కవిత్వం

అనుభూతులు

08-ఫిబ్రవరి-2013

అల్లావుద్దీన్ దీపంలోని భూతంలా
ప్రకృతి గాలిపోగుజేసి నన్ను తయారుచేస్తుంది

అనంత నీరవ, నిర్జీవ రోదసిలో ప్రాణం మొలకెత్తినట్టు
ఈ ఎడారి ఎదలో ప్రేమ బుగ్గలా పుట్టి వరదలౌతుంది.

నా కూతురు
నా గుండెను కాగలించుకుని నిద్రిస్తుంటే,
మట్టినై నేనున్నప్పుడు
నామీద పచ్చగడ్డి అల్లుకున్న భావన
ఒక పురానుభవమై కదలాడుతుంది.

తోడు వెతుక్కుని
తన గమ్యం వైపు తిరిగినపుడు,
చవిటినేలల్ని కేదారాలుగా మలచడానికి
పరిగెత్తుతున్న పాయను వీడి
బాధపడుతున్ననది నౌతాను

చితిపై మండుతున్నప్పుడు,
నాకోరికను మన్నించిన ప్రకృతి,
విసుగూ, అలుపూ, భయం లేకుండా
విశ్వవీక్షణానికి వేల రెక్కలననుగ్రహించిన
స్మృతి ఆవహిస్తుంది.