వ్యాసాలు

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

నవంబర్ 2016

కృష్ణశాస్త్రి సాహిత్య జీవితం సౌందర్యాన్వేషణే. షెల్లీ, కీట్స్, టాగూర్ కృష్ణశాస్త్రికి బాటలు వేసినవారు. అందరూ సౌందర్యాన్ని అన్వేషించినవారే. ఆరాధించినవారే. కవిత్వమూ, కళలూ మనిషికి సౌందర్య పిపాస కలిగిస్తాయి. మనిషిని పరిపూర్ణ మానవుణ్ణి చేస్తాయి.

కీట్స్ సౌందర్యాన్వేషణ చేస్తూ,

‘Heard melodies are sweet, but those unheard
Are sweeter, therefore, ye soft Pipes, play on
Not to the sensual ear, but, more endeared,
Pipe to the spirit ditties of no tone’

మనం చెవులతో వినే సంగీతం కంటే భావించే సంగీతం మరీ తీయగా ఉంటుందంటున్నాడు. ఎలాంటి సంగీతం కావాలో అది అందనంత ఎత్తులో ఉంటుంది. ఆ శిఖరాలని అధిరోహించే ప్రస్థానమే సౌందర్య ప్రస్థానం. కృష్ణశాస్త్రి స్వేచ్ఛాయాత్రలో ‘దిగిరాను దిగిరాను దివి నుండి భువికి’ అన్నారు. మనస్సుని ఉన్నత శిఖరాలకి చేర్చాలనే తపన ఆయన కావ్యారంభంలోనే సూచించారు. ‘ In all arts men reach towards such an ideal and know that, though they can not even attain it, it provides a standard and criteria for what all they have’

వాస్తవానికి అటువంటి సంగీతం సులభంగా లభించేది కాదు. మనిషి క్రమవికాసాన్ని పొంది, అభిరుచిని సంస్కరించుకోగలగాలి. అప్పుడే ఆదర్శ సౌందర్యాన్ని అందుకోగలుగుతాడు. కళల ప్రధాన లక్షణమిదే. కాల్పనిక కళలు ఆలోచనలని కాదు రేకెత్తించేది. భావుకతని వృద్ధి చేస్తాయి.

హేతుబద్ధంగా అన్వేషించేది కాదు సత్యమంటే. భావన ద్వారా అన్వేషించాలి. కీట్స్ కడపటి వాస్తవం సౌందర్యమని అన్నాడు. అదే సత్యమని విశ్వసించాడు. అనంతత్వంలో విశ్వాసం సృజనకి పునాది.
షెల్లీ ‘Hymn to intellectual beauty’ అనే ఖండికలో ఇలా అంటాడు.

‘Men were immortal and Omnipotent,
Didst-thou, unknown awful as thou art
Keep with thy glorious train firm state
within his heart’

సర్వ వ్యాపితమూ, శాశ్వతమూ అయినదాన్ని అందుకునే ప్రయత్నాన్ని మనిషిలో కలిగించేది సౌందర్యం. ఇది అనంతమైన అన్వేషణ. ఎప్పటికప్పుడు కొత్తదనంతో పలకరించే సృష్టిరహస్యం. ‘Truth’s Call is the Call of beauty’ అంటారు టాగూర్. షెల్లీ గురించి రాస్తూ ఇంకా ఇలా అంటారు. ‘He had the Creative mind which could only approach truth through its joy in Creative effort.’ సత్యాన్ని గ్రహించాలంటే సృజనాత్మక హృదయం ఉండాలి. సృజనాత్మక ప్రయత్నంలో పొందే ఆనందంలో సత్యాన్ని దర్శించగలమని టాగూర్ అభిప్రాయం.
కవిది ఆరని చిచ్చు. తీరని తృష్ణ. అతనిని సంతృప్తి పరచే సుందర వస్తువు, అతనిని ఆనందింప చేసే ఆర్ద్ర ప్రేమ ఈ లోకంలో దొరకవు. అందుకే కృష్ణపక్ష కవి ‘వనరు చేడ్వగలేను, చచ్చి చావగలేను కనలేని వెలుగుకొరకై’ అన్నాడు.

ఎడతెగని అన్వేషణతో సౌందర్య సృజనకి తపిస్తున్నాడు కవి. ‘ఒక ఆంధ్రకవి కృష్ణపక్షంలో ప్రవాసియై తిరిగి తిరిగీ, కంటపడిన ప్రతి లావణ్యాన్నీ కదిపి కదిపీ, పక్కన మ్రోగిన ప్రతి హృదయాన్ని పలకరించి పలకరించీ, లోకంలో తనకు నచ్చిన సౌందర్యం లేదనీ, తన్ను ప్రేమించి తాను ప్రేమించే ప్రేయసి లేదనీ కుంగిపోయి కుంగిపోయీ ముచ్చిచ్చులో వేగి వేగి, ‘నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు’ అన్న నరకంలోకి వచ్చాక, తపస్సు పూర్తయ్యాక, శాంతచిత్తుడై తానే ప్రేయసిని సృష్టించుకున్నాడట’ అని కృష్ణశాస్త్రిగారు రాశారు.

అనంతత్వాన్ని ఆరాధించడమే సౌందర్యోపాసన. దీనికి దేశకాల సంబంధం ఉండదు. షెల్లీ కూడా సౌందర్య దర్శనం చేసిన సందర్భంలో ఇలా అంటాడు.

‘Never joy illumed my brow
Unlinked with hope that thou wouldst free
This World from its dark slavery;
That Thou – O awful loveliness -
Wouldst give Whatever these words can not express’

షెల్లీ పద్యంలో స్వేచ్ఛ కోసం మనిషి పడే ఆరాటం ఉంది. సమగ్రత కోసం తపన ఉంది. మానవ ప్రపంచాన్ని ఈ చీకటి బానిసత్వం నుంచి విముక్తను చేసేది అనంత సౌందర్యమే నంటాడు.

కృష్ణశాస్త్రి ఆదర్శ సౌందర్యం ఊర్వశి. భారతీయ సాహిత్యంలో ఊర్వశికి ప్రత్యేక స్థానం ఉంది. కాళిదాస మాహాకవి స్వర్గానికీ మానవ లోకానికీ ముడిపెడుతూ ప్రేమ, సౌందర్యాలు మనిషికి అవసరమని చెప్పాడు. ఊర్వశిని రవీంద్రుడు ‘అనంత యౌవనా’ అని కీర్తించాడు. మానవునిలో నిత్య చైతన్యాన్ని కలిగించే భావన యౌవనం. కాలంలో వచ్చే మార్పులని బట్టి శరీరానికి వార్ధక్యం తప్పదు. కానీ మనసుకి యౌవనాన్ని ఇచ్చేది సౌందర్య భావన. మనుషుల్లో సౌందర్య చేతన లోపిస్తే ప్రపంచం నిర్జీవమైపోతుంది. సృష్టి సౌందర్యానికి ఆనందించలేని మనిషి రాయిలా మిగిలిపోతాడు.

‘దారి తలలెత్తు నింత సౌందర్య లవము
వదలి పోలేరు చంపెడివరకు వీరు ‘

ప్రజలలో సౌందర్య భావం నశించింది. కనిపించే సౌందర్యాన్ని ఎలా ఉపయోగించుకుందామా అనే ఆలోచన తప్ప అనుభవించి ఆనందించే శక్తి లేదు. ఈ భావాన్ని చలంగారు ఇలా చెబుతున్నారు.

‘సౌందర్యం మీది భక్తి ఉంటుందని కూడా మరచిపోయినారు. గొప్ప కవులూ, కళారాధకులూ సౌందర్యాలన్నిటిలోకి సుందరమైనది సుందరమైన జీవితం అని విశ్వసించారు. దానికి సూత్రం సుందరమైన ఆత్మ’

మానవ జీవితానికి అందాన్నిచ్చే విలువలూ, పద్ధతులూ చూస్తే భరించలేని లోకాన్ని కృష్ణశాస్త్రి, చలం ఒక విధంగానే తిరస్కరించారు.

‘వాడిపోయిన ప్రతి సౌరభమ్ము కొరకు
కనుమొరంగిన ప్రతి హిమకణము కొరకు
బ్రతుకు బ్రతుకెల్ల కరగు బాష్పములు కాగ
ఎట్లు కననేర్తు నానాటి దృశ్యమేను’?

తన మనస్సుని తాకిన ప్రతి సౌందర్య ఖండాన్నీ, తన హృదయాన్ని పలికించిన ప్రతి ప్రేమ శకలాన్ని ఏరుకొని ఆదర్శ సౌందర్యాన్ని నిర్మించుకున్నాడు కవి. ఆమె ఊర్వశి. ‘మృదుల కరుణా మధురము నా హృదయము, ఎవ్వరెరుగజాలుదు రేమని యేడ్తునెపుడు’ దుఃఖంతో, ప్రవాసంతో మనస్సు పవిత్రమయ్యింది. అగ్ని శోధనతో, ఎడతెగని సాధనతో సృజన శక్తులు పక్వానికి వచ్చాయి. మనస్సు ఉన్నత స్థితికి చేరుకుంది.

ప్రేమించలేక పోయానన్న బాధతో కవిని, పాత జ్ఞాపకాలు బాధిస్తున్నాయి. ‘తుది మొదలులేనిదానాటి తొలి నిశీధపుం దమము; ఆఘాత మయ్యెది; అందు దారిలేదు; మిణుగు రేనియు కానరాదు; ఒకండ పొంచి యొదిగితి నేమూల మూలలందు’ అంటాడు. కృష్ణపక్షంలో, భార్య మరణించినప్పుడు కవి పాడిన ‘తుది మొదలు కానికానరానిది; మహాంధకార కలుషిత కృష్ణపక్షంపు వీధి’ జీవితం జ్ఞప్తికి వచ్చి కవిని మరింత వేదనకి గురి చేస్తోంది.

‘ఊర్వశి’ గీతాల ప్రారంభంలో కృష్ణశాస్త్రిగారు,

‘నా కఠిన పాదశిలల క్రిందబడి నలగి
పోయె నెన్నెన్నియో మల్లెపూలు మున్ను’

అని పాడారు. పాటలో విషాదపు జీర మనసుని కదిలిస్తుంది. కృష్ణపక్షంలో తన పూర్వానుభవాలని గుర్తు చేసుకుంటున్నాడు కవి. ‘తేటివలపు’ ఖండికలో మల్లెపూవుని పెళ్ళికూతురిని చేసిన తీగలు తుమ్మెదతో అంటాయి. ‘ఆర్ద్రచిత్తుడని బేల వరించేను నిను మల్లికా లలన, యెరుంగ దింత అనురాగము తేనెల తేటకంచు’

ఆ మాటలు విని తుమ్మెద,

‘తెనెలంగూర్చి వలపుల దేటపరచి
ధన్యురాలనయ్యె మీ చెలి తలిరుబోణీ!
కాని నిరతంబు మల్లిక కడనె యుండి
ముదము కూర్పగ మాకొక్క పూలె చెపుమ’

తీగలతో అంటుంది. చంచలమైన తుమ్మెద మనస్తత్వం కవికుమారునిలో కనిపిస్తుంది. స్వేచ్ఛాప్రణయం దుఃఖానికి దారితీసి కవిని ప్రవాసిని చేసింది.

రకరకాల అనుభవాలు మూటకట్టుకున్న కవిని వార్ధక్యం,మరణం కలవరపెడుతున్నాయి.

‘నా కనుల క్రాగు చీకట్లు ప్రాకుచోట
లేదు నెత్తావి, మధువేని లేదు, లేదు
ప్రాణ, మొక్క లావణ్య లవమ్ము లేదు
ఏను రుజనైతి, జరనైతి, మృత్యువైతి’

కామవాంఛకి సౌందర్యానురక్తి ఉండదు. కవికి అంత దుఃఖంలోనూ ఆశాకిరణంలా

‘ఈ నిశావసానమ్మున, ఏ శుభాని
లమ్ము నిట్టూర్చెనో జాలిరాగనేడు
వ్రాలె నా పాడు అడుగుల మ్రోలనొక్క
తారయే, యొక్క దివ్యమందార సుమమె’

స్వర్గ సౌందర్యానికి ప్రతీకగా ఊర్వశిని సృష్టించుకున్నారు కృష్ణశాస్త్రి. ‘In the Poetical Compositions that followed Pravasam (Exile) and Urvasi – I attempted to offer an insight into values realized in the course of the earlier search for love and its fulfillment.’ అని అంటారు కృష్ణశాస్త్రి

మానవ విలువలు, ప్రేమవికాసం, వీటి అన్వేషణకి అంతర్దృష్టి అవసరం. అది కృష్ణశాస్త్రికి పుష్కలంగా ఉంది.

‘మోహినీ హాసమల్లీ ప్రఫుల్ల రుచియె, శ్రీ లలిత వైజయంతీ పరిమళమ్మో, హర జటా పారిజాత లంతాంత మధువె’ అందుకోలేని అందం ఊర్వశిది. ఆమె దర్శనంతో నిర్దయతో పదునెక్కిన ఈ నీచమైన గోళ్ల కొసలు కూడా పరవశంతో చలించి పోతున్నాయంటాడు కవి. గత జీవితంలో తన క్రూర ప్రవృత్తి కవిని చలింప చేస్తోంది.

‘త్రిజగతీ పతి కోటీర దివ్య రత్న
రాజి నేలు వజ్రాల తురాయి నీవు!
ఏనొ పాతాళలోకంపు టిరుకు సందు
లందు దిగబ్రాక వెరచు గాఢాంధ రేఖను’

మానసిక సంఘర్షణ కవి మనస్సుని ఉన్నతీకరిస్తోంది. కవి శృంగార బాధ అంతా సౌందర్యాన్వేషణే. ఒకనాడు విర్రవీగి స్త్రీని పతనం చేసిన కవి నేడు ఆమెని ఉన్నతమైన స్థితిలో దర్శించి, ఆత్మౌన్నత్యాన్ని సాధించే తపనలో తనని తాను కుంచింప చేసుకుంటున్నాడు. ‘పతిత నెట్లౌదు, నేనెటు పక్షినౌదు’ నంటాడు. ఐక్యం కుదిరేలా లేదు.

‘ఇన్ని కల్పాలు కాలు నాయెద నడంగి
నాకు ప్రాణమె యగు వేదనా సుఖమ్ము
ఇదె పలుకరించు, నా సఖీ ఇపుడు నీ య
పూర్వ కరుణార్ద్ర నీరవమూర్తి యగుచు’

యుగయుగాలుగా మానవుడు తనలో దాగిన సౌందర్యాన్ని తానే గ్రహింపలేకుండా ఉన్నాడు. కారణం. అహంకారం, అధికారం, మదం, గర్వం – ఇవన్నీ మనిషిని అసహ్యంగా తయారు చేస్తున్నాయి. భౌతికాన్వేషణ ఊపిరిగా బ్రతుకుతూ సుఖాల వెంట పరుగులు తీస్తూ తీవ్రమైన అఘాతానికి గురౌతున్నాడు. ఇప్పుడు కవికి ప్రాణమైన వేదనా సుఖం తన ప్రేయసిని కరుణార్ద్ర నీరవమూర్తిగా పరిచయం చేస్తోంది.

‘నే కురియ లేని మూగకన్నీరు యుగయు
గాల నేత్రాల యశ్రువర్షాలు, కడుగ
చల్లగా జాలిజాలిగా శాంతమధుర
ముగ నుషఃకాల కౌముది సొగసువైతి’

కృష్ణపక్షం చివరి రోజులలో ఉషఃకాలంలో వెన్నెల మెరిసిపోతూ ఉంటుంది. సౌందర్య సాక్షాత్కారం ప్రారంభమయింది. చీకటి, వెలుగు మానవ జీవితంలో సహజం. చీకటిని భరించటమంటే వెలుగుని అన్వేషించటం, తపస్సు, దుఃఖమంతా కన్నీటి శిల్పమై, సౌందర్యంగా, రసాధిదేవతగా సాక్షాత్కరిస్తుంటే, కృష్ణశాస్త్రి

‘ప్రేయసీ! వీని కృపణ జీవిత గళమ్ము
ఎండ వానల చివికి పోయినది, జీర
వారునో, మూగవోవునో, వడకి వెలితి
యౌనొ, పాడదో’ యను సందియమ్ము వలదు’

అంటాడు. ఆమె దయావీక్షణాలతో తను రచించే కవిత్వంలో ‘మూడు లోకాల సుఖమొక్క ముడినిమిడ్చి విసరలేనొ కాలాంతమే వెనుక ప్రాక!’ అని ఆత్మ విశ్వాసాన్ని ప్రకటిస్తాడు ప్రణయోపాసకుడు.

‘మత్సురానేక పుణ్య జన్మములు పండి
జాహ్నవీ స్వచ్చవును సుధాస్వాదుమూర్తి
వైన నీ దివ్య సాన్నిధ్య మందుకొంటి
పుడమికిన్ స్వర్గమున కొక్క ముడి రచించి’

అని నాయని సుబ్బారావుగారంటే, వేదుల తన ప్రేయసిని గురించి,
‘ఆమె మూడులోకాల కళ్యాణమునకు
అవతరించిన యొక పవిత్రానుభావము’

అంటారు. ‘ఎంకెవ్వరని ఎవరైన అడిగితే, ఎలుగునీడల కేసి ఏలు సూపింతు’ నన్నాడు నండూరి.

భావకవులు నాయని, నండూరి, వేదుల, కృష్ణశాస్త్రి నలుగురూ ఒకే రకమైన అనుభవాన్ని ఎవరి పద్ధతుల్లో వారు చెప్పినవారు. విశ్వ రహస్యాన్ని, మానవుని అనంతవేదనని భావన ద్వారా చెప్పినవారు. ప్రేమని ఉపాసించి సౌందర్యాన్ని అందుకున్నవారు.

‘నాడు ‘శాఫో’ విరహ కంఠనాళ వేణు
వాలపించిన యరుణారుణాంచ గీతి
యేడ్చు, నిట్టూర్పు, కోపించు నిపుడు సంధ్య
యటుల, కాల విశాల విహాయసమున’

అంటాడు కవి. విరహగీతాల శాశ్వతత్వాన్ని వివరిస్తూ ‘శాఫో’ అనే గ్రీకు కవయిత్రి విరహంలో తన కంఠనాళాన్ని వేణువుని చేసి పాడిన అరుణారుణాంధ గీతి ఎర్రని సంధ్యలా కాల విశాలాకాశంలో పలకరిస్తోందని అంటున్నాడు. ఊర్వశితో ఇంకా ఇలా అంటాడు. ‘యుష్మదీయ చరణ మస్వణారుణోదయ సురభి కాంతి’ తన గీతాలలో ఆరని వెలుగుగా చేర్చికొంటానని ఆరాట పడుతున్నాడు.

అసలు ఊర్వశి అంటేనే సౌందర్య తత్త్వం. చలంగారు కూడా ‘పురూరవ’ నాటకంలో ఈ తత్త్వాన్ని నిరూపించారు. అందులో ఊర్వశి ఇలా అంటుంది. ‘సౌందర్యాన్నే అనుభవించటం నేర్చుకొన్ననాడు స్వర్గమే నీ కరతలామలకం’ అని. పురూరవుడు ఎలా నేర్చుకోగలను అంటాడు. ఊర్వశి ‘అదో విద్య కాదోయి. ఎదగాలి. ఆ జ్ఞానంలోకి’ అని అంటూంది. ఈ సంభాషణంలో తేలిన దేమిటంటే శరీరాల కలయిక భౌతికానందాన్ని, హృదయాల కలయిక అలౌకికానందాన్ని కలిగిస్తాయని. శృంగారంలో ఉండే ఔన్నత్యమే సౌందర్యమని చలం భావన.

ప్రేమ గురించీ, స్త్రీ సౌందర్యాన్ని గురించీ చలం పురూరవ నాటకంలో ఊర్వశి చేత ఇలా అనిపిస్తారు. ‘ప్రేమంటే ఆశించి, స్త్రీ నీ ఆలింగనంలోకి వస్తే ఏ భారం లేకుండా అనుభవించడ మనుకున్నావా? కంటికి బాగున్న స్త్రీ నల్లా నీ పాన్పు మీదకి రమ్మని ఆహ్వానించడ మనుకున్నావా? కాదు. స్త్రీ సౌందర్యం – పురుషుణ్ణి కాల్చి మెడవంచి కళ్లు తెరవడానికి. అతని ఆత్మని అతనికి చూపడానికి.’

యుగాల ఫలితమైన పురూరవుని శృంగార వాంఛ ఊర్వశి రూపంలో వచ్చిందని చలం అంటారు. ఈ సృష్టి, ఈశ్వరుడు, ఎంత వాస్తవమో తన ప్రేమ అంత వాస్తవమని ఊర్వశి పురూరవునికి చెపుతుంది. తీవ్రమైన, భేదమైన, అగ్నితుల్యమైన విషాదంలోంచి తప్ప నేర్చుకోలేడు మానవుడు. అందువల్లనే మానవలోకంలో ఇంత వియోగం, అశాంతి, బాధ.

అందరానిది అందుకోవాలని మానవుడు పడే ఆవేదనకి అర్థం చెప్పిన నాటకం చలం పురూరవ.

కృష్ణశాస్త్రి, చలం ఇద్దరూ రొమాంటిసిస్ట్లే. ప్రేమకోసం, స్వేచ్ఛకోసం తపన పడ్డ వాళ్లే. ఆత్మసౌందర్యం కోసం అన్వేషించినవాళ్లే. తమని తాము సంస్కరించుకొనే ప్రయత్నంలో సాహిత్య సృజన చేసినవాళ్లు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొనే ఆరాటంలో విలువలని గౌరవించినవాళ్లు.

‘నేటి తెలుగుకవికి ఊర్వశి అంటే లోపం లేని ఆనందం. కలత లేని శాంతి. అమృతం. ఊర్వశిని ప్రేమిస్తే లోకంలో ఎవరినీ ప్రేమించలేకుండా ఉండలేమంటాడు’ అని అంటారు కృష్ణశాస్త్రి.

భావనతో సృష్టించుకున్న ప్రేయసి ఊర్వశి. వ్యక్తిగత ప్రేమని విశ్వప్రేమగా మలచి సౌందర్య రూపంలో కవి ఆరాధించిన అపురూప లావణ్యరాశి ఊర్వశి. కవి తన హృదయంలోని ఊర్వశిని చూడటానికి సిగ్గు పడుతున్నాడు. పూర్వానుభవాలు కవిని భ్రాంతిలో పడేశాయి. అహంకారం కరిగి పోయాక అందులోంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఊర్వశి దర్శనమిస్తోంది. కవితో ఇలా అంటుంది.

‘తొలి వియోగిని నేనె! తొలి ప్రేయసిని నేనె!
ఆనాటి కేనాటి కేను నీ దాననే’

సౌందర్యం మానవ హృదయంలోనే దాగి ఉంటుంది. ఎవరి అభిరుచిని బట్టి వారు దాన్ని చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. ఈ సౌందర్యానుభూతితో తపించిన కవి ఊర్వశిని గుర్తించాడు.

‘మున్నీటి తరగలకు మిన్నేటి నురుగులకు
తడయు నెడబాటౌనె! విడని కౌగిలి నేనె!
వాన చినుకుగ సొగసి వలపు చూపుగ నెగసి
పడిపోవుదును నేనె! పరువులిడుదును నేనె!’

కవి కోసం ఊర్వశి దిగిరావడంలోనే ‘మిసిమి వన్నెల మేన మసి జాలిగానయ్యె’ అన్నది. లోక సంగ్రహార్థం అయిన ఊర్వశి పాట కవికి తనను తాను తెలుసుకొనేలా చేసింది. ఆమె పాటని ఉద్దేశ్యించి కవి,

‘నీవు తేనియ గొంతెత్తి తేని, నీ క
పోలములు చిరునవ్వు నేత్రాలు కూడ
మరచి సర్వమ్ము, సొగసుగా శిరసు ద్రిప్పు
చెందులకొ పాడినట్లుండు నేదొ యేదొ!’

అని అంటాడు. ఆమె పాటని కవి భావిస్తూ ఆమె పిలిచినట్టుగా, పాడినట్టుగా ఆనందిస్తూ ఉంటాడు.

కవి ఊర్వశి పాటగురించి చెప్పిన తర్వాత ఆమె కళ్లలోని భావాలని గురించి చెపుతాడు. అనంత సౌందర్యమైన ప్రకృతి ఎంత గంభీరమైనదో ఆమె కనులలోని భావాలు అంత గంభీరమైనవి. ‘ఏదియో అపూర్వ మధుర రక్తి స్పురియించుగాని అర్ధమ్ముగాని భావగీతమ్ము లవి.’ భావ కవిత్వ సారాంశమంతా ఈ వాక్యంలో ఉంది. భావ కవిత్వం అర్థ తాత్పర్యాలకి లొంగేది కాదు. దీనిలో భావనకే ప్రాధాన్యత. పాటగా కనిపించిన సౌందర్య దేవతని చూడగానే కవికి జీవితరహస్యం బోధపడింది.

‘ఎదలోపలి యెదలో, నె
మ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో
వదలని కోరికవై, నా
బ్రదుకు బరువు లెల్ల పాట పాడింతు సఖీ!’

కృష్ణశాస్త్రి హృదయం సౌందర్యంతో నిండిపోతుంటే తన బ్రతుకు బరువులెల్ల పాటలా పలుకుతుంటే, కవిలోని కళాకారుని గొంతు ముడి విడిపోతుంది.

‘నీ యాజ్ఞ కూడెనా, గొంతు ముడి వీడెనా
హాయిగా యుగయుగంబుల కలల్ పాడనా!
చిర గాఢనిద్ర మేల్కొలిపి సందేశాలు
పరపనా దిక్కు దిక్కులకు చుక్కలకు!’

అని అంటాడు. గొప్ప కళ ఎప్పుడూ శాశ్వతత్వాన్ని కోరుతుంది. కవి హృదయంలో చిరకాలంగా నిద్రించే కలలు ఆనందగీతాలు పాడతాయి. యుగయుగాల ఆవేగంతో, ఆనందంతో, ఆశతో, ఆశయాలతో, వివిధానుభవాలతో ఊర్వశిని చేశారు. అందుకే కవి ఊర్వశిని ఆరాధిస్తాడు.

‘ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు!
ఆమె నవసాంధ్య సమయ మల్లీ మనోజ్ఞ
కుసుమకామిని ; ఎదొ వింత కోర్కె తీయ
దనపు వేదన నా జీవితమున రేపు’

అంటాడు కవి. జీవితాన్ని రసమయం చేసుకోవడమే కవి వాంఛ. దానినే తీయదనపు వేదన అంటున్నాడు. కవి భావార్థ హృదయుడు, ప్రణయరాజరాజేశ్వరుడూ అయ్యాడు. అప్సరస ఊర్వశి ప్రేమ భావనకి ప్రతీక.

కృష్ణశాస్త్రిగారు ప్రేయసిని సృష్టించుకోవడం గురించి ఇలా అంటారు. ‘నేను విధాత అంతవాణ్ణి. అతడు సరస్వతిని సృష్టించుకున్నాడు. ప్రేమించాడు. ప్రేమింపబడ్డాడు. నేనూ అంతే.’ అని. కళకీ, ప్రేమకీ ఉన్న సంబంధాన్ని చెప్పారు. సృజనాత్మక ఆదర్శం, సౌందర్యం విధాతకి సరస్వతి అయితే కవికి ఊర్వశి. ఆమె ప్రేమ స్వరూపిణి. కని హృదయాన్ని సౌందర్యమయం చేస్తుంది.

‘ఊర్వశి పుట్టుకను గురించి రెండు గాథలున్నాయి. క్షీరసాగర గర్భంలోంచి అప్సరసలు అందరితో జన్మించింది. అన్నది ఒకటి. రవీంద్రుడు ఇదే అంటాడు. ఒక చేతిలో సుధాపాత్రతో, ఒక చేతిలో విషభాంఢంతో అవతరించావనీ అంటాడు. ఆంధ్రకవికి అప్సరసలు అందరితో ఊర్వశి పుట్టింది అన్న మాట గిట్టదు. ఇక రెండో గాథ. బదరికాశ్రమంలో నారాయణదేవుడు తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు వెర్రివాడు. ఆయన మనస్సు కలపెట్టడానికని వసంత మన్మథాదులు ఆసరాగా రంభాద్యప్సరసలని పంపుతాడు. నారాయణదేవుడు చిరునవ్వు నవ్వి ఊరువు (తొడ) లోంచి ఏదో తీసి అచ్చరల కెదురుగా విసురుతాడు. అది ఊర్వశిగా నిలుస్తుంది. రంభ వెలవెలబోతుంది. రంభ సిగ్గుపడుతుంది. రంభ సౌందర్యం లౌకికం. వాడి పోగలదు. ఊర్వశి సౌందర్యం అలౌకికం. సత్యం. అనంత యౌవన ఊర్వశి’ తెలుగుకవికి రెండవ గాథ ఇష్టమని కృష్ణశాస్త్రిగారు అన్నారు.

ఊర్వశిని శాశ్వత స్త్రీ అన్నారు రవీంద్రుడు. నహోమాతా, నహోకన్యా, నహోవధూ అని కూడా అన్నారు. విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలిసిన ఊర్వశి యుగయుగాలవీ, చతుర్దశ భువనాలవీ అశ్రువులు కడగగా కడగగా సుందరతరం, దివ్యతరం, ఉజ్వలతరం అయిపోతూ ఉన్న ఆదర్శ సౌందర్యం ఊర్వశి.

‘నీ కనుచూపు చీకటుల నీడల
నాయెద నిల్వలేదు, పే
రాకలి గొన్న నా బ్రతుకునందు
త్వదీయ మనోజ్ఞ హాసరే
ఖాకమనీయ కాంతి సుధ
కాల్వలుకట్టగలేదు, కానియే
మో గలగున్ మనమ్ము
వలపుం దమకమ్మున నిందలంచినన్’

ఊర్వశి సౌందర్యం తలచుకున్నప్పుడు కవి మనస్సు అశాంతికి లోనవుతుంది. ప్రేమతో పర్యవసించిన ఆదర్శం సౌందర్యమై సాక్షాత్కరిస్తోంది. నూతన వియోగంతో బాధపడే దీనుడైన కవిని అనురాగంతో చూస్తోంది ఊర్వశి. విశ్వసౌందర్యం కవి భావనలో మానవ రూపాన్ని ధరించింది. ఆమె అతని జీవితంలో చైత్ర ఋతువులా ప్రవేశించింది.

‘నా బ్రతుకు నేడు నందన చైత్ర వనమౌనొ
ప్రాభాత గగన పూర్వ ప్రాంగణమ్మౌనొ!
చెర తొలగు జీవమో!
మరపు విడు తేజమో!’

ఊర్వశి ప్రేమపిపాసి. జీవితంలో పాటలా, పక్షిలా ప్రవేశించి కొత్త ఆశని, కొత్త హాయిని కలిగిస్తోంది.

కని కన్న స్వప్నాలన్నీ వెలుగు రూపాన్ని ధరించినాయి. జీర్ణజీవిత ప్రాంగణంలో వసంత విలాస మధుర్యమూ, ఉషఃకల్యాణ లావణ్యమూ ప్రవేశించినాయి. అప్పటి తన స్థితిని కవి ఇలా పాడుకుంటున్నాడు.

‘నేడు నా జీవితము కూడ నిర్జరాంగ
నా దరస్మితమయి ప్రపంచాలు ప్రాకు!
పిలుచునేరేడు లోకాల ప్రేమకొరకు!
పరపు నాహృదయము చరాచరములకును’

సృష్టిలో ప్రతిపదార్థమూ ఉన్నత దశని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆత్మవికాసమే మనిషికి సౌందర్యాన్నిస్తుంది.

భావ కవిత్వంలో ప్రధానమైన మరో అంశం అద్భుత సృజన. ప్రతి విషయాన్ని లోపలికి పెల్లగించి చూసి అసలు తత్త్వాన్ని భావనతో అన్వేషించటం. కృష్ణశాస్త్రి ఊర్వశి అద్భుత సృజనే ఆత్మావలోకనమే. ఆనందభావనే.

‘ప్రతి పదార్థమ్ములోని రూపమ్ము వరకు
అసలు తత్త్వమ్ము కొరకు ప్రయాణమౌ మ
నస్సునకు అడ్డు కంచెలన్నవియె లేవు’

ప్రేమ అసలు తత్త్వం అన్వేషణలో పడ్డ కవి దుఃఖానికి గురై హృదయాన్ని క్షాళన చేసి విశ్వసౌందర్యాన్ని దర్శించి, ప్రేమని విశ్వవ్యాపితం చేస్తున్నాడు.

కవి హృదయంలో ‘విశ్వ వీణాగళమ్ము భోరుభోరున’ మ్రోత పెడుతోంది. విశ్వప్రేమని ఉపాసిస్తున్నాడు. అనుభవాలతో అణగారిన పరిస్థితి కవిది. కారుచీకటిలో ప్రయాణించినవాడు కవి. ఊర్వశితో అంటున్నాడు.

‘కరుణచే వలపుచే తరళమైనా నీవు
బిడియాన నిరులలొ బడి యేడ్చినా నేను’

ఆమె కరుణని చూసి కవి సిగ్గుపడుతున్నాడు. దయా స్వరూపిణియైన విశ్వప్రేయసితో ‘కలుగునా నాకు నీ వియోగమ్ము సకియ’ అని ప్రశ్నిస్తున్నాడు. సౌందర్యం కోసం అన్వేషించి ‘ఎంత దిగజారి దిగజారి ఎంత వెదకి వెదకి పడినవొ, పెంధూళి కదలలేక వెలుగులేక యెగురలేక వీని కనులె శిలలు గాక, వదలని కౌగిలి పెనంగ చెదరు గాక లజ్జా గాఢ వేదనాగ్ని! ‘ అని అంటాడు.

కవి ఊహలకి అతీతమైన ఆనందానికై అర్రులు చాచే ఆశాజీవి. ముద్దుకృష్ణ మాటల్లో చెప్పాలంటే, ‘ఆశయాలలో, అనుభవాలలో కొత్తదనమూ, విశేషప్రత్యేకత ఉన్నవాడు కృష్ణశాస్త్రి. ప్రేమకై విదాహం పొందాడు. విరహంలో వేగిపోయాడు.’
భావకవిగా కృష్ణశాస్త్రి విశిష్టత ఆయన సౌందర్యాన్వేషణలో కనిపిస్తుంది. ప్రేమకై ఆయన పడిన ఆరాటం, ప్రకృతిలో సమన్వయించుకున్న తీరు, కాల్పనిక సౌందర్య దృష్టి పట్ల ఆయనకి గల అవగాహన తేట తెల్లమవుతుంది.

‘నిదురలో స్వప్నాల కదలికే బరువైన
కలలెల్ల కనువిచ్చి కాల్చు నాగతియేమి
బ్రదుకులో భావాల పరిమళమె బరువైన
భావాలె పరువమై బ్రతుకు నా గతి యేమి’

మధురమైన బాధ, కాల్చే తియ్యదనం, తియ్యతేనియ బరువు కృష్ణశాస్త్రి కవిత్వానికి ఆధునికతని సంతరింప జేశాయి. లోకాతీతమైన పరమసత్యాలని ఇంద్రియానుభవం ద్వారా ఆవిష్కరించటం కృష్ణశాస్త్రి ప్రత్యేకత. స్వప్నాల కదలికలో ఉండే బరువునీ, భావాల పరిమళాల బరువునీ అనుభవించి అక్షరీకరించటం కృష్ణశాస్త్రి కవితాశిల్పం. ఆయన విశ్వప్రేమ భావనలోంచి ‘కలదు నాలోన క్షీరసాగరము నేడు’ 52 అంటాడు. ‘ఆనందమూ, అనురాగమూ లోపల నిండి ఉన్నప్పుడు మన హృదయం మెత్తబడి మెత్తబడి క్షీరమై, మంచై, పాలమంచు కాలవై ఊరికే ప్రతి వస్తువు మీద కురుస్తుంది. – అది అలాంటి అశ్రువు! ఊర్వశినాది, ప్రేమ అందరిదీని.’ అంటారు కృష్ణశాస్త్రి.

ప్రపంచంలో ప్రతి మానవునికీ కారుణ్య దృష్టి ఉండాలని కృష్ణశాస్త్రి మతం. అది ప్రేమని వెలిగిస్తుంది. కన్నీరు కావ్యానికి ప్రేరణ అయినట్లుగానే కావ్యం పాఠకుల చేత కన్నీరు కార్పించాలని కృష్ణశాస్త్రి కవితా సిద్ధాంతం. ఏ తత్త్వవేత్త అయినా ప్రపంచం బాధని తాను అనుభవించీ, జీవిత సత్యాన్ని అన్వేషించీ ఆనందాన్ని ప్రపంచానికి అందించాలని తపిస్తాడు. యుగయుగాలుగా ఈశ్వరయోధులైన సంస్కర్తలు, మానవతావాదులు సాగించిన ప్రస్థానమే సత్యాన్వేషణం. కృష్ణశాస్త్రి తన సౌందర్య ప్రస్థానంలో పడిన తపన ఇదే.

కవికి స్వప్నం వస్తుంది. స్వప్నం వంటి సత్యం. ‘నిశా నిటలాంత సీమ శ్యామల లలితాలసాలకల’ నుంచి కవి కనురెప్ప సెజ్జల మీద వాలుతుంది. ఆ కలలో కవీ, ఊర్వశి నందన వీధులలోకి వెళ్ళిపోయారు. అపుడు ఊర్వశి

‘ప్రియతమా! దాసి అక్షయ ప్రేమసేవ
కీలతాంతాలు మొత్తాలు చాలునోయి!
నింగి మూలలె నీలిపందిళ్లు పరచి
ఎంత తెలిమల్లె తోట వేయించినానొ’

అంటుంది. ఈ విధంగా ఊర్వశి సంయోగం స్వప్నావస్థలో లభించినట్లు కృష్ణశాస్త్రి చిత్రించారు.

ఊర్వశి శాశ్వతమైన సౌందర్యం. కృష్ణశాస్త్రికి స్త్రీపట్ల, ప్రేమపట్ల ఆదర్శ దృష్టి ఉంది. మృదుభావన ఉంది. ప్రేమ మనిషికి శక్తినిస్తుంది. శిశిరంలా పడిఉన్న కవి హృదయంలో వసంతంలా ప్రవేశించింది ఊర్వశి.

‘విడని వాసన పదములు విరులెయయ్యె
ఆననమ్మున నశ్రులే యారవయ్యె
నిలిచినాడ నేటికి కూడ తొలి వసంత
కాలపు ప్రభాత తరుణ వృక్షమ్ము కరణి!’

అనుకుంటాడు కవి. సృష్టిలో కనిపించే వస్తువులన్నింటికీ ఏదో అమరిక ఉంటుంది ఆ అమరిక అర్థం కాకపోవడంతో ప్రపంచం అసమగ్రమౌతోంది. అసమగ్రతలోంచి దుఃఖం. భావకవులు ఆ అమరికని అన్వేషించడానికీ అంతర్దృష్టిని అలవరుచుకున్నారు. అంతర్దృష్టి భావనకి మెరుగు పెడుతుంది. కవి శాశ్వత సౌందర్యాన్వేషణలో సృష్టిమూలాల కేసి దృష్టిని సారించాడు. కవి తొలివసంత కాలపు ప్రభాతవృక్షమయ్యాడు. అన్వేషణ పూర్తయ్యింది.

‘The Romantics thought that beauty is a final quality of reality revealed through visible things’

కాల్పనిక కవులు దృశ్యమాన వస్తువుల ద్వారా అదృశ్య ప్రపంచాన్ని అన్వేషించే ప్రయత్నంలో కడపటి వాస్తవ గుణం సౌందర్యమని విశ్వసించారు.

కవి దయాపూరితమైన హృదయంలోంచి కన్నీరు పువ్వులుగా, పాటలుగా రాలతాయి.

‘నావలెనె యాతడున్మత్త భావశాలి,
ఆగికోలేడు రేగు నూహల నొకింత
ఎట్టి నిశి నేనదరిపోవు నెగసిపడును!’

భావకవి ప్రవృత్తిని గురించిన గొప్ప సత్యం ఇందులో ఉంది. ఎగసి పడడమనేది భావకవి జీవ లక్షణం. ప్రకృతిలో తాదాత్మ్యానికి తహతహలాడే ఆవేశం భావకవిని సృష్టితత్త్వాన్ని గ్రహించేలా చేస్తుంది

‘ఇంత చిరుగీతి యెద వేగిరించు నేని
పాడుకొనును, తాండవ నృత్య మాడుకొనును;
మస్తక మ్మోరగా వంచి మన్నుమిన్ను
వేయి కేలాడగా వ్రాసి వేసికొనును!
ఏనెరుంగుదు నావలెనే యతండు
పాట పదములకై నిత్య పథికుడయ్యె!’

భావకవిత్వం అంటే పాట. బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, కృష్ణశాస్త్రి – వీళ్ల దృష్టిలో కవిత్వం అంటే పాట. జీవితం అంటే పాట. కిక్కిరిసిన అనుభవాలతో బరువెక్కిన హృదయాలని పాటతోనే దింపుకునే వాళ్లు. పాటల రహదారుల్లో నిత్యపథికులు వీళ్లు. ఈ లక్షణం వల్లనే భావకవిత్వం ఉద్యమరూపాన్ని ధరించి రెండు దశాబ్దాల పాటు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించింది.

‘ఈ వియోగ నిరాశాక్ష
ణ క్షణ ప్రతీక్ష చెదరి
ఎగసి ఎగసి పగిలి పోదునో! ‘

అని ప్రేయసి కోసమే కాదు, పాటకోసమూ అంత తపన పడతాడు.

కృష్ణశాస్త్రిగారు కృష్ణపక్షము – ప్రవాసము – ఊర్వశి కావ్యాలలో ప్రేమానుభవంతో పాటు అంతర్లీనంగా సృజనాత్మక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, కవిత్వాన్ని సంగీత స్థాయికి తెచ్చి సరస్వతిలో లీనమై పోవాలని తపిస్తున్నారు. ‘All art aspires to the condition of Music’ అంటాడు వాల్టర్ పీటర్. కృష్ణశాస్త్రి కవితలో ఉన్న గానగుణం ఆయన కవిత్వాన్ని సంగీత స్థాయికి తెచ్చింది. ఆయన సాహిత్య రసవేత్త. సంగీత రసవేత్త.

కాల్పనిక సౌందర్య శాస్త్రములో కవి తన ఆత్మానుభవాన్ని వ్యక్తం చేయడమే కాక, కళాకారునిగా సృజనాత్మక అనుభవాన్ని కూడా వ్యక్తం చేయడం ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. కృష్ణశాస్త్రి తన సౌందర్య ప్రస్థానంలో ఇది నెరవేర్చారు.

సృష్టితత్త్వాన్ని ఆకళించుకొని, ‘మూడులోకాల బరువుల మోత నడగి యడగి చిదికెను గద అంధజడము తాను’ గ్రహించాడు కవి.

‘ఈ మిడిసిపాటు నీ మ్రోల నేల, తేనె
తేట చినుకేని లేని యీ పాటకిపుడు?
ఇంత చివురిచ్చి యంత హేమంత శృంఖ
లాల బంధింతు మూగతనాల గొంతు ‘

కవి మనసు భక్తి వైపు మళ్లింది. ‘స్వామి! నూత్న వసంత జీవ ప్రవాళ పల్లవమ్ముల రుచులె నా బ్రతుకు జీర గోసి తీయదనమ్ములు వోసినప్పుడె వెడలి పడలేద! యొక యదుగిడగలేద’ అంటాడు. కవికి తన సంగతి తనకి తెలిసింది. ‘ఓయి గాయక సార్వభౌమా! యివేటి తగని త్రుళ్లింత వెలితి నృత్యమ్ములోయి!’ అంటాడు. స్వేచ్ఛపట్ల భ్రమలు తొలగి పోయినాయి. శాశ్వతమైన స్వేచ్ఛని గ్రహించ గలుగుతున్నాడు కవి

కళని గురించి చెప్పేది సౌందర్య శాస్త్రం. సౌందర్యాన్ని వ్యక్తం చేసేది కళ. ఆనందాన్ని వ్యక్తం చేసెది సౌందర్యం. మనస్సుని వికసింప చేసేది ఆనందం.

‘Beauty is that profound expression of Reality which satisfies our hearts without any other allurements but its own ultimate value’ అని అంటారు రవీంద్రుడు. అసలు వాస్తవాన్ని గాఢంగా వ్యక్తం చేయగలిగేది సౌందర్యం. మన హృదయాలకి ఆనందం కలిగించినప్పుడే అది సౌందర్యం అవుతుంది. అయితే మన హృదయాలు సంతృప్తి చెందాలి.

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రిగారు మొదలైన కవుల చేతిలో సాహిత్యకళ భరతనాట్యం చేస్తున్నది. వచనకావ్యం హృదయాన్ని సంస్కరించలేదు. ఈ కవులు హృదయ సౌకుమార్యాన్ని వృద్ధి చేయగలుగుతున్నారు. ఎప్పటికైనా మేధ కంటే హృదయమే ముందు భగవంతుని సాన్నిధ్యం సంపాదించుకుంటుందనిపిస్తుంది ఈ కవుల కవిత్వం చూస్తే. నవ్యసాహిత్యం పుట్టేవరకూ సాహిత్య కళచేత మెదడుకు మెరుగు పెట్టించుతూ వచ్చారు. ఈనాడు ఈ సౌందర్యం కవిత్వాన్ని ఆశ్రయించి హృదయాన్ని సంస్కరింపజేస్తున్నది.

భావకవుల సౌందర్యదృష్టి మానవ హృదయాన్ని ఎలా సంస్కరిస్తుందో చెబుతూ కొడవటిగంటి కుటుంబరావుగారు ‘నవ్య సాహిత్యం పుట్టేవరకూ’ అని ఒక మాట అన్నారు. అది సత్యం కాదు. ప్రాచీన సాహిత్యంలో శతకాలూ, పోతన భాగవతమూ మొదలైనవి హృదయాన్ని భక్తిభావంతో నింపినవే. అయితే కుటుంబరావుగారు అన్నట్టు భావకవులు మేధకంటె హృదయానికి ప్రాధాన్యాన్నివ్వటం వలన సౌందర్య దృష్టి మెరుగులుదిద్దుకుంది.

కవికిగల అనంత సౌందర్య దాహం నిలవనివ్వడం లేదు. భగవంతుని దర్శనం కోరుతోంది. భక్తుడూ, పిచ్చివాడూ, కవి ముగ్గురూ ఒకలాంటి మనస్తత్వం కలవారే.

‘అంత నే వెర్రి నైపోదువయ్య; నిన్ను
బోలి పాడబోవుదు; నిన్ను పోలినాట్య
మాడబోవుదు, లజ్జబోనాడి, కాక
ఇంత దాహమ్ము దహియింప నెటులు మనుదు’

అంటాడు కవి. సౌందర్య దాహం కవిని ఉన్మత్త శిఖరాలకి చేరుస్తుంది.

‘ఏవిధాన సౌందర్య రసైక జీవి
నిలువ నేరుతు నిత నొక్కనిమిషమేని
మామకీన జీవితశుష్కమార్గముల త్వ
దీయ పాదమంజీరముల్ మ్రోయకున్న’

కృష్ణపక్షంలో ప్రారంభించిన పవిత్ర యాత్ర ఎడతెగని అన్వేషణై సాగుతూనే ఉంది. దర్శనం సాధించేవరకూ సాగేది. ఈ యాత్ర మనస్సు వెన్నెలతో నిండి ‘కార్తీకి’ గా పర్యవసిస్తోంది.

కృష్ణపక్షంలో స్వేచ్ఛకోసం, ప్రేమకోసం, ఆదర్శ సౌందర్యం కోసం అన్వేషించిన కవి తపస్సు ఫలించింది. వెలుగునీ, అమృతాన్నీ అందుకున్నాడు కవి. అది శాశ్వత సౌందర్యం.

‘ప్రేయసి సోయగమ్మునకు లేదు శరీరము; లేదు మేను నా
తీయని ప్రెమకేని, కలదే యెడబాటికమాకు; శ్యామ వై
హాయస సీమ కారితికి యామవతీ హసితమ్మువోలె నన్
బాయదెదో వెలుంగొ – మధువె…’

అంటాడు కవి.

స్వర్గ సౌందర్యానికీ, భూలోకంలోని ప్రేమ మధుర్యానికీ ముడిపెట్టి మానవలోకాన్ని ప్రేమ సౌందర్యంతో తీర్చి దిద్దాలన్న తపనతో కవి సాగించిన అన్వేషణ ఫలించింది. పరమశివునితో అద్వైత సిద్ధి లభించింది. ‘తన కంఠమున దాచి హాలాహలం – తల నుంచి కురిపించి గంగాజలం’ మనిషి శివుడవాలని తపించిన కవి విషాదాన్ని గుండెల్లో దాచుకొని సౌందర్యామృతాన్ని ప్రపంచాని కందిస్తున్నాడు. కరుణతో లోకాన్ని వెలిగిస్తున్నాడు. తనని తాను తెలుసుకొని, శాశ్వతమైన స్వేచ్ఛనీ, సత్యాన్నీ ఆవిష్కరించేది కృష్ణశాస్త్రి సౌందర్య తత్త్వం.

**** (*) ****

Artwork: Anwar