ప్రత్యేకం

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

అక్టోబర్ 2016

రాయప్రోలు సుబ్బారావుగారి ప్రభావంతో ఆధునిక కావ్యాలలో వియోగ శృంగారానికి ప్రాధాన్యం వచ్చింది. నవరసాలలో ప్రప్రథమంగా చెప్పదగినది శృంగారం. ఇది సంభోగం, విప్రలంభం అని రెండు విధాలు. విప్రలంభ శృంగారం ఐదు విధాలని మమ్మటాదుల అభిప్రాయం. అవి 1. అభిలాష 2. విరహం 3. ఈర్ష్య 4. ప్రవాసం 5. శాపం. ఇందులో ప్రవాసం కృష్ణశాస్త్రి కావ్య పరిశీలనకి అవసరం. ‘అనురక్తులైన నాయికా నాయకులు కార్యాంతర వశమున దేశాంతరగతులగుట ప్రవాసము’.

కాళిదాసు మేఘసందేశం ప్రవాస విప్రలంభానికి చెందిన కావ్యం.

‘త్వా మాలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైః శిలయా
మాత్మానంతే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్
అస్త్రైస్తావమమ్హరు ప చితై ర్దృష్టి రాలుప్యతే మే
క్రూరస్త స్మిన్నపి న సహతీ సంగమం నౌకృతాంతః’

కుబేరుని శాపానికి గురైన యక్షుడొకడు రామగిర్యాశ్రమంలో నివసిస్తూ మేఘుని చేత తన ప్రియురాలికి పంపిన సందేశమిది. ప్రియురాలా!

ప్రణయ కుపితవై యున్న నీ రూపాన్ని, ధాతురాగాలచే శిలపై రాసి, నేను నీ పాదాలపై పడాలనుకునేంతలో మరల మరల ఉబికే కన్నీటిచే నా చూపు లోపిస్తుంది. క్రూరమైన దైవం చిత్రంలో కూడా మన సంబంధాన్ని సహింపలేకున్నది.

హృదయాన్ని కరిగించేలా కాళిదాసు చిత్రించిన ప్రవాస విప్రలంభమిది.

సీతారాముల శృంగారం ధర్మశృంగారం. బాహ్య సౌందర్యము చేతనే కాక ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం, క్షణిక సౌఖ్యాన్ని కాక భవిష్యత్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొనుట ఈ ధర్మశృంగార లక్షణాలు.

శృంగార రసాన్ని రసరాజమన్నవాడు భోజుడు. శృంగారానికి అహంకారం, అభిమానం, రసం పర్యాయ వాచకాలు.

ఆధునిక యుగంలో అమలిన శృంగార చర్చ చేసినవారు రాయప్రోలువారు. తృణకంకణం, లలిత, స్నేహలతాదేవి లేఖ వంటి ప్రణయ కావ్యాలలో భావకవిత్వానికి రూపురేఖలు దిద్దినవారు. కరుణ, శృంగారరసాలు రెండే రసావిష్కరణకి సమర్థాలని అభిప్రాయపడినవారు వీరు. పూర్ణానందాస్వాదానికి శృంగారం, మనో దోష శుద్ధికి కరుణ ఉపయుక్తాలని వీరి భావం. శృంగార రసానికి సంభోగమవధి అన్న పూర్వుల సిద్ధాంతాన్ని వీరు తిరస్కరించారు. ఉపాధి మాత్రమైనది కాబట్టి ఇది పనికిరాదన్నారు. వియోగ శృంగారం అనుపాధికం కాబట్టి స్వీకరించాలన్నారు. వియోగంలో ఆలంబన విభావం ప్రత్యక్షం కాదు. ఇక్కడ హృదయానికి ప్రాధాన్యం. నిర్మలమైన శృంగారం వియోగంలోనే అనుభూతికి వస్తుందని రాయప్రోలు వారి అభిప్రాయం. ‘స్థూలంగా చూచినచో సౌందర్య శృంగారములొక్కటే’ అని సి.నారాయణరెడ్డిగారు అభిప్రాయపడ్డారు.

‘కానవచ్చు సౌందర్య శృంగారములకు
అంతరంబనభివ్యక్తమయి; ఉపాధి
గతము సౌందర్య – మను పాధికము రసాధి
కారి శృంగార – మఖిల మాంగల్య పరము’

అని రాయప్రోలు వారు చెప్పారు. నిర్మలమైన సౌందర్య ధ్యానంతో ఆనందాన్ని అనుభవించవచ్చునని వియోగంలోనే ప్రేమ ఔన్నత్యం పరిఢవిల్లుతుందని రాయప్రోలు వారి సిద్ధాంతం.

కృష్ణశాస్త్రిగారి ప్రవాసం ఖండికలలో కవి కోరిన శృంగార జీవితం, ప్రేయసి లభ్యం కాకపోవడం, ఆదర్శ సౌందర్యం కోసం నిరీక్షించడం మొదలైన అంశాలు ప్రాముఖ్యాన్ని వహించాయి. ప్రవాసం ఖండికలు కృష్ణశాస్త్రిగారు మొక్కపాటి రామమూర్తికి అంకితం ఇచ్చారు. అంకిత గీతం ‘ ఓ మానవోత్తమా! అని సంబోధిస్తూ

‘ఈ యశ్రుఝరులతో, ఇరులతో, రొదలతో
సొదలతో, ఈ హాస మృదుల వాసనలతో
విసముతో, సిగ్గుతో, కొసరు తేనియలతో
ఈ పాట బ్రతుకు నీ కేపాటిదోయీ, నా
నెచ్చెలీ!’

అంటారు.

బ్రహ్మసమాజానికి సన్నిహితులైన వారిలో రామమూర్తి నిజాయితీ అంటే అందరికీ అమితమైన గౌరవం. కృష్ణశాస్త్రిగారు రామమూర్తిని ఆధ్యాత్మిక గురువుగా భావించేవారని చలం రాశారు. రామమూర్తిని గురించి తెలుసుకోవాలంటే చలం మ్యూజింగ్సు ఆధారం. వ్యక్తిగత కారణాలచేత ఆత్మహత్య చేసుకొన్న రామమూర్తిని గురించి చలం ఇలా అంటారు.

‘నీ మరణం అపజయం కాదని – సంఘం మీదనే కాదు, మనుష్య స్వభావం మీద, మరణం మీద జయధ్వానమని చెప్పడానికి మిగిలాను నేను.’

రామమూర్తి ధైర్యం, ఉత్సాహం, అశాంతి, తిరుగుబాటు – ఆ కాలం నాటి సాంఘిక దురాచారాల మీద విరుచుకపడేలా చేశాయి. ప్రేమకోసం, సత్యం కోసం, సమత కోసం, సమాజంలో ఆయన లేవనెత్తిన ఆలోచనలు చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రి వంటి రచయితల కలాలలో బలంగా ప్రతిధ్వనించినాయి. రామమూర్తి చలానికి రాసిన లేఖలో ఇలా అంటారు.

“And you are not alone in this suffering for want of sympathy and communion. For the first time I heard similar cry from D.K. (Krishna Sastri). With almost a broken heart he has been telling how people merely say his verses are good and fashionably read them rapidly through and skip over the surface while he has taken such pains to paint picture after picture in some of them.’

భగ్నహృదయంతో కృష్ణశాస్త్రి రాసిన గీతాలు రామమూర్తిని ఆకర్షించాయి. చలం రచనలలో ఏ భావాలు సంచలనాన్ని కలిగించాయో, ఏ స్థాయిలో సాహిత్యలోకాన్ని ఆలోచింపజేశాయో, అలాంటి స్పందనే కృష్ణశాస్త్రి గీతాలూ కలిగించాయి.

My sin is the desire to be loved’ అన్నాడు రామమూర్తి. ‘బ్రతుకు’, ‘ప్రేమించు’ – ఇదీ రామమూర్తి సిద్ధాంతం. నిజమైన ధీరులనీ, నిజంగా ప్రజలని ప్రేమించేవారినీ లోకం దగ్గరకు రానివ్వదు. ప్రేమ నటించి, మోసం చేసేవారిని లోకం ఆదరిస్తుంది. ఇది లోకస్వభావం. రామ్మూర్తి చచ్చిపోగానే ముద్దుకృష్ణ రామమూర్తి జీవిత చరిత్ర రాద్దామా అన్నారు చలం గారితో. ‘మీరూ నేనూ చదువుకోవాలి. రామ్మూర్తి ఎవరికి గొప్ప’ అన్నారు చలంగారు.

ప్రేమకోసం, మనుషులకోసం, సత్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన రామమూర్తి మరణించడం కృష్ణశాస్త్రిని అమితంగా కదిలించింది. ‘హృదయ భేదకమైనవీ, అర్థం కానివీ, అయిన రెండూ మూడు మరణాలూ, అంతకన్నా దారుణంగా కలతపెట్టిన రెండు మూడు వియోగాలు అవసరమైనాయి’ అని చలంగారు అన్నారు. (దేనికి అవసరమైనవి?)

భావకవిత్వంలో వియోగానికీ, సౌందర్య ధ్యానానికీ విలువైన స్థానం ఉంది. ప్రేమ సామ్రాజ్యైక చక్రవర్తిగా, స్నేహశీలిగా, అభివర్ణింపబడిన రామమూర్తి కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలో ప్రేరణ కలిగించిన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు.

భావకవిత్వం అంటే పాట. కృష్ణశాస్త్రి భావకృతులన్నీ గానయోగ్యమైనవే. కవిత్వాన్ని సంగీత స్థాయికి తెచ్చినవారు కృష్ణశాస్త్రిగారు. ఆంగ్ల కవిత్వ విమర్శకులు ‘లిరిసిజం’ అంటారు. అశ్రుఝరులూ, చీకట్లూ, మృదుహృదయం, కొసరుతేనియలూ మొదలైన పదాలు రామమూర్తి వ్యక్తిత్వంలోని విశాల దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి.

సంకుచితంగా వ్యవహరించే లోకం చూపిన దుర్మార్గానికి బలైపోయిన రామమూర్తితో, ‘ఈ పాట బ్రతుకు నీకేపాటిదోయీ’ అనడంలో పాటకంటే ఉదాత్తమైన వ్యక్తిత్వం కలవాడని కృష్ణశాస్త్రి అభిప్రాయం.

‘ప్రేయసీ, ప్రేయసీ, వెడలిపోయితివేల, ఆ యగమ్య తమస్వినీ గర్భకుహరాల’ అంటూ ప్రారంభమౌతుంది ప్రవాసము. కృష్ణపక్షములోని ‘ప్రతీక్ష’ ఖండికలో వ్యక్తమైన ‘ ఆ యగమ్య తమస్సాంద్ర యవనికాంతరంపుటేకాంతమున బడి, యా క్రమ క్రమాస్తమిత నూపురారవాహ్వానములను వెంటనంటి,నా హృదయము వెడలిపోయె’ నన్నదానికి ప్రతిధ్వని ప్రవాసంలో కనిపిస్తుంది. ‘ప్రవాసం’ కవి వేదన యొక్క విశ్వరూపాన్ని, కవి హృదయ పరిణామాన్ని స్పష్టం చేస్తుంది. ‘కవి రసాత్మకుడు. తాను ఆనందిస్తూ మనల్ని ఆనందింపజేస్తాడు. కవి ఋషియట. అతని ఆత్మోన్నతి మనకి వివృతమౌతోంది. మరి భావకవి అంటే లోకానికి ఎంత ఆశో! ఆ ఆశ ఎంత న్యాయమైనదో’ అని కొంపెల్ల జనార్దనరావు అన్నారు.

కృష్ణపక్షంలో ‘నేను’గా అహంభావం ప్రకటించిన కవి తనని తాను సంస్కరించుకొని, విశ్వవ్యాపితమయ్యే ప్రయత్నం ప్రవాసంలో కనిపిస్తుంది. ప్రియురాలి ఎడబాటు భరించలేక, అపుడు గొంతెత్తి యేడిస్తే, తారకలు ఆర్చుకుపోయినాయి. మొగిళ్లు మరింత నల్లబడి నిట్టూర్పు దొంతరలైనాయి. చీకట్లు తలలు వాల్చుకున్నాయి. ఇలా అమూర్తమైన వాటికి ఆకారాన్ని కల్పిస్తూ గాలి చలించిపోవడాన్ని కృష్ణశాస్త్రి

‘అపుడు బ్రతుకొక్కటె యేడుపైన గాలి
రిచ్చవడి వట్టి పసిపాప లీల మౌన
యానమున బరి సుప్త పత్రాళి నొదిగి
పొంచి చూచుచు చలియించి పోయినాడు’

ఏకాంతంలో మానవుని మానసిక స్థితిని ప్రకృతిలో సమన్వయించి ప్రవాసిని చిత్రించారు.

వేసటేలేని వెర్రి అన్వేషణం కవిలో అశాంతిని కలిగించింది. అసలు సౌందర్యంలో ఈ అశాంతిని కలిగించే శక్తి ఎక్కువగా ఉంది. సౌందర్యాన్ని ఆకర్షకంగా చేసే సూత్రం ఇదే. సౌందర్య సృజన చేయగల కళాకారులు లోకంలోని సౌందర్యంతో తృప్తిపడరు. దీన్ని ప్రపంచం చంచలత్వం అంటుంది. సౌందర్యం ఎవరిని కదిలించలేదో, ఎవరికి సౌందర్యం చాలా అల్ప విషయమో వాళ్లకి కవి బాధ అర్థం కాదు. అందుకే చలంగారు ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అని అన్నారు.

కళాకారుల మనసులోని విలువలు ప్రత్యేకమైనవి. ఆశలూ, స్వప్నాలూ అనంతమైనవి. ఈ గుణం వాళ్లు ఆరాధించే సౌందర్య దేవతలోనే ఉంది. సౌందర్యమూ, ఆనందమూ మాయ కావు. అందవికారమూ, అసహ్యమూ మాయ. నిర్మలత్వమూ, ఏదో అర్థం కాని నూతనత్వమూ సౌందర్యం. అందుకే కృష్ణశాస్త్రిగారు,

‘అంతమే లేని నా యాత్రా పథాన నా
పదచిహ్నములు వోలె పడియున్న వెన్నెన్నో
అడుగుజాడలు మదీయార్ద్ర హృదయమ్ములో
నిశికడుపులో తారలై, నిశ్శబ్ద
వాటిలో చిరుపాటలై,’

అన్నారు. కవి ఇక్కడ అనంత ప్రయాణీకుడు అవుతున్నాడు. అంటే సౌందర్య ధ్యానంలో ఈ ప్రపంచం వెనకాల అసలు సత్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆకలి ఎక్కువైంది. తాను ఎంత దూరం నడిచినా, తన పాద చిహ్నాలు కరుణతో నిండిన తన హృదయంలో కనిపిస్తున్నాయి. అవి కవికి ఆశాజనకంగా ఉన్నాయి – చీకటి కడుపులో నక్షత్రాల్లా, నిశ్శబ్దంలో చిరుగీతుల్లా. తన ప్రయాణానికి రెండు పక్కలా నిలబడ్డ చెట్లూ, పక్షులూ ఇవన్నీ ‘సంజియ కావి వింతలై’ నశించి పోతాయని కవికి బాధ కలిగిస్తున్నప్పటికీ, ఏదో తెలియని ఆశ ముందుకే నడిపిస్తుంది.

1925 ‘ ప్రవాసం’లోని ఏ ఖండికకీ శీర్షిక లేదు. తనని అర్థం చేసుకోని లోకాన్ని గురించి కృష్ణశాస్త్రి ఇలా అంటారు.
‘కొందరు స్వేచ్చా విహంగం అన్నారు. కొందరు కుటిల పన్నాగం అన్నారు. కొందరు మూఢ దివాంధం అన్నారు. నేను మాత్రం నా యథార్థ స్వరూపం అజ్ఞాత దుఃఖంలో పదిలపరచాను’

ఎవరికోసమైతే ఆరాటపడతారో, ఎవరి భవిష్యత్తుని గురించి ఆందోళన పడతారో, ఎవరి మంచి కోరి కష్టాలని వరిస్తారో వారినుంచే విరోధం పొంగుతుంది. ప్రపంచంలో ప్రతి కళాకారుడికీ, తత్వవేత్తకీ, ప్రవక్తకీ ఎదురైన పరిస్థితి ఇదే. అయినా కళాకారులు హాలాహలాన్ని దిగమింగి, అమృతాన్ని ప్రపంచానికి అందించాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. తాత్కాలికమైన ప్రయోజనాలు ఆశించే వారికీ శాశ్వతమైన సత్యాన్ని ప్రకటించాలని తపించేవారికీ మధ్య యుగయుగాలుగా సంఘర్షణ ఉండనే ఉంది. వెలుగుకోసం చీకటితో సంఘర్షించడమే ధీరులు చేసే పని. అదే ప్రవాసంలో కృష్ణశాస్త్రి ప్రదర్శించారు.

కవి సముద్ర తీరాన నిలబడి సముద్రునితో అంటాడు. ‘ఎంత బాధ నీది! లోకంలో దుఃఖమంతా నిజంగా నీదే . ఈ విశాల విశ్వంలో ఉన్న ఆర్తి అంతా నీదే కదా! నీవు ప్రవాసులలో ఓ చక్రవర్తివి’ అని అంటాడు.

అనంతమైన వేదన కవికి ప్రేమ కిటికీలు తెరచి ప్రియురాలిని సృష్టించుకొనే శక్తినిస్తుంది.

కావ్య కల్పనలో, కావ్య సృజనలో కరుణకి తగిన స్థానం ఉంది. ‘ఏకోరసః కరుణ ఏవ’ కనుక విశ్వప్రేమనూ, కరుణనూ ఇతరుల హృదయాలలో కలిగించటమే కావ్యానికి ముఖ్యమైన ఉద్దేశ్యమని కృష్ణశాస్త్రిగారి అభిప్రాయం. చలంగారు కృష్ణశాస్త్రిగారి ఈ పరిస్థితిని ‘శృంగార బాధ’ అని అన్నారు. అంతేకాదు. శృంగారాన్ని కళగా భావించినవారని అన్నారు. శృంగార బాధే కరుణకి దారితీసింది. ఏ రసమైనా కరుణతో ప్రపంచాన్ని ప్రేమించగలిగినప్పుడే కళగా వన్నెకెక్కుతుంది.

‘చక్కని శరీరానికి సుఖమూ, చక్కని ఆత్మకు దుఃఖమూ కావాలి. అన్నాడొక తత్వవేత్త. కనుక అశ్రువులలోనే ఆనంద సందేశం ఉంది, ఆశాజ్యోతి ఉంది’ అని అంటారు కృష్ణశాస్త్రి.

మనసు ఎంత బాధకి గురైతే అంత పక్వానికి వస్తుంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసేనాటికి, మహాభారతానువాదం చేసేనాటికీ ఎంత పరిణామానికి లోనయ్యాడో అందరికీ తెలిసినదే. ఆ కాలం నాటి ఆంధ్రదేశంలోని పరిస్థితులు ఆయన హృదయాన్ని ఎంత కలతకి గురిచేశాయో గ్రహించగలం. అంటే కళలోని రసం అమృతస్థితికి చేరాలంటే కళాకారుని మనసు ఎంత మధనానికి గురైతే అంతమంచిది. కీట్స్, షెల్లీ వంటి కవులు ఆదర్శ సౌందర్య లక్ష్య సాధనలో దుఃఖాన్ని అనుభవించినవారే.

‘వెదకి వేసారి నా వెర్రిబ్రతుకెపుడేని
తుది రేయి కనుమూయనా
బేలయై
నిదుర బరువుల క్రుంగునా
మరపు మసకల దారి తెరచికొని కలయేదో
విరిసికొని పరతించును,
కారురా
తిరి కొనల మెరపించును’

అంటారు కృష్ణశాస్త్రి. ఈ ప్రపంచంలో తన ఆదర్శానికి సరిపోయే ప్రేమనీ, సౌందర్యాన్ని వెదకి వెదకి చివరికి బ్రతుకు ముగిసిపోతుందేమోననీ, మనసు కుంగిపోతుందేమోననీ అనుకుంటున్నాడు కవి. కానీ, మరపు మసకల దారిలో ‘కల’ లా పలకరిస్తుందన్న విశ్వాసం, కారు రాతిరి కొనలని మెరిపిస్తుందన్న ఆశ కవిని నిలబెడుతున్నాయి.

‘వనరు చేడ్వగలేను, చచ్చి చావగలేను
కనలేని వెలుగుకొరకై
ఎన్నడును
కనరాని దానికొరకై’

కృష్ణశాస్త్రి అన్వేషించే వెలుగు సౌందర్యం. అదే విశ్వప్రేమ. అసలు కవులందరూ అన్వేషించేది వెలుగే. ‘పెంజీకటి కవ్వలి వెలుగుల’ కోసం ఆర్తితో భాగవతం రాసిన పోతన వెలుగు ‘మోక్షం’. ‘మతములన్నీ మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశించిన వెలుగు ‘జ్ఞానం’. అలాగే కృష్ణశాస్త్రి ఆకాంక్షించేది ప్రేమ. సుందరమైన జీవితం. ‘కవులకి బాధలో ఆనందం, వేదాంతులకి ఆనందంలో బాధ’ ఉంటుందంటారు చలం. కవులు తమ అనుభవాలని సృజనకి తొలిమెట్లుగా భావిస్తారు. కనుక బాధ ఆనందాన్నే కలిగిస్తుంది. బాధించే సత్యాలు విచ్చుకుంటున్న కొద్దీ ఆనందం అధిక మౌతూ ఉంటుంది.

మానవుడి వెతుకులాట కృష్ణశాస్త్రి పాట అని చెప్పవచ్చు. ” ఆయన కవిత్వమంతా గొప్ప అన్వేషణ. అందుకే అంత దిగులూ, అంత నిరాశ. వెలుగు ఇంత అందరానిది కావడం చేతనే, All great art is tragic. కానీ ఈ అశాంతి, ఈ వెలుగు కొరకు ఏడుపు – దీనికంతా గొప్ప అర్థం, సంతోషం ఉంటూంది’ అంటారు చలం.

కృష్ణశాస్త్రి స్వతహాగా సౌందర్యరసైకజీవి. అనుభవించిన దానిని లోపలికి తీసుకొని దాని అందాన్ని రసంగా తీసి పలికేవాడే కళాకారుడు. ఇక్కడ కవి ప్రియురాలిని మనసునిండా నింపుకొని, కన్నీళ్లతో కడిగి స్వచ్ఛమైన సౌందర్యంగా సృష్టించే తపనలో శరీరాన్ని దహింప చేసుకుంటున్నాడు.

‘నాకుగాదులు లేవు
నాకుషస్సులు లేవు
నేను హేమంత కృష్ణానంత శర్వరిని
నాకు కాలమ్మొక్కటే
కారురూపు,నా శోకమ్ము వలెనె, నా బ్రతుకు వలెనె
నా వలెనె’

కృష్ణశాస్త్రి కవిత్వ కళ విషాదాన్ని చిత్రించే సన్నివేశాలలో బహుముఖాలుగా విస్తరిస్తుంది. ప్రపంచమంతా ప్రణయోత్సవాలతో ఆనందంగా ఉంటే కవికి తన పరిస్థితి ‘హేమంత కృష్ణానంత శర్వరి’ గా అనిపించింది. చీకటిలో తడిసిన నది గడ్డకట్టినప్పటి స్థితి ఇది. కవి తన పరిస్థితిని పాఠకుని మనస్సులో పునస్సృష్టి చేయగలగటం భావకవితా ధోరణి.

కృష్ణ పక్షంలో కవి శోధన కనిపించింది. ప్రవాసంలో కవి సాధన కనిపిస్తుంది. ప్రియురాలిని సృష్టించుకోవాలనే దీక్షతో కనిపించిన ప్రతి సౌందర్యాన్నీ పదిలపరచుకుంటున్నాడు.

విశ్వమంతా వ్యాపించిన కవి నిర్వేద తమస్సు ఒక స్త్రీమూర్తిగా రూపు దిద్దుకుంటుంది.

సూఫీ తత్వంలో ప్రేమ గురించి ఇలా అంటారు. ‘Love is the complete consecration of the desires of the heart to the purpose of god’ – అంతే కాదు. Rumi మాటల్లో చెప్పాలంటే, This is Love to fly heaven wards. Union గురించి ఇలా అంటారు. ‘With two figures but with one soul, thou and I; Individuals no more, but mingled in ecstasy, joyous and serene, thou and I’ హృదయంలోని కోరికలన్నిటినీ కాల్చేసి, తనని తాను అర్పించుకొని అద్వైతసిద్ధిని సాధించటం సూఫీ తత్వం. ఈ భావాన్ని కృష్ణశాస్త్రి,

‘కంట కురిసిన కార్చిచ్చు మంట యేళ్ల
కాలినుసియై నశించే వాంఛా లవాలె;
ఏరెరుంగుదురని ఏ యెడారి దార్ల
నింకెనో చుక్కతడి జాడయేని లేక’

కవికి ఇప్పుడు ఏ కోరికలు లేవు. ప్రేయసీ సాక్షాత్కారం కోసం శరీరాన్ని దుఃఖంలో కాలుస్తున్నాడు కవి. ‘మంటయేళ్లు’ అన్న పదం ద్వారా ఈ భావాన్ని సూచిస్తున్నారు కృష్ణశాస్త్రి. మనస్సు చేసే తపస్సు సౌందర్య దేవతకోసమే.

‘వలపు టాకలి స్రుక్కు నా బ్రతుకు మీద
ఇనుప పాదాలనిడి లోకమిపుడు నడుచు’

ప్రేమకోసం పరితపించిన ప్రవాసి బ్రతుకుని లోకం ఎంత కర్కశంగా బాధించిందో తెలుస్తుంది. తనని తాను దుఃఖ కుటీరంలో దాచుకున్న ఏకాంత స్థితిని కవి

‘రేయి కడుపున చీకటి చాయవోలె
తమసుటెడద దివాంధగీతము విధాన
ఘూకరావాన వలవంత రేకరీతి
నా విషాదమ్ములో దాగినాడ నేనె’

తనని ప్రేమించేవారూ, తన బాధని అర్థం చేసుకునేవారూ లేరనే పరిస్థితిలోంచి పుట్టిన నిర్వేదమిది. ‘నా విషాదమ్ములో దాగినాడ నేనె’ అనే వాక్యం కృష్ణశాస్త్రి కవితా తత్వాన్ని ఆవిష్కరిస్తూ కరుణ రసం నిండుగా పండిన సన్నివేశమిది.

కవి ప్రేయసితో అంటాడు, ‘నీ దీర్ఘ ధమ్మిల్ల నీల వల్లీ చాయ పొడిచికొని, నిదుర చెర విడిచి, పూవులు నేడు’ కనిపిస్తున్నాయి. ‘తళతళపాట’ పాడుతున్నాయి. ఈ ఆహ్వానం కవి భరించలేకపోతున్నాడు. ఇది సురభిళాహ్వానం. చీకటికి అలవాటు పడినవాడు వెలుగుని భరించలేనట్లుగా, అనుకోని ఈ ఆహ్వానం కవి భరించలేకపోతున్నాడు. ‘నటియించు ఆపూవులెటు నవ్వుచున్నవో! తురిమి విసరుమువాని ఎరుగ నేరని దూరదూరాలకో, రహస్తీరాలకో, చెలీ’ అంటాడు. విభ్రాంతికి లోనైన కవి ‘నా సఖీ! నీ ప్రేమ శాపమీ అపూర్వ నరకయాతనాఖర్వతాపము’ అంటున్నాడు.

‘ప్రవాసంలో కవి జీవితానుభవ యవ్వనోదయము మాత్రము ఇప్పుడు కొంత చిక్కబడింది. నాటి కోవెల కొలనుతనము నేడు హేమంత శృంఖలోచితమైన కొత్త వెలుగులకు తావలమైనది. ఈ ఐక్యనిధి ఈ కావ్యాల ఆనుషంగిక పరిశీలనంలో ఫలించినట్టిది’ అని కొంపెల్ల జనార్దనరావు అన్నారు.

కృష్ణశాస్త్రిగారు కృష్ణపక్షం ఖండికలు చాలా వరకు వసంతఋతు నేపథ్యంలో రచించారు. మానవ జీవితంలోని రకరకాల అనుభవాలకి ప్రతిబింబాలు ఋతువులు. ప్రకృతిలోని పరిణామం కవి హృదయ పరిణామంలో కనిపిస్తుంది. కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి క్రమపరిణామంగా భావించి పరిశీలిస్తుంటే కవి హృదయవికాసము బోధపడుతుంది.

కృష్ణపక్షంలో ఉన్నంత అందుబాటులో ఉండవు ప్రవాసంలో రచనలు. దానికి కారణం కృష్ణశాస్త్రిగారు నా గొప్ప రచన అనే వ్యాసంలో ఇలా అంటారు. ‘అన్వేషణ ఆగిపోలేదు. ఇదివరకు ఎక్కడికీ చూడలేనివాడు ఇంక లోపలికి చూడటం ప్రారంభించాడు. చూపులు పగలు పైకి పరుగెత్తుతాయి. రాత్రి తలతిప్పుకొని లోపలికి వెళ్ళగించుకొని చూస్తాయి.’

ఏ కళాకారుడైనా సృజనాత్మక భావనని అంతర్దృష్టితో మేళవించినప్పుడే సౌందర్యాన్ని సృష్టించగలుగుతాడు.

‘ప్రేమకంటే గొప్ప అనుభవం మానవుడికి లేదు. ఇది వరకు అసమగ్రంగా ఉన్న నా ప్రకృతి నీవు నాలోకి వచ్చాక సమగ్రంగా అయింది.’ అంటాడు ప్రెమికుడైన కవి’ అని అంటారు కృష్ణశాస్త్రి.

మనిషి ప్రేమలోనే ఆనందాన్ని పొందగలుగుతాడు. అదే శాశ్వత సత్యం. అదే కడపల. అనంతము అద్వైతము అయినది ప్రేమ. ప్రేమలో ఉన్న కవికి దుఃఖం సౌందర్యంగా పర్యవసిస్తుంది.

‘వినరావీ విభావరీ
వేలాశాలల నీమృదు
వసనాంచలముల గుసగుసలో

మసలు చరణ మంజీరము
కొసరు జాలి పలుకరింతలో!

ఈ కుటీర ముఖద్వార
మిందే వ్రేలాడి సగము
వాడి, విరహతోరణమ్మునై

వలవంత సడలి నేలజీ
రాడి యెన్నినాళ్లు మనుదునో!
….
నీ మనోజ్ఞ కాంచన కాం
చీమణి ఘంటా గళములు
ఏకాంతము కరగ మ్రోయగా

విన నరచే బ్రదుకు దాల్చి
యెడద మోత కెంత యేడ్తునో’

కృష్ణశాస్త్రిగారి సహజకళా వికాసం, శిల్పం అనన్య సామాన్యమనిపించే పాట యిది.

‘ఆకసమాలోకనముగా లోకమెల్ల వీనుగ కాలాంతమునకు కాచియుందునా’ శాశ్వతమైన సత్యాన్ని ఆవిష్కరించేటప్పుడు కృష్ణశాస్త్రి కవిత ఉన్నత శిఖరాలని అందుకుంటుంది.

ప్రియురాలి మృదువసనాంచలముల గుసగుసలు వినటానికి కవి చెవులని దిశాంతాలదాకా లాగి వింటాడు. దరిద్ర హేమంతంలో చైత్ర శుభోత్సవ విభాత కళ్యాణం కోసం చూస్తాడు. ‘అన్వేషణలో ఎంత అలసట ఉందో అంత రుచి ఉంది’ అంటారు కృష్ణశాస్త్రి.

‘ఇది ముగియబోని ఏ అర్థమెరుగరాని
వేసటేలేని వెర్రి అన్వేషణమ్ము’

సౌందర్యం అతిలోకమైనది. తన ఆదర్శానికి సరిపోయేది. అందుకే తనని తాను ఇలా ప్రకటించుకుంటాడు.

‘నా నివాసమ్ము తొలుత గంధర్వలోక
మధుర సుషమా సుధాగాన మంజువాటి
ఏనొక వియోగ గీతిక.’

గంధర్వలోక సౌందర్యానికీ, మానవప్రేమకీ ముడిపెట్టి మానవలోకాన్ని అందంగా తీర్చి దిద్దాలనే తపన కవిలో కనిపిస్తుంది.

కవికి ఎంత ఏకాకితనం ఉందో అంత ఆత్రత, అంత ఆర్ద్రత ఉన్నాయి. అగ్నిపరీక్ష పూర్తయింది. తాను పరుచుకున్న మరణశయ్యపై తానే వాలి, తన చితిని తానే పేర్చుకొని ప్రవాసియైన కవి మరణిస్తాడు.

‘ఏను మరణించుచున్నాను – ఇటు నశించు
నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు’

నిండు యౌవనంలో మరణించాలన్న ఆలోచన కవికి ఎందుకు రావాలి? అని ప్రశ్నించుకొని ప్రసిద్ధ నవలారచయిత బుచ్చిబాబు ఇలా అంటున్నారు. ‘ఈ పద్య కావ్య సంపుటంలో ‘నేను’ అన్నది ఒక వ్యక్తిగా కవి కాడనే అనుకుంటున్నాను. ‘ఏను మరణించుచున్నాను’ అంటే ‘తను’ అని కాదు. తనలాంటి వాళ్లెందరోనని. ప్రత్యేకమైన అంతరంగ జగత్తులో – శరీరానికి బంధింపబడ్డ వ్యక్తి – విముక్తుడై తన వ్యక్తిత్వాన్ని బాధతో కుంగదీసి, నలిపి, ముక్కలు చేసి ఇతరుల అంతరంగ జగత్తులో వెదజల్లి, వ్యక్తిగా తను మాయమై – ఒక శక్తిగా ఇతరులలో తన్ను చూసుకొని దాగిలి మూతలాడటం లాంటిది’

బుచ్చిబాబుగారు ‘నాకొరకు చెమ్మగిల్ల నయనమ్ము లేదు’ అన్న కృష్ణశాస్త్రిగారి వాక్యం ప్రేరణగా ‘చివరకు మిగిలేది’ నవల రాశానని చెప్పారు. ‘ఇంతకంటే విషాదకర గీతం ఏదుంది’ అన్నారు. ఈ సమస్య బుచ్చిబాబుని బాధించింది. వ్యక్తిగతమైన విముక్తి తన నవలకి ప్రేరణ అని చెప్పుకున్నారు.

జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు. ప్రేమించలేకపోవడమని బుచ్చిబాబు అభిప్రాయపడ్డారు.

‘నా కాష్టాల రేగుమంట
మును బ్రతుకునట్ల నాదేహమును దహింపు
పడదులే ఆర్పగా నొక బాష్పమేని’

కృష్ణశాస్త్రి కృష్ణపక్షములోని కవికుమారుని తన బ్రతుకులాగే తన దేహాన్ని దహిస్తున్న కాష్ఠజ్వాలలలో ఎవరినీ కన్నీరు కార్చొద్దంటున్నాడు. సూఫీ తత్వంలో సత్యాన్వేషణం ఇలా ఉంది. ‘Probe through the surface self and discover the transcendent self to rend the veils in Sufi language perceive the truth.’

ఆనందాన్వేషణలో పడ్డ కవి ప్రేమని పొందలేక, ప్రేమించలేక దుఃఖంతో శరీరాన్ని బాధించి, కాల్చి హృదయాన్ని ప్రేమతో నింపుకున్నాడు. ప్రేమే సత్యం. ఇక్కడ కవి చనిపోవడమన్నది ప్రతీక. వాస్తవమేమిటంటే వేదన నుండి విముక్తిని పొందటం.

‘టాగూర్ కలలు’, సౌందర్యాన్వేషణ, సమన్వయ ప్రయత్నం యీనాటి యువకవీరులకి ఉత్త పనికిరాని మూలుగు అయిపోయింది. కృష్ణశాస్త్రి బాధ ఉత్త ఉన్మాదంలాగు కనబడుతోంది.’ అని అంటారు చలం.

ఈ సృష్టిలోని ఏ అణువు మన హృదయాన్ని స్పందింప జేసినా అది అనంతత్వాన్ని అన్వేషించేలా చేస్తుంది. చలం గారు ఇంకా ఇలా అంటారు.

‘ఈ నాటికి కాకపోయినా, మీ మనోనేత్రం తెరుచుకునేనాటికైనా, ఎప్పటికో జన్మలుంటే, ఎన్ని జన్మలకో, కృష్ణశాస్త్రి ఈనాడు పడుతున్న శృంగార బాధ, సంకుచితత్వాన్ని దాటి వ్యాపించాలని పడే వేదన – మీరు మాత్రం తప్పించుకోగలరా? ఈనాటి మీ చీకటి అన్వేషణకి తోవలో వెలుగు వెయ్యాలని శాస్త్రిగారి ప్రవాసానికి అర్థం’

కృష్ణశాస్త్రి భావకవి. భావకవులకి భావన ప్రాణం. మానవులని బాధించే జీవిత సత్యాలని అన్వేషించడానికి కవులు భావనకి అగ్రతాంబూలం ఇచ్చారు. మెదడుకి అందని సత్యం హృదయానికి లభిస్తుందని వీరి విశ్వాసం. శాశ్వత సత్యమైన ప్రేమని, కవి తన శరీరాన్ని నలగ గొట్టడం ద్వారా తెలుసుకోగలిగాడు. ‘కృష్ణపక్షం’ చీకటిలో ప్రయాణం ప్రారంభించి, ప్రవాసంలో సంకుచితత్వాన్ని దాటి, విశ్వవ్యాపితమైన ప్రేమని రక్షించగలిగాడు. సాధన పూర్తయింది. అదే సౌందర్యం, భావకవులు అన్వేషించే సత్యం. అది శాస్త్రానికి, తర్కానికి, వేదాంతానికి లొంగేదికాదు. అందుకే భావకవులు అంతర్దృష్టితో భావనకి పదును పెట్టుకుని సృజన సాగించారు. ఈ పరంపరలోనే కృష్ణశాస్త్రి సౌందర్య ఆరాధనలో పడ్డారు.

**** (*) ****