కవిత్వం

అనుక్షణికాలు-11 : వున్నావనే…

జనవరి 2013

1
మిగిలిపోయాయి కొన్ని మాటలు
కొన్ని నవ్వులు
కొన్ని తిట్లూ

2
ఇంకా కురుస్తున్నాయి తల మీద నిన్నటి రాత్రి మల్లెలు
ఇప్పటి గాలిలో వాటి పరిమళాలు
అరనవ్వుతూ .

3
ఇంకా
ఇంకా రాలుతోంది నీ అరచేతుల్లోంచి నా అరచేతుల్లోకి
ఆ మంచు
తెల్లగా తెలతెల్లగా
వుండనా కరిగిపోనా అనే కళ్ళతో.

4
చివరికి ఎలాగోలా వెళిపోయాయి
అన్నీ-
నిన్ను నాలో తురిమిన
ఆ క్షణాలు తప్ప!
ఆ క్షణాల ఇరుకుసందుల్లో వొదిగిపోయిన నేను తప్ప.

5
చూశాను కదా
నీ వెనుతిరిగిన పాదాన్ని,
పదాన్ని కూడా!

ఇంతా అయ్యాక
ఆ వొక్క
క్షమాపణ కూడా అందంగా చెప్పగలవు కదా నువ్వు!