డైరీ

సావిరహే!

మే 2016

కొన్ని మాటలు మనసులో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరూ వినలేరు- నేను తప్ప. అలానే వాటిని అక్షరాలలోకి మార్చినప్పుడు కూడా ఎవరూ చదువనక్కర లేదు, కావాలనుకున్నప్పుడు తప్ప. ఈ రెండూ జరగనివే అందుకే నీకు చెప్పాలనుకున్నది ఇలా… నా డైరీలో. ఇది నీకు చేరదని తెలిసినా నీతోనే మాట్లాడుతున్న అనుభూతి.

ప్రతిసారీ ప్రయాణంలో ఎలా జారిపోతానో తెలీదు..

నీ జ్ఞాపకాలలో…

అది నీవల్లనో లేక ప్రయాణాలంటే నాకున్న మమకారం వల్లనో తెలీదు. నేను కదిలిపోతూ నిశ్చలంగా ఉన్నవాటిని చూడగలిగే ఒక విచిత్రమైన అనుభూతి అనుకోనా? కానీ ఇంతవరకు ఎటువంటి ప్రయాణంలోనైనా… రైలు, బస్సు, విమానం చివరికి కారు సీట్లో వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంటే, కనురెప్పల వెనుక నీ జ్ఞాపకం!

నువ్వు నిశ్చలంగా, నేను గమనంలో…

అంతేగా? అందుకేనేమో నా కళ్ళు మూతపడగానే దాగుడు మూతలలో నువ్వు!

ఎన్ని గంటలు గడిపావు నువ్వు నా మనసులో? రాత్రి ముసుగులో, పగటి వెలుతురులో! నేనొక్కదాన్నే ఉన్న ప్రతిసారీ… నువ్వు, నీ జ్ఞాపకం!

నేలరాలిన పారిజాతాలను ఏరకుండా చూస్తూనే ఉండాలన్న అనుభూతి!

విరగబూసిన జాజిమల్లెల్ని చెట్టుకే ఉంచి వాసన పీలుస్తూ ఉండాలన్న కోరిక!

కొబ్బరాకుల మధ్యనుండి వెన్నెల కోణాల్ని కొలుస్తూ రాత్రంతా కాపలా కాయాలన్న పిచ్చితనం!

రాలే వర్షపు చినుకుల్ని దోసిట్లో పట్టుకుని ముఖం పై చల్లుకుంటూ మురిసిపోవాలన్న ఆరాటం!

సంజ వెలుగులో చల్లటిగాలికి, ఏటిగట్టున రాతిదిమ్మపై వెల్లకిలా పడుకుని ఆకాశంవైపు చూస్తూ మొదటి నక్షత్రాన్ని పట్టేసుకోవాలన్న ప్రయాస.

వీటన్నింటికీ మించి రోజులో ఒక్కసారైనా రెండు నిమిషాలు నీతో గడపాలన్న ఆశ!

ఒక్క నిమిషమైనా… రెండు మాటలు. ఒక్క క్షణమైనా చూస్తావన్న ఎదురుచూపు.

కళ్ళతో పలకరించడం, కళ్ళతో నవ్వడం నీకు తెలుసు!

కళ్ళతోనే కౌగిలించుకోవడం నాకు తెలుసు!

అంతకు మించి మన మధ్య దూరాలను కాంతిసంవత్సరాలలో కొలవాలనీ తెలుసు.

దాటలేనా ఒక్క చూపుతో ఆ దూరాన్ని?

ఒక స్పర్శ, ఒక స్పందన, ఒక ఓదార్పు… వీటన్నిటినీ పొందటం ఒక్క చూపుతో సాధ్యం కాదా?

నీకు తెలుసో లేదో, నీకోసం ఆత్రుతగా గది అంతా గాలించటం తెలుసు నా కళ్ళకి!

నువ్వు పట్టించుకోనప్పుడు నిరాశగా ఆశపడటం తెలుసు నా కళ్ళకి!

నువ్వు కష్టపడుతూ ఉంటే బాధతో వాలిపోవడం తెలుసు.

ఎప్పుడయినా చదివావా అసలు వాటిని? వాటిలోని భావాల్ని? తట్టుకోగలవా వాటిని నువ్వు?

చదివితే అర్థం చేసుకోవాలన్న భయం నీకు! అర్థమైతే తిరిగి ఏదైనా అడుగుతానేమోనన్న బెదురు!

అదే స్థాయిలో ఆత్రంగా చూస్తానన్న బెరుకు! ఇన్ని ఇబ్బందులకంటే చూడటమే వద్దని తటపటాయిస్తావు నువ్వు!

నాకు తెలియకుండా నువ్వు గమనించటం నాకు తెలుసు!

నా కళ్ళకి తెలుసు, రెప్పలు మూసుకున్నా నీ రూపం నాకు కనబడుతుంది! నీ చప్పుడు నాకు వినబడుతుంది.

అన్నీ చూస్తాను… నీ మాటలు, అందరితో నీ నవ్వు, నీ ఇష్టాలు, మనుషుల మీద నీ అభిమానం, నీ లెక్కలేనితనం, నీకిష్టమైన వ్యక్తులు, వాళ్ళపట్ల నీ కళ్ళల్లో వ్యక్తమయ్యే భావం! ఏదీ దాటిపోలేదు నన్ను!

అదేంటో ఇన్ని చూసినా నిశ్చలంగా నా మనసు… నిశ్శబ్దంగా నా నవ్వు!

నిన్ను కౌగిలించుకునే నా కళ్ళు నీకోసమే ఎదురు చూస్తాయి! ప్రతి ఉదయం… ఒక్క క్షణం…

నాకు తెలీదు దీన్నేమనాలో! ఒక భావానికి పేరు అవసరమా?

నువ్వే వచ్చి నన్నడిగావనుకో ఏంకావాలి నీకు అని -
ఒక వెన్నెలరాత్రి, పదినిమిషాలు, నిశ్శబ్దం నీకు నాకూ మధ్య, దాంతో పాటు ఒక్క కౌగిలింత నీ కళ్ళతో, అని అడుగుతాను. మన మధ్య ఉండే పదడుగుల దూరం. పదంగుళాల దూరం. అలాగే ఉండనీ… ప్చ్… ఉంటుందని నాకు తెలుసు.

ఒకవేళ నువ్వో నేనో ఒక్కడుగు ముందుకు వేశామనుకో… ఊహూఁ…

నన్ను తాకిన స్పర్శ నా మనసుని తాకనేలేదు ఇంతవరకూ! అది అశాశ్వతం!

నా మనసుని తాకిన నీ స్పర్శ… నన్ను తా…కనవసరంలేదు.

ఇది శాశ్వతం ఎప్పటికీ. సరిగ్గా నా భావమిది కాకపోయినా… తెలీదు… జయదేవుని అష్టపది… లీలగా…

ప్రతి పదమిదమపి నిగదతి మాధవ తవ చరణే పతితాహం
త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తను దాహం

సావిరహే…… తవదీనా!

**** (*) ****

art work: Javed