మనిషి జీవితానికి సంబంధించిన బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశలలో అత్యంత దయనీయమైన దశ ఏదంటే, అది నిస్సందేహంగా వృద్ధాప్యమే!
చూస్తూ వుండగానే, ఖడ్గ ఖచితంగా భ్రమింపజేసిన దేహం పటుత్వం తప్పి కదలికలను కట్టడి చేస్తుంది. విశాల లోకాన్ని చుట్టి వచ్చిన జ్ఞాపకాలు ఒక చిన్ని గదికి పరిమితమైన స్థితిని చూసి భోరున విలపిస్తాయి. చూస్తూ వుండగానే కనీస పలకరింపులు కూడా కరువయే అస్తిత్వం మరింతగా భయపెడుతుంది!
మ్యాథ్యూ ఆర్నాల్డ్ అంటాడు -
It is to spend long days
And not once feel that we were ever young;
It is to add, immured
In the hot prison of the present, month
To month with weary pain
(Growing Old)
చదువరీ! పై మాటలు చాలా నిస్తేజంగా, నిస్పృహతో నిండినవిగా అనిపిస్తున్నాయా?
అయితే, శివారెడ్డి రాసిన ‘వృద్ధాప్యం’ పద్యం చదవండి ఒకసారి.
మీరు ఇంకా మీ యవ్వనంలోనో, లేక నడి వయసులోనో ఉన్నట్లయితే, ఇది మీరు జీవితంలో తప్పకుండా చదవ వలసిన పద్యం. బహుశా, ఈ పద్యం మిమ్మల్ని భయపెట్టే పద్యం. మనమెవరమైనా, ఎంతటి ఆజానుబాహువులమైనా చివరాఖరున ఒకనాటికి దాటవలసిన ఈ భయానక అగాధ స్థితిని మనకు కరకు కరకుగా జ్ఞాపకం చేసే పద్యం ఇది. దయనీయ వృద్ధాప్య స్థితిని భౌతిక, సామాజిక, ఆర్ధిక, సకల మానవ సంబంధాల కోణాల నుండి దర్శించి వ్యాఖ్యానించిన అరుదైన శివారెడ్డి పద్యం ఇది. చదవండి!
వృద్ధాప్యం – కే శివారెడ్డి
వృద్ధాప్యం కుడితిలో ఈగ
వృద్ధాప్యం సంతానం సాలెగూట్లో పురుగు
వెచ్చదనం ఎటో ఎగిరిపోతే మంచుగడ్డ శరీరం
కళ్ళ ముందు పొంగి పొరలే కన్నీటి తెరలు
వృద్ధాప్యం మృత వృక్షం – కొడుకులూ కూతుళ్ళూ
చుట్టాలూ పక్కాలూ అందరూ నన్ను తెగ్గోసిన ప్రవాహం
అవతల గుడ్డి వెన్నెట్లో గుర్తు తెలియని మంచు తుంపరల నీడలువృద్ధాప్యం నరకకూపం మంచం
వృద్ధాప్యం సర్వ ప్రపంచం మంచం
ఇదొక బావి లోలోపలికి జారిపోయే కత్తుల ఊబి
పొలిమేరల్లేని నికృష్టపు ఏకాంతపు ఎడారి
క్షణ క్షణాత్మ హత్యా ఊహల
ఏవగింపుల విదిలింపుల చీదరింపుల బతుకు
పడి పోయిన నిస్సహాయ అవయవాలు
కదల్లేని శరీరాన్ని పట్టుకున్న చీమలు
మనుషులకి లోకువ చీమలకు లోకువ ఈగలకు లోకువమంచం దగ్గర నుండి మెల్లగా శరీరాన్ని
లాక్కొచ్చి గడప దగ్గరికి చేర్చితే
కూలిపోయిన శరీరాన్కి వాకిలి దివ్యనేత్రం
నా విశాల నేత్రం వాకిట్లోంచి చూస్తే
ఎదురుగ్గా చావిట్లో మేకుకు కట్టేసిన గేదె
ఉచ్చలో పేడలో రొచ్చులో అరుస్తూ మేకు చుట్టూ తిరుగుతూ
పెంటపోగు, పెంటపోగు పక్క మురిక్కాలవ- యింకాస్త జరిగితే దొడ్డి
మంచమూ – దొడ్డీ, ఈ రెండు ప్రపంచాల మధ్య
వేళ్ళాడే దండెం – ఎప్పుడో చచ్చిపోయిన ఈ ‘నేను’
తలెత్తితే – వాకిట్లోంచి కన్పించే బూరుజుముక్క – ఆకాశం
‘ఎవరదీ ఎవరదీ ‘ జవాబుల్లేవు
పశువుల మూగతనం కన్న రాళ్ళ మూగతనం కన్న
క్రూరాతిక్రూరమైన మనుషుల మూగతనం
ఎదుటివాడి సమాధానాన్ని బట్టి పోల్చుకోవాల్సిన స్థితిలో
సమాధానాల్లేవు – సమాధానాల్ రావు
ఒక రాక్షస నిర్లక్ష్యపు కదలికలే
నా చుట్టూ తగలబడుతున్న సంబంధాల కమురు కంపులే
కొడుకులంతా తండ్రులవగానే వాళ్ళ తలిదండ్రులు
సుఖంగా అకస్మాత్తుగా చనిపోవాలని మీరంతా ప్రార్థించండి
సంతానాలు నేరాలవుతున్నాయి
సంబంధాలు నేరాలవుతున్నాయి
వృద్ధాప్యం నేరమవుతుంది
జీవించడం నేరమవుతుంది
గోడ పక్కన విసిరేసిన పనికిరాని
తుప్పు పట్టిన చిల్లులు పడ్డ పాత డబ్బా ఈ వృద్ధాప్యం
దిక్కుమాలిన వృద్ధాప్యం – డబ్బులు లేని వృద్ధాప్యం!
కవి, పద్యం ప్రారంభంలోని మొదటి రెండు పంక్తులలో వృద్ధాప్యాన్ని ‘కుడితిలో ఈగ’, ‘సాలెగూట్లో పురుగు’ లతో పోల్చడంలోనే మనల్ని వృద్ధాప్య స్థితి ముందు నిలబెడుతాడు. వృద్ధులైన తలిదండ్రులను విదిలించ వలసిన పురుగులుగా చూసే సంతానాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘సంతానం సాలెగూట్లో పురుగు’ అంటున్నాడు. చెట్టంత ఎదిగిన మనిషిని, ఒక్కసారి వృద్ధాప్య స్థితిలోకి జారిపోయేక కొడుకులూ, కూతుళ్ళూ చుట్టపక్కాల నిర్లక్ష్యపు చూపులు అడ్డంగా తెగ్గోసి మృత వృక్షంగా మార్చివేస్తాయి అంటున్నాడు. మంచంలోని ముసలి దేహం చుట్టూ ముసురుకునే ఈగల్ని చూసి, ‘చీమలకు లోకువ ఈగలకు లోకువ‘ అని బాధపడుతున్నాడు. వృద్ధాప్యం కమ్ముకున్న దేహాన్ని ‘కూలిపోయిన శరీరం’ అనడం ఎంతగా గుండెని మెలిపెట్టే మాట.
స్వర్గమనీ, నరకమనీ ఏవేవో వర్ణిస్తారు గానీ, శక్తులన్నీ ఉడిగిపోయి, ఐదడుగుల మంచానికి పరిమితమయే జబ్బులు కమ్ముకున్న వృద్ధాప్య దేహాన్ని మించిన నరకం మరేం వుంటుంది? అందుకే కవి అంటున్నాడు – “వృద్ధాప్యం నరకకూపం మంచం / వృద్ధాప్యం సర్వ ప్రపంచం మంచం”.
బహుశా, వృద్ధాప్యం లోని రాత్రుళ్ళు మరింత నరకం. అందుకే, “ఇదొక బావి లోలోపలికి జారిపోయే కత్తుల ఊబి” అని వృద్ధాప్యాన్ని వర్ణిస్తున్నాడు!
కేవలం వృద్ధాప్యం లోని భౌతిక స్థితిని మాత్రమే వర్ణించి వదిలి వేయకుండా కాస్త ముందుకు వెళ్లి, “మంచం దగ్గర నుండి మెల్లగా శరీరాన్ని / లాక్కొచ్చి గడప దగ్గరికి చేర్చితే” అనుభవంలోకి వచ్చే దృశ్యాలను కూడా మన ముందు చిత్రిక కడతాడు కవి. “చావిట్లో మేకుకు కట్టేసిన గేదె / ఉచ్చలో పేడలో రొచ్చులో అరుస్తూ మేకు చుట్టూ తిరుగుతూ “ తన స్థితికీ, మంచానికి పరిమితమైన వృద్ధాప్యానికీ తేడా లేని చేదు నిజాన్ని చెబుతుంది.
కాదు – “పశువుల మూగతనం కన్న రాళ్ళ మూగతనం కన్న / క్రూరాతిక్రూరమైన మనుషుల మూగతనం” అవగతమై, చావిట్లో మేకుకు కట్టేసిన గేదె స్థితి కన్నా మంచానికి పరిమితమైన వృద్ధాప్యం మరీ దయనీయమైనదన్న సంగతి చెబుతుంది.
ఈ తెలిసి రావడం ఒక్కోసారి ఎంత నిస్పృహ లోకి నెట్టి వేస్తుంది అంటే – “కొడుకులంతా తండ్రులవగానే వాళ్ళ తలిదండ్రులు / సుఖంగా అకస్మాత్తుగా చనిపోవాలని మీరంతా ప్రార్థించండి” అనీ, “సంబంధాలు / సంతానాలు నేరాలవుతున్నాయి” అనీ లోకానికి బిగ్గరగా చెప్పాలని అనిపించేంతగా!
ఒక్కసారిగా మీదపడిన అలవలె చదువరిని విస్మయపరిచే ఎత్తుగడతో తీసుకువెళ్ళే ఈ పద్యం, ఒక భయానక సామాజిక వాస్తవాన్ని, సకల మానవ సంబంధాల లోని డొల్ల తనాలని కప్పి పెట్టి వుంచే, మనిషి వృద్ధాప్యాన్ని మరింత దయనీయం చేసే మాయతెర రహస్యాన్ని విప్పుతూ ముగుస్తుంది! బహుశా, అందుకే ఈ పద్యం ఆధునిక తెలుగు కవిత్వంలోని అపురూపమైన కవితలలో ఒకటి అయింది.
అవును -
మనిషికి ‘వృద్ధాప్యం దిక్కుమాలినదైతే’,
మరి, ‘డబ్బులు లేని వృద్ధాప్యం’?
(ఆగష్టు 6, కవి శివారెడ్డి 74 వ పుట్టిన రోజు )
***** (*) *****
1-9-8/1/1, Giri Sikhara Plaza Apartments, Behind SBH, Ramnagar,, నా కళ్ళల్లో రెండే రెండు కన్నీటి చుక్కలు
దయనీయ వృధ్దావస్థ ….యే ప్రాణికైన తప్పని స్థితిని.. సహజాతి స్థితి ని అంగీకరించక తప్పదు…ముసిలితనంలో నిర్లక్ష్యంగా చూడబడడం నేటి నాగరికతా అవలక్షణము.అలాగే వొక జంతువు ఆహార సమీకరణను నోచుకోలేనపుడుిం అది కృశచి చనిపోతుంది….సోఫిస్టికేటెడ్ గా మెట్రో ఆశ్రమాలుండగా యిబ్బందెందుకో?రోజూ నడవలేక అడుక్కోలేక ఆకలితొో చనిపోతున్న ముసలి ప్రాణాలు పల్లెల్లో ప్రతిరాత్రీ ధ్వనించెే నిరాశ్రయపు నొప్పులు వేనవేలు…తెల్లారితే శవాలను సైతం దహనానానికి రాక వొంటరిగా పడుంటే పొరుగువారి సహాయంతో బంధువులతో పూడ్చబడుతున్నారు…
పిల్లలకు వ్యాపారాలను నేర్పాలి.మానవత్వాన్ని నేర్పేలోపు ముసలివారైపోతూ వాపోయే మధ్య యెగువమధ్య తరగతి వెతలు కవిత్వమౌతున్నాయి.యే ఆటవికపు తెగలో వెదురు మంచాలపై మోసుకొని దార్లో ప్రాణాలొదిలిన వారిని అక్కడే పాతిపెట్టి …యింతటి దయనీయ ముసలితనపు యాతనను అంగీకరించక తప్పదు…యవ్వనపు బాల్యపు పునాదులపై ముసలితనాన్ని మోస్తే బరువే కదా…సహాయాసరాలు కోరుకోవడం దుఖమే కదూ…వో హిందీ పాటలో…నేను నిన్ను వేలు పట్టి నడిపిస్తున్నాను…రేపు నీవు నేను ముసలి వాడిని అయ్యాక నా వూతకర్రవూ కావాలనే వో అసంబధ్ధ వ్యాపార వొప్పందం పై ఆలొోచించిస్తుంటాం….
వోల్డ్ యేజ్ …యిస్ నాట్ యే సిన్…కర్స్…యిట్ యిస్ టూ బి …
No doubt….K Siva Reddy’s poem is a great one in Modern Telugu Literature….Thanks to Vijay Kumar for introducing this poem with his poetic commentary..
“Gerontion”, the poem written by TS Eliot in 1919 is also to be read in this context.
థాంక్స్ రమాకాంత్ సర్ … ఇలియట్ పొయెమ్ చదువుతాను
వర్తమాన సామాజిక మానవ దృక్పధాన్ని అడుగంటి పోతున్న మానవీయతను స్పర్శిస్టు స్వార్ధపూరిత ముందుచూపుతో నవనాగరికత నడుస్టున్నా తీరు గొప్పగా చెప్పారుకవి .విశ్లేసిషణ బాగుంది -కొండ్రెడ్డి
చాలా మంచి విశ్లేషణ చేసారు సార్. నిజంగా మన కుటుంబ వ్యవస్థలో నానాటికీ దగజారుతున్న అనుబంధాలు, ఆత్మీయతలూ వయసు మళ్ళిన తల్లిదండ్రుల్ని, పెద్దల్ని ఇక ఏమాత్రం ఉపయోగం లేనివారిగా జమకట్టి వదిలించుకోడానికి చేస్తున్న ప్రయత్నాలూ.. వృద్ధాప్యం ఒక శాపంగా పరిణమిస్తోంది.. అటువంటిది డబ్బులేని వృద్ధాప్యం…మనుషుల్ని జీవచ్ఛవాలుగా మారుస్తోంది..చాలా హృదయవిదారకమైన కవిత..ఇంతమంచి కవితని ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదములు సార్.
ధన్యవాదాలు ఫనీంద్ర గారు
విశ్లేషణ మీకు నచ్చినందుకు సంతోషం సర్
I remember reading this in the AJ weekly’s featured ఈ వారం కవిత decades ago. Fantastic!
-వాసు-
” వృద్ధాప్యం నేరమవుతుంది
జీవించడం నేరమవుతుంది
దిక్కుమాలిన వృద్ధాప్యం – డబ్బులు లేని వృద్ధాప్యం! ”
దయనీయ వృద్ధాప్యాన్ని కళ్ళకు కట్టిన శివారెడ్డి పద్యం పరిచయం చేసిన విజయ్ కుమార్ గారు ధన్యవాదాలు
Here I am, an old man in a dry month,
Being read to by a boy, waiting for rain.
I have lost my sight, smell, hearing, taste and touch:
How should I use it for your closer contact?
And an old man driven by the Trades
To a sleepy corner. ( Gerontion by T. S. Eliot )