కవిత్వం

ఆఖరితనం

జనవరి 2013

1
ఎప్పుడో గానీ ఎదురయ్యే
ఆ చిన్న పలకరింతకు కూడా
సమాధానం సంధించే భిగువు
ఇప్పుడీ పెదాల్లో లేదు.

2
కలలు వలసబోయిన రెప్పల కింద
కన్నీటి బిందువు కూడా ఎదగనంటే

ఏ తోడూ లేని చిటికెన వేలును
ఊతకర్ర కూడా వెలేస్తే

వ్యాకోచించని ఊపిరితిత్తుల లోయలోకి
ఊయలూగ ప్రాణవాయువు కూడా రానంటే

అరిచేతుల్లోంచి అదృశ్యమైన అదృష్టరేఖలు
అదాటున దేహమంతా పాకి ప్రశ్నిస్తున్నట్టు

అందర్నీ దేవుని సన్నిధికి చేర్చిన గుడిమెట్టు
శిధిలమై దేవునికి దూరంగా రాలిపడుతున్నట్టు

మళ్ళీ మొదలైన
ఆఖరితనం.

3
చెయ్యందించి
చివరి బండెక్కించడానికి
ఎవరొస్తారులే?!
ఈ మునిమాపు చీకటి మలుపులోకి.

4
పోనీ, ఒక కవిత్వపుటలవై నువ్వు నన్ను ముంచెత్తినా బావుణ్ణు.