డైరీ

పౌర్ణమి

డిసెంబర్ 2016

న్ని సార్లు అడిగాను, ఒక్క పౌర్ణమికైనా కలిసుందామని.

ఈ రోజు పౌర్ణమి !

రాత్రి పది గంటలకి ఆఫీసు మూసేసి వస్తూ ఉంటే, చల్లచల్లగా వెన్నెల, మంద్రంగా కొబ్బరాకులు, చుట్టూరా నిశ్శబ్దం. మనసంతానువ్వు. నువ్వెదురుగా ఉన్నావనుకో! చాలా బిజీగా ఉన్నట్లు కనిపించాలన్నట్లు, అంతసేపూ నువ్వు నాకోసం ఎదురు చూడాలన్నట్లు- అదో తపన.

నేను ఎదురుగా ఉన్నాననుకో నువ్వూ అంతే!

ఇన్ని రోజులలో ఒక్కసారైనా వీలు పడలేదు మనకి, ఒక్క పున్నమి రాత్రైనా వెన్నెల్లో తడవడానికి! రాత్రిపూట డిన్నర్ అయ్యాక అలా నడుద్దామని బయట అడుగు పెడితే ఎంత ప్రయత్నించినా నువ్వు కొన్న మువ్వల సవ్వడి అలజడి కలిగించకుండా వదలదు.
నిశ్శబ్దంలో నిన్నెలా దూరంగా ఉంచాలో నువ్వే చెప్పరాదూ!

ఎందుకు దగ్గరవుతాం మనుషులకి, మనసులకి. Why do we get attached to people? Why do we take shelter in that attachment? ఒక్కసారి మనసులోకి ఇంకి పోయాక ఎంత ప్రయత్నించినా పోరు కదా. పోన్లే అని గుండెల్లో పొదువుకుంటామా, చెప్పకుండానే భళ్ళున తలుపు తీసుకోని వెళ్ళిపోతారు. నాలోనే ఉండి పోతావు కదూ అని నిన్ను అడిగిన ప్రతిసారీ, నాలోని Insecurity బయట పడుతూంటుంది- ఊ…! అన్న నీ జవాబుతో పాటు.

నీతో గడిపిన ప్రతి రోజూ బోల్డంత ఫిలాసఫీ! నువ్వు చెప్పేది కొంత, నేను చూసి నేర్చుకునేది మరి కొంత; అన్నింటి కంటే ఎక్కువగా నాలో నీ వల్ల కలిగే ప్రతి స్పందనా ఒక్కో పాఠం నేర్పుతూంటుంది. (ఆ పాఠాలు గుర్తుంటాయా అని మాత్రం అడగకు!)
ఒక్కో చుక్కని చూస్తూ నడుస్తూంటే ఒక్కో జ్ఞాపకం, దూరంగా మెరుస్తూ.

ఆరోజుల్లో ఏదో శూన్యం. లోపలో, బయటో. ఎవరు నింపారో తెలీదు. లేక నేనే నింపుకున్నానో!
నాలో నుండి తను వెళ్ళి పోయాక, నడిచెళ్ళిపొయాక, The void that filled me once he had gone!

పనిలోనే విశ్రాంతి వెతుక్కునే రోజులు. అలాంటప్పుడే ఒక సాయంత్రం నీ పరిచయం. ఇంకా గుర్తు నాకు. పౌర్ణమి ముందు వచ్చిన ఒక ద్వాదశి రాత్రి, మధ్యరాత్రి పన్నెండు గంటలయినా నిద్ర పట్టలేదు. చాలా మంది మనుషులు చుట్టూరా ఉన్నా ఎంతో ఇష్టమైన ఒంటరితనం…అయినా ఎప్పుడూ భరించలేనంతగా లేదు. కాకపోతే రాత్రిళ్ళు వెన్నెల, నేలరాలిన పారిజాతం పూలు, మంచు కురవడం, చినుకుల్లో తడవడం, అర్ధరాత్రి ఆకుల చప్పుళ్ళూ, చుక్కల్లో ముగ్గులు, ఇవన్నీ మరిచిపోయి చాలా రోజులైంది- కావాలనే! ఒక కొత్త ప్రపంచంలో బ్రతకడం, అలసిపోయేట్టు పని చేయడం, మనసులోకి ఒక్క అంగుళం కూడా లోతుగా వెళ్ళకపోవడం – చాలా హాయిగా ఉండేది జీవితం, కనీసం అలా అనిపించేది.

ఎప్పుడైనా ఒక్కసారి నిద్రపట్టని రాత్రుల్లో ఓ నిమిషం పాటు ఎవరైనా నా భాష అర్థమయ్యేవాళ్ళు ఉంటే బావుణ్ణు అని, బయటకు వచ్చే ఫీలింగ్ ని నేనే లోపలకు తోసేసేదాన్ని. ఇలాంటి సందర్భాల్లో మనసుకి నచ్చిన పుస్తకాల్లో తల దూర్చడం అలవాటైంది. అలా అలా పెరిగిన ప్రపంచంలో పరిచయమైన కొందరు రైటర్సు ఎలా మన మనసులో తొంగిచూసినట్లు రాసేస్తారో అనిపించేది. వాళ్ళే చాలా దగ్గరగా అనిపించే వాళ్ళు, అక్షర బంధం తప్ప మరేం లేకుండా. ఎక్కడో చదివాను “ When something is destined to happen, all molecules in the universe push you in that direction”.

నువ్వెవరివి? ఆర్యూ వన్ సచ్ మాలిక్యూల్ ఆర్ ద డెస్టినీ ఆర్ మై ఫైనల్ డెస్టినేషన్? Will I ever find this out in my journey of life? (అబ్బా! మళ్ళీ ఫిలాసఫీ….)

మనుషులకి మాటలు అర్థమవుతాయి కాని నిశ్శబ్దంలో కూడా ఎలా వినిపిస్తూంది నీకు నా మనసులో మాట.

I spoke to you more through the silence between the words than through the mere words. I spoke to you more through the gaps of my voice than through the voice itself. నీ నోటి నుండి వచ్చే తర్వాతి పదం తెలుస్తూంది నాకు- నువ్వు చెప్పకుండానే.

అయ్యో! మబ్బులు కమ్మేసాయి… వర్షం పడుతుందేమో. పోయిన సంవత్సరం నాలుగు జల్లులు ఇదే టైమ్ లో. ఈసారి ఇంత డ్రైగా ఉంది అనుకుంటున్నప్పుడే ఇలా అనుకోకుండా వర్షం. ఆకాశాన్ని, భూమినీ కలుపుతూ- వాటి మధ్య ఉన్న ఒకే ఒక్క చానెల్ ఆఫ్ కమ్యూనికెషన్ లా. ఈ రెండింట్లో ఏది దేనికోసం ఎదురు చూస్తూందో ఎప్పుడూ ప్రశ్నే నాకు( ప్రాపంచిక బంధాల్లో కూడా!).

ఏదో చాలా ప్రత్యేకంగా ఇవ్వాలి అని అనిపించినప్పుడు, ఏదివ్వాలో తెలియనప్పుడు, ఎదురు చూడకుండా కమ్మేసే వాన. ప్రతి చినుకూ నీకోసమే అని చెప్పాలనుంది ఇప్పుడు. ఇంతకంటే స్వచ్ఛమైంది ఏమివ్వగలను?

ఒక సూర్యోదయం, నాలుగు రాలిన పువ్వులు, సాయంత్రపు నీరెండ, నిశ్సబ్దపు సూర్యాస్తమయం, అందులో మారే రంగులు కలిపిన ఒక పెయింటింగ్, ఆకాశపు కాన్వాస్ మీద- వీటిని మించినవి ఏమున్నాయి నాదగ్గర ఇచ్చేందుకు. అందుకే నీ ప్రతి పుట్టిన రోజునా ఒకే ప్రశ్న నాకు. ఏమివ్వాలని, ఏది బాగా గుర్తుంటుందనీ- వచ్చే పుట్టిన రోజుదాకా.

నీతో గడిపిన క్షణాల్లో ఏం చేశానో గుర్తు తెచ్చుకుందామనుకుంటానా… ఉహు, కానీ మనసు నిండి పోతుంది. లోపలే కాదు. బయట కూడా. ఇదేంటి “మనోబుధ్యహంకార చిత్తాని నాహం…” అని శంకరాచార్య గుర్తొస్తున్నారు.శివోహం అంటూ నీవల్ల కలిగే ప్రతి స్పందనలొనూ అంతర్లీనంగా ఒక ఫిలాసఫీ వినిపిస్తుంది.

నా మనసునిండా నువ్వా, లేక నీలో నేనా?

“…అహం నిర్వికల్పి నిరాకార రూపి.” ఉహు…వద్దు…” విబుధ్వాశ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్…”

అబ్బా, ఏంటీ పెండ్యులమ్? “…శివోహమ్”

Why did you enter my life? To lighten the romantic side of my heart, or to enlighten me through its reflection?

ఎప్పుడొస్తావు? నీకోసం ఎదురు చూసి చూసి, తలుపులేసి వెనక్కి తిరిగిన ప్రతిసారీ అనుకుంటాను. ఇంకా ఇలా ఎదురుచూడకూడదని, డిటాచ్ మెంట్ తెచ్చుకోవాలనీ (వెన్నెల తగ్గిపోతోంది).

అప్పుడే ఒక కొత్త గులాబీ పూస్తుంది, ఒక మంచి పాట వినిపిస్తుంది, కుండపోతగా వాన పడుతుంది. ఇవేమీ జరగక పోతే, నీనుండి ఒక పలకరింపు వస్తుంది. పాత పుస్తకాల్లోనుండి ఏదో ఉత్తరం జారి పడుతుంది. లేదా నీకోసం రాసుకున్న ఇలాంటి డైరీ లోని పేజీ నన్ను ఆపేస్తుంది. చేస్తున్న పని నుండి. ఇందులో ఏది మిస్ అయినా. కలలోనైనా కనిపించకుండా ఉండవు గదా నువ్వు! ఏదీ డిటాచ్ మెంట్?

ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు అని అడగాలనిపించిన ప్రతిసారీ నా అహం అడ్డొస్తుంది. అడగను, ఉహు… అలవాటైపోతావన్న భయం. కనీసం నీకోసం చూస్తూన్నట్టు నీకు తెలియకూడదన్నతపన.

I don’t want to get used to you, possess you and fight with in myself.

కాని, ఒక్క వెన్నెల రాత్రైనా ఇవన్నీ అలొచిస్తాను. నాలొ జరిగే ఘర్షణ కాసేపే అయినా తరవాత సద్దు మణుగుతుంది. అందుకే కదా నా చుట్టూ నువ్వున్నావనిపించినపుడల్లా ఎవరో ఒక ఫిలాసఫర్ బయట పడుతూ ఉంటారు, ఏదోటి గుర్తు చేస్తూ. I don’t mind getting lost here.

వర్షం వెలిసింది. ఎదురుగా తడిసి ముద్దయి పోయి నువ్వు! ఏం చెప్పను, ఇప్పటిదాకా ఎలా ఎదురు చూసానో, ఏమాలోచించానో చెప్పాలంటే… ఏదీ, ఒక్కటీ గుర్తు రాదే?

God! Why do you mute me with your presence?

**** (*) ****