కిటికీలో ఆకాశం

సంకెళ్ళలో ధ్వనించిన స్వేచ్చాగీతం

డిసెంబర్ 2015

ప్రజలను దోపిడీ సంకెలల నుండి విముక్తం చేసేందుకు కవిత్వమై పుష్పించే అక్షరాలు తారసపడినపుడు రాజ్యం ఏం చేస్తుంది?
ఏం చేస్తుంది- దోపిడీని నిరంతరాయంగా కొనసాగించేందుకు తనకు అవసరమైన భద్రత కోసం తాను నిర్మించుకున్న జైలు గోడల నడుమ ఆ అక్షరాలను బందీగా చేస్తుంది!పీడన పీడ కలల నడుమ జీవితాలను గడిపే పేదవాళ్ళ గుండెలకు యింత సాంత్వన యిచ్చే ధైర్య వచనాలు ఎదురు పడినపుడు సింహాసనాలు ఏం చేస్తాయి?
ఏం చేస్తాయి – లోకం ఆదమరిచి నిద్రపోయే ఒక కాళ రాత్రి ధైర్య వచనాలను గాలిలో కలిపేసి, ఉదయమే ఒక వికృతమైన కట్టు కథ చెప్పి, ‘నమ్మి తీరవలసిందే’ అని లోకాన్ని దబాయిస్తుంది!

మరి, రాజ్యం నాలుగు జైలు గోడల నడుమ బందించిన అక్షరాలు ఊరికే వుంటాయా?

లేదు – అవి సంకెళ్ళ నడుమ పరిమళించే మరిన్ని స్వేచ్చా పుష్పాలను కలగంటాయి. తాము ప్రేమించిన పీడిత ప్రజల విముక్తం కోసం మరిన్ని అందమైన గీతాలను సృష్టిస్తాయి.ఆ ఊహలు ఒక్కోసారి రాజ్యాన్ని ఎంతగా భయపెడతాయో అర్థం కావాలంటే పాలస్తీనా కవి మహమ్మద్ దేర్విష్ రాసిన ఒక జైలు కవితని చదవవలసిందే! ఆ కవిత ఇట్లా సాగుతుంది-
జైలు గదిలో కవిని తనిఖీ చేయడానికి వొచ్చిన పోలీసు గార్డు ‘ఈ గదిలో ఈ నీళ్ళు ఎక్కడివి ? ఈ వెన్నెల ఎక్కడిది? ఈ సంగీతం ఎక్కడిది? ఈ స్వేచ్చ ఎక్కడిది?’ అని ప్రశ్నల వర్షం కురిపించినపుడు
‘నీటిని నైలు నది నుండి, వెన్నెలను బాగ్దాద్ నుండి, సంగీతాన్ని నా గుండె చప్పుళ్ళ నుండి, స్వేచ్చను మీరు నాకు తగిలించిన సంకెళ్ళ నుండి తెచ్చుకున్నాను’ అని కవి సమాధానం! చివరికి, బెంబేలెత్తిన పోలీసు గార్డు, తాను పోగొట్టుకున్న స్వేచ్చను తిరిగి యిమ్మని కవిని బతిమిలాడతాడు.

తెలుగు కవిత్వంలో శివసాగర్, వరవరరావుల జైలు కవితలు ప్రత్యేకమైనవి.

ముఖ్యంగా, వరవర రావు మొత్తం కవిత్వంలో ఆయన జైలులో గడిపిన రోజులలో రచించిన కవితలు కవిత్వ నిర్వహణ రీత్యా కూడా చాలా ప్రత్యేకంగా వుంటాయి. వరవర రావు మిగతా కవిత్వమంతా శత్రువును వెంటాడుతూ కసిగా పేల్చిన తుపాకీ గుళ్లలా గోచరిస్తే, జైలు కవితలు మాత్రం శత్రువు దొంగ చాటుగా తీసిన దెబ్బకు గాయపడి, ఏటి ఒడ్డున ఆ గాయాలను కడుక్కుంటూ పంటి బిగువున భరించే బాధలా మనల్ని మెలిపెడతాయి. ఉదాహరణకు, వరవర రావు రాసిన ‘సబ్ ఠీక్ హై’ అన్న కవిత చదవండి.

కవి జైలులో వున్నపుడు తనని కలవడానికి వొచ్చిన జీవిత సహచరి పలకరింపుకి ఇచ్చే ఒక మృదువైన సమాధానంలా మొదలైన కవిత, ఎక్కడెక్కడో ప్రయాణించి, చివరికి జైలు పహారా పోలీసుల ‘సబ్ ఠీక్ హై’ మాటతో ముగుస్తుంది!

సబ్ ఠీక్ హై

ఇక్కడ కష్టంగా ఉందా అని నువ్వడిగినావు
అవును, ప్రజల కష్టాలు తుడిచెయ్యడానికి
అజ్ఞాతంలో కష్టాలు అనుభవిస్తున్న
కామ్రేడ్స్ ను తలచుకుంటే
ఈ నిర్వ్యాపకత్వం కష్టంగా వున్నది

నాకిక్కడ సుఖంగా వున్నదా అని నువ్వడిగినావు
ఈ విశాల దేశం కోట్లాది జనం గుండెల్లో
మబ్బులో దాగిన మెరుపులా వెలుగుతున్న
భవిష్యత్తు మీది ఆశ ఈ సంకెళ్ళలో ధ్వనిస్తున్నది

విప్లవాన్ని కబళించాలని నోళ్ళు తెరుచుకున్న
జైళ్ళ గర్భంలో కూడ కలకలం
పహారా కాస్తోన్న దోపిడీ జెండాను తప్పించుకుని
ఇక్కడికి ఉదయమూ
జన హృదయమూ వచ్చి పలకరిస్తూనే వున్నాయి
జైలు గోడ ముళ్ళ తీగ మీద కూర్చొని పక్షులూ
ఖైదీల చెమటలో చిగురించిన మల్లెలూ
మౌన సందేశం వినిపిస్తూనే వుంటాయి

రాత్రి గాలి వీస్తూ వుంటుంది
నా కవి మిత్రుడు చెప్పినట్లు
జైలు గోడ ముళ్ళ తీగెల్లో చంద్రుడు బందీ అవుతాడు
మేం పాడీ, మాట్లాడీ విప్లవ స్వప్నాల్లో మునిగిపోతాం

పాపం – ఒంటరిగాళ్ళు
నిద్రకూ, ఆశ్రయానికీ వెలియైన పేద పోలీసులు మాత్రం
‘సబ్ ఠీక్ హై ‘ అని గంట గంటకూ ఆవలిస్తూ వుంటారు

‘జైలులో కష్టంగా ఉందా?’ అని జీవిత సహచరి అడిగిన ప్రశ్నకు ‘ప్రజల విముక్తి కోసం అజ్ఞాతంలో కామ్రేడ్స్ పడే కష్టం జ్ఞప్తికి వొచ్చి, జైల్లోని తన నిర్వ్యాపకత్వం కష్టంగా వుంది’ అంటున్నాడు కవి!‘సుఖంగా ఉందా ?’ అని అడిగితే, ‘జనం గుండెల్లో వెలుగుతోన్న భవిష్యత్తు పైని ఆశ సంకెళ్ళలో మెరిసి సుఖంగా వుంది’ అంటున్నాడు !ఎట్లా సాధ్యం ఇది?

బేషరతుగా పిల్లల్ని ప్రేమించడం మరేమీ తెలియని తల్లులకు ఆ పిల్లల కష్ట సుఖాల పట్టింపు తప్ప, తమ కష్ట సుఖాల పట్టింపులు వేరేగా వుంటాయా?తన చర్యలను ఎవరూ ప్రశ్నించకుండా రాజ్యం కొన్ని హద్దులను నిర్ధారిస్తుంది. జెండా, గీతం లాంటి కొన్ని ప్రతీకలని పాలితుల మనసులలో నాటి వాళ్ళను నిద్రపుచ్చుతుంది.

అందుకే, ‘పహారా కాస్తోన్న దోపిడీ జెండాను తప్పించుకుని ఉదయమూ, జన హృదయమూ వచ్చి పలకరిస్తూనే వున్నాయి’ అని అంటున్నాడు కవి!అంతే కాదు -
‘ జైలు గోడ ముళ్ళ తీగ మీద కూర్చొని పక్షులూ / ఖైదీల చెమటలో చిగురించిన మల్లెలూ / మౌన సందేశం వినిపిస్తూనే వుంటాయి ‘ అంటున్నాడు.

ఏమిటి ఈ పక్షులూ, మల్లెలూ వినిపించే మౌన సందేశం?

పీడిత ప్రజల విముక్తిని కలగనే కవులూ, విప్లవకారులు స్వేచ్చా విహంగాలే కదా!

ముళ్ళ తీగ మీద కూర్చున్నామని పక్షులూ, జైలులో బందింపబడి ఉన్నామని కవులూ తమ స్వేచ్చాగానాలను ఆపివేస్తారా? ఆ స్వేచ్చాగానాల పరిమళాలు జైలు గోడల మధ్యనే సమసిపోతాయా?

‘జైలు గోడ ముళ్ళ తీగలు చంద్రుడిని బందించినట్టు’ భ్రమసి మురిసి పోవలసిందే గానీ, నిజంగా విశాల లోకం మీద దయతో వెన్నెల కురిసే ఆ చంద్రుడిని బందించే శక్తి ఆ ముళ్ళ తీగల జైలుకు వుందా?

మహా అయితే, ప్రజల అసహనాల సెగ ఏదీ కాసేపు రాజ్యానికి తగలకుండా ‘అంతా బాగానే వుంది’ అన్న ఒక భ్రమను దట్టించి, ‘సబ్ ఠీక్ హై’ అని అర్థరాత్రి గంభీర ప్రకటన చేస్తుంది!

**** (*) ****