కబుర్లు

అమ్మల కొలువు

సెప్టెంబర్ 2016

త్య శ్రీనివాస్ తెలుగు కవిత్వ లోకానికి కవిగా సుపరిచితుడు. వర్షంలో తడిసి, ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పుకున్న అడవి మార్మిక సౌందర్య పరిమళమేదో తన కవిత్వంలో పరుచుకుని వుంటుంది. అతడు కలె తిరిగిన అడవిలాగే అతడి కవిత్వం కూడా సరళ గంభీరంగా వుంటుంది. అడవి నుండి బలవంతంగా వేరు చేయబడుతోన్న ఒక పురా మానవుడి దుఃఖం ఏదో అతడి కవిత్వ ప్రవాహం పైన తడి తళుకు వలె గోచరిస్తుంది.

ప్రకృతినీ, అడవుల్నీ ఆలింగనం చేసుకుని, వాటి తరాల గాథల్ని ప్రేమగా ఆలకించి, కవిత్వమై పలవరించిన కవి కాబట్టే, అమ్మలనూ, అమ్మమ్మలనూ పట్టించుకున్నాడు సత్య.

కేవలం తన అమ్మను మాత్రమే కాదు. తనకు తారసపడిన తన స్నేహితుల తల్లులనూ, తనకు ఏమీ కాని తల్లులనూ పట్టించుకున్నాడు. ఆ తల్లులలో ఆంధ్ర, రాయలసీమ తల్లులున్నారు – తెలంగాణ తల్లులున్నారు. పట్టణ ప్రాంత తల్లులున్నారు, పల్లె తల్లులున్నారు. అట్లాగే హిందూ, ముస్లిం తల్లులూ వున్నారు.

ఈ తారతమ్యాలు తెలియని సత్య శ్రీనివాస్ కు వాళ్ళంతా ప్రేమను పంచిన తల్లులే! బహుశా, అందుకే, గొప్ప స్త్రీ మూర్తులను దర్శించిన తన అనుభవాలను మనతో పంచుకోవడానికి ఏ కాగితం పైనో ఒలికే నాలుగు అక్షరాలు సరిపోవని భావించి, తాను దర్శించిన ఆ ప్రేమమయ మాతృ మూర్తులను మనకు సజీవంగా పరిచయం చేసేందుకు నీటి రంగులతో వేసిన వర్ణ చిత్రాలను ఎంచుకున్నాడు. ఆ వర్ణ చిత్రాలను ఒక ప్రదర్శన రూపంలో మన ముందుకు తెచ్చేందుకు 14 ఏళ్ళ సుదీర్ఘ కాలం శ్రమించాడు.

14 ఏళ్ళ క్రితం సత్య ఈ కలను తాను పెరిగిన బంజారా హిల్స్ లోని తొలి జర్నలిస్టు కాలనీలోని నెంబర్ 20 లో వున్న తన ఇంటిలో కన్నాడు. ఇప్పుడా ఇల్లు లేదు. సత్య వాళ్ళు ఆ ఇంటిని అమ్మి వేసి వెళ్లి పోయిన తరువాత ఒక పెద్ద బిల్డరు ఆ స్థలంలో పెద్ద భవంతిని కట్టి జర్మను వాళ్ళ గోథె సాంస్కృతిక కేంద్రానికి అద్దెకిచ్చారు. ఇవేవీ తెలియని మన సత్య హైదరాబాద్ నగర శివారుల్లో ఒక కుటీరం లాంటి ఇల్లు కట్టుకుని బతికేస్తున్నాడు.

ఇక్కడే బాలచందర్ సినిమాలలో కనిపించే కొన్ని సంఘటనలు అతడి జీవితంలో చోటు చేసుకున్నాయి.
14 ఏళ్ళుగా మోసుకుంటూ వొస్తోన్న తన కల – అమ్మల నీటి రంగుల చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలని అనుకుంటూ వున్న సమయంలో ఈ గోథె సెంటర్ గురించి చదివాడు. ఆ సెంటర్ వున్న చిరునామా – ‘ ప్లాట్ నెంబర్ 20 ; బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3’ చూసి, పరమానంద భరితుడయ్యాడు. ఒకప్పుడు, వాళ్ళ అమ్మ సంగీతంతో, తోడబుట్టిన వాళ్ళ కళలతో, ఇంటికి తరచుగా వచ్చీపోయే కవులు, రచయితల సంభాషణలతో కళకళలాడిన ఇల్లు ఇవాళ జర్మన్ సాంస్కృతిక కేంద్రం అయినందుకు చాలా సంతోషించాడు. అక్కడే, ఆ చోటులోనే తాను సృజించిన అమ్మల వర్ణ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని తపన పడ్డాడు!

ఏదైతేనేం… కవి యాకూబ్ లాంటి మిత్రుల సాయంతో తాను పెరిగిన, తన జ్ఞాపకాలు ఇంకా అల్లుకుని వున్న ఆ ప్లాట్ నెంబర్ 20 చిరునామాలో ’20 మెమోయిర్స్ ‘పేర ప్రదర్శన నిర్వహించాడు. అక్కడ తన వర్ణ చిత్రాల ప్రదర్శన నిర్వహించుకోగలిగినందుకు సత్య మాత్రమె కాదు, ఒక అరుదైన ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం దక్కినందుకు గోథె సెంటర్ భవన ఓనర్, గోథె సెంటర్ నిర్వాకులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

ఇంకా ఆ కాలనీలోనే వుంటున్న వాళ్ళు, సత్య ఇంటితో, మరీ ముఖ్యంగా సత్య వాళ్ళ అమ్మతో అనుబంధం వున్న అనంత్, కందుకూరి రమేష్, సాంబశివ రావు, సిద్దార్థ, అక్బర్, ఖదీర్, ఎమ్మెస్ నాయుడు, కుప్పిలి పద్మ, మోహన్, శంకర్, ఏలే లక్ష్మణ్ లాంటి ఎందరో కవులు, రచయితలు, చిత్రకారులు ఆ ప్రదర్శనకు వచ్చి, తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. ఆ జ్ఞాపకాల తలపోతల కోసమే ప్రత్యేకంగా ‘down the memory lane’ పేర ఒక రోజు ఏర్పాటు చేసాడు సత్య!

ప్రేమ మూర్తులైన అంతమంది అమ్మలు, అమ్మమ్మలు కొలువైన ప్రదర్శనలో, సత్య గీసిన వాళ్ళ నాన్న గారి చిత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ.

నాన్నలు తమ స్నేహితులు కొందరిని పోగేసి, కొన్ని డబ్బులు పోగేసి ఒక స్థలాన్ని సంపాదించి ఇళ్లనైతే కట్టగలరు గానీ, ఆ కట్టిన ఇళ్ళలో ఇంత జీవం నింపి, ఆ ఇళ్ళ సముదాయాన్ని మనుషులు తిరుగాడే అందమైన కాలనీలుగా మార్చేది అమ్మలే.

బహుశా, అందుకే ఈ అమ్మల కొలువుని తమ ఊళ్ళో కూడా ప్రదర్శించమని సత్యను వైజాగ్, విజయవాడ మిత్రులు కోరుతున్నారు.

జ్ఞాపకాలకు అంతం వుండదు – ముఖ్యంగా అమ్మలతో, అమ్మమ్మలతో ముడిపడి వున్న జ్ఞాపకాలకు.

**** (*) ****