పుస్తక పరిచయం

ఎదురు చూపు

డిసెంబర్ 2017

దురు చూస్తాం… చాలా వాటికోసం. అనుభావాలకోసం, ఆత్మీయులకోసం, వాళ్ళ జ్ఞాపకాలకోసం. కాస్తంత ఊరటకోసం, విసుగొస్తే మార్పుకోసం. ఎదురుచూపు భవిష్యత్తుకి సంకేతం.

సంప్రదాయ సాహిత్యంలో పాఠకుడు పొందే కవిత్వానుభవం, పరాయిగా ఆయా కథల్ని, పాత్రల్ని (ఆ కవుల స్వభావాల్ని కూడా) అల్లుకుని ఉంటుంది. ఆధునిక కవిత్వం దగ్గరకు వచ్చేసరికి పాఠకుడి కవిత్వానుభవం, ఆయా కవుల్నే అల్లుకుని ఉంటుంది.

ఇక్కడ- తను నివసిస్తున్న ఏ సమాజంలో అయినా, కవే ప్రధానపాత్ర. అతడి అనుభావాల్ని, కష్టసుఖాల్ని, ఉద్రేకపారవశ్యాన్ని, పాఠకుడిక్కడ అర్థం చేసుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఒకవిధంగా పాటకుడికిది పరీక్ష.

ఇక్కడ- కవిత్వానుభవం రెండంతరువుల్లో ఉంటుంది.

ఒకటి; కవి చెప్పి విడిచిన అనుభవాలవంటివే పాఠకుడికీ ఎదురైవుంటే, అతడు కవితో సామాన్యీకరణ చెంది సంతోషిస్తాడు. ఆదరిస్తాడు.

రెండు; కవి చెప్పే అనుభవాలు పాఠకుడికి అపరిచితమైనవీ, కేవలం వ్యక్తిగత ప్రతీకలతో నిండినవీ అయితే, ముందతడు ఆశ్చర్యపోతాడు. అర్థంకాక గాభరాపడి, అర్థమైతే బాగుండునని ఎదురుచూస్తాడు. ఈ ఇబ్బంది కవి చెప్పే అనుభవాలలో మార్మికత పెరిగితే కలుగుతుంటుంది. కవిత్వప్రేమికుడు “అరే ఇదేదో గొప్ప అనుభవం, ఈ మాటలు కొత్తగా ఉన్నాయి, మనకు అర్థమైతే బాగుండును” అని కలవర పడతాడు. కవి వాడే భాషగానీ, ఉపయోగించే technic గానీ స్వీయానుభవ ప్రకటనకి వట్టి పరికరాలు మాత్రమే. పోలిక చెప్పాలంటే,- కమలాఫలం తొక్క వొలిచి, తొనల రసం పీల్చడం లాంటిది. పాఠకుడు ఆ భాషనీ, technic నీ వొలిచిపారేసి, కవి అనుభవాల్ని పీల్చుకునే ప్రయత్నం చేస్తాడు.

రవి వీరెల్లి నలభై పైగా కవితలు ఒకే sitting లో ఏకధాటిగా చదివాను. ముందుగా కవితలన్నిటా ప్రముఖంగా,- ఆకాశం, వెన్నెల, నీరు, నది, కొండ, పచ్చదనం, చెట్లు, అతివేలమైన ప్రకృతి తాదాత్మ్యం కనిపించాయి. అన్నిటా కవి ఆత్మీయపారవశ్యాన్ని పాఠకుడిలోనికి ప్రసరింప చేయాలనే తహతహ నన్ను ఆకర్షించింది. నాకు గాడంగా ఏమనిపించిందంటే; ఇవి క్రిక్కిరిసిన అనుభవాల ప్రసారణం. ఇక్కడ సమూహం లేదు; ఉన్నవి, వ్యక్తి ఆరాటాలు, అనుభవస్పందనలే. కవి నిర్మించిన వాక్యాలకొక ప్రవాహగుణం, సున్నితమైన తాత్వికత ఉన్నాయి. ఉంటూనే, abstract images వెల్లువ కమ్ముకుంటూ కనిపిస్తుంది. ఈ images ని ప్రతి అభిప్రాయ ప్రకటనలో ఇబ్బడి ముబ్బడిగా రూపకాలంకారాలతో నిర్మించడం గమనించగలం.

తెలుగు ఆధునిక సాహిత్యంలో రూపకాలంకారాన్ని, ఉపమాలంకారాన్ని, ఆరుద్ర, కుందుర్తి, రా. వి. శాస్త్రి, బీనాదేవి, పాఠకుడికి మొగంమొత్తెంతగా వాడారు. విరివిగా రూపకాలను వాడడం ద్వారా ఏర్పడే monotony అలావుండగా, పాఠకుడి అవగాహనకు కవిత్వం సంక్లిష్టమయే ప్రమాదం ఉంటుంది.

రవి వీరెల్లి తాత్వికంగానూ, తాదాత్మ్య దృష్టితోనూకూడా వాక్యనిర్మాణంలో రూపకాభిలాష నాకెక్కువగానే తోచింది. అయితే- జీవితం పట్ల, జగత్ సౌందర్యం పట్ల అపారప్రేమ ఈ కవితలకు రక్ష. వాక్యాలు నిర్మించే విధానంలో ఒక చమక్కు మనల్ని ఆకర్షిస్తుంది.

“వెలుగులోకి నడిచినంత ధైర్యంగా
చీకట్లోకి చొచ్చుకు పోలేం కదా!” అంటూనే కొసమెరుపుగా…
“అనుకుంటాం గానీ
చీకట్లోకి నడిచినంత స్వేచ్ఛగా వెలుగులోకి వెళ్ళలేం
…నగ్నంగా!” (కొసమెరుపు)

ఈ రెండూ సత్యాలే- రెండు మానసికఅవస్థల్లోంచి వచ్చిన సత్యాలు.

అలాగే, మరికొన్న కవిత్వ (తాత్విక?) ప్రకటనలు:

1.
“కన్నూ.. కాలమూ..
ఎప్పుడూ వెలితి కుండలే.
కవిత్వంలా.” (వెలితికుండ)

2.
“చీకటి కేం
అంచులను చురకత్తుల్లా చేసి
రంపపుకోత కొస్తుంది
ఎంతైనా
ఒంటరితనాన్ని మోస్తున్నవాళ్ళంటే
రాత్రికి తెగ లోకువ.” (రాత్రికి లోకువై)

3.
“పోనీ,
ఒక కవిత్వపుటలవై
నువ్వు నన్ను
ముంచెత్తినా బావుణ్ణు.” (ఆఖరితనం)

4.
“పుట్టుకతోనే విడిపోయిన ఈ ప్రపంచాన్ని
ఉత్తుత్తిగా కలిపినట్టుంచే ఊహా అక్షాంశ రేఖాంశాల్లా
విడివిడిగానే కలిసి భూమితో తిరుగుదాం.” (విడివిడిగానే)

5.
“సిగ్గుతో విచ్చుకున్న పువ్వు నడుం చుట్టూ
మరీ చిన్నదై బిగుసుకుపోయిన సిగ్గు బిళ్ళలా…
తొడిమె.” (చిలిపి చినుకులు)

6.
“అనంతమైన ఆకాశాన్ని సాగు చేసి
చుక్కల మొక్కలు నాటిన చంద్రుడు
చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి
అలల తలలను దువ్వుతాడు.” (గ్రావిటీ)

ఇక- ఈ మొత్తం కవితల్లో నాకు మరీ ఇష్టంగా అనిపించినవి:

1. దిగులు పువ్వు

2. దగ్గరిదూరాలు

3. రాత్రంతా నా కళ్ళలోనే

4. Solitary

5. సకినం

6. అమ్మ ఉత్తరం

7. హోమ్ కమింగ్

8. తెరుచుకున్న పద్యం

9. నిశ్శబ్ద తిర్యగ్రేఖ

జీవితాన్ని, మానవ ప్రవృత్తుల్ని, ప్రకృతిలో సౌందర్యాస్వాదననీ తన కవితా వస్తువులుగా చేసుకుని సున్నితంగా తన మాటల్లో శబ్దించి వ్రాలుకట్టి చెప్పిన రవికి అభినందనలు.

***

(రవి వీరెల్లి కవితాసంపుటికి రాసిన ముందుమాట నుండి)

పుస్తకం వివరాలు:

పుస్తకం: కుందాపన
రచయిత: రవి వీరెల్లి
పేజీలు: 136
వెల: ₹ 100
ప్రచురణ: వాకిలి

ప్రతులకు సంప్రదించండి:
కినిగే: http://kinige.com/book/Kumdapana
అమెజాన్: https://www.amazon.com/ku%E1%B9%83d%C4%81pana-Ravi-Verelly/dp/0997736321
ఈమెయిలు: vaakili.editor@gmail.com
అడ్రస్: VAAKILI, 8-415/89, SAPTAGIRI COLONY, Miyapur, Hyderabad-49



3 Responses to ఎదురు చూపు

  1. కె.కె. రామయ్య
    December 1, 2017 at 9:19 am

    పెద్దలు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి,

    ఇంతకు మునుపొకసారి అడిగినదే తడవుగా శ్రీపాద గారి గురించి ఎన్నో విలువైన విషయాలు చెప్పారు.

    ఇప్పుడు రవి వీరెల్లి గారి కవితల సంకలనం ” కుందాపన ”
    ( “జీవితాన్ని, మానవ ప్రవృత్తుల్ని, ప్రకృతిలో సౌందర్యాస్వాదననీ కవితా వస్తువులుగా చేసుకున్న” )
    పరిచయం చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు.

    “కుందాపన” పుస్తకాలు కినిగె, అమెజాన్ లలోనే కాక నవోదయ బుక్ హౌస్ కాచిగూడ, హైదరాబాదు వంటి చోట్ల కూడా
    లభించే వెసులుబాటు కలిగిస్తే పాఠకులకు మరింత సౌకర్యంగా ఉంటుందని మనవి.

    • రవి వీరెల్లి
      December 4, 2017 at 7:52 am

      రామయ్య గారు,

      డిసెంబర్ 17 నుండి నవోదయలో కూడా దొరుకుతాయి.
      ధన్యవాదాలు!

      -రవి

  2. కె.కె. రామయ్య
    December 26, 2017 at 8:47 am

    రవి వీరెల్లి గారి కవితల సంకలనం ”కుందాపన” నవోదయ బుక్ హౌస్ కాచిగూడ, హైదరాబాదు వారి వద్ద కూడా లభిస్తుంది.
    నవోదయ లింక్

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)