కవిత్వం

An Empty Episode-7 : మనిద్దరి గాయాలూ…

జనవరి 2013

ఏడో సన్నివేశం: నాకు తెలుసు వొక్క ఏడుపే మిగులుతోంది ప్రతి సన్నివేశం చివరా! ఈ సన్నివేశంలో కూడా నీ కోసం బోలెడంత దుఃఖాన్నే మోసుకొస్తున్నందుకు ఈ సారికి కూడా క్షమించు. ఎప్పుడూ క్షమించేది నువ్వే కదా! నా లోపలి క్షమా కణాలన్నీ చచ్చిపోయి కొన్ని తరాలయిందిగా! ఈ వొక్క క్షణాన్నయినా భయాలు లేని, గాయాలు లేని, సంకోచాలు లేని, సంశయాలు లేని  నీ ‘నిర్భయ’ స్నేహంలోకి, వేధింపులు  కాని ప్రేమలోకి, అనుమానాలు అత్యాచారాల్లేని సాహచర్యంలోకి ప్రయాణించగలనా?

 

1

          ఎంతకీ నువ్వంటే వొక శరీరమే నాకు?!

అవునా?

కాదని చెప్పే క్షణం కోసం కొన్ని యుగాలయింది ఎదురుచూసీ, చూసీ!

నీ చిరునవ్వులకు బదులు నీ పెదాలే కోసుకొస్తున్నానా ప్రతిసారీ? నీ గుండె చప్పుళ్ళకు బదులు నీ వక్షోజాల బరువులే కొలుస్తూ వున్నానా ఎప్పుడూ? చిగురాకు కన్నా మెత్తనయిన నీ అలికిడి నాలో మోగించే చిన్ని సంగీతపు  అలలకి చెవొగ్గే బదులు  నీ పొడుగాటి కాళ్ళ మధ్య ఏదో వొక వాంఛా ద్రవంగా తప్ప మిగల్లేకపోతున్నానా?

ఇప్పటికీ ప్రశ్న ఎన్ని సార్లు నా అద్దంలో నిలబడి నన్నూ

నాలోపల ఎలాగోలా వొదిగి వుండాలనే నిన్నూ  గుచ్చి గుచ్చి అడిగానో తెలీదు.

రెండూ శరీరాలే…కానీ, ఈ రెండు శరీరాల మధ్య ఇంత పెద్ద లోయ తెలీదు…. ఎందుకో!

2

          మాధానం కోసం నిజంగా ఎదురుచూశానా?

అనేక సూర్యచంద్రుళ్ళ శాఖా చంక్రమణాల్లో నీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ నిలబడే అమ్మనయ్యానా నిజంగా ఎప్పుడయినా? ఆ కళ్లలోని రెండు కరుణ సముద్రాల్లో కనీసం వొక నీటి చుక్కనయ్యానా పోనీ?

ప్రమాదాలు దారికాసే నీ ఏ మలుపులోనయినా వొక స్నేహితుడి పలకరింతనయ్యానా  ఎక్కడయినా? నన్ను తనలోకి లాక్కునే ప్రతి చీకట్లో వొక వెలుగు చెయ్యివై నువ్వు అందుకున్నప్పుడు తోడు నడిచినప్పుడు ఆ స్పర్శని గుర్తుంచుకున్నానా పోనీ?

3

          నా సమాధానాలు నిజంగా నా లోపలికి ఇంకాయో లేదో నిన్నూ అడగలేదు, నన్ను నేనూ అడుక్కోలేదు. ఈ ప్రశ్నలెప్పుడూ మనిద్దరితో ఆడుకుంటూనే వున్నాయ్.

ఈ ఆట వొక వేట! అలుపు లేదు నా మగతనానికి! నా అంగాంగ అహంకారానికి!

ఆయుధాలు మార్చి మార్చి ప్రయోగించే కొత్త విద్యలేవో నేర్చుకుంటూనే వున్నా ఎప్పటికప్పుడు అలసిపోకుండా!

ఎంత చెప్పు,

నేను నా కలుగులోకి దూరి సంతసించే విర్రవీగే  నా మగతనపు మృగయా వినోదినే ఎప్పుడే!

4

          చీకటి ఇంతే

నా దేహపు గూటిలో వొక స్త్రీత్వపు దీపం వెలిగితే తప్ప !

 

నా వెతుకులాటా  ఇంతే

నిన్ను వెతుక్కునే దీపమే నేనయితే తప్ప!

.