కథ

వికలాంగసైనికుడు

జూలై 2013

(మూలం: ఆలివర్ గోల్డ్ స్మిత్)

“ప్రపంచంలో సగంమందికి మిగతా సగంమందీ ఎలా బ్రతుకుతున్నారో తెలీదు”. అన్నంత అతి సాధారణమూ, యదార్థమైన పరిశీలన మరొకటి ఉండదేమో. గొప్పవాళ్ళ ఆపదలూ, కష్టాలూ మన ఆలోచనలను ప్రభావితం చేసేలా మనకి చెప్పబడుతుంటాయి; అవి ఉపన్యాసాలలోలా కాస్త అతిశయోక్తులతో కూడుకుని ఉంటాయికూడా; `అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో(పడ్డారో) చూడం’డని ప్రపంచం దృష్టికి తీసుకెళతారు; బాధలవల్ల కలిగే ఒత్తిడిలో ఉన్న గొప్పవాళ్లకి వాళ్ళ బాధలు చూసి మిగతా వాళ్ళు జాలిపడుతున్నారు అన్న ఎరుక ఉంటూనే ఉంటుంది; వాళ్ళ ప్రవర్తన ఏకకాలంలో వాళ్లకి ప్రజల మెచ్చుకోలూ, జాలినీ కూడా సంపాదించిపెడుతుంది.

ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు ధైర్యంగా కష్టాలని ఎదుర్కోడంలో గొప్పదనం ఏమీ లేదు; మనుషులు అటువంటి సందర్భాల్లో ఆడంబరానికైనా డాంబికంగా కష్టాలు ఎదుర్కున్నట్టు నటిస్తారు. కాని ఎవరైతే, అజ్ఞాతమనే లోయల్లో కష్టాలు ధైర్యంగా ఎదుర్కుంటారో; ఎవరైతే కష్టాల్లో తమకి అండగాఉండి ఉత్సాహపరచడానికి మిత్రులూ, జాలిపడడానికి పరిచయస్థులూ లేకపోయినా, అసలు తమ కష్టాలు గట్టెక్కుతాయన్న ఆశ ఏ కోశానా లేకపోయినా, ప్రశాంతంగా నడుచుకుంటూ, నిర్లిప్తంగా వాటిని స్వీకరిస్తారో వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు; వాళ్ళు సామాన్య జనపదులైనా, దర్బారులో సభికులైనా సరే, వాళ్ళు మన అభినందలనకి తగినవాళ్ళే గాక, వాళ్ళని మనం అనుకరించడానికీ, గౌరవించడానికీ కూడా యోగ్యులై ఉంటారు.

కొన్ని దిగువతరగతులలో ప్రజలు ఒక రోజులో అనుభవించే దురవస్థలు, ఉన్నతవర్గాలలోని మనుషులు తమ జీవితకాలం మొత్తంమీద అనుభవించరు. ఐనప్పటికీ గొప్పవాళ్ల విషయంలో అతి సామాన్యమైన ఇబ్బందులని కూడా విపత్తులుగా ఎత్తిచూపుతూ, వాళ్ల కష్టాలని కావ్యాలుగా మలచి ఆలపిస్తే, సామాన్యులుపడే కష్టాల విషయంమాత్రం ఎవరూ పట్టించుకోరు; మన సైనిక, నావిక దళాలలో క్రిందిస్థాయి సైనికులు ఏ సణుగుడూ, ఏ విచారమూ, ఏ ఫిర్యాదులూ లేకుండా సహించే కష్టాలు మనం ఊహించలేము; ఆవేదనతో విధిని నిందించడంగాని, తమ వీరత్వంమీద దేశప్రజలు బ్రతుకుతున్నారని గొప్పలుచెప్పుకోడంగాని చెయ్యరు. నిజానికీ ప్రతిరోజూ వాళ్లు దుర్భరమైన జీవితమే గడుపుతారు, ఐనా ఏ అసంతృప్తి ప్రకటించకుండా దాన్ని అలాగే స్వీకరిస్తూ ఉంటారు.

ఒక ఓవిడ్ (Ovid), ఒక సిసీరో (Cicero), ఒక రబూటిన్ (Rabutin) వాళ్ల దురదృష్టాన్ని గురించి చెపుతున్నప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో చెప్పలేను; ఇంతకీ వాళ్లు పడిపోతున్న ఓపలేని కష్టం ఏమిటయ్యా అంటే వాళ్ళు భూమిమీద ఏదోచోట ఆనందం ఉందని తెలివితక్కువగా ఊహించుకుంటే, ఆ ఊహించుకున్నచోటుకి వాళ్ళు వెళ్ళలేకపోవడం. జనసామాన్యం నిత్యం ఏ అయిష్టతా ప్రకటించకుండా అనుభవించే కష్టాలతో సరిపోల్చితే, వాళ్ల కష్టాలు కష్టాలుపడడం కాదు; ఆశించిన సుఖాలు అందకపోవడం. వాళ్ళు సుష్టుగా తింటారు, తాగుతారు, పడుక్కుంటారు. వాళ్ళకి సేవలు చెయ్యడానికి బానిసలు ఉండడమే గాక, రేపు జీవించడానికి జీవనోపాధి ఎలా అన్న చింత జీవితకాలమూ ఉండదు; అదే సాటి మనుషులలో చాలమంది ఒక స్నేహితుడి అండగాని, ఓదార్పు మాటలుగాని దొరకక, ప్రకృతి బీభత్సాలనుండి తలదాచుకుందికి ఏ రకమైన రక్షణకూడా లేకుండా బతకవలసి వస్తుంది.

నేను ఈ రకమైన ఆలోచనలలోకి వెళ్ళిపోవడానికి కారణం… కొద్దిరోజుల క్రితం, నేను చాలా కాకతాళీయంగా నాకు చిన్నప్పటినుండీ తెలిసిన కుర్రాడొకడు, ఇప్పుడు సైనికదుస్తులు వేసుకుని, కర్రకాలుతో, పట్నంలో కొన్నిదుకాణాలముందు నిలబడి అడుక్కోవడం చూడ్డం తటస్థించడమే. పల్లెలో ఉన్నంతకాలం అతను చాలా నిజాయితీ పరుడనీ, కష్టపడి పనిచేసేవాడనీ స్వయంగా నే నెరిగి ఉండడంవల్ల, పాపం అతను ఈ దౌర్భాగ్యస్థితిలోకి దిగజారిపోవడానికి కారణం ఏమయి ఉంటుదబ్బా అని కుతూహలం కలిగింది. అందుకని, నాకు ఉచితమని తోచినది అతని చేతులో పెడుతూ, అతని గత జీవితం గురించీ, పడిన కష్టాలగురించీ, అతనీ విధంగా దిగజారిపోవడానికి వెనకగల కారణాలగురించీ తెలుసుకో గోరాను. పాపం ఆ అవిటి సైనికుడు, నా ప్రార్థనని మన్నించి, తల గోక్కుంటూ, తన ఊతకర్రమీద ఆనుకుని నిలబడి, తన కథ ఈ విధంగా చెప్పనారంభించేడు:

“అయ్యా! కష్టాలంటే ఏం చెప్పమంటారు, మిగతావాళ్ళకంటే నేనేదో కష్టపడిపోయానని గొప్పలు చెప్పుకోలేను; ఎందుకంటే, దేముడిదయవల్ల, ఒక కాలు పోవడం, ఇలా అడుక్కోవలసి రావడం మినహాయిస్తే, నేను విచారించడానికి తగిన కారణం కనపడదు. అదే మా రెజిమెంట్ లో పాపం బిల్ టిబ్స్ అని ఉన్నాడు. అతనికైతే రెండు కాళ్ళతోపాటు ఒక కన్నుకూడా పోయింది; దేముడిదయవల్ల నాకు అలా జరగలేదు.

“నేను ష్రోప్ షైర్ లో పుట్టేను; నా తండ్రి ఒక కూలీ, అతను నాకు ఐదేళ్ళప్పుడు చనిపోయాడు. అందుకని నన్ను చర్చిసేవలో నియోగించేరు. నా తండ్రి ఎప్పుడూ దేశదిమ్మరిగా తిరగడంతో, నేను ఎక్కడ పుట్టానో, ఏ చర్చి పరిధిలోకి వస్తానో ఎవరూ నిర్ణయించలేకపోయారు; దాంతో నన్ను వాళ్ళు చర్చి ఒక అధికార పరిధినుండి మరొక చర్చి అధికారపరిధిలోకీ, అక్కడనుండి మూడోదాని అధికారపరిధిలోకీ పంపేరు. వాళ్ల వాలకం చూస్తే నాకేమనిపించిమదంటే, నన్నెక్కడా పుట్టనివ్వకుండా ఏ చర్చికీ చెందకుండా చేస్తారేమోనని. చివరికి ఎలాగయితేనేం, నా పుట్టుక సంగతి నిర్థారించేరు. నాకు చదువుమీద ఆసక్తి ఉండడంతో, నేనెలాగైనా బాగా చదువుకోవాలనుకున్నాను. కాని నాకు ఆశ్రయం కల్పించిన “బీదగృహం” యజమాని, నాకు గరిటతిప్పడం వచ్చిన దగ్గరనుండీ పనిలో పెట్టాడు. ఒక అయిదేళ్లపాటు జీవితం సుఖంగానే గడిచింది అక్కడ. రోజుకి పదిగంటలు పనిచేసే వాడిని, దానితో నా భోజనం, పానీయం ఒడ్డెక్కిపోయేవి. నేను బయటికి వేళితే పారిపోతానేమోనన్న కారణం చేత నాకు బయటకి వేళ్ళే స్వేచ్ఛ అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే మాత్రం ఏం? మొత్తం ఇల్లూ, ఆవరణా, అంతా నాదే. అది చాలు నాకు. ఆ తర్వాత నన్ను ఒక రైతుకి అప్పచెప్పేరు. అక్కడ నేను అవసరమైనపుడు పెందరాడే, లేకపోతే ఆలస్యంగా లేచే వాడిని. అక్కడ నాకు తినడానికీ తాగడానికీ సమృద్ధిగా దొరికేది. అతను అప్పచెప్పిన పనులు నాకు నచ్చడంతో అంతా సవ్యంగానే సాగిపోయింది అతను చనిపోయేదాకా. ఆ తర్వాత నా పొట్ట నేను పోషించుకోవలసి రావడంతో నేను నా అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను.

“ఆ వేసవిలో ఒక పట్టణం నుండి మరో పట్టణానికి తిరుగుతూ, పనిదొరికినపుడు పనిచేసేవాడిని, లేనపుడు ఏదీ లేదు; ఒక రోజు “ప్యూనీ జడ్జి”(Puisne Judge) గారి పొలంలోంచి నేను వెళ్లడం తటస్థించింది; ఒక చెవులపిల్లి నా త్రోవకి అడ్డంగా పరిగెత్తడం చూశాను; ఆ క్షణంలో నా నెత్తిమీద ఏ శని తాండవించిందో తెలీదు కాని, దాన్ని కర్రతో వేటువెయ్యాలని దుర్బుద్ధిపుట్టింది. ఇంకేముంది? దాన్ని చంపి తీసుకొస్తున్నాను. సరిగ్గా ఆ జడ్జిగారే నాకు ఎదురయ్యాడు. నన్ను ఒక దొంగవేటగాడిననీ (Poacher), దుర్మార్గుడిననీ నా కాలరు పట్టుకుని నే నెవరినో ఋజువుచేసుకోమన్నాడు. నేను వెంటనే అతని కాళ్లమీద పడి, క్షమాపణలు కోరుకుని, నాకు తెలిసిన మేరకి నా కులమూ, గోత్రమూ పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నదున్నట్టు విన్నవించుకున్నాను; కానీ జడ్జిగారు నన్ను నేను ఋజువుపరుచుకోలేకపోయానని చెప్పి ఆరోపించి, పేదవాడినవడంతో నేరస్థుడిగా ధృవీకరించి, లండనులో “న్యూగేట్”(Newgate) కి పంపించేడు… అక్కడనుండి నన్ను దేశదిమ్మరినని చెప్పి దేశాంతరం పంపించడానికి.

“న్యూగేట్ జైలు గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు గాని, నామట్టుకు నా జీవితంలో అంత అనువైన ప్రదేశం ఎక్కడా కనిపించలేదు. అక్కడ కడుపునిండా తినడానికీ తాగడానికీ దొరకడంతో పాటు, ఏ పనీ పాటా ఉండేది కాదు; అటువంటి జీవితము ఎన్నాళ్ళో కొనసాగదు; కొనసాగడానికి చాలా అదృష్టం కావాలి; ఐదునెలలు గడిచిన తర్వాత నన్ను జైలులోంచి విడుదలచేసి, మరో రెండు వందలమందితోపాటు ఓడ ఎక్కించి, ప్లాంటేషన్స్(Plantations) కి పంపించేశారు. మా ప్రయాణం సజావుగా సాగలేదు; అందర్నీ గొలుసులతో బంధించి ఒక్కచోట కట్టిపడేయ్యడంతో, సరియైన గాలి ఆడక వందమందికి పైగానే చనిపోయారు. మిగిలినవాళ్ళు ఎంతగా అనారోగ్యంపాలయ్యేరో ఒక్క భగవంతుడికి తెలుసు. మేము తీరం చేరగానే మమ్మల్ని ప్లాంటేషన్స్ యజమానులకి అమ్మేసేరు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి, నేను మిగతా నీగ్రోలతో పాటే పనిచేయవలసి వచ్చింది; విధిలేక నా శిక్షాకాలం అలా వెళ్లదీయవలసి వచ్చింది.

“నా శిక్ష పూర్తవగానే, నేను తిరుగుప్రయాణానికి కావలసిన డబ్బులుకోసం పనిచేశాను. తిరిగి మళ్ళీ ఇంగ్లండు చేరగలిగినందుకు ఆనందం వేసింది. ఎందుకంటే, నా దేశమంటే నాకు ప్రేమ. అయితే, నేను పల్లెటూర్లోకి వెళితే నన్ను దేశదిమ్మరినన్న నేరంమోపి మళ్ళీ ప్లాంటేషన్స్ కి పంపెస్తారేమోనన్న భయంతో, అక్కడికి వెళ్ళకుండా పట్నంలోనే దొరికినప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపేను.

“అలా కొంతకాలం సుఖంగానే గడిచింది. కానీ, ఒకరోజు సాయంత్రం పనినుండి ఇంటికి వచ్చేక, ఇద్దరు మనుషులు నన్ను క్రిందకి పడదోసి, తర్వాత నన్ను నిలబడమని అడిగేరు. వాళ్ళు యువకులని యుద్ధంలో బలవంతంగా నమోదుచేసే ముఠాకి చెందినవాళ్ళు. నన్ను న్యాయాధిపతిదగ్గరకి తీసుకుపోయారు. నన్ను నేను ఋజువుచేసుకోలేక పోవడంతో, అయితే నావికుడిగా, లేకపోతే సైనికుడిగా నమోదుచేయించుకోవడం తప్ప నాకు వేరే గత్యంతరం లేకపోయింది. నేను రెండో దాన్ని ఎంచుకున్నాను. ఆ హోదాలో నేను Flanders లో రెండు పోరాటాల్లోనూ, Val, Fontenoy యుద్ధాలలోనూ పాల్గొన్నాను. ఇదిగో ఇక్కడ నా గుండె పక్కనుండి ఒక తూటా వెళిపోతే, మా రెజిమెంట్ లోని డాక్టరు దాన్ని నయం చేసి, నేను త్వరగా కోలుకునేటట్టు చేశాడు కూడా.

“యుద్ధవిరమణ ప్రకటించగానే, నన్ను ఉద్యోగంనుండి విడుదలచేశారు. నా గాయం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుండడంతో ఉద్యోగంచెయ్యలేక నేను ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company)లో “లాండ్ మాన్ (Land Man)” ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఫ్రెంచి వాళ్లతో ఆరు తీవ్రమైన పోరాటాల్లో పాల్గొన్నాను; నాకే గనక చదవడం రాయడం వచ్చి ఉంటే, మా కేప్టెన్ నన్ను కార్పొరల్ ని చేసి ఉండేవాడని నాకు గట్టి నమ్మకం. కాని నాకు ఆ పదోన్నతి వచ్చే అదృష్టం రాసిపెట్టి లేదు. దానికి తోడు నేను వెంటనే అనారోగ్యం పాలవడంతో వెంటనే ఇంటికి తిరుగుముఖం పట్టవలసి వచ్చింది జేబులో నలభై పౌండ్లతో. ఇదంతా ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ముందు సంగతి. నేను ఇంటికి చేరి ఈ డబ్బులతో ఎలాగో కాలం వెళ్లబుచ్చుదామనుకున్నాను; అయితే, ప్రభుత్వానికి యుద్ధానికి మనుషులు అవసరం పడడంతో, నేను ఇంకా నా కాలు నేలమీద మోపీమోపకుండానే, నన్ను మళ్ళీ నావికుడిగా తోలేసింది.

“ఓడ సరంగుకి, అతనే చెప్పినట్టు, నేను చాలా మొండివాడిలా కనిపించేను. నేను సోమరిగా కూచుని పూర్వీకుల పరువు తీస్తున్నానని, నాకు నా పనేమిటో అర్థం అయేలా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఏం చెయ్యను నాకు సముద్రం మీద ఓడ వ్యవహారాలంటే ఏమీతెలీదు; అయినా, అతనేంచేస్తున్నాడో తెలీనంతగా కొడుతుండేవాడు. అతను కొట్టినప్పుడల్లా నా నలభై పౌండ్లూ నాదగ్గరున్నాయి, నాకదే చాలు అనుకుని నన్ను నేను ఊరడించుకునేవాడిని. ఆ డబ్బులు నా దగ్గర ఈ పాటికి ఉండవలసిందే కాని, దురదృష్టవశాత్తూ మా ఓడని ఫ్రెంచివాళ్ళు స్వాధీనం చేసుకోవడంతో ఆ డబ్బంతా పోయింది.

“ఓడ సిబ్బందిని అందర్నీ బ్రెస్ట్ (Brest) తీసుకుపోయి జైల్లో పడేశారు; నే నయితే రాటుతేరాను గనుక నాకేమీ కాలేదు గాని, జైలుజీవితం అలవాటులేక అందులో చాలా మంది అక్కడికక్కడే చనిపోయేరు. ఒకరోజు రాత్రి అలవాటుప్రకారం దుప్పటి కప్పుకుని వెచ్చగా బల్లచెక్కలమీద పడుక్కున్నప్పుడు, సరంగు నాదగ్గరికి వచ్చి నన్ను లేపి, “జాక్, ఆ ఫ్రెంచి సెంట్రీని లేపేగలవా?” అని అడిగేడు. తెలివితెచ్చుకుందికి ప్రయత్నిస్తూనే, “అదోపెద్దపనేం కాదు, కానీ, మరొకరి చేసాయం ఉండాలి,” అన్నాను. “అయితే పద,” అన్నాడు. నేను లేచి, దుప్పటీ నా నడుము చుట్టూ చుట్టుకుని ఫ్రెంచి కాపలాదారుడితో పోరాడడానికి బయల్దేరాను. నాకు ఆ ఫ్రెంచివాళ్ళంటే అసహ్యం; వాళ్లందరూ బానిసలే, కాళ్ళకి కర్రజోళ్ళు తొడుక్కునేవాళ్ళే.

“చేతిలో ఆయుధాలు లేకపోయినా, ఏ క్షణంలోనైనా ఒక ఫ్రెంచివాడు ఐదుమంది ఇంగ్లీషువాళ్ళని అవలీలగా ఓడించగల సమర్థుడు; మేము ఇద్దరం కాపలాదారులున్న ద్వారం దగ్గరకి వెళ్ళేము. వాళ్ళమీదకి ఒక్క సారి ఉరికి, ఒక్క క్షణంలో చేతుల్లోని ఆయుధాలు లాక్కుని వాళ్లని క్రిందపడేసేం. అక్కడనుండి తొమ్మిదిమందిమి జైల్లోంచి పారిపోయి రేవుగట్టుకి పరిగెత్తి, దొరికిన మొట్టమొదటి పడవ ఎక్కి హార్బరునుండి దూరంగా సముద్రం మీదకి చేరుకున్నాం. మూడురోజులైనా ప్రయాణం చేశామో లేదో, డోర్సెట్ (Dorset) కి చెందిన ఒక దొంగలఓడ మమ్మల్ని పట్టుకుంది; ఇంతమంది అనుభవమున్న పనివాళ్లు దొరకడంతో వాళ్లు సంతోషించేరు; మేం కూడా మా అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నాం. కాని మేం అనుకున్నట్టు అదృష్టం కలిసిరాలేదు. ఇరవై మూడు ఫిరంగులే ఉన్న మేము, మరో మూడురోజులు తిరక్కుండా పాంపడోర్ (Pompadour)కి చెందిన నలభై ఫిరంగులున్న మరో దొంగలఓడకి చిక్కేము. మూడు గంటలసేపు వాళ్లతో పోరాడేం; మాకే గనక వెనక మరికొద్ది మంది మనుషులుంటే, మేము ఆ ఫ్రెంచి ఓడని పట్టుకునే వాళ్లమే; దురదృష్టం కొద్దీ, ఇక మేం గెలుస్తామనుకునే వేళకి మావాళ్లందరూ చనిపోయారు.

“మళ్ళీ నేను ఫ్రెంచివాళ్ల అధీనంలోకి పోయాను. నన్ను వాళ్ళు గనక బ్రెస్ట్(Brest) పంపించి ఉంటే, నా బ్రతుకు దుర్భరమైపోయి ఉండేది; అక్కడ అదృష్టం బాగుండి వాళ్ళు నన్ను వైపర్ (Viper) కి పంపేరు. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను… ఈ పోరాటంలో నాకు రెండు చోట్ల దెబ్బలు తగిలేయి; నా ఎడం చేతి నాలుగు వేళ్ళూ పోయాయి, ఒక కాలు తెగిపోయింది. ఈ పోయిన వేళ్ళూ, కాలూ గనక ఏ దొంగ ఓడ మీదో కాకుండా, రాజుగారి ఓడమీద పోయి ఉండి ఉంటే నాకు జీవితాంతమూ కూడూ గుడ్డకి లోటులేకుండా ఏర్పాటు జరిగి ఉండేది. కానీ అంత అదృష్టం ఏదీ? ఒక మనిషి గొప్పవాళ్లింట్లో పుడితే మరొకడు పేదవాడింట్లో పుడతాడు. ఏమయినా, నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలిగేను; స్వేచ్ఛనీ, నా దేశాన్నీ ప్రేమిస్తూనే ఉంటాను. స్వాతంత్ర్యం, సౌభాగ్యం, నా పూర్వపు ఇంగ్లండు ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. జయహో!”

అని చెప్పి, తను కుంటుకుంటూ వెళ్ళిపోయాడు . నన్ను అతని ధైర్యానికీ, సంతుష్టికీ విస్తుపోమని చెబుతూ. తత్త్వబోధనకంటే, దైన్యానికి అలవాటుపడి జీవించడం జీవితాన్ని తృణప్రాయంగా స్వీకరించడం నేర్పుతుందన్న విషయం నేను ఒప్పుకోకుండా ఉండలేను.

ఆలివర్ గోల్డ్ స్మిత్

Text Courtesy: http://www.bibliomania.com/0/5/24/341/17273/1/frameset.html