అనువాదం

మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 1

మే 2016

త్త్వవేత్త అనగానే, తత్త్వవేత్తలకు మాత్రమే పనికివచ్చే విషయాలగురించి వాళ్ళ పరిభాషలో మాట్లాడేవ్యక్తి అని ఇంగ్లండులో చాలమంది అభిప్రాయం. కాని నిజానికి తత్త్వశాస్త్రం మనుషులందరికీ పనికివచ్చే విషయాలు, మనిషి స్వభావం, ఈ విశ్వం, దాని స్వభావం మొదలైనవాటిని చర్చిస్తుంది. ప్రతి మనిషీ పుట్టుకతోనే తత్త్వవేత్త. కానీ అతనిలోని తత్త్వవేత్తని రెక్కాడితే గాని డొక్కాడని మనుగడకు సంబంధించిన జీవితసమస్యలు అణచివేస్తాయి. పెద్దవాళ్ళకంటే పిల్లలు ఎక్కువ తాత్త్వికులు. ఉపాధ్యాయునికంటే విద్యార్థులు ఎక్కువ తాత్త్వికులు. వాళ్ళకు తెలియకుండానే విద్యాభ్యాసంలో వాళ్లు కోల్పోతున్నది ఈ తత్త్వచింతనే. ఈ తాత్త్విక చింతన లోపించడం వల్లనే వాళ్ళకి విద్యాభ్యాసం రుచించక దానికి ఎదురుతిరిగే విధంగా వాళ్లను ప్రేరేపిస్తుంది. మంచిగా ఎందుకు ప్రవర్తించాలి, జ్ఞానాన్ని ఎందుకు అభిలషించాలి అనే ప్రశ్నలకు సమాధానాలు వారికి అవసరం. కానీ ఎవ్వరూ సమాధానం చెప్పరు. నిజానికి తాత్త్విక విషయాల గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించడంగాని, తమని తాము ప్రశ్నించుకోవడంగాని వాళ్లు చెయ్యకపోవచ్చు. వాళ్ళ అంతరాంతరాల్లో సంతృప్తి పరచక మిగిలిపోయిన తత్త్వజిజ్ఞాస కారణంగా, వాళ్ళకి బోధించిన అన్ని విషయాలపట్లా అసంతృప్తి మిగిలిపోతుంది. వాళ్లు పదాల గురించిన విషయం తెలియకుండా వ్యాకరణ విషయాలను ఎలా నేర్చుకుంటారో, కారణం తెలియకుండా ప్రవర్తన గురించి కూడా అలాగే నేర్చుకుంటారు. వాళ్లకి ప్రతి విషయానికీ వెనకనున్న కారణం కావాలి. చెయ్యమన్న పనిని ఎందుకు చెయ్యాలో కారణం కావాలి. కానీ దాన్ని ఎవరూ చెప్పరు.

మీరు ఉపాధ్యాయుడిని కారణం ఎందుకు చెప్పరని నిలదీస్తే, అతను బహుశా, ప్రతి మనిషికీ ఏది సరియైనదో అదే చెయ్యాలన్న విషయం సహజంగానే తెలుస్తుంది గనుక కారణం చెప్పవలసిన అవసరం లేదనిగానీ, పిల్లలకు తత్త్వశాస్త్రం బోధించడం కష్టమనిగానీ చెప్పొచ్చు. కానీ ఈ రెండు రకాల సమాధానాలూ ఒక విషయాన్నే సూచిస్తాయి. అతనిలోని సహజమైన తత్త్వజిజ్ఞాస చచ్చిపోయిందనీ, తత్కారణంగా తత్త్వశాస్త్రాన్ని బోధించగల సత్తా అతనిలో లోపించిందనీ. అతనికే ఒక తాత్త్వికదృక్పథం లేనప్పుడు అతను తత్త్వశాస్త్రం ఏం బోధించగలడు? అతనికే అవగాహన కాని విషయాన్ని ఇతరులకి ఎలా అవగాహన అయేట్టు చెయ్యగలడు? కనుక, ఇతరులకి తను ఏదైతే బోధించలేడో అది బోధించవలసిన అవసరం లేదనుకోవడం సహజమే.

కానీ జర్మనీ మనకి తత్త్వశాస్త్రాన్ని బోధించవలసిన అవసరానికి ఉదాహరణగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఎందుకు ప్రేమించాలో, ఎందుకు మంచిగా మసలుకోవాలో జర్మనీలోని కుర్రాళ్లకు బోధించబడుతోంది. జర్మనీ కీర్తినీ, అధికారాన్నీ ఇనుమడింపజెయ్యడానికి తగ్గట్టుగా కృషి చెయ్యవలసిన అవసరం ఉందని వాళ్లకు ఉద్బోధ చేయడం జరుగుతోంది. ఆ ఆలోచన సరియైనది కాదు. కాని, అది ఒక రకమైన ఆలోచనా సరళి. అతనికి చెప్పబడినన కారణం తప్పు కావచ్చునేమో గాని, ఒక కారణాన్నైతే చెప్తున్నాం. దాని పర్యవసానంగా, నేర్చుకున్నదేదో ఇంగ్లీషు కుర్రాడికంటే ఎక్కువగా, ఇష్టంతో, సమగ్రంగా నేర్చుకుంటున్నాడు. అతను ప్రపంచాన్ని తప్పుగా అవగాహన చేసుకున్నప్పటికీ, ప్రపంచం పట్ల అవగాహన కలుగుతోంది. ఇంగ్లీషు కుర్రాడికేమో అసలు అవగాహనే కావటం లేదు. జర్మను భావజాలం వలన చెడ్ద ఫలితాలు వస్తున్నాయి కదా అని మనం తత్త్వవివేచనని అశ్రద్ధ చెయ్యడం సరియైనదే అనే అభిప్రాయానికి రాకూడదు. తప్పుడు ఆలోచనలకు విరుగుడు ఏ ఆలోచనలూ లేకపోవడం కాదు, మంచి ఆలోచనలను నేర్పడం. పెద్దలకైనా, పిల్లలకైనా స్వభావరీత్యా వాళ్ళు చెప్పింది చెయ్యాలంటే వాళ్లకి సరియైన కారణం చెప్పాలి. అలా సరియైన కారణం చెప్పకపోతే తప్పుడు కారణాలను వాళ్ళే వెతుక్కుంటారు.

మనం ఏ తత్త్వచింతనా అవసరం లేకుండా జీవితం వెళ్ళబుచ్చవచ్చు అనుకుంటాం. కానీ అక్కడే మనం పప్పులో కాలు వేస్తాం. మనం మన నమ్మకాల గురించి ప్రచారం చేసుకోకపోవచ్చుగాని, ఈ జీవించడమనే ప్రక్రియలోనూ, చేతలలోనూ మన వ్యక్తిత్వాల గురించీ, ఈ ప్రపంచం గురించీ కొన్ని విశ్వాసాలను కలిగే ఉంటాం. ఉదాహరణకి ఒక మనిషికి జీవితంలో డబ్బు సంపాదనే ముఖ్యమైనపుడు, డబ్బును కలిగి ఉండడం ముందు మిగతావి ఏవీ అంత విలువైనవిగా అతనికి కనిపించవు. అంతే కాదు, అతని మిగతా నమ్మకాలు కూడా దీనికి అనుగుణంగానే ఉంటాయి. మనకందరికీ డబ్బు సంపాదించడం ఒక్కటే జీవిత ధ్యేయం కాకూడదన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. కానీ, ఎంత మంది ఉపాధ్యాయులు తమ విద్యార్థులకి జీవితంలో ఏ లక్ష్యాలు ఉండాలో, ఎందుకుండాలో స్పష్టంగా, వాళ్ళు నమ్మగలిగేలా చెప్పగలరు? జర్మనీ శక్తిమంతమైన దేశంగా ఎదగాలని ఒక జర్మను ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు చెప్పగలడు. అతను తన విద్యార్థులని ఒప్పించగలిగినట్టు అనిపిస్తుంది కూడా. జర్మనులకి మన విద్యావిధానం అంటే ఏవగింపు. ఎందుకంటే, మన ఉపాధ్యాయులు విద్యా ర్థులకి దేనిపట్లా నమ్మకాన్ని కలిగించలేరు. ఈ విషయంలో వాళ్ళ ఏవగింపుకి అర్థం ఉంది. మనం వాళ్లు బోధించే తప్పుడు సిద్ధాంతాలను బోధించకపోవచ్చు. కానీ, మనం అసలు ఏ సిద్ధాంతమూ బోధించము. దాని పర్యవసానం మనకి తెలియకుండా పిల్లలకి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు పట్టుబడతాయి. బుద్ధిపూర్వకంగా జర్మనీని ఆరాధించడం జర్మనీలో ఉన్న అత్యంత దౌర్భాగ్యమైన విషయం అయితే, తమకి తెలియకుండానే డబ్బుని ఆరాధించడం ఇంగ్లండులో ఉన్న అత్యంత దౌర్భాగ్యమైన విషయం. పైగా దీనినుండి బాలబాలికలకి ఏ రకమైన తాత్త్విక రక్షణ కూడా లేదు.

వాళ్ళకి ఉన్న రక్షణ కేవలం మతపరమైనది. కానీ, మతం అన్నదే తప్పుడు సిద్ధాంతాల గుప్పిట్లో ఉంది. డబ్బును దోచుకునేవాడు తాను దైవచింతన గలవాడిననే తరచుగా అనుకుంటాడు. విశ్వాసపరంగా చూసినపుడు అతని మతం, సెయింట్ ఫ్రాన్సిస్ మతం ఒకటే అయి ఉండొచ్చు. కానీ, ఇతని తాత్త్విక చింతన పునాది వేరు కాబట్టి ఇతని అభిప్రాయంలో దేముడు అన్నా, దేముడికి విధేయత కలిగి ఉండడమన్నా వేరేగా ఉంటాయి. దేముడికి విధేయత అంటే అతని దృష్టిలో సెయింట్ ప్రాన్సిస్ మతంలోని అభిప్రాయం కాదు, ఒక మంచి లాభసాటి యైన పెట్టుబడి మాత్రమే.

అమెరికను ఇవాంజెలిస్టులు నగరంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ రోజు ప్రార్థనలో, సమావేశకర్త ఆ రాత్రి హాజరయిన వారందరూ ‘క్రీస్తుని కనుగొనడం ద్వారా ఫలవంతమైన వ్యాపారవృత్తికి పునాదులు వేసుకోగలుగుదురుగాక’ అని అన్నాడు. అతను సెయింట్ ఫ్రాన్సిస్ సిద్ధాంతంతో, కనీసం దేమునిపట్ల నమ్మకం విషయంలో పూర్తిగా విభేదిస్తున్నాడు. అతను ధనం భగవంతుడి దగ్గరకు చేరుస్తుందనుకోవడం లేదు, భగవంతుడు ధనం దగ్గరకి తీసుకువెళ్తాడనుకుంటున్నాడు. అతని దృష్టిలో విలువలంటే లాభసాటియైన విలువలే. ఈ లోకంలో ఏ విలువలు లాభసాటిగా ఉంటే తర్వాతి లోకంలో కూడా అవి లాభసాటిగా ఉంటాయని అతని నమ్మకం.

ఈ లోకం గురించీ, పరలోకం గురించీ మనకు ఉన్న అభిప్రాయాల్లో ఒక రకమైన సారూప్యం ఉంది. అది దైవచింతన ద్వారా ఏర్పడినది కాదు. ఈ రెండింటి గురించీ మన భావనలను నిర్దేశించే తాత్త్విక చింతనవల్ల వచ్చినది. కనుక మనకి తాత్త్విక చింతనా కావాలి, మతమూ కావాలి. అమెరికను ఇవాంజెలిస్టులు ఋజువు చేసినట్టు, మన తాత్త్విక చింతన తప్పయితే మన మతమూ తప్పు కాకుండా ఉండలేదు. తాత్త్విక చింతన మప్పకుండా, మతం గురించి చెప్పడం కేవలం పురాణాల గురించి చెప్పడం అవుతుంది. దానితో అతడు ఏమైనా చేసుకోవచ్చు. దేముడున్నాడనీ, మనం భగవంతుడి శాసనానికి విధేయులుగా ఉండాలనీ చెప్పి, ఎందుకు విధేయతతో ఉండాలో చెప్పకపోతే, మనం స్వర్గానికి పోవచ్చు కాబట్టి దేముని శాసనానికి విధేయులుగా ఉండాలి అనుకుంటాడు. ఆ ‘ఎందుకు’ అన్నది చెప్పేది తాత్త్విక చింతన. ఎందుకు అనే విషయాన్ని అతనికి చెప్పడానికి ముందు మనకంటూ ఒక తాత్త్విక దృక్పథం ఉండాలి.

భగవంతుణ్ణి ప్రేమించడంలోనే మిగతా సర్వజగత్తునీ ప్రేమించడం మిళితమై ఉంది, మనల్ని మనం ప్రేమించుకోవడంలో కాదు. సర్వజగత్తుని ఎందుకు ప్రేమించాలో తత్త్వశాస్త్రం చెబుతుంది. నిజానికి, గత రెండు వేల సంవత్సరాలకు పైగా తత్త్వశాస్త్రం చేస్తున్న ప్రయత్న మంతా మనల్ని కాకుండా ఇతర వస్తువుల్ని ఎందుకు ప్రేమించాలో చెప్పడమే. ఆ ప్రయత్నం వృథా కాలేదు. ఈ తత్త్వశాస్త్రం మన అనుభవాలకి దగ్గరగా, మిగతా శాస్త్రాల్లాగే మనం అర్థం చేసుకోగలిగే రీతిలో విపులీకరిస్తుంది. నిజానికి తత్త్వచింతన శాస్త్రం కాలేకపోతే మరేదీ అవలేదు. తత్త్వశాస్త్రం అందరూ తెలుసుకుని తీరవలసినది. అది తెలియనపుడు మనకి ఎన్ని తెలిసినా మౌలికమైన జ్ఞానం లేనట్టే.

అయినప్పటికీ, సత్యాలను భౌతికశాస్త్రాలు నిర్ధారించినంత రూఢిగా తత్త్వశాస్త్రం ఏ సత్యాన్నీ నిర్ధారించినట్టు కనపడదు. “మనకి మనం విలువ ఇచ్చుకుని, ప్రేమించుకోగలిగినంతగా వేటికీ విలువ ఇవ్వడం గాని ప్రేమించడం గాని చెయ్యలేం” అని చెప్పిన వాళ్లని విన్నంతగా, “భూమి బల్లపరుపుగా ఉంటుంది” అని చెప్పేవాడిని ఎవరూ వినరు. తత్త్వశాస్త్రం చేస్తున్న ఈ బృహత్తర ప్రయత్నాన్ని తత్త్వవేత్తలనబడే వాళ్ళు అడ్డుకుంటుంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే, తత్త్వశాస్త్రం ఇంతవరకు ఏమి సాధించగలిగింది అన్నదాని మీద కూడా ఈ సమూహాలకి అవగాహన లేదు. వాళ్ళకి తాత్త్విక ప్రశ్నలు అంటే ఇప్పటికీ చర్చించవలసిన సమాధానం దొరకని ప్రశ్నలు అనే భావనే. ఎందుకంటే, తత్త్వశాస్త్రం ఏదీ ఋజువు చెయ్యలేకపోయింది కాబట్టి అది దాని వైఫల్యం క్రింద లెక్క. విఫలమైంది ఇక్కడ తత్త్వశాస్త్రం కాదు, వాళ్ళు ఏ ప్రమాణాల ప్రకారం చేస్తే నమ్ముతారో ఆ ప్రమాణాలని అనుసరించలేకపోయిన తత్త్వవేత్తలే. తత్త్వశాస్త్రం ఒక విజ్ఞానశాస్త్రం. అది ప్రవచించిన సత్యాలను ప్రయోగాల ద్వారానే ఋజువు చెయ్యాలి. వృక్షశాస్త్రానికి సంబంధించిన సత్యాన్ని ఋజువు చెయ్యడానికి మొక్కలమీద ప్రయోగం చేస్తే, తత్త్వశాస్త్రానికి చెందిన సత్యాన్ని ఋజువు చెయడానికి మనమీద ప్రయోగాలు చేసుకోవాలి. కనుక, తత్త్వశాస్త్రం ఒకదానికి విలువ ఇవ్వాలని చెబితే, అది విలువ ఇవ్వమన్నదానికి విలువ ఇస్తూ దాని సత్యాన్ని పరీక్షించాలి. మనం విలువ ‘ఇవ్వగలగడంలో’ ప్రయోగం చెయ్యాలి. అది చేతల్లో, ఆలోచనల్లో, అనుభూతి చెందడంలో కూడా ఉండాలి. ఉదాహరణకి, ఒక వ్యక్తి ప్రపంచంలో అన్నిటికన్నా డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తున్నాడనుకోండి. అతను ఆ విలువలకి తగ్గట్టుగా నడుచుకుంటాడు. అతని జీవితంలో ఏకైక లక్ష్యం డబ్బు సంపాదనే. డబ్బుకన్నా విలువైనవి ఉన్నాయని తత్త్వశాస్త్రం అతనికి చెప్పిందనుకొండి. అప్పుడతను తత్త్వశాస్త్రం చెప్పిన సత్యాన్ని ప్రయోగం చెయ్యడం ద్వారా పరీక్షించాలి. అటువంటి సందర్భంలో అతడు తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవలసి వస్తుంది. ఎక్కువ సందర్భాలలో అతను అలా చెయ్యడానికి నిరాకరిస్తాడు.

అందుకనే, తత్త్వశాస్త్రపు సత్యాలు చాలామంది సత్పురుషుల, జ్ఞానుల జీవితాలలో ప్రయోగాల ద్వారా ఋజువు చెయ్యబడినప్పటికీ, సర్వేసర్వత్రా అంగీకారానికి నోచుకోవు. ఒక చింతన ఉంది. అది ఇలా చెబుతుంది: “నేను ఈ లక్ష్యంకోసం పుట్టాను. ఇది సాధించడానికి భూమి మీదకి వచ్చేను. నేను ఈ సత్యానికి సాక్షిగా నిలబడాలి. ఈ సత్యంతో ఏకీభవించిన వాళ్లందరూ నా మాట వింటారు”. దానికి Pilate (క్రీస్తుని విచారించి శిలువ వేయాలని నిర్ణయించిన వ్యక్తి) ఏమి సమాధానం చెప్పేడో అందరికీ తెలిసిందే. అతను, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగి, బేకన్ చెప్పినట్టు, సమాధానం కోసం నిలబడలేదు. అతను సమాధానం విని, దాన్ని విశ్వసించి ఉంటే, తన జీవిత గమనాన్ని మార్చుకోవలసి వచ్చేది. అలా చెయ్యకుండా, సత్యాన్ని కనుక్కోలేమని నమ్మేడు. నమ్మి ఊరుకున్నాడు. అతనిలాగే, “సత్యం అంటే ఏమిటి?” అని ప్రశ్నించిన వ్యక్తులు సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయినప్పటికీ, సత్యం సత్యమే. దాన్ని విని, ఆచరణలో ప్రయత్నించిన వారికి దానిలోని సత్యం ఋజువౌతుంది.

ఇంకా ఉంది..