చింది” అని చంప అతని వాగ్దానాన్ని గుర్తు చేసింది.
“పెండ్లా? నీతోనా> ఎలా జరుగుతుందది? వీలు కాదు” రఘు తనలో తానే గొణుక్కున్నాడు.

“ఎందుకు వీలు కాదు?” నీళ్ళలో మునుగుతున్న వ్యక్తి మరో వ్యక్తి చేయిని గట్టిగా పట్టుకున్నట్టు అడిగింది చంప. ఆమె కండ్లలో కన్నీళ్ళు సుడిగుండంలా తిరిగాయి.

రఘు ఇచ్చిన జవాబు ఓ పదునైన కత్తిలాంటి నిజం అనుకున్నది చంప. అది తన గుండెను కోసేసింది. చంప గట్టిగా ఏడుస్తూ “వాస్తవంలో నేనెంత అమాయకురాలిని, మూర్ఖురాలిని! నేను ఓ వేశ్య కూతురును అనే వాస్తవాన్ని మరచిపోయాను. కాని నేను నిన్ను తప్ప మరెవ్వరినీ దగ్గరికి రానీయలేదు. నువ్వు ఈ రోజు నా నుదుటిపైన వేసిన కళంకం ఏనాటికీ చెరిగిపోదు” అని అరిచింది.

ఆమె వెక్కివెక్కి ఏడ్వసాగింది. రఘు తన చేయిని విదిలించి అక్కడినుండి నిష్క్రమించాడు.

తనకోసం కాకపోయినా పుట్టబోయే తన కొడుకు కోసమైనా రఘు తిరిగొస్తాడని చంప ఆశించి నిరీక్షించింది. కాని ఆమె నిరీక్షణ ఫలించలేదు. అతడు రాలేదు.

ఆ రోజు ఉదయం నుంచే తనకు పురిటి నొప్పులు వస్తున్నట్టనిపించింది చంపకు. శిశువు ఈ లోకంలోనికి రావడానికి బహుశా ఆరాటం చెందుతున్నాడేమో! అతని రాక కోసం ఎవ్వరూ ఎదురు చూడడం లేదు! బెడ్ పైన ఉన్న చంప శారీరకంగా, నైతికంగా బాధ పడసాగింది. అంతలోనే రఘునాథ్ నాన్న ప్రభునాథ్ ఆ గదిలోకి ప్రవేశించి చంప పక్కన కూర్చున్నాడు. అతనిలో విచారం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.

“ఏమిటి పెదనాన్న గారూ?” చంప బలహీన స్వరంతో అడిగింది.

ముసలివాడైన రఘునాథ్ తండ్రి తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. భయం కారణంగా అతని నుదురు పైన చెమటలు పట్టాయి. దయను ఆశిస్తున్న వాడిలా “చంపా, నేను సర్వనాశనమై పోయాను. నా కూతురు నా వంశపు ముఖం మీద మసి పూసింది” అన్నాడు.

“రూపకేమైంది పెదనాన్న గారూ? ఆమె అంత పెద్ద తప్పేం చేసింది?” అని చంప అమాయకంగా అడిగింది.

ప్రభునాథ్ ఏడుపును ఆపుకుంటూ “బహుశా మా అదృష్టానికి శని పట్టి ఉంటుంది. మూడు నెలల తర్వాత రూపకు పెండ్లి కాబోతున్నది. తారీఖు కూడా నిశ్చయమైపోయింది. ఇంటికి రమ్మని కొన్ని నెలల క్రితమే దానికి ఉత్తరం రాశాను” అన్నాడు. తర్వాత మళ్ళీ “రూప పట్నంలో హాస్టల్లో ఉంటూ చదువుతోంది. కాని ఆమె రాలేదు. నేనే స్వయంగా ఆమెను వెంట తీసుకురావడానికి వెళ్ళాను. అప్పటికే ఆమె నిండు గర్భిణి” అని వెక్కిళ్ళ మధ్య చెప్తూ ప్రభునాథ్ కుర్చీ చేతులను గట్టిగా పట్టుకున్నాడు.

“ఏమిటీ? రూప గర్భవతి అయిందా?” చంప నమ్మలేక పోయింది.

“అవును. ఆరు నెలల నుంచి ఆమె కాలేజీకి వెళ్ళడం లేదు. ఈ విషయాన్ని నాకు ఎవ్వరూ చెప్పలేదు. అసలు విషయం నాకు ముందుగా తెలిసి ఉంటే బాగుండేది” రూప తండ్రి గొంతులో కోపం ధ్వనించింది.

“నిన్న అర్ధరాత్రి వేళలో రూపను దుప్పట్లో చుట్టి ఎవ్వరికీ తెలియకుండా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పడామెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పెండ్లికి మూడు నెలల సమయం మాత్రమే ఉంది. వరుడి తరఫువాళ్ళకు ఈ విషయం తెలిస్తే నాకు మొహం చెల్లదు. ఆత్మహత్యే నాకు శరణ్యం” అన్నాడు ప్రభునాథ్. అతని మొహం పాలిపోయింది.

“కాని పెదనాన్న గారూ. ఈ విషయంలో నేనేం చేయగలను? ఇదంతా నాకెందుకు చెబుతున్నారు?” చంప విస్తుపోతూ అడిగింది.

“నా బిడ్డ విషయం చూస్తే నా మర్యాద గంగలో కలవబోతున్నదని అనిపిస్తోంది. నువ్వే నాకు సహాయ పడగలవు” అన్నాడు ప్రభునాథ్. అతని గొంతులో లక్ష వేడుకోళ్ళు వినిపిస్తున్నాయి.

“నే… నేనా? నేనెలా మీకు సహాయ పడగలను?” ఆమెలోని ఆశ్చర్యం రెండింతలైంది.

“రూప పెండ్లికి ఇంకా మూడు నెలల సమయముంది. ఆమె అన్న అయిన రఘుకు కూడా పెండ్లి కాబోతోంది. ఒకవేళ రూప సంగతి బయట పడితే ఈ రెండు పెండ్లిళ్ళు జరగవు. కాబట్టి నువ్వు రూప బిడ్డను నీ బిడ్డగా స్వీకరిస్తే ఈ గండంనుంచి మేం బయట పడగలుగుతాం” అన్నాడు రఘునాథ్. అతనికి ముచ్చెమటలు పట్టాయి.

“మీరు చూడడం లేదా? నేనే తల్లిని కాబోతున్నాను” చంప తన కోపాన్ని అణచుకుంటూనే చిన్నగా అరిచింది.

“కవల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉన్నది కదా నీకు?” కవల పిల్లలు పుట్టినట్టు మేము ప్రచారం చేయగలం. చంపా, నా బిడ్డ గౌరవాన్నీ, నా గౌరవ మర్యాదలనూ నిలబెట్టు” అంటూ రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్న ప్రభునాథ్ కండ్లలోంచి కన్నీటి చుక్కలు రాలాయి. అతడు ఇదంతా ముందే ఆలోచించుకుని వచ్చాడులా ఉంది.

చంప కొన్ని క్షణాలదాకా ఛీత్కరింపు నిండిన చూపులతో అతడిని చూడసాగింది. తల పూర్తిగా నెరిసిన ప్రభునాథ్ చంప కాళ్ళను పట్టుకున్నాడు. ఒప్పుకోమని వేడుకున్నాడు. ప్రార్థించాడు. చంప చివరికి మెత్తబడి ఓడిపోయిన స్వరంతో ఇలా అన్నది. “సరే, నేను కవల పిల్లల తల్లినవుతాను. మీ గౌరవ మర్యాదలకు నష్టం కలగడం ఈ పనితో ఆగిపోతే మంచిదే. అలాగే మరి” ప్రభునాథ్ ఊపిరి పీల్చుకుని ఆమె కాళ్ళను వదిలేసి, అత్యంత ప్రేమతో ఆమె చేయిన తన చేతులలోకి తీసుకుని “నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు మామూలు మనిషివి కావు. నా బిడ్డవు. ఓ అవతారానివి, దేవతవు” అన్నాడు. ఇంకా ఏదో అనబోతుండగా “పెదనాన్న గారూ! నేను ఏ దేవతనూ కాను. అవతారాన్నీ కాను. నన్ను అంత ఎత్తైన పీఠం మీద కూర్చోబెట్టకండి. నేను కేవలం ఓ వేశ్య కూతురును. వేశ్యను. ఎవరి బిడ్డనూ కాను” అన్నది చంప.

దాదాపు నాలుగు నెలల తర్వాత వసంత రుతువులో ఓ అందమైన సాయంత్రం వేళ ఊరి బయటి స్వచ్ఛమైన గాలిని పీల్చడం కోసం రఘువాథ్ తన భార్యతో నడవసాగాడు. అతని వెంట అతని చెల్లెలు రూప, ఆమె భర్త కూడా ఉన్నారు. వాళ్ళు తోటనానుకుని ఉన్న రోడ్డు వెంట నడుస్తున్నారు. రఘు భార్య రోడ్డుకు అవతలి వైపున ఉన్న ఒక స్త్రీని తన చూపుడువేలుతో చూపిస్తూ “ఓ స్త్రీ ఒకేలా ఉన్న ఇద్దరు పసిపిల్లలతో ఎలా నిలబడి ఉందో చూశారా?” అంది.

రఘు ఆ స్త్రీని చూడగానే ఆందోళన చెందుతూ తన చూపును మరల్చుకున్నాడు. ఇద్దరు పసిపాపలను తన గుండెలకు హత్తుకుని నిలుచున్న ఆ స్త్రీ చంప. ఆమె నలిగిపోయిన చీర, అక్కడక్కడ చిరిగిపోయిన రవిక, చెదరిన జుట్టుతో ఉంది. కళావిహీనంగా ఉన్న ఆమె కండ్లలో నిరాశా నిస్పృహలు నిండి ఉన్నాయి.

“పిల్లలు ముద్దుగా ఉన్నారు” అని రూప భర్త వ్యాఖ్యానించాడు. రూప అతడిని తన ముంజేయితో తట్టి నేలవైపు చూస్తూ చిన్నగా ఇలా గొణిగింది. “పోనీయండి. అటువైపు చూడకండి. ఆమె ఓ వేశ్య కూతురు”

*

(భారతీయాంగ్ల కథ)
మూలం: ఎన్. సుందర్
తెలుగు అనువాదం: అమ్జద్

**** (*) ****