ప్రత్యేకం

కృష్ణశాస్త్రి సాహిత్యావలోకనం (రెండవ భాగం)

ఆగస్ట్ 2016

కృష్ణశాస్త్రిగారి కవిత్వంలో ప్రేమకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆనాటి భావకవులు ప్రేమని గురించి కొత్త తరహాలో చెప్పారు. ఉదాహరణకి గురజాడ అప్పారావు గారి ‘కాసులు’ అనే కవితలోని ఈ పాదం…

‘ప్రేమ -
పెన్నిధి గాని, యింటను నేర్ప
రీ కళ, ఒజ్జ లెవ్వరు లేరు -
శాస్త్రములిందు గూర్చి తాల్చె
మౌనము’

గురజాడవారు ప్రేమని కళగా భావించారు. ఇది శాస్త్రాలలో లభించేది కాదు. అనుభవంతో అన్వేషించాలి. ఆయన ఇంకా ఇలా అంటారు. ‘ప్రపంచం యొక్క అచ్చమైన తత్వం స్వార్థ త్యాగంలో, పరోపకారంలో ఉంది. స్వార్థత్యాగానికి దారి తీయగల ప్రేరణ ప్రేమని మించింది ఉందా? మానవాత్మ పూసిన అత్యంత ఉజ్వలమైన పుష్పం ప్రేమ.’ ఈ భావాలు కృష్ణశాస్త్రిగారిని ప్రభావితం చేశాయి. భావనతో ప్రేమని అన్వేషించేలా చేశాయి.

లోకం స్వార్థంతో నిండి ఉంది. విలువలు పడిపోతున్నాయి. మానవ ప్రేమ కరువౌతోంది. లోకం పోకడని కృష్ణశాస్త్రి-

‘తోయముల తీయనైన పానీయమొసగి
వలపు నునులేత గాలి వీవనల విసరి
ప్రబల నైదాఘ తీవ్రాతపంబు వలన
నిట్టులైతివె సెలయేర, తుట్ట తుదకు ‘

లోకం దాహం తీర్చిన సెలయేరు చివరికి ఎండిపోయిన తీరుని చూపిస్తూ స్వార్థత్యాగము ప్రేమకి ఎలా ప్రేరణ కలిగిస్తుందో చెప్పేరు. తనని తాను అర్పించుకోవడం ద్వారా మనిషి శాశ్వతంగా మిగిలిపోతాడనే సత్యం ఇందులో ఉంది. ఇదే భావాన్ని టాగూర్ ‘Beauty is the self – offering of the one to the other one’ అని అంటారు. స్వార్థత్యాగం విశ్వాసానికి పాదు గొల్పుతుంది. విశ్వాసం మనిషికి సౌందర్యాన్నిస్తుంది.

కృష్ణపక్షం కావ్యంలో కవి ప్రేమించిన వాళ్ళు కవిని ప్రేమించలేదు. కవిని ప్రేమించినవాళ్లని కవి ప్రేమించలేదు. ప్రేమలేని చోటికి సౌందర్యం రాదు. సౌందర్యం లేని చోటికి ప్రేమ పోదు. దీనికి ఆధారం ‘తేటివలపు’ ఖండికలో దొరుకుతుంది. హృదయానికి ప్రాధాన్యాన్నివ్వకుండా, శరీరానికే ఆనందాన్నివ్వడంలో భౌతిక దృష్టి కనిపిస్తుంది. శారీరక సుఖంలో తృప్తి పడని కవి భావనతో ప్రేమాన్వేషణం ప్రారంభిస్తాడు. కాల్పనిక కవితలో భావనకి గల స్థానం ప్రత్యేకమైనది.

షెల్లీ ప్రేమగురించీ, భావన గురించీ ఇలా అంటాడు.

‘The great secret of morals is love; or going out of our nature, and an identification of ourselves with the beautiful which exists in thought, action or person, not our own. A man, to be greatly good, must imagine intensely and comprehensively, he must put himself in the place of another and of many others, the pains and pleasures of his species must become his own. The great instrument of moral good is imagination.’

గొప్ప నైతిక రహస్యం ప్రేమ. సౌందర్యంతో మనల్ని మనం ఐక్యం చేసుకోవాలి. దానికి భావన అవసరం. గాఢంగా, విశాలంగా ఆలోచించగలిగినప్పుడే మనిషి మంచితనం తెలుస్తుంది. ప్రేమభావన మనిషిని ఇతర మానవులని ప్రేమించగలిగేలా చేస్తుంది- అని షెల్లీ అభిప్రాయపడుతున్నాడు.

కృష్ణశాస్త్రి ప్రేమపిపాసి. అంతేకాదు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే కవి. స్వేచ్ఛాన్వేషణంలో, ప్రేమాన్వేషణంలో కవి లోకాన్ని నిరాకరించాడు. కృష్ణపక్షంలో పడ్డ కవి కాంతికోసం ప్రయాణిస్తూ పాంథుని (wayfarer) గా మారాడు.

‘శ్యామలాంబర పరిణాహ సరసిలోన
ప్రణయలీలా విహార విలాసినులగు
తారకల గాంచుమా! నీ హృదయము నందు
భావనక్షత్ర కాంతులు పర్వునేమో!’

అన్న కృష్ణశాస్త్రి ఆదర్శాన్ని సాధించడానికి హృదయాల్ని మేల్కొలుపుతున్నారు ‘ This great world, where it is a creation, an expression of the infinite – where its morning sings of joy to the newly awakened life, and its evening stars. sing to the traveler, weary and worn, of the triumph of life in a new birth across death – has its call for us.’ అన్న టాగూర్ మాటలు ఇక్కడ గుర్తొస్తాయి.

కవి తన పరిస్థితిని చీకటి ఆకాశంలో దర్శించి తన హృదయంలో ప్రేమకోసం అన్వేషణ ప్రారంభించారు. ఋగ్వీధిలో ఇంకా ఇలా అంటారు.

‘కారు చీకటిలో బైలుదేరి, యమృత
కాంతిగోరి, సతమ్ము లోకమ్ములో: బ్ర
యాణమగు బాటసారి యీ మానవాత్మ
యనుచు నమృతాలతేట బ్రహ్మర్షి మాట’

సామాన్యులకైతే మామూలు మాటలూ వెలుగూ చాలు. ప్రేమలో ఉన్న మనిషికి పలుకుని సంగీతంగా మలచాలనీ, వెలుగుని ఇంద్రచాపంగా దిద్దాలనీ తపన. ఇక్కడ కవి తన హృదయాన్ని ప్రేమతో నింపడం ద్వారా సృజనకి మెరుగు పెడుతున్నాడు. సృజనాత్మక అనుభవాన్ని సాధించడం భావన ద్వారానే సాధ్యం.

‘తేటివలపు’ లో కవి మధుపమై అనుభవించిన పువ్వుని, హృదయంతో చూస్తే ఇలా కనపడుతుంది.

‘రంగు రంగుల సొగసు చీరల ధరించి
నవ్వు వెన్నెల కాయు క్రొన్ననల నడుమ
వాడి వాడని యీ విరిచేడే తాల్చు
మంచి ముత్తియముల గన మది కరంగు’

కవిని తన జీవితభాగస్వామిగా భావించిన ఆ పువ్వు కవిని చంచల మధుపంగా నిరసిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ధారలతో పెంచిన స్నేహంపు పూల తీగె గాలి తాకిడికి నేలవాలినది.

చిరుత ప్రాయంలోనే కోరికలు చెదరిపోయాయి. ఆశయాలు అడుగంటినాయి. అని బాధపడుతూ,

‘మత్తిలిన యొక్క చంచల మధుపమునకు
కోలుపోయితి మకరంద జాలమెల్ల
ఇంతలో వీచి యెచటికో యెగిరిపోవు
మారుతము తోడ వలపులు మాయమయ్యె’

అని దుఃఖిస్తుంది. హృదయనాళము తెగిపోయి, హృదయ ధనము కోల్పోయి ‘వలపె విషమయిన తుచ్ఛజీవనము విషము’ అని కూడా అంటుంది. ఆనందంలో పడి తనని మరచిపోయిన ప్రియునితో ప్రియురాలు ‘ఘోర దుఃఖ తమంబున కుందునపుడు తెరచి హృదయంబు,నారని దివ్వెనిత్తు’ నని స్వార్థత్యాగంతో తనని తాను అర్పించుకున్న ప్రియురాలు ప్రియుని హృదయంలో ప్రణయదీపాన్ని వెలిగిస్తానంటుంది.

‘నా యిచ్చ యే గాక నాకేటి వెరపు’ అన్న కవిలో, బాధతో కూడిన మార్పు కలుగుతోంది. ‘నాప్రేమ’ ఖండికలో ‘క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన మలినమౌ నా హృదయము ధామమెటులయ్యె నతి విశుద్ధము మధురము నఘ రహితము ప్రణయమున కంచు సందియపడుదువేమో’ అని అంటూ

‘ప్రేయసీ శర్వరీ తమో వీధుల బడి
చందురుడు రాడె పూర్ణ తేజస్వియగుచు?
అఘవిదూషిత మీ హృదయంబు నందె
ప్రేమ కోమలతమము పవిత్రమయ్యె’

అంటాడు. కవి ఆశాజీవి. పాపపంకిలమైన హృదయాన్ని సంస్కరించుకొనే ధీశాలి. కోమలమైన ప్రేమ భావనతో జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలనే తపనగలవాడు. చెడుని ప్రేమతో క్షాళన చేయాలనుకొనే హృదయవాది.

ప్రకృతిలో ప్రేమ ఎంత సహజమైనదో, ఎంత నిస్వార్థమైనదో, ఎంత స్వచ్ఛమైనదో ‘ఏల ప్రేమింతును’ అనే ఖండికలో, ప్రపంచలోని ఐక్యతని వివరిస్తూ,

‘సౌరభము లేల చిమ్ము పుష్ప వ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’

అని అంటారు. షెల్లీ Love’s Philosophy అనే ఖండికలో కూడా ప్రకృతిలో అణువణువూ ప్రణయమయం అనే భావాన్ని వ్యక్తీకరించాడు. మావి కొమ్మల్లోంచి మధుమాస వేళలో, కోయిల పాడే పాట ఇతరులని ఆనందింపజేయటానికో, తన బాగుకోసమో ఆలోచించమంటున్నాడు కవి.

నిజమైన ప్రేమకి కలుషిత హృదయం భయపడుతుందని చెబుతూ,

‘విరిసి విరియని క్రొవ్విరి నరయుటకును
ఎంతొ సందియపడ, స్పృశియింపగలమె?
వలపుల హరింపగలమె? యౌవనము నూత్న
వికసితము, కలుష హృదయము వెరపుః జెందు’

ప్రేమతత్వాన్ని ఆవిష్కరిస్తారు. రొమాంటిక్ కవి Rosetti, ‘ Lover Enthroned’ అనే కవితలో ఇలా అంటాడు.

‘ Love’s throne was not with these, but far above
All Passionate Wind of welcome and farewell
He sat in breathless bowers they dream not of ;
Thou Truth foreknow Love’s heart, and Hope fore tell,
And fame be for Love’s Sake desirable,
And Youth be dear, and Life be sweet to Love’

ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత ఉదాత్తమైనదో, ఎలాంటి విలువలనందిస్తుందో చెబుతున్నాడు Rosetti. జీవితంలో యౌవనం ప్రేమ మాధుర్యాన్ని నింపుకొని ఆశలకి ప్రాధాన్యాన్నిస్తుందంటాడు. కవులు ప్రేమకు ఇంత ఉన్నతిని ఇవ్వడమెందుకంటే, సౌందర్య దర్శనానికి ప్రేమ తొలిసోపానం కనుక.

రొమాంటిక్ కవులు కనిపించని సౌందర్యాన్ని అన్వేషించడానికి కనిపించే సౌందర్యాన్ని సాధనంగా చేసుకున్నారు. భౌతిక సంవేదనలోనే అన్వేషణ ప్రారంభమౌతుంది. ‘ఇంగ్లీషు కాల్పనిక కవిత్వంలోని స్వచ్ఛంద ప్రణయము భావకవులని ఆకర్షించినది. ప్రేమించుట యన్నది ఉదాత్త కృత్యమని వారికి తోచినది’ అని డా. సి.నారాయణరెడ్డిగారు ‘భావకవిత్వం’ అనే విభాగంలో చెప్పారు.

కృష్ణశాస్త్రి కావ్య ఖండికల్లో వెల్లివిరిసిన ప్రేమ ఆత్మాశ్రయ ధోరణిలో సాగింది. కవే కథానాయకుడు. ప్రకృతి ప్రీతి అధికం కావడంతో ప్రేయసితో ఇలా అంటాడు.

‘సార్వభౌమ భోగములేల చాన, మనకు?
ఏలికల మౌద మన్యోన్య హృదయములకు
ప్రవిమల ప్రేమ సామ్రాజ్య పట్టభద్ర
భాగ్యముగన్న జిఱుత సంపదలేల?’

‘దివ్యభాగ్యము’ ఖండికలో బంగారం, మణిభూషణాలూ, ముత్యాల హారాలూ అనవసరమని భావించి, సంధ్యా కాంతులలోని సువర్ణచాయలను, కాంతులీనే నక్షత్రాలను చూసి చింతలని దూరం చేసుకుందామనీ, సెలయేటి నురుగుల సౌందర్యాన్ని చూసి ఆనందంగా ఉందామనీ ప్రియురాలితో అంటాడు. ఈ సందర్భంలో చలంగారు, ‘కృష్ణశాస్త్రి తన ప్రియురాలిని హృదయరాజ్యాలని ఏలుకుందాం రమ్మని ఆహ్వానించాడు. బయట వస్తువు లేనిదే దాని నుంచి రాగల ఆనందాన్ని కల్పించుకోగల మనసే ఉంటే అది ఎంత అదృష్టం’ అని అంటారు. కృష్ణశాస్త్రి సృజనాత్మకతని చలంగారు పరిశీలనతో గ్రహించారు. అదే కాల్పనికత.

కృష్ణశాస్త్రిగారి ప్రేమలో రెండు రకాల ధోరణులు కనబడతాయి. 1. ఆయనని ప్రేమించిన వాళ్లు 2. ఆయన ప్రేమించిన వాళ్లు. ఆయన ప్రేమలో సౌందర్య దృష్టి ఉంది. కాని లోకం దానిని అర్థం చేసుకోలేదు. ఆయన లోకాన్ని లెక్క చేయలేదు.

‘వెఱ్ఱిలోకమ! హృదయంపు స్వేచ్ఛనెటులు
పంజరంబున బంధింతె? పాదపమున
కూడియుందు మెల్లప్పుడు కొమ్మమీద
ప్రవిమల ప్రేమవిహగ దంపతులమగుచు’

అని అంటారు. అంతే కాదు యుగయుగాలుగా ప్రేమికుల స్వేచ్ఛకి ఆంక్షలు విధించిన పద్ధతిని తెలియజేస్తూ ‘శాపము’ అనే ఖండికలో,

‘నవవసంత శుభోదయానంద వశత
ప్రకృతి నూతన జీవలావణ్య మొంద
రాయి రప్పయు కంఠస్వరంబు దాల్చి
నైజగుణము త్యజించి గానంబుసేయ
పికమ, పాడకుమనుచు శపించినారు!’

ప్రేమికుల పట్ల లోకం పోకడని తెలియజేస్తూ, తన స్వేచ్ఛాయాత్రలో, ప్రేమాన్వేషణంలో తనతో రాని నిర్జీవ ప్రపంచాన్ని ఆయన లెక్క చేయలేదు.

‘పక్షినని పాడగలనని ప్రణయవీధి
నిత్యలీలా విహారముల్ నెరపుదునని
పక్షముల దూల్చి, బంధించి పంజరాన
గానమును బ్రాణము హరింప బూనినారు’

అంటారు కృష్ణశాస్త్రి. భావకవిత్వానికి సంబంధించిన రెండూ ప్రధాన గుణాలు పరిచయం చేస్తున్నారు. అవి సంగీతం, ప్రేమ . రెండూ దగ్గర సంబంధం కలిగి ఉన్నవే. కవి దృష్టిలో రెండింటికీ స్వేచ్ఛ ప్రాణం. ఈ రెండింటి ఔన్నత్యాన్ని కృష్ణశాస్త్రి కవితాత్మకంగా చెప్పారు.

కృష్ణశాస్త్రి వేంకట పార్వతీశ కవులని గురించి రాస్తూ ఇలా అంటారు.
‘నవ్యకవులకి స్వేచ్చ ప్రాణము. వీరు ప్రాణమైన కోల్పోవుదురు గాని శృంఖలముల ధరింపరు. వీరికి ప్రాణము కన్న గానము తీపు. సంకెలలో సంగీతమా? కట్టుబాటులో కవిత్వమా?’

ప్రేమకీ, కళకీ గల సంబంధం విడదీయరానిది. ప్రేమికుల పట్ల, కళాకారుల పట్ల – ముఖ్యంగా నవ్య ధోరణులు ప్రదర్శించేవారి పట్ల లోకం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కృష్ణశాస్త్రి చిత్రించారు.

కృష్ణపక్షంలో కవికి తన ప్రేయసి నుండి బదులు రాలేదు. పైగా ఆమెకు వేరొకరితో వివాహమైంది. ఈ విషయాన్ని కృష్ణశాస్త్రి ‘ మా ప్రణయలేఖల కథ’ లో ఇలా రాస్తారు. ‘ఓ అద్భుత వ్యక్తి నా హక్కయింది. నా కోసమే జీవితం వహించింది. తన ప్రేమతో నన్ను కప్పేసింది. నాకూపిరాడింది కాదు. నాకెందుకో ఇరుకైంది ఈ ప్రపంచం’ అని అంటూ, ఆమె ప్రేమని స్వీకరించలేక పోయాడు. ఆమెని ప్రేమించ లేకపోయాడు. బాధతో ఆమె నలిగిపోయింది. చివరకి ప్రాణాలు విడిచింది.

‘నా విరుల తోట పెంచికొన్నాడ నొక్క
పవడపు గులాబిమొక్క నా ప్రణయ జీవ
నమ్ము వర్షమ్ముగా ననయమ్ముకురిసి
కొన్ని నాళ్లాయె; సుకుమార కుసుమమొకటి
నవ్వె కిలకిలమని నా వనమ్ములోన’

అంత దానిని జీవితాశంగా ప్రేమించారు. ఎదల నిశ్శబ్దంగా పలకరించుకున్నారు. కాని అంతలోనే ‘నొక్క క్రూరార్క కిరణమ్ము; ఉర్వి వాలి నా గులాబి సోలుచు తూలి నన్ను వీడె’. భార్య మరణంతో క్రుంగిపోయిన కవి దుఃఖంతో కుమిలిపోతాడు.

భార్యని ప్రేమించక అందరాని ఆనందం కోసం అన్వేషించిన కవి – తన పరిస్థితిని ‘చుక్కలు’ కవితలో ఇలా వివరిస్తారు .

‘మింట నెచటనొ మెరయు చుక్కల
కంట చూచితి కాంక్షలూరగ
కాంక్షలూరిన కొలది చుక్కలె
కాంచి బ్రదుకే గడపితిన్
చేతి కందెడు పూలకొరకై
చేయి చాపక చేరి కోరక
దూరమున లేవంచు వానిని
దూరి వదలితిని’

అందుబాటులో ఉన్న ప్రేమని కాదని అందరాని ప్రేమకి అర్రులు సాచినపుడు ఆకాశంలో చుక్కలు అదృశ్యమవుతాయి. చేతికందే పూలు వాడిపోతాయి. పక్షిలా ఆకాశంలో ఎగిరి పోవాలని కోరుకున్నాడు కవి . రెక్కలు లేవన్న సంగతి గ్రహించలేదు. చివరికి జీవితం కలగా మిగిలిపోయింది. ఇపుడు కవిలో పశ్చాత్తాపం కలుగుతోంది.
రొమాంటిక్ కవి షెల్లీ కూడా యౌవనంలో స్వేచ్ఛని విశృంఖలంగా కోరుకొని ‘Prometheus unbound’ పద్య నాటకం రాసేనాటికి వ్యక్తిత్వంలో ఎంతో పరిణామాన్ని సాధించాడు. దీనికి Methodist విధానాలు అతని మనసుని పక్వానికి తెచ్చాయి. తెలుగుకవి కృష్ణశాస్త్రి వైష్ణవభక్తి, బ్రహ్మసమాజం, సూఫీతత్వం వంటి ఆధ్యాత్మిక భావసంస్కారంతో, శూన్యమైన తన హృదయాన్ని సౌందర్యంతో నింపుకొనే ప్రయత్నం చేశాడు. దాని ఫలితమే అన్వేషణము. కృష్ణశాస్త్రి కవిత్వం ఎడతెగని అన్వేషణ. దానికి ఊత భావనాశక్తి.

‘అన్వేషణము’ ఖండిక సంభాషణాత్మకంగా సాగింది. కవికీ, గోపికకీ మధ్య జరిగిన సంభాషణమిది. గోపిక శ్రీకృష్ణుని మురళీగానాన్ని ఆసరా చేసుకొని, కృష్ణుని సౌందర్యాన్ని అనుభవించగలగటం ఈ ఖండికలో ఉంది. ప్రేమ అనంతమైనదని గాఢమైనదని చెప్పటానికే కవి ఈ ఖండికను రచించారు. ‘అప్పుడు నీపవనిలో శ్రీకృష్ణుని వెదికినది నేనుకాదు. యుగయుగాల నుంచీ ఎరిగున్న గోపిక’ అని కృష్ణశాస్త్రిగారు అన్నారు. అమూర్తమైన వేణుగానాన్ని భావన ద్వారా అనుభవంలోకి తెస్తారు కృష్ణశాస్త్రి.

‘ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
బడిపోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లె పూదీవె సోనల పైని
తూగాడు తలిరాకు దోనెవోలె
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
మునిగిపోయిన మబ్బు తునుక వోలె

చిరుత తొలకరి వానగా చిన్ని సొనగ
పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు
కదలిగా పిల్లగ్రోవిని వెడలు వింత
తీయదనముల లీనమై పోయె నెడద. ‘

బృందావన వేణుగానము కవి హృదయాన్ని భావశబలితం చేస్తోంది.

కవిని భార్య మరణం కుంగదీస్తోంది. ఎడద మోడైపోయి, జీవితం శిథిలమైంది. హృదయాన్ని చిగురింపజేయడంకోసం కవి తపన. భావకవిత్వంలో హృదయానికి అంత ప్రాధాన్యం ఉది. రొమాంటిక్ కవిత్వానికి సంబంధించిన లక్షణం ‘అన్వేషణం’ లో కనబడుతుంది. ఇస్మాయిల్గారన్నట్టు, ‘ఈ విశ్వానికి ఆలంబనలైన అదృశ్యశక్తులు దృశ్యవస్తువుల ద్వారా వ్యక్తమవుతాయని రొమాంటిక్ కవుల అభిప్రాయం. ఇంద్రియానుభూతి ద్వారానే ఈ అదృశ్యశక్తులని అందుకోగలం. ప్రతి కవికీ ఇంద్రియానుభూతి అవసరం. రొమాంటిసిస్టులకు మరీను’. చీకటిలో చల్లని గాలిని తాకి, యమునానదీ కెరటాల సంగీత ఝరులతో కలసి, వెన్నెల స్వచ్చతని అందుకొని వేణుగానం చెవిని తాకుతోంది. కృష్ణశాస్త్రి సృజనాత్మక శక్తులు విజృంభించి మరీ ‘అన్వేషణ’ రూపుదిద్దుకుందేమో అనిపిస్తుంది. గాఢత, సాంద్రత, క్లుప్తత మెరుగులు దిద్దుకొని కవి అనుభూతి రసగీతిగా జాలువారిన సన్నివేశమిది.

సహధర్మచారిణి, మధురమధుర ప్రియురాలు, సఖురాలు, పూర్ణరాగకలిత అయిన కవిగారి భార్య కరముకరమున కీలించి కలసి మెలసి జీవించింది. ఆమె మరణంతో కవి చలించిపోయి ‘నాకు మరణమ్ము వలదనినాను’ అని అంటూ మరణం అనే మాట వినపడితే వణికిపోయే వాణ్ణికాను. ‘మహాంధకార కలుషిత ‘కృష్ణపక్షంపు’ వీధిలో ఆమె స్మృతులు హృదయాన్ని కదిలిస్తుంటే -

‘నా దుఃఖ మసువులే తొలగిపోవ,
వీడిపోవు నేమొ యను వెరపు వలన
నాకు మరణమ్ము వలదనినాను’

అని అంటారు. భావకవులు దుఃఖాన్ని ‘విషాదసుఖం’ గా భావించారు. ఆత్మ ప్రక్షాళనానికి దుఃఖాన్ని వరంగా స్వీకరించారు. ‘సగము నిద్దురలోకమ్ము స్వప్నమటులు’ కదలిపోయిన భార్య కవిని చీకట్లో మిగిల్చింది. చీకటి చిక్కదనాన్ని కృష్ణశాస్త్రి ఇలా అంటారు.

‘ఆ నిగూఢ ప్రశాంత సంధ్యా దురంత
గర్భ కుహరాంతరమ్ముల కలచిపోవు
కమ్ర భవదీయ మంజీర కటకగాన
రవముచే తిమిరమ్ము సాంద్రతరమయ్యె’

భార్యతో వెళ్లిపోయిన తన హృదయం కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తూ ఉంటాడు కవి. దుఃఖం భయంకరంగా ఆవరించింది. అందులో ఆశ మెరుస్తూ ఉంటుంది. కన్నీటి కెరటాల వెన్నెలనీ, హాలహలంలో అమృతాన్నీ, శిథిల శిశిరంలో చివురునీ, రాతిలో పూవునీ చూడగల భావనాశక్తి కవికి ఉంది. అందుకే ఎంత దుఃఖాన్నైనా భరించగల ధైర్యం ఉంది. భావకవికి. ఆశాసంగీతం వినిపించగల సృజన శక్తులున్నాయి.

‘Man achieves his close contact with reality only by participation in love through the activity of the imagination’ షెల్లీ ప్రవృత్తికి సంబంధించిన ఆత్మావలోకనమిది.

రొమాంటిసిజం ప్రభావంతో భావకవిత్వంలో ప్రధానమైన ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఎంత ఉదాత్తమైనదో, ఎంత గాఢమైనదో కృష్ణశాస్త్రిగారు తమ కావ్య ఖండికల ద్వారా చెప్పారు. ఆ ప్రేమ సౌందర్య ప్రస్థానానికి తొలి సోపానంగా ఎలా మారుతుందో వివరించారు.

**** (*) ****