కిటికీలో ఆకాశం

లోపలి అంతరాలను ప్రశ్నించిన కవి యాకూబ్ గళం – అవ్వల్ కల్మ

సెప్టెంబర్ 2016

పీడనకు గురవుతున్న సమాజం నుండి కొన్ని బలమైన నిరసన గళాలు వినిపించినపుడు, ఆ మొత్తం సమాజం గాయాలని ఆ గళాలు గానం చేస్తున్నాయనీ, పీడనకు గురవుతున్న ఆ సమాజం మొత్తానికి బలమైన ఆ కొన్ని గళాలే ప్రాతినిథ్యం వహిస్తున్నాయనీ ఆ సమాజం అవతలి వాళ్ళు భావిస్తారు. కానీ, క్రమక్రమంగా ఈ బలమైన గళాల వలన అవమానాలకూ, పీడనకూ గురైన ఆ సమాజం లోపలి అట్టడుగు గళాలు, మరి ఈ సమాజం లోలోపల పీడనకు గురవుతున్న మా సంగతేమిటని ప్రశ్నల్ని సంధిస్తాయి. పీడనకు గురి అయ్యే ఏ సమాజమైనా తన దుస్థితికి కారణమైన మహా బలమైన వ్యవస్థతో తలపడే ముందు అంతర్గతంగా పరిష్కరించుకోవలసిన అంతరాలను ఈ అట్టడుగు గళాలే చర్చకు పెట్టి నిరసనలను ప్రజాస్వామికీకరిస్తాయి.

తెలుగు కవిత్వంలో ముస్లిం మైనారిటీ వాదం బలంగా ముందుకు వచ్చినపుడు, ముఖ్యంగా బాబ్రీ మసీదు విధ్వంసం చుట్టూ అల్లుకుని వచ్చిన ముస్లిం కవిత్వం తెలుగు సాహిత్యాన్ని తన వైపు తిప్పుకున్నపుడు, మొత్తం ముస్లిం మైనారిటీ సమాజమంతా ఎదుర్కుంటూ వున్న వివక్ష ఒక్కటేననీ, ఆ సమాజం లోపల నిచ్చెన మెట్లేవీ లేవనీ, మెజారిటీ సమాజం భావించింది. అట్లాంటి కాలంలో వచ్చిన ఒక అరుదైన కవిత – కవి యాకూబ్ రాసిన ‘అవ్వల్ కల్మ’!

అవ్వల్ కల్మ

‘చెబితే నమ్మరు గానీ మా బాధనెవరూ మాట్లాడడం లేదు
మళ్ళీ ఇక్కడ కూడా పదో, పదకొండో తరం వాళ్ళే
తాము కోల్పోయిన వైభవాల తలపోతల్నే
అందరి భాషగా మాట్లాడుతున్నారు
అనుభవాల దోపిడీ అంటే ఇదేనేమో

నిజానికి- నవాబు, ముస్లిం, సాయిబు, తురక
ఎవరెవరు ఏ పేర్లతో పిలవబడుతున్నారో అదే వాళ్ళ వర్గం – వర్ణం
చేజారిన రాజరికం, జాగీరు, నవాబీ, పటేలు దర్పాల్లో
బతికిన వాళ్లకు కోల్పోయిన సుఖాల ఆనవాళ్ళయినా మిగిలాయి
రెక్కకూ డొక్కకూ బతుకు బందీఖానా ఐనవాళ్ళం
ఎప్పుడూ మిగుల్చుకోవడానికి ఏమీ లేనివాళ్ళం
చెప్పుకోవడానికి మాకేం మిగుల్తుంది

‘ ఓయమ్మా ‘ అని పిలిచే మా అమ్మల్ని
‘అమీజాన్’ అని పిలవాలని తెలియదు
అబ్బూ, అబ్బాజాన్, పప్పా అని పిలవాలంట నాన్నల్ని
మాకేం తెలుసు – మా అయ్యలు నేర్పనేలేదు
హవేలీ, చార్ దీవార్, ఖిల్వత్, పరదాలంటే ఏమిటో
మా తడికెల అంతఃపురం గాళ్ళకు ఏం తెలుసు?
నమాజులంటే ఒంగి లేవటమేనని మా తాత చెప్పేవాడు
ఈ బిస్మిల్లా హిర్రహిమాన్, అల్లాహో అక్బర్, జీహాద్ ల
భాషనెప్పుడూ నేర్వలేదు

పండగలంటే పచ్చడన్నం మాకు
బిర్యానీలు, తలాప్ లు, పలావ్ లు, షీర్ ఖుర్మాలు మీకు
షేర్వానీలు, రూమీ టోపీలు, సలీం షాహిం బూట్లు
ఘుమ ఘుమలాడే ఈదర్లతో మీ వస్త్రాలు
వాయు వస్త్రాల నగిషీల్తో మేము
చెబితే నమ్మరు గానీ చెప్పుకుంటే మీ ముందు
పలుచనైపోతామని భయం

పెంటుసాబు, ఉద్ధండు, దస్తగిరి, నాగులు, చిన ఆదాం
లాలు, పెద మౌలా, చినమౌలా, షేకు శ్రీనివాసు
బేతంచెర్ల మెయిను, పాటికట్ట మల్సూరు – ఇవే కదూ మా పేర్లు
షేకు, సయ్యద్, పరాస్ – మీ దర్పాల హోదాల కాన్దాన్ల
పేర్లు చెప్పి దగ్గరకైనా చేరనిచ్చారా?
లద్దాఫ్, దూదేకుల, కసాబ్, పింజారీ -
వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులమయ్యాం
మీ ఇళ్ళల్లో నీళ్ళు నింపి ‘ బెనిస్తీలమై’
గుడ్డలుతికితే దోభీ దోభన్ లమై
జుట్టు గొరిగితే హజ్జాం లమై
దొడ్లు కడిగితే మెహతర్, మెహతరానీలమై పోయాం
మీరన్నట్లు అందరమూ ముసల్మానులమే
కాదనం – కానీ ఈ వివక్ష సంగతేమిటి?

మాకూ ఇష్టమే – తవ్వకాలలో ఎప్పటి నుంచో తేలని లెక్కలు
ఇప్పుడు తేలిపోతాయంటే ఇష్టం కాదూ ?
ఉమ్మడి శత్రువు గురించి కాదిప్పుడు
ఉమ్మడి మిత్రుత్వ మర్మం తేలాలిప్పుడు
అణచివేయబడిన వాళ్ళంతా దళితులే – కాదనం
కానీ, అణచివేతల నిర్వచనం తేలాలి

చిత్రం – మాకొచ్చిన భాష మాది కాదట
మాదనే భాష మాకు రాదు
చివరికిలా మాతృభాష లేని సంకటంలో పడ్డాం
‘ ముసల్మానువై వుండి కూడా తెలుగులో బాగా మాట్లాడుతావే ‘
నవ్వాలో, ఏడవాలో తెలియని విచిత్ర సందిగ్ధం
తుదకి కలలన్నీ తెలుగే, కన్నీళ్ళూ తెలుగే
ఆకలై అన్నం అడిగినా, ఆర్తనాదం చేసినా
మొత్తం భావ వ్యక్తీకరణమంతా తెలుగే

నమాజు చేయమంటే దిక్కులు చూశాం
ఆజాలు విని అదిరిపడ్దాం
సూరాల శ్రుతుల్లో రాగాలు మాత్రం వెతుక్కున్నాం
మాకు రాని భాషలో పూజించమంటే
చివరికి ఆరాధనానందాన్ని కూడా కోల్పోయాం
చెబితే నమ్మరు గానీ మా బాధనెవరూ మాట్లాడడం లేదు

***

ఆత్మ గౌరవం అందరి ముందూ పరిచిన ‘దస్తర్ఖాన్’
అది ఐనింటి వాళ్ళు మాత్రమే అనుభవించే హక్కు కాదు
తోటి వాడి గౌరవంతో ఆడుకునేది
ఎవరైనా ద్రోహం ద్రోహమే
అనుభవాల దోపిడీ అంతకంటే మరీ ద్రోహం ‘

ఈ కవిత లోని ప్రత్యేకత ఏమిటంటే, తర తరాలుగా అనుభవిస్తూ వస్తోన్న బాధ లోపల సుళ్ళు తిరుగుతూ వున్నా, తమను పీడనకు గురి చేసిన తమ సమాజం వారి పైన బిగ్గరగా అరవడం లాంటిది లేకుండా, లోలోపలి బాధని లోలోపలే గొణుక్కుంటూ వున్నట్టుగా, ‘చెప్పుకుంటే మీ ముందు పలుచనైపోతామని భయంగా’ పలకడం!

అవును కదా! పీడనకు గురవుతున్న మైనారిటీ సమాజం ఆవేదనను, ఆగ్రహాన్నీ మెజారిటీ సమాజం ముందు పెట్టే సమయంలో, అంతర్గతంగా వున్న ఈ అంతరాల దుఃఖ గానం ఇప్పుడు ఎందుకని ప్రశ్నలు ఎదురయే ప్రమాదం ఒకటుంది కదా! అట్లా అని, మైనారిటీ సమాజం లోని ఈ అట్టడుగు బలహీన గళాలకు మెజారిటీ సమాజం ప్రదర్శించే పీడనతో ఫిర్యాదులు లేవని కాదు గదా! ఏక కాలంలో, ఒక వైపు మెజారిటీ సమాజం ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి తన మైనారిటీ సమాజంతో కలిసి నడుస్తూ, మరొక వైపు తన సమాజం ప్రదర్శించే ఆధిపత్యంతో తలపడడం ఒక సవాలు.

మాటలూ, మర్మాల వెనుక దాక్కునే కళలు నేర్వని అట్టడుగు మనుషుల స్వరం ఈ కవిత నిండా పరుచుకుని వినిపిస్తుంది. చివరికి, బాధల్ని ఏకరువు పెట్టుకునే దగ్గర కూడా ఐన వాళ్ళే ముందు నిలబడి, తాము కోల్పోయిన సంపదల, విలాసాల గురించే చెబుతూ, తమ స్వరాన్ని వెనుక వరుసల లోకి నెట్టి వేయడం ఏమిటని కొంత మృదువుగానే ఈ కవిత ప్రశ్నిస్తుంది.

నిజానికి ఈ కవితకు అద్భుతమైన శీర్షిక పెట్టడంలోనే కవి సగం విజయం సాధించాడు.

ఇస్లామీయ సంప్రదాయంలో పిల్లలకు నేర్పించే ఆరు బీజాక్షరాలలోని తొలి బీజాక్షరమే ‘అవ్వల్ కలిమ’.
ఇంతకూ, ఈ తొలి బీజాక్షరం చెప్పిందేమిటి?

“lā ilaha illa Allahu, Muhammad ur-rasul Ullah”
(ఆరాధించదగిన దేవుడు అల్లా ఒక్కడే – మహమ్మద్ అతడి వార్తాహరుడు)

దేవుడొక్కడే అని చెప్పిన పవిత్ర మతంలో ఈ తారతమ్యాల మాటేమిటని, మతం లోపలి అంతరాల నిచ్చెన మెట్ల అట్టడుగున వున్న తమ బాధలని గురించి ఎవరూ మాట్లాడరెందుకని కవి వాపోతున్నాడు!

బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో ‘తవ్వకాలలో తేలే లెక్కలు’ తేలనీయమంటూనే, ఉమ్మడి మిత్రుత్వ మర్మం తేలిపోవాలని అంటున్నాడు! (‘మాకూ ఇష్టమే – తవ్వకాలలో ఎప్పటి నుంచో తేలని లెక్కలు / ఇప్పుడు తేలిపోతాయంటే ఇష్టం కాదూ ? / ఉమ్మడి శత్రువు గురించి కాదిప్పుడు / ఉమ్మడి మిత్రుత్వ మర్మం తేలాలిప్పుడు’)

ఒక వైపు భయభక్తులతో తన బాధని చెప్పుకుంటున్నట్లు కనిపిస్తూనే, మరొక వైపు వ్యంగ్యంగా చెప్పడం కూడా ఈ కవితలో కనిపిస్తుంది- (హవేలీ, చార్ దీవార్, ఖిల్వత్, పరదాలంటే ఏమిటో / మా తడికెల అంతఃపురం గాళ్ళకు ఏం తెలుసు?)

ఇస్లామీయ సంప్రదాయం లోని తొలి బీజాక్షరమే కాదు – మహమ్మద్ ప్రవక్త చివరి మాటల సంగతేమిటి?
ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భేదాలు లేవు. వర్ణ భేదం లేదు. మనుషులందరూ ఒక్కటే! అందరి తండ్రీ, దైవం ఒక్కరే!

మరి, ఇన్ని పవిత్ర భావనలతో ఏర్పడిన మతంలో, మనుషులు లద్దాఫ్, దూదేకుల, కసాబ్, పింజారీ, మెహతర్, దోభీ, హజ్జం వగైరాలుగా ఎందుకు వివక్షకు గురవుతున్నట్టు? హిందూ మతం లోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అవమానాలనూ, అణచివేతనలనూ భరించలేక ఒకింత గౌరవం కోసం వేరొక మతంలోకి వెళ్లి కూడా, పాత మతం వాసనలను వదలక, పెంటుసాబు, ఉద్ధండు, దస్తగిరి, నాగులు, చిన ఆదాం, లాలు, పెద మౌలా, చినమౌలా, షేకు శ్రీనివాసు, బేతంచెర్ల మెయిను, పాటికట్ట మల్సూరు లుగా ఇంకా అవమానాలు ఎదుర్కుంటున్నారా? అందుకే, ఒక ఊరడింపు కోసం తరాల కిందట ఇస్లాము లోకి వలస వెళ్లి, చివరికి ఆరాధనానందాన్ని కూడా కోల్పోయారా ? అందుకే, ‘తుదకి కలలన్నీ తెలుగే, కన్నీళ్ళూ తెలుగే’ అని భాషకు సంబంధించి కూడా ఎదుర్కుంటూ వున్న సమస్యని తలుచుకుని కవి బాధపడి పోయాడా?

బహుశా, అందుకే -

ఆత్మ గౌరవం అందరి ముందూ పరిచిన ‘దస్తర్ఖాన్’

అది ఐనింటి వాళ్ళు మాత్రమే అనుభవించే హక్కు కాదు

అని ఒకింత ధిక్కార స్వరంతో ఈ కవితని ముగించాడు!

జయహో కవిత్వం !!

**** (*) ****