కవిత్వం

ఇందాకటి పడవ

15-ఫిబ్రవరి-2013

ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు
పాడలేనే ఎంకి పదములీ రొదలో..
-ఎంకి పాటల నించి…

1
వెళ్లిపోయాకే తెలుస్తుంది పడవ యిసురు!

ఆ మిగిలే నిశ్శబ్దంలో నీతో మాట్లాడాలనిపిస్తుంది ఇంకా,
దాటొచ్చిన అంతేసి సంద్రమూ
వొట్టి ఏటి పాయే కదా అనిపిస్తుంది
నీ మాటల్ని కలుపుకొని.

2
రాయడం ఆపేశాకే తెలుస్తుంది
గొంతులో అడ్డం పడిన గుండె రాపిడి
పెదవి కింద వొత్తిగిలిన అలల అలజడి.

రాయాలనిపిస్తుంది ఇంకా, వూపిరి తెగేలా.
ఇంతలో యీ కాగితాలూ లేఖలూ కురచనయి పోతాయి
నీ నిశ్శబ్దాన్ని తలచుకొని.

3
ఆ మలుపు దాటాకే నిజంగా కనిపిస్తావ్ నువ్వు
చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా, కంటి కొనలు సాగదీసి.

రాత్రీ పగలు నిద్రని వెలేసి నిప్పుకణికయిపోతుంది చూపు
నిన్ను తన రెప్పల్లో వొంపుకొని.

4
మాట్లాడేదేముంది అని నువ్వన్నప్పుడల్లా
ఈ మాటకి రేపు లేదు మాపు లేదని
నువ్వన్నప్పుడల్లా పసికూననై బెంగటిల్లిపోతానెక్కడికో,
నామీంచి నదినంతా బోర్లించినట్టు
నిలవనీరయి జారిపోతానెక్కడికో.

5
మాటిమాటికీ
నువ్వొదిలివెళ్ళిన ఆ అరకొర మాటల పడవలెక్కిదిగుతూ వుంటా
ఇందాకటి నీ మాటలు ఇంకా ఏ కొత్త అర్థాల వలయాలు చుట్టుకుంటాయో అని!
ఇందాకటి నీ వొంటిని తమకంగా తడిపిన నగ్న నదిలో
చేతులు చాచి చాచి ప్రతి నీటిబిందువూ వెతుక్కుంటా
తెగని వాంఛతో.

ఏదో వొక నీటిచుక్క
నీ నవ్వునో
నీ కంటి మెరుపునో దాచేసుకుందనే వెర్రిగా నమ్మేస్తూ.

6
మాటలెందుకని
ఎందుకంటావో ఎప్పుడూ నువ్వు!

అయితే, మాటల రేవులన్నీ చుట్టి వచ్చేశావా నువ్వు?

లేక,
‘ఉంగా…ఉంగా’ ల దగ్గిరే అంబాడుతున్నానా నేను?!