ఇరుగు పొరుగు ఆకాశాలు

లీ…ఆమెకు కవిత్వమే ఇల్లూ వాకిలీ!

జనవరి 2013

1

వొక మధ్యాన్నపు ఆలోచన: ఖాళీల్ని పూరించడం వొక కళ. ఏ ఖాళీనైనా భర్తీ చేయడం కష్టమే! కానీ, బలవంతాన అయినా దాన్ని భర్తీ చేయలేకపోతే  జీవితమే చేజారిపోతుంది.

-      ఈ మధ్యాన్నపు ఆలోచనలోంచి నేను వొక హీబ్రూ కవయిత్రి ఆకాశంలోకి పక్షిలా ఎగురుకుంటూ వెళ్ళాను.

2

ఎప్పుడూ నాలో అలజడి రేపే నా గురువారం మధ్యాన్నాలు ఇప్పుడు వున్నట్టుండి వొంటరి అయిపోయాయి.

ఇప్పుడు మాకు చలికాలం సెలవులు. మామూలుగా క్లాసులు జరుగుతున్న రోజుల్లో గురువారం మధ్యాన్నాలు వొక గంట నా ఆఫీస్ అవర్. ఆ గంట నాకు ఊపిరాడదు, నన్ను రకరకాలుగా ఉల్లాసపరిచీ, ఉత్సాహపరచీ నా లోపలి నేనుని అనేక ప్రశ్నలతో, కొన్ని సార్లు ఆశ్చర్యకరమయిన సమాధానాలతో! ఆ గంట నేను నా ఆఫీసులో పూర్తిగా నా విద్యార్థులకి నేనిచ్చే వ్యక్తిగత సమయం. వాళ్ళు రాయబోతున్న థీసిస్ ల గురించి, వాళ్ళు రేపు చదవబోతున్న పుస్తకాల గురించి, కొన్ని సార్లు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలతో సహా నాతో చెప్పుకుంటారు. అది వొక విధంగా నన్ను బాగా motivate చేసి, నా గురించి నేను కూడా ఆలోచించుకునే గంట! ఈ సెలవుల్లో ఆ బాహ్య/ లోపలి సంభాషణలకి సెలవు!

ఈ గంటని ఎలా భర్తీ చేయాలన్న ఆలోచనలో వున్నప్పుడు నా చేతులు చాలా యాంత్రికంగా హిబ్రూ కవయిత్రి లీ గోల్డ్ బెర్గ్ కొత్త పుస్తకం with this night ని తెరిచాయి. ఆమె మొదటి వాక్యంతోనే నన్ను ఆకట్టుకుంది. “ A poet finds corresponding sounds in language the way a sculptor finds in a block of marble.” అని రాసుకుంది తన గురించే కాకపోయినా, తన గురించే అన్నంత తీవ్రంగా!

ఆ వాక్యం విన్న తరవాత ఆమె కవిత్వంలోకి ప్రయాణం పెద్ద కష్టమేమీ కాలేదు నాకు. ఆమె భిన్న సంస్కృతి, ఆమె పరాయీ భాష నాకేమీ అడ్డంకి కాలేదు.  ఆ గురువారం వొకటి రెండు గంటల్లో ఆ చిన్ని పుస్తకాన్ని పూర్తి చేశానన్నది నిజమే కానీ..అసలు చదవడం అన్నది, అదీ కవిత్వ పుస్తకం చదవడం అన్నది…. ఆ పుస్తకం మూసేసిన తరవాతనే మొదలవుతుందని ఇంకో సారి గట్టిగా అనిపించింది నాకు. ఆమె వాక్యాలు నాలోపల తిరిగి నన్ను వుక్కిరిబిక్కిరి చేయడమూ, వాటిని నేను పదే పదే మననం చేసుకుంటూ ఆమె కవిత్వ లోకంలోనే బతకడమూ…అందులోంచి నన్ను బయటికి లాక్కు రావడానికి మూణ్ణాలుగు రోజులు పట్టింది నాకు. ఎప్పుడయినా ఆమె కవిత్వాన్ని పూర్తిగా అనువాదం చేయాలని వుంది కానీ, ఇప్పుడీ కొన్ని పంక్తులు మీదాకా తీసుకు రాకపోతే నాకు మనశ్శాంతి లేదు!

లీ కవిత్వం నల్లేరు మీద నడక కాదు. ఆమె జీవితంలో సుఖంగా గడిచిన పేజీ వొక్కటీ లేదు. హింస, కన్నీళ్లు, మరణాలు ఇవన్నీ చుట్టుముట్టిన ఏకాంతంలో ఆమె తనకంటూ వొక నేలనీ, వొక ఆకాశాన్నీ, వొక ప్రపంచాన్ని సృష్టించుకుంది. బయటి జీవితం సృష్టించిన ఖాళీలని పూరించడానికి ఆమె ఆ లోకంలోకి వెళ్ళి వస్తూ వుండేది. కేవలం మగ వాళ్ళు మాత్రమే రాజ్యం చేస్తూ వుండిన ఆధునిక హిబ్రూ సాహిత్యంలో కలం పట్టి కవిత్వం రాసిన మొదటి తరం స్త్రీ లీ! ఆమె కవిత అచ్చయిన రోజు అక్కడి వార్తా పత్రికలు కేకేసాయంట – వొక ఆడది కవిత రాసింది – అని! కానీ, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆమె స్వేచ్చా స్వరాన్ని అక్కడి పురుష ప్రపంచం భరించలేకపోయింది. ఆమె గొంతుని నొక్కి పెట్టింది. ఆమె రచనల్ని తొక్కి పెట్టింది. అంత అణచివేతలోనూ ఆమె స్వరం ఆగలేదు. ‘నీ ఇల్లూ వాకిలి ఏది?” అని ఎవరైనా అడిగితే, ఆమె నిస్సంకోచంగా చెప్పేదట – ‘కవిత్వమే నా ఇల్లూ వాకిలి” – అని! యూనివర్సిటీలో కవిత్వ పాఠాలు చెప్పాలన్న వొకే వొక్క కలతో బతికిన లీ చివరికి ఆ కల తీరబోయే ముందు శ్వాసకోశ వ్యాధితో 1970 లో చనిపోయింది. ఆమె ఈ చివరి వాక్యాలు చూడండి:

You’ll remember for fondly

As it was I who brought you pain,

Since for you, I remain

A living well of suffering.

 

3

లీ కవితలు కొన్ని

 

నువ్వు లేనప్పుడు

నేను నేనే కాదు

నాకో చెట్టు లేదు

గాలిలో ఎగిరే ఆకునయినా కాలేను.

నాకు మాటలుండవు

కనీసం …ఆ చిన్న మాట  ‘లేదు’

అన్న మాట కూడా నాలోంచి రాదు.

అవున్నిజమే కదా:

ఎవరినైనా నిరాకరించగలనా నేను?

 

నిన్ను మరచిపోలేదనే అనుకో

నా నాలుక నా అంగిలికి పైకి అతుక్కుపోతుంది.

ఈ చీకటి గుండెల్లోంచి

నీ జ్నాపకాలేవీ నేను

తెంపుకోలేదే అనుకో,

నా ఎముకలు కూడా

పాడాల్సిందేదో మరచి పోతాయి.

 

ఎడారిలో ఎండు ముళ్ళ కుప్ప:

ఎవరిక్కావాలిలే చలి మంటలు?

అయినా, కాల్చి బూడిద చెయ్యడానికయినా ఏముందిలే?

 

మన మధ్య

అదేదో భీకర సముద్రం వుందనుకుంటున్నావా నువ్వు?

మన మధ్య

అదేదో అంతుపట్టని అగాధం వుందనా అనుకుంటున్నావ్ నువ్వు?

మన మధ్య

అసలేమీ తేల్చని కాలం వుందనేనా నువ్వంటున్నావ్?!

 

కాదు, కాదు, కాదు

మన మధ్యా వున్నది కేవలం మనిద్దరం మాత్రమే!