ఆ గదిలోకి వెళ్ళాక
మనల్ని మనం మరచిపోవల్సిందే
పొడి పొడి అంకెలబిళ్ళ
మన మెడలో వేలాడదీస్తరు
గదావరణమంతా శీతలీకరింపబడ్తదికదా
ఉచ్వాస నిశ్వాసలు, హృదయ స్పందనలు, భావోద్వేగాలు
క్రమబద్దీకరింపబడతయి
నిశ్శబ్దీకరింపబడతయి కూడా-
ఎదురుగ్గా గాజు తెరల కావల నుంచి
అతనో అమెనో సైగలిస్తుంటరు
కుడిచేతి నాలుగువేళ్ళు
ఎడం చేతి నాలుగు వేళ్ళు
రెండు బొటనవేళ్ళు ఆ పరికరం మీద వుంచమని-
రక్తప్రసరణలు ఒలకొద్దు
చేతిరాతల లిపి అందం అంటుకోవద్దు
అరఫీటు స్టాండు మీద బుద్దిగా కూచుని
ముఖాన్ని సరిగ్గా పెట్టాలె-
కళ్ళలోంచి ఏ దృశ్యాలు ఊరవద్దు
ముఖ కవళికల స్వేచ్చ అరికట్టుకోవాలె
వాళ్ళకు కళ్ళు, ముఖము, చేతివేళ్లు
మాత్రమే అవసరం
ఆత్మ వుందో లేదో
సంపద్వంతంగా కొట్టుకుంటుందో లేదో
ఈ(e-) పరమాత్ములకు అక్కర్లేని విషయం
గదిలోంచి బయట పడ్డాక
ఇల్లలుకుతూ ఈగ
తన పేరు మరచిపోయినట్లుగనే
పని చేస్తూ, చేస్తూ
నా నెంబర్ బిళ్ళనే గుర్తుంచుకుంటున్న
నా రేపటి ప్రపంచాన్ని
వీసా చుట్టే అల్లేసుకుపోవడం
అలవాటైపోయింది నాకు-
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్