ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు
పాడలేనే ఎంకి పదములీ రొదలో..
-ఎంకి పాటల నించి…
1
వెళ్లిపోయాకే తెలుస్తుంది పడవ యిసురు!
ఆ మిగిలే నిశ్శబ్దంలో నీతో మాట్లాడాలనిపిస్తుంది ఇంకా,
దాటొచ్చిన అంతేసి సంద్రమూ
వొట్టి ఏటి పాయే కదా అనిపిస్తుంది
నీ మాటల్ని కలుపుకొని.
2
రాయడం ఆపేశాకే తెలుస్తుంది
గొంతులో అడ్డం పడిన గుండె రాపిడి
పెదవి కింద వొత్తిగిలిన అలల అలజడి.
రాయాలనిపిస్తుంది ఇంకా, వూపిరి తెగేలా.
ఇంతలో యీ కాగితాలూ లేఖలూ కురచనయి పోతాయి
నీ నిశ్శబ్దాన్ని తలచుకొని.
3
ఆ మలుపు దాటాకే నిజంగా కనిపిస్తావ్ నువ్వు
చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా, కంటి కొనలు సాగదీసి.
రాత్రీ పగలు నిద్రని వెలేసి నిప్పుకణికయిపోతుంది చూపు
నిన్ను తన రెప్పల్లో వొంపుకొని.
4
మాట్లాడేదేముంది అని నువ్వన్నప్పుడల్లా
ఈ మాటకి రేపు లేదు మాపు లేదని
నువ్వన్నప్పుడల్లా పసికూననై బెంగటిల్లిపోతానెక్కడికో,
నామీంచి నదినంతా బోర్లించినట్టు
నిలవనీరయి జారిపోతానెక్కడికో.
5
మాటిమాటికీ
నువ్వొదిలివెళ్ళిన ఆ అరకొర మాటల పడవలెక్కిదిగుతూ వుంటా
ఇందాకటి నీ మాటలు ఇంకా ఏ కొత్త అర్థాల వలయాలు చుట్టుకుంటాయో అని!
ఇందాకటి నీ వొంటిని తమకంగా తడిపిన నగ్న నదిలో
చేతులు చాచి చాచి ప్రతి నీటిబిందువూ వెతుక్కుంటా
తెగని వాంఛతో.
ఏదో వొక నీటిచుక్క
నీ నవ్వునో
నీ కంటి మెరుపునో దాచేసుకుందనే వెర్రిగా నమ్మేస్తూ.
6
మాటలెందుకని
ఎందుకంటావో ఎప్పుడూ నువ్వు!
అయితే, మాటల రేవులన్నీ చుట్టి వచ్చేశావా నువ్వు?
లేక,
‘ఉంగా…ఉంగా’ ల దగ్గిరే అంబాడుతున్నానా నేను?!
ఓహ్! మళ్ళీ పాత అఫ్సర్ ని చూసినట్టయింది.”పెదవి కింద వొత్తిగిలిన అలల అలజడి”, “నామీంచి నదినంతా బోర్లించినట్టు”, ” రెప్పల్లో వొంపుకొని” ఒక వాక్యం దగ్గర ఆగి చదివి మళ్ళీ చదివి ‘హమ్మయ్యా’ ఇది కవిత్వం అని అనిపిస్తే అది కవిత్వమె..అదిక్కడ దొరికింది.what a poem for my weekly off! Kudos Afsar jee
పాత అఫ్సర్ గుర్తున్నాడా మీకు? ఏ రూపంలో?
baagundhi sir
“రాయడం ఆపేశాకే తెలుస్తుంది
గొంతులో అడ్డం పడిన గుండె రాపిడి
పెదవి కింద వొత్తిగిలిన అలల అలజడి.
రాయాలనిపిస్తుంది ఇంకా, వూపిరి తెగేలా.
ఇంతలో యీ కాగితాలూ లేఖలూ కురచనయి పోతాయి
నీ నిశ్శబ్దాన్ని తలచుకొని.”
ఇలా ఎన్నో సార్లు ఎన్నో సార్లు అనిపించేది “పుష్పగుచ్ఛం” అనే గ్రూప్ లో బొమ్మకి కవిత రాసేటప్పుడు 7 లైన్స్ లిమిట్ దాటేటప్పుడు…ఆ ఒత్తిడి తట్టుకోలేక అక్కడ మానేసి నా వాల్ పై వ్రాసుకునేదాన్ని…నిజం… భావాలు నిరంతర ప్రవాహమైనప్పుడు కాగితాలు మాత్రమే కాదు వ్రాయగలిగే కలమూ కురచనే…”పెదవికింద ఒత్తిగిలిన అలల అలజడి”…ఒక అలను మింగేస్తూ మరో అల..ఒక భావాన్ని కాగితం అల్లేయ(హత్తుకో)గానే మరో భావం….నీ..నిశ్శబ్దానికి నిర్వచనాలిస్తూ…
“మాటిమాటికీ
నువ్వొదిలివెళ్ళిన ఆ అరకొర మాటల పడవలెక్కిదిగుతూ వుంటా”
తలపులను పడవలతో …ఆ స్పర్శను ఎగసే పయనంతో పోల్చిన ఈ కవిత్వానికి ఏం స్పందించగలను….శిరసాః నమామి అనడం తప్ప….
పద్మగారూ, కొన్ని నిశ్శబ్దాలు ఎంత గాయం చేస్తాయో!
మాటిమాటికీ
నువ్వొదిలివెళ్ళిన ఆ అరకొర మాటల పడవలెక్కిదిగుతూ వుంటా
ఇందాకటి నీ మాటలు ఇంకా ఏ కొత్త అర్థాల వలయాలు చుట్టుకుంటాయో అని!
ఇందాకటి నీ వొంటిని తమకంగా తడిపిన నగ్న నదిలో
చేతులు చాచి చాచి ప్రతి నీటిబిందువూ వెతుక్కుంటా
తెగని వాంఛతో…………ఇలా రాయాలని పి౦చే మమకారాన్ని పె౦చుతారు. ఉత్సుకత ను ని౦పుతారు. అద్భ్హుతమైన పదప్రయోగ౦. అనిర్వచనీయమైన అర్థ౦….గ్రేట్ అదే “అఫ్సరిజ౦”. సార్…ధన్యోస్మి…
సురేశ్, నా వాక్యాల లోపలి అర్థాలన్నీ మీకు భలే తెలిసిపోతున్నాయి. ఏమిటా రహస్యం? ‘రాయాలనిపించే మమకారం’ మీలో కలిగిస్తున్నందుకు ఖుష్…
మాటలెందుకని
ఎందుకంటావో ఎప్పుడూ నువ్వు!
అయితే, మాటల రేవులన్నీ చుట్టి వచ్చేశావా నువ్వు?
లేక,
‘ఉంగా…ఉంగా’ ల దగ్గిరే అంబాడుతున్నానా నేను?!
odduku cherchavu
నువ్వున్నావ్ కదరా, సత్యా, నన్ను వొడ్డుకు లాగడానికి!
మాట్లాడేదేముంది అని నువ్వన్నప్పుడల్లా
ఈ మాటకి రేపు లేదు మాపు లేదని
నువ్వన్నప్పుడల్లా పసికూననై బెంగటిల్లిపోతానెక్కడికో,
నామీంచి నదినంతా బోర్లించినట్టు
నిలవనీరయి జారిపోతానెక్కడికో.
*** మీ కవిత చదివాక.. నిజంగా మాటల్లేవు అఫ్సర్జీ
అలా గుండె స్పందన సజీవం గా వుండటమూ ఒక అదృష్టమే అనిపిస్తుంది..
అదృష్టమే, జయగారూ! ఇలా రాసుకునే మాటలయినా వున్నందుకు అదృష్టమే అనుకోవాలి!
సింప్లీ బ్యూటిఫుల్ అఫ్సర్ గారు.
నాకెందుకో కవిత 5వ ఖండిక దగ్గరే కవిత అయిపోయిందని అనిపించింది.
“ఏదో వొక నీటిచుక్క
నీ నవ్వునో
నీ కంటి మెరుపునో దాచేసుకుందనే వెర్రిగా నమ్మేస్తూ.”
- అద్భుతం.
మీరన్నది నిజమే, సాయికిరణ్ గారూ! కానీ, ఆ చివరి చరణమ్మీద నాకెందుకో మోహం!
రాయడం ఆపేశాకే తెలుస్తుంది
గొంతులో అడ్డం పడిన గుండె రాపిడి
పెదవి కింద వొత్తిగిలిన అలల అలజడి
superb afsar garu
Beautiful poem Afsar garu!
“ఆ మలుపు దాటాకే నిజంగా కనిపిస్తావ్ నువ్వు
చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా, కంటి కొనలు సాగదీసి”..
ఏ మలుపు దగ్గర గురూజీ?
నా గురూజీని మళ్లీ చాన్నాళ్లకు ఈ కవితలో చూసుకున్నాను.
బుద్ధి, ఆ మలుపు దగ్గిరే! నేను ఇంకా అక్కడే వున్నా కాబట్టి ‘ఆ’ అనడం కూడా అసంబద్ధంగా వుంటుంది. ‘ఈ’ అనాలి. అక్కడి నించి వొక్క అడుగు అవతలికి జరపడానికి కూడా నా మనసుకి నచ్చడం లేదు…
ఇప్పటికి ఒక నాలుగైదు సార్లు చదివానేమోనండీ! అచ్చు మీరన్నట్టే మీ అనుభూతి ఖండికల పడవలెక్కి దిగుతూ..
“రాయాలనిపిస్తుంది ఇంకా, వూపిరి తెగేలా.
ఇంతలో యీ కాగితాలూ లేఖలూ కురచనయి పోతాయి
నీ నిశ్శబ్దాన్ని తలచుకొని…”
ఇక్కడ మాత్రం చాలాసేపే ఉండిపోయాను!
కానీ సాయికిరణ్ గారు అన్నట్టు ఆరోది కొంచెం సాగతీతగా అనిపించింది.
కిరణ్, మీరు ఆగిన చోటే నేనూ ఆగిపోవాలని అనుకున్నా, రాయడానికి సంబంధించి!క్రమంగా ఆ నిశ్శబ్దంలోకే వెళ్తున్నా…నా శబ్దాలు ఇక పనికి రావని తెలిసిపోయింది.
“ఆ మలుపు దాటాకే నిజంగా కనిపిస్తావ్ నువ్వు
చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా, కంటి కొనలు సాగదీసి”
…జీవితంలో ఎన్నో మలుపులు దాటుకొచ్చినా
‘ఆ’ ఒక్క మలుపు దగ్గరే నిలబడి మళ్ళీ మళ్ళీ చూసేలా చేశారు.
ఇందాక కిరణ్ కి చెప్పిందే మీకూ, దేవరా! ‘ఆ’ వొక్క మలుపే చాలు అనిపిస్తుంది చాలా సార్లు!
>>రాత్రీ పగలు నిద్రని వెలేసి నిప్పుకణికయిపోతుంది చూపు
నిన్ను తన రెప్పల్లో వొంపుకొని.>>
అద్భుతంగా ఉంది అఫ్సర్ గారూ…
అనుక్షణికాల అఫ్సర్ కాదు..’ఊరిచివర’న ‘వయొలీన్’ మీటుతున్న అఫ్సర్ గా గుర్తు
వాసూ, నేను ‘వూరి చివరా’ లేను, మొదట్లోనూ నేను. ఆ అనుక్షణికాల్లోనే వున్నా నాకు తెలిసీ!
well expressed , spontaneous , good poem afsar ji ….love j
మాట్లాడేదేముంది అని నువ్వన్నప్పుడల్లా
ఈ మాటకి రేపు లేదు మాపు లేదని
నువ్వన్నప్పుడల్లా పసికూననై బెంగటిల్లిపోతానెక్కడికో,
నామీంచి నదినంతా బోర్లించినట్టు
నిలవనీరయి జారిపోతానెక్కడికో….
ఈ వసివాడని పసితనపు బెంగ వెంటాడుతూ ఇలా కవిత్వంగా పరిమళిస్తునె వుంది మీ సిరాక్షరాలలో సార్.. నాకిది మరీ మరీ యిష్టమని తెలుసుకదా.. యిలా హృదయాన్ని అక్షరాలలోకి ఒంపడం మీకే సొంతమైనది..
Dear Afsar,
Within myself, I have many complaints about you, particularly about ur trysts with literature; nevertheless, I reserve them.
But, if you are really enlivening the moments as portrayed in the stanza….
ఇందాకటి నీ వొంటిని తమకంగా తడిపిన నగ్న నదిలో
చేతులు చాచి చాచి ప్రతి నీటిబిందువూ వెతుక్కుంటా
తెగని వాంఛతో….
… I don’t reserve my complaints, rather I erase..
వెళ్లిపోయాకే తెలుస్తుంది పడవ యిసురు!
ఆ మిగిలే నిశ్శబ్దంలో నీతో మాట్లాడాలనిపిస్తుంది ఇంకా,
దాటొచ్చిన అంతేసి సంద్రమూ
వొట్టి ఏటి పాయే కదా అనిపిస్తుంది
నీ మాటల్ని కలుపుకొని…..
గుంటూరి శేషాద్రి శర్మ గారి పాట గుర్తుకు వస్తుంది. అవును. నిశ్శభ్దం గుండెలు బద్దలు కొట్టే గునపం. పూర్తిగా అనుభూతి అందింది.
అఫ్సర్ సర్, మీ కవిత ఇప్పుడే చూసాను, చాలా మంది చాలా విదాలుగా రాశారు తమ,తమ అభిప్రాయాలునాకు అనిపించిన భావాన్ని మీముందు ఉంచుతున్నాను,
“మాటిమాటికీ
నువ్వొదిలివెళ్ళిన ఆ అరకొర మాటల పడవలెక్కిదిగుతూ వుంటా
ఇందాకటి నీ మాటలు ఇంకా ఏ కొత్త అర్థాల వలయాలు చుట్టుకుంటాయో అని”!…….ఈ భావన బహుశా ప్రెమించిన ప్రతి గుండెలో కొట్టాడుతుందేమో. ప్రతి పదాన్నీ విడమరచి చూసుకుంటే గుండె చప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా.మీరు వాడిన ఉపమానాలు.
“రాత్రీ పగలు నిద్రని వెలేసి నిప్పుకణికయిపోతుంది చూపు
నిన్ను తన రెప్పల్లో వొంపుకొని”.ఇలాంటి పద ప్రయోగాలు అనితర సాద్యం.
రాత్రీ పగలు నిద్రని వెలేసి నిప్పుకణికయిపోతుంది చూపు
నిన్ను తన రెప్పల్లో వొంపుకొని.
నామీంచి నదినంతా బోర్లించినట్టు
నిలవనీరయి జారిపోతానెక్కడికో.
అఫ్సర్ కే సాధ్యమయ్యే expressions! చాలా బాగున్నాయి!
పద్యం నిండా మాటలూ, మనిషీ, అర్థం కాని అర్థాలు, దగ్గరయే దూరాలు – dialectical relationships!
“ఆ మలుపు దాటాకే నిజంగా కనిపిస్తావ్ నువ్వు
చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా, కంటి కొనలు సాగదీసి”
“మాటిమాటికీ
నువ్వొదిలివెళ్ళిన ఆ అరకొర మాటల పడవలెక్కిదిగుతూ వుంటా
ఇందాకటి నీ మాటలు ఇంకా ఏ కొత్త అర్థాల వలయాలు చుట్టుకుంటాయో అని!”
నిజానికి, మొత్తం పోయెం ని ఇక్కడ కోట్ చేయాలని వుంది…
ఈ పోయెం మొదట చదివినపుడు చెప్పినట్టు గుర్తు….
ఇది పూర్తి’అఫ్సర్ బ్రాండ్ పోయెం’ అని (సాహిత్య పరిభాషలో చెప్పలేకపోతున్న మా అశక్తతని మన్నించండి) …. ఇప్పుడు మళ్ళీ, మళ్ళీ చదివాను….