భావకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1-11-1897 న కార్తీక శుద్ధ అష్టమినాడు పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో జన్మించారు. తండ్రి దేవులపల్లి వేంకటశాస్త్రి అనే తమ్మన్నశాస్త్రిగారు. పెదతండ్రి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. దేవులపల్లి సోదరకవులుగా ప్రసిద్ధులైన వీరి పూర్వీకులు కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందినవారు.
కృష్ణశాస్త్రిగారి పూర్వీకులంతా ‘వేదంబుల శాస్త్రంబుల వాదంబుల నెదురులేని వారలే’ ‘సీతావర పదసేవన విధాన పావనులే.’ కావ్యాలూ, నాటకాలూ రచించిన దేవులపల్లి కులాగ్రణి వేంకట సూరిమణి, ఆ తర్వాత జగన్నాథార్యుడు గాథాబోధనాశాలి. వేంకట రామశాస్త్రి, అందరూ కళావేత్తలే. వేంకట రామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలలో నిష్ణాతులు. కృష్ణశాస్త్రిగారి పూర్వీకుల కళా సంస్కారంలో సంప్రదాయం మెరుగులు దిద్దుకుంది.
పెదతండ్రి సుబ్బరాయశాస్త్రి, తండ్రి తమ్మన్నశాస్త్రి (కృష్ణశాస్త్రి), ఇద్దరూ సంస్కృతాంధ్రాలలో కవిత చెప్పినవారు. సుబ్బరాయశాస్త్రిగారు మహేంద్ర విజయమనే ప్రబంధము, మందేశ్వర శతకం, రాజనీతిని తెలిపే కుమారశతకం, రామరాయవిలాసం వంటి తెలుగు గ్రంథాలూ, శ్రీరామపంచశత్, శ్రీరావు వంశ ముక్తావళి వంటి సంస్కృత గ్రంథాలూ రచించారు. తండ్రి దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి అనే తమ్మన్న శాస్త్రిగారు ‘యతిరాజవిజయం’ అనే నాలుగాశ్వాసాల గ్రంథం రచించారు. రామానుజాచార్యుని గురువర్యుల పవిత్ర జీవితాన్ని చిత్రించిన గ్రంథమిది. వీరిద్దరికీ అష్టావధాన విద్య వెన్నతో పెట్టిన విద్య.
పండిత వంశంలో పుట్టిన కృష్ణశాస్త్రిగారు ‘నేను స్వంతంత్రంగా ఏమీ సంపాదించలేదు. ఏమయినా నాకు కవిత వస్తే మా పూర్వుల నుంచి వచ్చిందే ‘ అని సవినయంగా మనవి చేశారు.
‘ఏమనోహర సీమలందే పవిత్ర
విమల తేజోమయ విశాల వీధులందు
అక్షరామోద సంచరితాంత రంగు
లగుచు విహరించుచున్నారొ ‘
అని స్మరిస్తూ ‘అమృతగాన మధుర మందాకిని’గా ప్రవహించిన తండ్రి, బాబయ్య గార్ల కవితని కీర్తించారు.
‘మీ పవిత్ర యశో నిర్మలాపగాతి
శీతల తరంగ జల సుధా సేచనమున
కలుష కౌటిల్య కర్దమమలినమైన
మీ తనయు జీవితము కూడ పూతమయ్యె ‘
ఎన్నడో తండ్రితాతలు పాడిన వసంత మధుర జీవనగీతి తన జీవితాన్ని కవితామయం చేసిందని కృష్ణశాస్త్రిగారు చెపుతూ ఉంటారు. తల్లి సీతమ్మగారి దగ్గర జానపద గీతాల మాధుర్యాన్ని పుణికి పుచ్చుకున్నారు.
బాల్యంలోనే తండ్రుల దగ్గర ప్రాచీన సాహిత్యంలోని పద్య సంస్కృతిని వంట పట్టించుకున్నారు. పిఠాపురం హైస్కూలులో కూచి నరసింహంగారి శిష్యరికంలో ఆంగ్ల కావ్య నాటకాలలోని మెలకువలని గుర్తించి తన ప్రతిభకి మెరుగులు పెట్టుకున్నారు. గ్రంథ పఠనంతో తెనుగు పద్యాల సొగసుని గ్రహించారు. గ్రాంథిక, వ్యావహారిక భాషా వివాదం ఆంధ్రదేశపు యువకులని నూతన మార్గాల వైపు దృష్టిని మళ్ళిస్తున్న కాలమది.
1916లో విజయనగరం మహారాజ కళాశాలలో వి.ఏ చదివారు. మామిడిపూడి వేంకట రంగయ్యగారు, బుర్రా శేషగిరిరావుగారు, రామవతారంగారు వంటి విశిష్ట గురువుల దగ్గర విద్యని అభ్యసించారు. విజయనగరంలో చదువుకునే రోజుల్లో మహాకవి గురజాడ అప్పారావుగారిని చూశారు. వీరి పెద తండ్రి సుబ్బరాయశాస్త్రిగారి అవధానానికి గురజాడవారు పృచ్ఛకులుగా వ్యవహరించారు. అప్పారావుగారి గురించి రాస్తూ కృష్ణశాస్త్రి “సన్నగా, అర్భకంగా, కాని పదును పెట్టిన కత్తిలాగుండేవారు. ఎప్పుడయినా పిఠాపురం నుంచి వచ్చే నా తండ్రిగారూ వారూ సాహిత్య గోష్ఠి జరిపేవారని జ్ఞాపకం” అని రాశారు.
కాల్పనిక కవితకి రూపురేఖలు దిద్దిన గురజాడ వారిని ‘మహాకవి’ గా సంబోధించినది కృష్ణశాస్త్రిగారే. గురజాడవారి కవితని గురించి
‘యుగ యుగంబుల నుండి మ్రోగెడు
విశ్వగాన వియత్తరంగిణి
భంగముల నుప్పొంగు నాతని
గీత శీకరముల్’
అన్నారు. గురజాడవారి భావ సంస్కారం కృష్ణశాస్త్రిలో కొత్త ఆలోచనలకి పాదులు వేసింది.
దేశం పరాధీనమై ఉంది. బ్రిటిషువారు పరిపాలనా సౌలభ్యం కోసం మూడు ప్రధాన రైలు మార్గాలు వేశారు. మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో మూడు విశ్వ విద్యాలయాలు స్థాపించారు. ప్రజలని మరింత బానిసలుగా మార్చటానికి ఆంగ్ల విద్యని ముమ్మరం చేశారు. దేశంలో ఆంగ్లవ్యాప్తి యువకులలో ఉత్సాహాన్నీ, కొత్త తరహాల పట్ల ఆసక్తిని కలిగించాయి. దేశంలో స్వేచ్చ కోసం సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమైనాయి.
నవీన మానవుడు రాజారామమోహనరాయలు ప్రారంభించిన మానవోద్యమం మానవులందరికీ స్వేచ్చా స్వాతంత్ర్యాలు కావాలంటుంది. రూసో మొదలయిన తత్వవేత్తల ఆలోచనల ఫలితంగా ఆవిర్భవించిన ఉద్యమమిది. ప్రాచీన భారతీయ సంస్కృతిని సహేతుకంగా విమర్శించి, దేశకాల పరిస్థితులను బట్టి మార్పులు అవసరమనే ఉద్యమమిది. జగత్తులొ మానవుణ్ణి మించింది ఏదీలేదు. ‘నాజాతి మానవజాతి’ అనే విశ్వజనీనమైన భావాలకి నాంది పలికిన ఉద్యమమిది. ప్రతి వ్యక్తికీ స్వాతంత్ర్య వికాసాలుంటేనే జాతి ముందుకి నడుస్తుందనీ, అప్పుడే మానవజాతి సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందనీ ఈ ఉద్యమం ఆశిస్తోంది.
రాజారామమోహనరాయలు భావాల ప్రభావంతో ఆంధ్ర దేశంలో సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
‘అభినవాంధ్ర శుభోదయ ప్రాప్తికెల్ల
మూలపురుషుడొకడుండె, విశాలదృష్టి
ఆ మహర్షి నాటిన మహోద్యమ లతికలె
సూన పల్లవ తతి మోసె… ‘
అని కందుకూరి వారి ఆధునిక దృష్టిని కృష్ణశాస్త్రిగారు వివరించారు. బాల వితంతువుల దుస్థితి, నిమ్న జాతుల దయనీయ స్థితిగతులు, కళావంతుల హేయపద్ధతి – వీటినన్నింటినీ తొలగించాలనీ, దాస్యాలన్నింటిలోనూ మనోదాస్యం మరీ చెడ్డదనీ, దాన్ని వదిలించుకోవాలనీ జాతిని హెచ్చరించినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
పంతులుగారి భావచైతన్యం కృష్ణశాస్త్రివంటి యువకుల హృదయాలని చలింప జేసింది.
భారతదేశంలో బ్రహ్మసమాజ ఉద్యమ స్థాపకుడు రాజారామమోహనరాయలు. దేశంలోని మతాలన్నీ మనిషిని మరచిపోయి, జాతి వైషమ్యాలకి దారి తీస్తుంటే, అన్ని మతాలలోని మంచిని గ్రహించి,మానవుణ్ణి మానవునిగా తీర్చిదిద్దే బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. వ్యక్తిగత సాంఘిక జాతీయ మానవ సమస్యల పరిష్కారానికీ, ప్రతి మానవునికీ అందగల సమగ్ర సుందరమయిన విధానాన్ని నిర్మించిన నూతన యుగ నిర్మాత రాజారమామోహనరాయలు.
‘ఏక మేవా ద్వితీయం బ్రహ్మ’ అన్నది బ్రహ్మ సమాజానికి మకుటం. కేశవచంద్రసేన్ మొదలైన వారి కృషితో ఇది ఉద్యమరూపం ధరించింది. కందుకూరి కృషి వల్ల రాజమండ్రిలోనూ, బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడుగారి కృషివల్ల కాకినాడలోనూ, బ్రహ్మసమాజం చైతన్యవంతమై ఆంధ్రదేశమంతా వ్యాపించింది. పిఠాపురం మహారాజా రావువేంకట మహీపతి సూర్య రాయబహద్దూర్ వారి ప్రేరణతో ఆంధ్రదేశంలోని బ్రహ్మ సమాజ ఉద్యమానికి కాకినాడ కేంద్రమైంది. నాయుడుగారి శిష్యరికంలో మొక్కపాటి రామ్మూర్తి , తారకం, చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రివంటి యువకులు ఉద్యమానికి ఊపుని, కొత్త చూపునీ ఇచ్చారు. నాయుడుగారు అధ్యక్షులుగా ఉన్న కాకినాడ కళాశాలలో కృష్ణశాస్త్రి విద్యార్థిగా చేరారు. కళాశాలలో విద్యార్థులకి పాఠాలు చెప్పిన నాయుడుగారు రూమీ, హఫీజ్, సాది లాంటి సూఫీ కవులవీ, కబీర్, మీరా, విద్యాపతి వంటి మధ్యయుగం భారత భక్తులవీ కావ్యాలు వినిపించేవారు . ఆంగ్లకవులు షెల్లీ, కీట్స్, బైరన్ వంటి కవుల సౌందర్య దృష్టిని వివరించేవారు. కృష్ణశాస్త్రి వంటి యువకులకి ప్రతి అణువులోనూ అనంతత్వాలన్నీ, ప్రతి అనుభూతిలో పరమార్థాన్నీ పరిశీలించే నిశిత దృష్టిని కలిగించింది నాయుడుగారి శిష్యరికం.
కృష్ణశాస్త్రిగారు నాయుడుగారి నిశిష్టతని వివరిస్తూ
‘ఈ జడ జీవితమ్ము పలికించితి: వీ యఘపంకమందు నం
భోజము మొల్వజేసితి; వపూర్వము నీ దయ; ఈ నిశీథి నీ
రాజన మెత్తినావు; విపులమ్మగు నీ యెద నిండెనే శర
ద్రాజిత చంద్రకాంతు లమృతమ్ములు స్వర్గలతాంత వాసనల్ ‘
అన్నారు. సూఫీ చరితామృతాన్ని కళాశాల స్థాయిలోనే గురుదేవులనుంచి అధ్యయనం చేసిన కృష్ణశాస్త్రి తన కవితలో ఉదారాశయాలని, తత్వ దృష్టినీ అలవరచుకున్నారు.
విద్యారంగంలో, సాంఘికరంగంలో, సాంస్కృతిక రంగంలో అపూర్వ చైతన్యం తెచ్చిన బ్రహ్మసమాజం పవిత్రమైన శీలం, ఏకేశ్వరోపాసన, ప్రేమ, ఔదార్యం వంటి విలువలని ఆవిష్కరించింది. అనాథల జీవితంలో కొత్తకాంతులు వెలిగించింది. వసుధైక కుటుంబానికి రూపకల్పన చేసింది.
సంస్కరణ ఉద్యమాల ప్రభావంతో కృష్ణశాస్త్రిగారు హరిజనోద్యమంలోనూ కళావంతుల వివాహోద్యమంలోనూ పాల్గొన్నారు. బంధువులూ, బ్రాహ్మణులూ ఆయనని బహిష్కరించారు. బ్రహ్మసమాజం ఆయనని కవిగా తీర్చి దిద్దింది.
1923 కి పూర్వం వేంకట పార్వతీశ్వర కవుల ‘ ఏకాంతసేవ ‘ వెలువడింది. రాయప్రోలు సుబ్బారావుగారి కావ్య సంస్కారం, గురజాడవారి నవ్య ధోరణులూ, ఏకాంతసేవలోని భక్తి సౌందర్యం కృష్ణశాస్త్రిగారిని ప్రభావితం చేశాయి. తెలుగు కవితారంగంలో నవ్య రీతులకోసం ప్రయత్నాలు జరుగుతున్న కాలమది. 1923 లో సాహితీసమితి ఏర్పడింది. నవ్య కవిత్వాన్నీ ఒక ఉద్యమంగా చేసింది సాహితీసమితి. ‘సాహితి’ పత్రిక స్థాపనతో ఖండ కావ్యాలు విరివిగా ప్రచురింపబడ్డాయి. ఆంగ్ల విద్యా సంస్కారం గల తెలుగు యువతరాన్ని ఈ నవకవుల పద్యాలు బాగా ఆకర్షించాయి. సాహితీ సమితి కృష్ణశాస్త్రిని భావకవిని చేసింది.
గిడుగు రామమూర్తి పంతులుగారి వ్యావహారిక భాషా ఉద్యమం తెలుగు సారస్వత రంగంలో నవీనమైన మార్పులు తెచ్చింది. ఆంగ్ల కవితా ప్రపంచంలో వర్డ్స్ వర్త్ ప్రజల భాషలో రాయమని చెప్పినట్టుగా గిడుగువారు తెలుగు భాషని సంస్కరించుకోవలసిన ఆవశ్యకతని తెలియజెప్పారు. కృష్ణశాస్త్రిగారు ప్రయాణీక కవి. ఆంధ్రదేశంలోని అన్ని ఊళ్ళలో తనవీ, ఇతరులవీ పద్యాలు సభలలో చదివి భావ కవితకి ఉద్యమ రూపాన్నిచ్చారు. ఆ పర్యటనలో భాగంగానే పర్లాకిమిడిలో గిడుగువారికి కృష్ణశాస్త్రిగారు తమ పద్యాలు వినిపించారు. రామమూర్తి పంతులుగారి మెప్పు లభించింది. 1925లో ‘కృష్ణ పక్షం’ ప్రచురించారు.
నవ్యసాహిత్యానికి ఒక వేదిక కావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది సాహిత్యవేత్తలు 1933లో బరంపురంలో ‘అభినవాంధ్ర కవిపండిత సభ’ పేరుతో సమావేశమయ్యారు. దీనికి సూత్రధారి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు. డా.చిలుకూరి నారాయణరావుగారు ప్రథమ సభాధ్యక్షులు. వ్యావహారికాంధ్రాన్ని ఉపయోగించాలనీ, నవ్య రచనలని ప్రచారం చేయాలనీ, నవ్య రచనల బాగోగులని చర్చించాలనీ, నవ్య సాహిత్యం గురించిన అపోహలని తొలగించాలనీ, వచన వాజ్ఞ్మయాన్ని ప్రజలకి అందుబాటులోకి తేవాలనీ ఆకాంక్షించిన సంస్థ ఇది . 1942లో నవ్య సాహిత్య పరిషత్ సమావేశం ఏలూరులో జరిగింది. దీనికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు అధ్యక్షత వహించారు.
భావ కవిత్వానికి పెద్ద పీట వేసిన పత్రికలు ఎక్కువగా సాహిత్య సంస్థలు నడిపినవే. ఆంధ్రభారతి, ఆంధ్ర గ్రంథాలయ సర్వస్వము, అనసూయ, శారద మొదలైన పత్రికలలోని పద్యాలు కృష్ణశాస్త్రి వంటి యువకులు ఉత్సాహంతో చదివేవారు. ‘భారతి’ పత్రిక నవ్య సాహిత్యాన్ని ఆహ్వానించింది. 1925లో సాహితీసమితి పత్రిక ‘సఖి’, 1927లో విశ్వనాథవారి ‘జయంతి’ పత్రిక, కొంపెల్ల జనార్దనరావు నడిపిన ‘ఉదయిని’, పాటిబండ్ల మధవశర్మ ‘వీణ’, ముద్దుకృష్ణ ‘ జ్వాల’ వంటి పత్రికలు నవ్య సాహిత్యం కోసం నడిపినవే. కోలవెన్ను రామకోటేశ్వరరావుగారి ఆంగ్ల పత్రిక ‘త్రివేణి’ కూడా నవ్య కవిత్వానికి వేదికగా వ్యవహరించింది.
కృష్ణశాస్త్రిగారు స్వేచ్చాజీవి.ఆత్మాభిమానం ఎక్కువైన కారణం చేత ఎక్కడా స్థిరమైన ఉద్యోగం చేయలేదు. కాకినాడ మిషను స్కూలులో కొన్నాళ్ళు పనిచేసారు. 1932 నుంచి 1941 వరకు కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా పనిచేసారు. 1957 నుంచి 62 దాకా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సాహిత్య ప్రయోక్తగా పనిచేశారు. రేడియోకి ఎన్నో సంగీత రూపకాలు రచించారు. బుచ్చిబాబు, మునిమాణిక్యం నరసింహారావు వంటి రచయితలతో కలిసి రేడియోకి సాహిత్య పరిమళాలు అందించారు.
1925లో అక్కిరాజు ఉమాకాంతమ్గారు ‘ నేటికాలపు కవిత్వం’ గ్రంథంలో కృష్ణశాస్త్రిగారి కవిత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొత్త తరహా కవిత్వాన్ని పరిశీలించవలసిన పద్ధతిలో పరిశీలించకపోవడం వలన ఉమాకాంతమ్గారు ఆనందాన్ని అనుభవించలేకపోయారని కృష్ణశాస్త్రిగారు బాధపడ్డారు. ‘కొంత ఆర్ద్ర దృష్టితో, కవితా హృదయంతో ఆ విమర్శన సాగితే నేటి కాలపు కవిత్వంలో వారు చక్కదనమూ, కవిత్వ గుణమూ గ్రహించి ఉండేవారు ‘ అని రాశారు. ఊపిరాడనీయనంత కోపంతో దాడి చేసినవారికి సమాధానం చెప్పడం కంటే కొత్త పద్యాలు రాయడమే జవాబనే దృఢ సంకల్పంతో ‘ప్రవాసము’ – ఊర్వశి’ కావ్యాలూ ప్రకటించారు.
బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు, చింతా దీక్షితులు, చలం, మొక్కపాటి రామమూర్తి – వీళ్ళంతా మంచి స్నేహితులు. కాల్పనిక సౌందర్యానికి సన్నిహితులు. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వంటి ఆంగ్లకవితో పరిచయం ఏర్పడింది. హరీంద్రుని కావ్య పఠనం కృష్ణశాస్త్రిగారికి బాగా నచ్చింది. ఈయన కూడా నవకవుల పద్యాలు ఒక పద్ధతిలో కూర్చి సరికొత్త కావ్య పఠనానికి రూపం సిద్ధం చేశారు. ‘సంధ్యారాగం’ లోని ‘ఆగుమాగుమా తెరువరీ’ అన్న స్వాగతంతో ఆరంభించి, పింగలి-కాటూరి ‘తొలకరి’ లోని ‘కవితాసామగ్రి’ తరువాత చదివి, ఎంకి పాటలు పాడేవారు. ఊరూరా వాడవాడలా సభలూ సమావేశాలతో కవితా వసంతోత్సవాలే. దీని వలన భావకవిత్వం ఉద్యమమై నిలవడానికి కృష్ణశాస్త్రిగారి కృషి ఉందని తెలుస్తుంది.
1922లో కృష్ణశాస్త్రిగారి మొదటి భార్య మరణం ఆయనని అమితంగా కదిలించి ‘కన్నీరు’ ఖండకావ్యం రచించేలా చేసింది. ఆధ్యాత్మిక గురువు మొక్కపాటి రామమూర్తి మరణంతో ‘ప్రవాసం’ ఆయనకి అంకితమిచ్చారు. కూతురు సీత మరణం ఆయనని ఎంతాగానో కలచి వేసింది. ‘తిరుప్పావై’ కీర్తనలు రచించేలా చేసింది. బ్రహ్మర్షి నాయుడుగారి వియోగ వేదన కృష్ణశాస్త్రి కావ్య జీవితానికి ఊపిరి పోసింది.
కృష్ణశాస్త్రిగారు మంచి వక్త. సాహిత్యాన్ని గురించి అందంగా, విజ్ఞానదాయకంగా మాట్లాడి సభలని అలరింపజేసిన వక్తగా ఆయన పేరు పొందారు. నవ్య సాహిత్య పరిషత్తు సమావేశాలలో కానీ, కళాశాలల సాంస్కృతిక ఉత్సవాలలో కానీ ప్రాచీన ఆధునిక కవుల కావ్య సృజన గురించి, రీతుల గురించి అనర్గళంగా మాట్లాడగల ప్రతిభావంతులు. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు, వేల్చేరు నారాయణరావుగారు కృష్ణశాస్త్రిగారి వక్తృత్వాన్ని గురించి వివరించారు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలొ నన్నయగారి ‘వాడి మయూఖముల్ కలుగు వాడపరాంభుధి కుంకె’ అనే పద్యంలోని అందాలని గురించి, జానపద గీతాల నేపథ్యం గురించి ఆయన ప్రసంగించిన తీరు ప్రజలని ముగ్ధులను చేసిందనీ, కృష్ణశాస్త్రిగారికి ప్రాచీన సాహిత్యం పట్ల ఉన్న ఆధునిక దృష్టిని తమ ‘తెలుగులో కవితా విప్లవాలు’ సిద్ధాంత గ్రంథంలో తెలిపారు. విజయనగరంలో జరిగిన నవ్య సాహిత్య సమావేశంలో గొర్తి సూర్యనారాయణగారిని తెలుగుపండితులు భావకవుల కవిత్వాన్ని ఎద్దేవా చేస్తూ ప్రజలని రంజింపచేస్తూ హాస్యస్ఫోరకంగా ప్రసంగించారనీ, ఆ ప్రసంగాన్నితిప్పి కొడుతూ కృష్ణశాస్త్రిగారు తమ సహజ ధోరణిలో భావకవుల పద్యాలని భావస్ఫోరకంగా చదువుతూ, మృదువైన మాటలతో భావ కవితా సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రసంగించారనీ, అబ్బూరి వరద రాజేశ్వరరావు వివరించారు. వక్త భావకవిత్వానికి ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన కవి కృష్ణశాస్త్రి.
కృష్ణశాస్త్రిగారు స్వతహాగా హాస్యప్రియులు. ఆయన ప్రభావంతో కవిత్వం రాసే యువకులు ఆయనలాగా గిరజాలు పెంచేవారు. మెరుగు కళ్లజోళ్ళు పెట్టేవారు. పద్యం మీద మాత్రం శ్రద్ధ ఉండేది కాదు. ఆ ధోరణిని హేళన చేస్తూ కృష్ణశాస్త్రిగారు
‘మెరుగు కళ్ళజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవి లేవు
కవితయందు తప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ వినురవేమ ‘
అని చెప్పారు. చలం, అబ్బూరి రామకృష్ణారావు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటి కవుల సమావేశాలు నవ్వుల జల్లులు కురిపించాయి.
విజయనగరం, కాకినాడ కళాశాలలో విద్యని అభ్యసించే రోజులలో ‘విశ్వకవి’ రవీంద్రుని రచనలు చదివి,సౌందర్య దాహాన్ని గురించి అధ్యయనం చేశారు. గీతాంజలి, క్రియేటివ్ యూనిటీ, సాధన వంటి గ్రంథాలలోని సౌందర్యదృష్టి కృష్ణశాస్త్రిని ఆకర్షించింది. ఆంగ్ల కవిత్వాన్ని అధ్యయనం చేసి తెలుగు కవితకి నగిషీలు చెక్కినవారు కృష్ణశాస్త్రిగారు. ‘ఆంగ్లకవిత తెలుగుకవిత అద్భుతంగా సమ్మిళితమైన ఒక అపూర్వమైన సాహిత్య సమ్మేళనం కృష్ణశాస్త్రి’ అని ఆచంట జానకీరామ్ గారు అన్నారు.
1948లో మద్రాసు వెళ్ళిన కృష్ణశాస్త్రిగారు బి.ఎన్.రెడ్డి గారు దర్శకత్వం వహించిన కళాత్మక ‘ మల్లీశ్వరి ‘ సినిమాకి మాటలూ, పాటలూ రాసారు. అప్పటిదాకా పద్య రచనలో సిద్ధహస్తులై, చందస్సులో ఎన్నో మెలకువలు గ్రహించి, పద్యాన్ని పాటలా పాడుకునేలా తీర్చి దిద్ది పాటల కూర్పులోని రహస్యాన్ని గ్రహించారు. జానపద గేయాల నడకలూ, పల్లీయజన నుడికారాన్ని సన్నిహితంగా పరిశీలించి, మల్లీశ్వరి చిత్రానికి పాత్రోచిత సంభాషణలు రచించి సినిమాకి కావ్య గౌరవాన్ని తెచ్చారు. ప్రేమకథని ఉదాత్త కళాత్మక విలువలతో తీర్చి దిద్దడంలో కృష్ణశాస్త్రి తనవంతు బాధ్యతని సమర్థంగా నిర్వహించారు. అప్పటినుంచి చలనచిత్రాలకి పాటలు రాసి, పాట రచనలో తన ముద్రని వ్యక్తం చేయడమే కాక తెలుగుపాటకి మారుపేరై స్థిరపడ్డారు.
చక్కని మాటకారిగా, వక్తగా ఆంధ్రులని ఆనందింపచేసిన కృష్ణశాస్త్రిగారికి 1966లో గొంతు కేన్సర్ వచ్చి మరి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మూగబోయాక ఆయనకి మనుషుల పట్ల ఆసక్తి మరీ ఎక్కువైంది. ‘స్క్రిబ్లింగ్ పాడ్స్’ మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలూ, అనుభూతులూ మానవ మనస్తత్వం పట్ల ఆయనకి గల అవగాహనని స్పష్టం చేస్తాయి.
కౄష్ణశాస్త్రిగారు నిత్య యువకులు. ఎప్పుడూ యువతరం పట్ల ఆశావహంగా ఉండేవారు. శ్రీశ్రీ, పఠాభి, ఆరుద్ర వంటి నవ్య కవులపై ఆయన అభిప్రాయాలూ, యువకవులని ఆయన ప్రోత్సహించిన తీరూ భవిష్యత్తులో కవిత మరింత వికాస దృష్టితో ఉంటుందనీ, ఉండాలనీ ఆయన అభిలషించేవారని తెలుస్తుంది.
ప్రకృతిలో మానవ ప్రకృతిని దర్శించి, రచనలో ప్రదర్శించడం కృష్ణశాస్త్రిగారికి ఇష్టం. ఆయన ఒకచోట రాసుకున్నట్టు, ‘ఒకసారి హైదరాబాదు నుంచి మదరాసు వెళుతున్నాను కారులో. దారిలో నాగార్జునసాగర ప్రాంతాననో, దేవరకొండ ప్రాంతాననో ఒక ఎత్తైన కొండ ఉంది. ధుమధుమలాడుతూ, కనుబొమలు ముడుచుకొని తిక్కగా కొందరు మనుష్యుల లాగున ‘ అంటారు. ఆయన కవిత్వం అంతటా ప్రకృతి ప్రీతి కనిపిస్తుంది.
వైష్ణవ భక్తి, సూఫీ తత్వం, ఆంగ్ల కవితా సంస్కారం కృష్ణశాస్త్రిగారిలో సౌందర్య దృష్టిని నిశితం చేసింది. షెల్లీ, కీట్స్ వంటి కవుల పదాల కూర్పును తెలుగు కవిత్వంలో ప్రవేశపెట్టి, నూతన పోకడలకి దారి చూపించారు. వచనాన్ని కావ్య సరణిలో తీర్చి దిద్ది స్వీయానుభవాలని అందరూ పంచుకొని ఆనందించేలా రచనలు చేసారు.
తన రచనలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రభాత వాయువులా ప్రవేశించి, ప్రేమతత్వం సౌందర్య దృష్టితో ఆవిష్కరించి, తెలుగువారి హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన కృష్ణశాస్త్రిగారు 24-2-1980 తేదీన మదరాసులో మరణించారు. చివరిదాకా ఆయన పాటలు రాస్తూనే ఉండేవారు. గొంతు మూగవోయాక రాసిన పాటలు తెలుగువారి తీరుతెన్నులని మరింత ఆర్ద్రంగా చిత్రించినాయి.
కృష్ణశాస్త్రి సాహిత్యంలో వైవిధ్యంతో కూడిన రచనలున్నాయి.
తొలి పద్యకృతుల సంపుటి :
1.కృష్ణపక్షము
2. ప్రవాసము-ఊర్వశి
గేయనాటికలు:
1. శర్మిష్ఠ
2. ధనుర్దాసు
3. శ్రీవిద్యాపతి
4. కొత్తకోవెల
యక్షగానాలు:
1. క్షీరసాగర మథనం
2. విప్రనారాయణ
3. మాళవికాగ్నిమిత్రము
పద్యాలు:
1. ఋగ్వీధి
2. పల్లకీ
3. బదరిక
వచన రచనలు:
1. అప్పుడు పుట్టి ఉంటే
2. బహుకాల దర్శనం
3. పుష్పలావికలు
4. కృష్ణశాస్త్రి వ్యాసావళి ( 4 సంపుటాలు )
గేయసాహిత్యం:
1. అమృతవీణ (మహతి, కన్నీరు)
2. మంగళకాహళి
3. తిరుప్పావై కీర్తనలు
సినీ సాహిత్యం:
1. మేఘమాల
2. గోరింట
పైన పేర్కొన్న గ్రంథాలన్నీ సంపుటాలుగా వెలువడ్డాయి. రౌతు బుక్ డిపో, రాజమండ్రి వారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి సన్మాన సంఘం, మద్రాసు వారు, విశ్వోదయ ప్రచురణ, కావలి వారు, రాజహంస ప్రచురణలు మద్రాసు వారు, ఓరియంట్ లాంగ్మన్ హైదరాబాదు వారు కృష్ణశాస్త్రిగారి రచనలని ప్రచురించి తెలుగువారికందించారు.
రాజా, కాటూరి వేంకటేశ్వరరావుగారు, సూరి నారాయణమూర్తిగారు, ఆచంట జానకీరామ్గారు, పాలగుమ్మి పద్మరాజుగారు, బాలాంత్రపు రజనీకాంతరావుగారు, బాలాంత్రపు నళినీకాంతరావుగారు, కురుమెళ్ల వేంకటరావుగారు మొదలైన వారు కృష్ణశాస్త్రి గ్రంథాలు వెలుగు చూడటానికి కృషి చేసినవారు.
**** (*) ****
కృష్ణ శాస్త్రి గారి జీవితాన్ని వారి సాంస్కృతిక నేపధ్యాన్ని నేటితరానికి కంటికి అద్దినట్టు వివరించిన రామసూరి మాస్టారికి కృతజ్ఞతలు. కృష్ణశాస్త్రి గారికి విజయనగరానికి ఉన్న అనుబంధాన్ని చక్కగా వివరించారు. కాల్పనిక కవితకి రూపురేఖలు దిద్దిన గురజాడ వారిని ‘మహాకవి’ గా సంబోధించినది కృష్ణశాస్త్రిగారేనని చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కృష్ణశాస్త్రి పై చక్కని వ్యాసాలను ప్రచురించిన వాకిలికి కృతజ్ఞతలు.
వ్యాసం అద్భుతం,