కవిత్వం

కొన్ని ప్రశ్నలు – ఒక ముగింపు

08-మార్చి-2013

గడ్డ మీద నిల్చుని
నది మీది ప్రతిబింబాల అంతరంగాల్ని
కొలవగలమా,
అడుగు ముట్టాలేమో-
చెట్టు చిగురాకు కొమ్మ కొసన వూగుతూ
రంగుల హరివిల్లు మీద
వాన చినుకులై కురువగలమా,
మబ్బులో మూగాలేమో-
దారివెంట పోగొట్టుకున్న వెండి కలలతో
అదేపనిగా
తనలో తనుగా
గులుగుతూ పోగలమా,
ఎలదేటి పాటొకటి
వెంట రావాలేమో-
శత్రునిర్మిత సుదీర్ఘ రాత్రుల
తీరమైదానాల్లో
ఒక్కడిగా నడువగలమా,
అల్లుకున్న పదసైన్యాల గూటిలో
ప్రమత్తంగా కన్ను మలపాలేమో-
అడివినంతా గాలించినా
ఏ కూత యే పక్షిదో
ఏ ఆకు కన్నం యే విలుకాడు చేసిందో
కనిపెట్టగలమా,
జకముక రాపిడిలో
గిరిజనుడై పోల్చాలేమో-
సైకత చ్చాయల
నిదుర విహారంలో
సుఖానందాల సముద్రమట్టాన్ని
స్పృశించగలమా,
గొర్వెచ్చటి కలై దూరి, గిలిగింతలు పెట్టాలేమో -

ఏ తొవ్వ
ఎన్ని మలుపుల మెలికల విరిగిపోతుందో
దూసిన బాణం పుల్ల
ఏ రణరంగాన్ని అంగాంగాలుగా దునుమాడుతుందో
సిరా జల్లిన తెల్లకాగితం
ఏ ఆకాశ వరమై ఎవరికై అవతరిస్తుందో
ఇదమిత్తంగా చెప్పగలమా
ఖరాఖండిగా తేల్చగలమా

అలవికాని అపురూపాపేక్షల
ఒడిసి పట్టుకోజాలని సాహస క్రియా విన్యాసాల
పదిపదుల పరిపూర్ణ జీవితాన్ని
అన్ని వైపుల్నుంచీ
ఆక్రమించుకుంటే తప్ప…