పుస్తక పరిచయం

స్టైన్బెక్ – ‘ గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘ నవల

జూన్ 2017

హైవేని క్రాస్ చేయబోతున్న తాబేలు. దాని వీపుమీదగా దొర్లిన భారీ కంటైనర్ టైర్లు. టైరు వెంటే ఎగిరిన తాబేలు వెల్లకిలా మళ్ళీ హైవే మీదే పడింది. ఇంకో వాహనం వచ్చేలోపు అది గిల గిలా కొట్టుకొని ఎలాగో మళ్ళీ బోర్లా పడి ఆ పక్కకు పాక గలిగింది.

ముప్పై పేజీల తర్వాత వచ్చే ఈ తాబేలుకీ పది పేజీలముందు పెరోల్ కింద విడుదలయ్యి ఒక్లాహోమా లోని తన స్వంత ఊరికి బయలుదేరిన టాం జోడ్ కీ ఏమిటి సంబంధం?

నాచురలిస్ట్ రచనల్లో సహజంగా కనబడే పదులకొద్దీ పేజీల వర్ణనల తర్వాత వచ్చే ఇలాంటి ఒక చిన్న ‘ఘటన ‘ కోసం నవలంతా చదవాలా అని తలపట్టుకొనే నేటి తరం పాఠకులని కూడా చదివించగల సమర్ధత కొద్దిమంది రచయితలకే సాధ్యం. అదికూడా పుస్తకాన్ని దింప నివ్వకుండా.

అలాంటి ఒకానొక గుదిబండే జాన్ ఎర్నెస్ట్ స్టైన్బెక్ 1939 లో రాసిన ‘గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘ నవల.

ఓ హత్యానేరం కింద నాలుగేళ్ళ పాటు జైలు జీవితం గడిపిన టాం జోడ్, పెరోల్ కింద విడుదలయ్యి ఒక్లాహోమా లోని తన స్వంత ఊరికి బయలుదేరటంతో కథ మొదలవుతుంది.

మండే ఎర్రని ఎండ, దుమ్ముకొట్టుకుపోయిన కాలిబాటలు, ఎండిపోయిన పంటల మధ్య ఊరు చేరిన టాం జోడ్ కి అక్కడ బాంకు స్వాధీనం చేసుకొన్న రైతుల భూములు, అయిన కాడికి ఉన్న వస్తువులన్నీ అమ్మి ఇళ్ళు ఖాళీ చేసి వలసపోతున్న రైతులూ కూలీలు కనిపిస్తారు. అక్కడ కలిసిన మత బోధకుడు జిమ్ కేసీ తనకి మతం మీదా దేవుడి మీదా నమ్మకం పోయిందనీ, ఇప్పుడు మనిషినీ విశ్వమానవ ప్రేమనీ మాత్రమే నమ్ముతున్నాననీ చెప్తాడు.

ఓ డొక్కు వానులో వందల మైళ్ళ రోడ్డు మార్గంలో పని వెతుక్కుంటూ కాలిఫోర్నియాకి ప్రయాణమవుతుంది జోడ్ కుటుంబం. జిమ్ కేసీ కూడా వాళ్ళతోనే కలుస్తాడు. దుర్భిక్ష ప్రాంతాల్లో ఎడారి వడ గాడ్పుల మధ్య దారిలోనే జోడ్ ముసలి తాత, అమ్మమ్మలు మరణిస్తారు. ఆగిన చోట తిండి కోసం పళ్ళతోటల్లో పత్తిచేలల్లో పని చేస్తారు.

చీమల్లా దండులా వచ్చిపడుతున్న వలస కార్మికుల్ని దోచుకునేందుకు కూలీ తగ్గించి పనులు చేయించుకుంటారు అక్కడి ధనిక రైతులు. ఆకలితో చచ్చిపోతున్న జనానికి మిగులు ఆహార ధాన్యాలని పంచితే వాటి ధరలు పడిపోతాయని వారి కళ్ళముందే పంటల్ని తగలబెడతారు ఆ ధనిక రైతులు. కూలీ పెంపుకోసం సమ్మె చేసిన శ్రామికులకు నాయకత్వం వహిస్తాడు ఒకప్పటి మత బోధకుడు జిమ్ కేసీ. అతడిమీద దాడి చేసిన భూస్వాముల నుంచీ కాపాడే ప్రయత్నంలో మరొక హత్య చేస్తాడు టాం జోడ్.

జ్జిమ్ కేసీ లా పీడిత ప్రజల పక్షాన నిలబడతానని కుటుంబాన్ని వదిలి టాం జోడ్ వెళ్ళిపోతాడు. అలా జోడ్ కుటుంబం చెల్లా చెదురవుతుంది. నిండుగర్బిణి టాం జోడ్ చెల్లెలు రోస్ షెరాన్ ఒక మృతశిశువుని ప్రసవించి, తన చనుబాలతో ఆకలితో మరణించబోయే ఒక వృద్ధుడిని బతికించటంతో కథ ముగుస్తుంది.

అమెరికన్ శ్రమ జీవుల ఆకాంక్షలనూ, వారి ఆరాటపోరాటాలనూ కళ్ళకు కట్టినట్టు స్టైన్బెక్ చిత్రించిన ఈ నవలకు ఓ పెద్ద సామజిక చారిత్రిక నేపథ్యముంది.

1930 దశాబ్దం – అమెరికా చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. ప్రపంచాన్ని కుదిపివేసిన గ్రేట్ డిప్రెషన్ 1929లో స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చింది. పారిశ్రామిక రంగం కుదేలయ్యింది. దాని ప్రభావం దశాబ్దానికి పైగా ప్రపంచ మానవాళిని కుదిపివేసి 1939లో రెండవ ప్రపంచయుద్ధానికి కారణమయింది.

పెట్టుబడి దారీ వ్యవస్థ సృష్టించిన ఆ విలయం అమెరికాలోని రైతుల పాలిట మాత్రం యమపాశంగా మారింది. ఆ కాలంలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ప్రకృతి పగబట్టినట్టు ఆకాశాన్నంటిన దుమ్ముమేఘాలు ఆవరించాయి. డస్ట్ బౌల్ అనే ఆ దుమ్ము కింద కప్పబడిపోయిన పొలాలూ, పంటలూ. మొక్కజొన్న పొలాలనిండా అడుగుల ఎత్తున పేరుకుపోయిన దుమ్ము. అలా ముంచుకొచ్చింది అతి పెద్ద కరువు. ఫలితంగా మధ్యతరగతి, సన్న కారు రైతాంగం బాంకుల రుణాలకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి.

అన్నిచోట్లా జరిగినట్టే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలనుంచీ రుణాల్ని వసూలు చెయ్యలేని బాంకులు, రైతాంగం మీద మాత్రం నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడ్డాయి. అప్పులిచ్చిన బాంకులు ఆ నిస్సహాయ రైతాంగం నుంచీ వేలాది హెక్టార్ల భూముల్ని స్వాధీనం చేసుకొని వాటిని కారుచౌకగా ధనిక ఆసాములకి కట్టబెట్టాయి. అలా అమెరికాలో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు అవి దారులు వేశాయి.

ఈ నేపథ్యంలో సొంత భూములని కోల్పోయి ఒక్లాహోమా నుంచీ కాలిఫోర్నియాకు వలస పోయిన రైతు కుటుంబాల వ్యధాభరిత కథా చిత్రణే ‘జాన్ ఎర్నెష్ట్ స్టైన్బెక్’ రచించిన ఈ ‘ గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘ నవల.

స్టైన్బెక్ 1939లో రాసిన ఈ నవల ఆనాటి అమెరికన్ వాస్తవిక సాహిత్యంలో పెద్ద సంచలనమయ్యింది. అమెరికాలో ఇలాంటి పీడిత ప్రజలూ, దుర్భర జీవితాలూ ఉన్నాయన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి , అచ్చయిన ఏడాదిలోనే లక్షలాది ప్రతులు అమ్ముడు బోయి , అక్కడి కులీన వర్గాలకు దిగ్భ్రమ కలిగించింది.

ఇప్పటికీ ప్రపంచ సాహిత్యంలో వ్యవసాయ సమాజాలమీద, భూమి సంబంధాల మీద, వారి ఆరాట పోరాటాల మీద చాలా తక్కువ నవలలే వచ్చాయి. వాటిలో మంచి రచనలుగా ప్రాచుర్యం పొందినవి మరీ తక్కువ. రష్యాలో మైకేల్ షోలకోవ్, ఫ్రాన్స్లో ఎమిలీ జోలా, చైనా లో పెర్ల్ బక్, గాటిమాలాలో ఆష్ట్రియాస్, ఆడ్రైన్ బెల్ వంటి రచయితల సరసన, ఉత్తర అమెరికా నుంచీ జాన్ ఎర్నెష్ట్ స్టైన్బెక్ భుమి సంబంధాల మీదా, ఆ శ్రమజీవుల భావోద్వేగాల మీద ప్రతిభా వంతమయిన రచనలెన్నో చేశాడు.

జాన్ ఎర్నెస్ట్ స్టైన్బెక్ 1902లో ఉత్తర అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో పుట్టాడు. 16 నవలలు, 5 కథా సంకలనాలు, 6 వ్యాస సంకలనాలు మొత్తం 27 పుస్తకాలు రచించాడు.

1929లో రాసిన ‘కప్ ఆఫ్ గోల్డ్’ అతడి మొదటి నవల. ఆఫ్ మైస్ అండ్ మెన్, గ్రేప్స్ ఆఫ్ రాత్ , ఈస్ట్ ఆఫ్ ఈడెన్, ది రెడ్ పోనీ, టు ఎ గాడ్ అన్నోన్ వంటి 16 నవలలు, లాంగ్ వాలీ, పాస్చర్స్ ఆఫ్ హెవెన్ కథా సంకలనాలతో పాటు ఎన్నో వ్యాసాలూ, నాటికలూ రచించాడు. ఆఫ్ మైస్ అండ్ మెన్, గ్రేప్స్ ఆఫ్ రాత్ నవలలు అతడికి ప్రపంచ స్థాయి నవలాకారుడిగా పేరుతెచ్చిపెట్టటమే కాక హాలీవుడ్ సినిమాలుగా ప్రజలకు చేరువయ్యాయి.

మహా రచయితలుగా పేరుపొందిన వారిలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు స్టైన్బెక్ లో కూడా కనపడతాయి. వైవిధ్యమయిన జీవితానుభవాలు, వాటిని సాహిత్యంగా మలచగలిగే ప్రతిభ, హృదయ సంస్కారం, ప్రపంచ సాహిత్యంతో గాఢమయిన సంబంధం.

స్టైన్బెక్ బాల్యం కాలిఫోర్నియా దగ్గర శాలినాస్ లోయలోని ఒక చిన్న గ్రామంలో గడిచింది. అక్కడ అతడు పశువులు, గొర్రెలు, గుర్రాలను పెంచే పెద్ద పెద్ద గడ్డి మైదానాల్లో, పొలం పనుల్లో, చెరకు కొట్టే పనివాళ్ళతో కలిసి పనిచేశాడు. అప్పుడే సుదూర ప్రాంతాల నుంచీ తరలి వచ్చి అత్యంత కఠినమయిన పనుల్లో మునిగితేలే వలసకూలీలతో కార్మికులతో అతడికి పరిచయమయింది. వారి జీవితాన్ని అత్యంత సన్నిహితంగా, ఆసక్తిగా పరిశీలించేవాడు.

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువు మధ్యలోనే వదిలేసి టూర్ గైడ్గా , కేర్ టేకర్ గా, జర్నలిస్ట్ గా , రెండవ ప్రపంచ యుద్దంలో వార్ కరస్పాండెంట్ గా, సినిమా స్క్రిప్ట్ రచయితగా అనేక రకాల పనులు చేశాడు.

ఈ అన్ని జీవితానుభవాలూ అతడి సాహిత్యానికి ముడిసరుకుగా పనికొచ్చాయి.

1935 ప్రాంతంలో ‘ఆఫ్ మైస్ అండ్ మెన్ ‘ నవల రాస్తున్న సమయంలో ‘శాన్ఫ్రాన్సికో న్యూస్ ‘ పత్రికలో స్టైన్బెక్ పనిచేస్తున్నాడు. (వరికోతల / చెరుకు కొట్టే సీజన్ లో కోస్తా జిల్లాలకు పటమటనుంచీ కూలీలు వచ్చినట్టు) పంటల కాలంలో కాలిఫోర్నియాకి చీమల్లా వలస వస్తున్న వేలాది కార్మికుల మీద విశ్లేషణాత్మక కథనం రాసే పనిని అతనికి పురమాయించింది ఆ పత్రిక.

ఓ మారుపేరుతో ఆ వలస శ్రామికులతో కలిసిపోయి, వాళ్ళ డొక్కు ట్రక్కుల్లో వందలకొద్దీ మైళ్ళు ప్రయాణించి , చిరిగిన గుడారాల్లో పడుకొని, గంజి కేంద్రాల్లో పొట్టనింపుకొని వాళ్ళ జీవితాల్లోని నిష్ట దారిద్ర్యాన్నీ, హింసనూ ప్రత్యక్షంగా చూసి ‘జిప్సీస్ ఆఫ్ హార్వెస్ట్ ‘ అనే వ్యాసాల పరంపర రాశాడు. అలా ‘ఆఫ్ మైస్ అండ్ మెన్ ‘ నవలను ముగించే లోపే అతడి మనసులో ‘ గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘ నవలకు అంకురం పడింది.

గ్రేప్స్ ఆఫ్ రాత్ నవలలో వలస కార్మికుల దుర్భరమయిన స్థితి గతుల్ని చిత్రించినందువల్ల అతడు పెట్టుబడిదారీ విధానపు చీకటి పార్శ్వాన్ని బట్టబయలు చేశాడనీ, శ్రామికుల పక్షాన తిరుగుబాటుని సమర్ధించాడనీ స్టైన్బెక్ ను విమర్శిస్తూ ఆ పుస్తకాన్ని రెండేళ్ళ పాటు పబ్లిక్ లైబ్రరీలలో, విద్యా సంస్థల్లో నిషేధించారు.

అతడి రచనలకు నేషనల్ బుక్ అవార్డ్, ప్యూలిట్జర్ ప్రైజ్ వంటి అవార్డులతో పాటు 1962లో ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయినా చివరి వరకూ అమెరికన్ విధానాలను వ్యతిరేకించే రచయితగా అతడిని ఆ సమాజం విమర్శిస్తూనే వచ్చింది. కానీ తలతిప్పుకోకుండా చదివించగలగే శక్తివంతమయిన రచయితగా పాఠకులకూ, వాస్తవిక చిత్రణలో ఆదర్శప్రాయుడుగా రచయితలకూ ప్రపంచ వ్యాప్తంగా స్టైన్బెక్ ఎంతో ఆప్తుడయాడు.

అమెరికన్ సాహిత్యంలో, ఆనాటి రచయితలలో శిఖరసమానుడుగా పేరుపొందిన స్టైన్బెక్ 1968లో మరణించాడు.

**** (*) ****