జావెద్ నా ప్రాణ స్నేహితుడు. మా మధ్య ఏలాంటి దాపరికాలు లేవు. ఇద్దరం గంటల తరబడి పిచ్చాపాటి మాట్లడుకునేవాళ్లం. అతడికి దగ్గరి బంధువులతో పడేది కాదు. కొన్నాళ్ళనుంచి గంటల తరబడి ఏకాంతంగా ఉండేవాడు. పలకరిస్తేనే మాట్లాడేవాడు కాదు. వాడిలో ఉన్న చలాకితనం మాయమవుతున్నట్లు గ్రహించి, ఓ రోజు ” ఏంట్రా…ఏమిటి సంగతి? ఆకాశం లో ఏముందని అలా గంటల తరబడి చూస్తుంటావు? ఇలాగే ఉంటే ఓ రోజు పిచ్చివాడివైపోగలవు” అని అన్నాను.
గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి, “ అలాగే అనుకో…!?” అని జవాబు ఇచ్చాడు.
“ఫర్ ద గాడ్ సేక్ జావెద్ అసలు సంగతేమిటో చెప్పు. నా దగ్గర నీకు సీక్రేట్స్ ఏమి లేవుగా…” ప్రాధేయపడ్డాను వాడి అవస్థ చూడలేక.
చావు కబురు చల్లగా చెప్పినట్లు “నేను ప్రేమలో పడ్డానోయి!” అని అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. సిగ్గు మొహం, అడవాళ్ళంటే ఓ విధం గా బిడియం పడే ఈ వెధవ ప్రేమలో పడ్డాడా అని ఓ వైపు ఆశ్చర్యం కలిగిన మరో వైపు నమ్మకం కలగ లేదు. వాడు అమ్మాయిల కన్న ఎక్కువగా సిగ్గు పడుతుంటాడు. సందేహం నివృత్తి చేసుకొందామని కూపి లాగాను. వాడు జోక్ కొడ్తున్నాడనుకొన్నాను.
“ఏ అమ్మాయిని ప్రేమించావ్?”
“ఓ అమ్మాయి ఉంది. పేరు జాహెద. పొరుగింటి అమ్మాయి.ఆమె తో ప్రేమలో పడ్డాను. ఇరవై యేండ్లుంటాయి. చాలా అందంగా ఉంటుంది.ఎన్నోసార్లు మేము కలుసుకున్నాం. అమె నా ప్రేమను స్వీకరించింది. “తడుముకోకుండా జవాబిచ్చాడు.
“మరి నువ్వు ఇలా దిగులుగా ఉంటున్నావెందుకు?” అని అడిగాను.
అతడు నవ్వుతు అన్నాడు,” సాదత్ నువ్వెప్పుడైన ప్రేమలో పడితే తెలిసేది…ప్రేమ ఉదాసీనతకే మరో పేరు. మనిషెప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అవుతుంటాడు. అతడి మనసులో,మెదడులో ప్రేయసియే ఆవరించుకొని ఉంటుంది….ఆమె తో నీ గురించి చెప్పాను. నీ తర్వాత నాకు విలువైనవాడు సాదత్ అని చెప్పాను.”
“అలా అని ఎందుకు చెప్పావ్?”
“అంతే చెప్పేశాను. ఆమె నిన్ను కలవడానికి ఉత్సహంగా కూడా ఉంది. వస్తావుకదా నీ వదినతో కలవడానికి. ” అని అడిగాడు నన్ను.
నేనేం చెప్పాలో అర్థం కాలేదు.
“నాకు జవాబు ఇవ్వలేదు నువ్వు!” అడిగాడు జావెద్.
“ఆ…వెళ్దాం…తప్పకుండా వెళ్దాం. కాని ఎక్కడికి?”
“ఆమె ఏదో ఓ వంకన సాయంత్రం ఐదు గంటలకు లారెన్స్ గార్డెన్ లోకి వస్తానని చెప్పింది. నిన్ను తప్పకుండ అక్కడికి తీసుకొని రమ్మంది. కాబట్టి నువ్వు రేపు ఐదు గంటలకు తయారుగా ఉండు. లేదా నువ్వే నేరుగా ఐదు గంటలకన్న ముందే అక్కడికి చేరుకో. మేము నీ కోసం జింఖానా క్లబ్ కు ఇటు వైపున్న లాన్ పై నీ కోసం ఎదురు చూస్తుంటాం. “ అని క్లుప్తంగా చెప్పాడు
నేను నిరాకరించ లేదు. కారణం జావెద్ నాకు ప్రాణ స్నేహితుడు. తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను. నాకెందుకో అతని మీద సానుభూతి కలగసాగింది.
“అమ్మాయి గుణవంతురాలు. మంచి ప్రవర్తన గలిగిందే కదా?” అని అడిగాను.
జావెద్ మోహం కోపం తో కందగడ్డలా అయింది.
“జాహెద గురించి ఇలాంటివి నేను ఆలో చించలేను. విన లేను. ఆమె తో నువ్వు కలవాలను కొంటే సరిగ్గా ఐదు గంటలకు లారెన్స్ గార్డెన్ లో కొచ్చేయి. గుడ్ బై.” అంటూ కోపంగా అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు జావెద్.
అతడు కోపంగా అక్కడణుంచి లేచి వెళ్లి పోయాక ఆలోచించసాగాను. నేనలా అడగ కుండాల్సింది. అతడిని బహుశ నా ప్రశ్న నొప్పించిందేమో. ఎంతకైనా వాడు ఆమెను ప్రేమిస్తున్నాడు. ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడితే ఆమె చరిత్రహీనురాలు కానవసరం లేదు. జావెద్ తనను ప్రాణా స్నేహితుడనుకొంటున్నాడు. ఆ కారణం చేతనే కోపంగా ఉన్న కూడా సాయంత్రం లారెన్స్ గార్డెన్ కు రమ్మని మరీ చెప్పి వెళ్లాడు.
జాహెద తో కలసి ఏం మాట్లాడాలో ఆలోచించ సాగాను.
ఎన్నో ఆలోచనలు నా మస్తిష్కం లో కొచ్చాయి. కాని అవి ఓ మంచి మిత్రుడి ప్రియురాలితో మాట్లాడవలసిన అడగాల్సినవి కావు. నా గురించి ఆమెతో ఏమేమి చెప్పాడో దేవుడెరుగు. నా గురించి బాగా పొగిడే ఉంటాడు. ఆమెకు నేనంటే ఈర్ష్య కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే ప్రియురాళ్లు తమ ప్రేమను ఇతరులతో పంచుకోనివ్వరు. బహుశ నన్ను ఎగతాళి చేయడానికే జావెద్ తో చెప్పి నన్ను పిలిపిస్తున్నదేమో! తన ప్రియుని ప్రియ మిత్రుడితో తప్పకుండ పరిచయం చేయించమందోమో. ఏది ఏమైన నేను నా ప్రియమైన స్నేహితుడి ప్రియురాలిని కలవాల్సుంది. ఈ సందర్భం లో ఏదైన ఓ మంచి గిఫ్ట్ తీసుకోవాలను కున్నాను. రాత్రంతా ఆలోచించాను. బంగారపు టాప్స్ తీసుకోవాలని నిర్ణయించుకొన్నాను. అనార్కలికి వెళ్లగా షాపులు బంద్ ఉన్నాయి. ఆదివారం సెలవు. నా అదృష్టం కొద్ది ఒకే ఒక దుకాణం తెరిచి ఉంది. అక్కణ్నుంచి టాప్స్ కొనుక్కొని ఇంటికి తిరిగొచ్చాను. నాలుగు గంటల వరకు వెళ్లాలా మానాలా అనే సందిగ్ధావస్థ లో ఉండిపోయాను. నాకెందుకో సిగ్గుగా అనిపించసాగింది. అమ్మాయిలతో నేనెప్పుడు మాట్లాడింది లేదు…అందుకనేమో?
మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్ది సేపు బడలిక తీర్చుకుందామని పక్క పై వాలాను. కాని నిద్ర పట్ట లేదు. బోర్లాడసాగాను. నా తలగడక్రింద ఉన్న టాప్స్ రెండు నిప్పు రవ్వల్లాగా అనిపించాయి. లేచి, స్నానించి, షేవ్ చేసి, బట్టలు మార్చుకొంటూండగా గోడ గడియారంచేసిన టింగ్ ..టింగ్..టింగ్ అన్న శబ్దాలను విన్నాను. మూడు గంటలైంది. వార్తా పత్రిక అందుకున్నాను కాని నిలకడగా ఏమి చదవలేక పోయాను. మనసెలాగో ఉంది. ప్రేమలో పడ్డవాడు నా మిత్రుడు! పిచ్చెక్కుతోంది నాకు!!
ఖరీదైన సూట్ వేసుకున్నాను. కొత్త చేతి రూమాల్, కొత్త షూస్…ఇవన్నీ ఆ జావెద్గాడి కోసం. బహుశ నా గురించి జాహెద ముందు నా గురించి గొప్పగా చెప్పి ఉంటాడని. వాడి ఇంప్రెషన్ కోసం నా అలంకరణ ఇదంతా.
నాలుగున్నరకు బయలు దేరాను. ఓ మంచి సైకిలు తీసుకొని నెమ్మదిగా వెళ్లసాగాను.
జింఖాన క్లబ్ కు ఆవలి వైపున లాన్ పై ఒంటరిగా కూర్చున్న జావెద్ కనిపించాడు నాకు. నన్ను చూసి గట్టిగా ఓ కేక వేశాడు. నేను సైకిల్ పై నుంచి దిగగానే పరుగెత్తుకొంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు.
“నువ్వు తొందరగానే వచ్చేశావ్. గుడ్. జాహెద దారిలోనే ఉన్నదేమో. నా కార్ పంపిస్తానని చెప్పాను ఆమెతో. కాని ఒప్పుకో లేదు. టాంగా లో వస్తానంది.” అని ఒక గుక్కలో చెప్పేశాడు సంబరపడుతూ.
జావెద్ నాన్నగారిదగ్గర ఓ కార్ ఉంది. బేబి ఆస్టీన్. ఓల్డ్ మోడల్. జావెదే దీన్ని ఎక్కువగా నడుపుతూండే వాడు. జావెద్ తన కార్లో వచ్చాడు. నన్ను కార్ లో కూర్చొమని బలవంతం చేయసాగాడు. నేనొప్పుకోకపోవడం వల్ల, “అయితే…నువ్వో పని చెయ్…నవ్వు గార్డెన్ బయట గేట్ దగ్గర వేట్ చేయ్. ఓ టాంగా వస్తూంది. అందులో బక్కగా ఉన్న అమ్మాయి నల్లని బుర్ఖా వేసుకొని ఉంటుంది. టాంగా వాడిని ఆపి ’నేను జావెద్ స్నేహితుడిని. నా పేరు సాదత్…మీ స్వాగతానికోసం వచ్చాను’ అని చెప్పు “.
“నేనలా చేయలేను జావెద్” అని చెప్పాను.
“ఓరీ పిచ్చి నాయన…నువ్వు పేరు చెప్పగానే ఆమె నోరు కూడా మెదుపదు. ఒరేయ్…జీవితంలో కొన్ని తీపి గుర్తులుండాలి… జ్ఞాపకం చేసుకోవడానికి. జాహెదతో నా పెండ్లయ్యాక ఈనాటి సంగతులను చెప్పుకొంటూ నవ్వుకోవడానికి బాగుంటాయి. వెళ్లురా బాబు. ఆమె వస్తూనే ఉంటుంది.” అని అన్నాడు నవ్వుతు.
నేను జావెద్ మాటను ఎలా కాదనను! గత్యంతరం లేక నా సైకిల్ ను అక్కడే దగ్గర్లో ఉన్న సైకిల్ స్టాండ్ లో పెట్టి, గేట్ కు కొద్ది దూరంలో నిలబడి టాంగా కోసం నిరీక్షించ సాగాను, నల్ల బుర్ఖా లో వచ్చే జాహెద కోసం.
అర గంట తర్వాత ఒక టాంగా ప్రవేశించింది. అందులో నల్లని పట్టు బుర్ఖాలో ఉన్న ఓ అమ్మాయి టాంగా కనిపించింది. ఆమె వెనుక సీట్లో కాళ్ళు చాపి కూర్చుని ఉంది.
జంకుతు, బెదురుతూ ముందుకెళ్ళి టాంగా వాడిని ఆపాను. అతడు వెంటనే తన టాంగాను ఆపాడు.
“ఈ సవారీ ఎక్కణ్నుంచి వచ్చింది?” అని అడిగాను.
“నీకెందుకు. నువ్వెళ్ళి నీ పని చూసుకో!” అని కఠినంగా జవాబిచ్చాడు.
ఆ అమ్మాయి నెమ్మదిగా ఆ టాంగా వాణ్ణి కోప్పడింది ” నీకు సంస్కారం గల వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదా?” అని.
నా వైపు తిరిగి అంది, “ మీరు టాంగాను ఎందుకు ఆపారండి?” అని.
నేను నసుగుతూ అన్నాను, “ జావెద్ …జావెద్…నేను జావెద్ ఫ్రెండ్ ను. నా పేరు సాదత్. మీ పేరు జాహెద కదా!”
ఆమె మృదువుగా జవాబిచ్చింది, ” అవును…మీ గురించి వారితో చాలా విన్నాను.
“మిమ్మల్ని ఈ విధంగా కలుసుకున్నాక మీరేవిధంగా నాతో ప్రవరిస్తారో చూడమని చెప్పాడు జావెద్. అతడు జింఖాన క్లబ్ దగ్గర ఉన్న పచ్చిక మీద కూర్చొని మీ కోసం ఎదురు చూస్తున్నాడు.”
ఆమె తన ముసుగు తొలగించింది. అందంగానే ఉంది.
“మీరు ముందు సీట్లో కూర్చొండి…నాకో అర్జెంట్ పని ఉంది. కొన్ని నిమిషాలలో తిరిగి వద్దాం. మీ ఫ్రెండ్ కు గడ్డి మీద చాలా సేపువరకు కూర్చునే అవసరం ఉండదు.” అంటు చిరు నవ్వుతో అంది.
నేనామె మాటను కాదనలేదు. ముందుకెళ్లి ముందు సీట్లో టాంగావాడి ప్రక్కన కూర్చున్నాను. టాంగా కదిలింది. అసెంబ్లీ హాల్ దాటుతూండగా అతని తో అన్నాను, “ఇక్కడ దగ్గరలో సిగరెట్లు దొరికితే తీసుకోవాలి. నా దగ్గర సిగరెట్లు అయిపోయాయి.”
కొన్ని నిమిషాల తర్వాత టాంగాను ఓ చోట ఆపాడు వాడు. నేను టాంగా దిగుతూండగా జాహెద అంది, “ మీరెందుకు శ్రమ తీసుకొంటారు. టాంగ వాడు తీసుకొని వస్తాడు.”
“ఇందులో శ్రమ ఏముంది.” అని పాన్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ పెట్టె, ఓ మ్యాచిస్, రెండు కిళ్ళీలు తీసుకొని డబ్బులు చెల్లించి తిరుగుతూండగా టాంగావాడు నా వెనుకాలే నిలబడి ఉన్నాడు.
“సార్, ఈ అమ్మాయితో జాగ్రతగా ఉండండి.” నెమ్మదిగా చెప్పాడు నాతో. నేను చాలా ఆశ్చర్యపోయాను.
“ఆమె వేశ్య … ఆమె పనే ఇది. వయసులో ఉన్న మంచి కుటుంబాలకి చెందిన కుర్రాళ్లను తన బుట్టలో వేసుకొంటుంది. నా టాంగాలో తరచుగా కూర్చుంటుంది.”
ఇది విన్నాక నా కాళ్ల క్రింది నుంచి నేల జారిపోయినట్లైంది.
“నువ్వు ఆమెను ఎక్కణ్నుంచైతే తీసుకొచ్చావో అక్కడే వదిలేసేయ్. ప్లీజ్! నేనామెతో రాలేనని చెప్పేయ్. నా ఫ్రెండ్ నా కోసం గార్డెన్ లో ఎదురుచూస్తున్నాడు” అని ప్రాధేయ పడుతు చెప్పాను ఆ టాంగా వాడితో.
టాంగా వాడు వెళ్ళిపోయాడు. ఆమెతో ఏం చెప్పాడో తెలియదు. నేను మరో టాంగా తీసుకొని లారెన్స్ గార్డెన్ చేరుకొన్నాను.
***
జావెద్ ఓ అందమైన అమ్మాయితో కబుర్లాడడం చూసాను. ఆమె సిగ్గుపడుతూ ఉన్న మంచి అమ్మాయిలా అనిపించింది దూరం నుంచి. నేను దగ్గరికెళ్లగానే తన మొహం పై వెంటనే ముసుగు వేసుకుంది.
నన్ను చూడగానే కోపం నటిస్తూ, “ఎక్కడ చచ్చావోయ్! నీ వదిన ఎప్పుడో వచ్చి కూర్చుంది. నీ కోసం ఎదురు చూస్తుంది.”
నేనేం చెప్పాలో అర్థం కాలేదు. తత్తరపాటు లో, “ మరామె ఎవరు? నాకు టాంగాలో కనిపించిన వారు!” అని అన్నాను.
జావెద్ నవ్వాడు. జోకులెయ్యకురా…కూర్చొ. నీ వదినతో మాట్లాడు. నిన్ను కలవాలని ఆమెకు చాల ఉబలాటంగా ఉంది.
నేను కుర్చున్నాను. కాని ఆమెతో సరిగ్గా మాట్లాడలేక పోయాను.
నా మనసులో, నా మస్తిష్కంలో ఆ అమ్మాయి… స్త్రీ యే ఆవరించుకొని ఉంది.
ఆమె గురించి ఆ టాంగా వాడు ఎంతో వినయంగా, “ ఆమె వేశ్య!” అని చెప్పాడే!?
**** (*) ****
మూలం: Sadat Hasaan Muto (ఉర్దూ)
తెలుగు అనువాదం: అమ్జద్
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్