నడుస్తున్న తొవ్వ
కొంచెం కొంచెం ఒత్తుకస్తున్నది
మొలకేస్తున్న నువ్వుగింజంత కలకు
పొట్రాయి తగిలితే
నీరెండ పరిహాసం-
నెత్తిమీద పుట్టెడు వారసత్వం
కారడ్డాలకు కథలయితున్నయి
పోలీసు పహరాల్ని
ముళ్ళకంచెల్ని దాటొస్తది
మీ కళ్ళలో పోసుకున్న
ముళ్ళవలయాలనే దాటొస్తలేదు
అఖిల పక్షాన్ని
నీ పక్షంగ జేసుకుని
భుజాలెగరేస్తవు
నా రెక్కలిరగ్గొట్టి
ప్రత్యేక పాకేజీల సోది పెడ్తవు
పత్రికా నీదే భాషా నీదే గనుక
నా తండ్లాటకు దొరతనం తొడుగుతవు
కాలయాపనకోసం
కాలం నీకు కలిసొస్తది
రుతువులన్నీ రంగేసుకొని
ఇందిరమ్మ బాటపొంటి నడుస్తూ
మట్టి విశ్వాసాన్ని
వంకరతోకతో ఎక్కిరిస్తయి
ఆంధ్రారోగి కోరిన పథ్యాన్నే
అత్తెసరు డిగ్రీల అధిష్టానం వైద్యుడు ప్రిస్క్రిప్షన్ రాసిస్తడు
కావూరీ, టీజీ , అల్లాహో అక్బర్
మూడింట కాగినారహో, క్యా అల్లా
తెలంగాణని తలాయింత
అక్షరమక్షరం నమిలేద్దామనే-
కళ్ళకు బట్ట కట్టినా
కాళ్ళకు తాడు కట్టినా
తీరాన్ని ముద్దాడి
సాగర హారాన్ని మెడల ధరించినం
తలొక్కరు మాయల మబ్బుల్ని గుప్పిస్తుంటే గెంతొస్తలేదు
తిప్పలు పడి
ఎన్ని తొవ్వల్ల నడిచినా
రొప్పుతున్న ముసలవ్వను
గొప్పగ పొగిడినా
ఏంచేస్తావన్నది కాదన్నయ్యా
ఏం చేసినావన్నదే చూస్తం
వెన్ను విరిచిందే గద నీ గత ప్రాభవం ,
అనుభవం
ముడుచుకున్న బుర్కపిట్ట కాదు
వల పన్నుతున్నవు గని -
కాలి కాలి కాకలు తీరినం
ఎదురురాని కుటిల మర్మపు కాలానికి మొక్కాలె
పున్నమని అమాసని
గీతలేడ గీసుకోగలం
ఎన్ని వాయిదాలో, ఏకాభిప్రాయాలో
అయోమయపు అర్థంలో
మీ ద్రోహపు వ్యూహ రచన గెలవడానికి-
అప్పటిదాంక
ప్రతి ఇంటిల తెలంగాణ గండాదీపం
వెలుగుతనే వుంటది
ఆశ చుట్టుకుదురు మీద
ఉద్యమం నానుమాలు పడదు
తెలంగాణ ఎప్పటికీ
సాఫల్యమే -
మేం జీవిస్తం …
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్