కవిత్వం

ద్వంద్వ సమాసం

ఫిబ్రవరి-2014

శ్రావ్యంగా
వినడానికి వీనులు గావాలె
అరవై ఏండ్ల కల వలపోతని వినకపోవడానికి
బ్రహ్మ చెవుడు గావాలె

తెరిపిలేని వీక్షణానందానికి
అక్షులు గావాలె
తనువుల నంటువెట్టుకుని
బతుకుల బుగ్గి చేసుకున్న అమర దృశ్యరూపాలు
కనబడకపోవడానికి
గుడ్డి కనుగుడ్డొకటి గావాలె

తెలుగు తేనియలు చప్పరించడానికి
సమైక్యపు లాలాజలంలో ఈదడానికి
రుచికరమైన నాలుక గావాలె
ఆంబుక్క పెట్టడానికి
అడ్డుకునే అడ్డగోలు మాటల కోసం
మడత పడ్డ నాలుక కూడా గావాలె

హాస రేఖల ప్రదర్శనకు
ముఖారవిందం గావాలె
ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినట్టు
టీవీలో చూపినపుడు
వికృత ప్రకోపాల జేవురింపు మొహం
అత్యవసరంగా గావాలె

విశ్వాన్ని ప్రేమించగలిగే
విశాల సహృదయత గావాలె
నోటికొచ్చే బుక్క నెత్తగొట్టడానికి
ఎంతకైనా దిగజారే కుత్సిత మనసు
గట్టిదే ఖచ్చితంగా గావాలె

కుప్పమో కడపకో తప్ప
తంగెళ్ళు దాటని కాళ్ళతో
సీమ చెట్టుకో, కోస్తా మిర్చికో తప్ప
పెట్టుపోతలు జరుపని చేతులతో
వెయ్యికాలాల పెత్తనం
ఎన్నికల్లేకుండా మాకే గావాలె

ప్యూపాదశ నుంచీ సీతాకోకచిలుక అయ్యేవరకూ
1953 అనంగీకార కలివిడి మొదలు 2013 నిరవధిక కన్నారని ఆకాంక్ష వరకూ
అడ్డుకొంటూనే వుండాలె

అయితే గియితే
అన్నీ అన్నీ అన్నీ వున్న
హైదరబాద్ మాకే గావాలె

విడిస్తే గిడిస్తే
మా భీషణ ప్రతిజ్ఞలేం గాను
తొడగొట్టిన పౌరుషాలేం గాను
తేరగా మేసే మా నోరేం గాను

అంచేతా మేమందరం గుడ్క

వొదల బొమ్మాళీ
నిన్నొదల…!!!