కిటికీలో ఆకాశం

కూలిన విశ్వాసాల పైన ఎగిరేసిన నిరసన పద్యం

డిసెంబర్ 2017

కాళ్ళకింది భూమి కదిలిపోయే భూకంపం ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా?

నీడలా కొమ్ముకాసే ఆకాశం భళ్ళున ముక్కలై పోయి శరీరాన్ని గాయాల కూడలి చేయడం ఎన్నడైనా అనుభవం లోకి వచ్చిందా? ఒక గుడ్డి నమ్మకంతో పీల్చే ప్రాణ వాయువు మరుక్షణంలో విష పూరితమై నాసికల్ని భగ్గున మండించడం ఏ రోజైనా అనుభవం లోకి వచ్చిందా?

1992వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఒక సంఘటన ఈ దేశం లోని ముస్లింలకు అట్లాంటి గగుర్పొడిచే అనుభవాన్ని మిగిల్చింది. ఈ దేశాన్ని లౌకిక రాజ్యంగా నడుపుకుందామని ఈ దేశ ప్రజలు చేసుకున్న ఒక చారిత్రక ఒడంబడిక ఇచ్చిన విశ్వాసానికి ప్రమాదం సంభవించిన చీకటి రోజు అది. అది ఎంతటి చీకటి రోజుగా పరిణమించిందంటే, స్వాతంత్రానంతర దేశ చరిత్ర మొత్తం ‘ఆ చీకటి రోజుకు ముందు – ఆ చీకటి రోజు తరువాత’ గా మారిపోయింది.

అయితే, చరిత్రలో ఇది ఆకస్మికంగా ప్రత్యక్షమైన రోజా?! కానే కాదనీ, అసలు ఈ దేశంలో స్వాతంత్రం ఉదయించిన 1947 వ సంవత్సరంలోనే 06 డిసెంబర్ 1992 చీకటి రోజుకు బీజం పడిందనీ, ఆ మాటకొస్తే ముస్లిములను ఈ నేలకు పరాయివాళ్ళను చేసే కుట్ర శతాబ్దాలుగా జరుగుతున్నదే అని సత్యాగ్రహంతో తన పద్యం ‘నాకే జన్మభూమీ లేదు’ లో చెబుతున్నాడు కవి అఫ్సర్!

బహుశా, ఒక్క తెలుగు భాషలోనే కాదు – అన్ని భారతీయ భాషలలో, బాబ్రీ మజిద్ కూల్చివేత నేపథ్యంలో వెలువడిన అత్యంత శక్తివంతమైన పద్యాలలో అఫ్సర్ రాసిన ‘నాకే జన్మభూమీ లేదు’ పద్యం ఒకటనుకుంటాను.

వ్యక్తిగత దుఃఖాన్ని పద్యం చేయడం కన్నా, ఒకానొక సందర్భంలో అనేక రాజకీయ, చారిత్రక కారణాలతో ముడిపడి వున్న ఒక సామూహిక సామాజిక దుఃఖాన్ని పద్యం చేయడం ఎప్పుడైనా పెద్ద సవాలు! అయితే, కవి ఆ సామూహిక సామాజిక దుఃఖాన్ని తన అనుభవంలోకి తీసుకున్నప్పుడు ఆ పద్యం ఆ బాధిత సమూహాలకవతలివాళ్ళని కూడా కదిలిస్తుంది.

అఫ్సర్ పద్యాలలో ఒక పసి లక్షణం మనల్ని చాలాసార్లు కట్టిపడేస్తుంది. అది వ్యక్తిగత దుఖమైనా, సామాజిక దుఖమైనా, దానిని పద్యం చేసినపుడు, ఆ దుఖానికి కారణమైన వాళ్ళ పట్ల తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేయడంకన్నా, ఒక చిన్న పిల్లవాడు అలకను ప్రదర్శిస్తూ ఫిర్యాదులు చేయడం లాంటిది అఫ్సర్ పద్యంలో కనిపిస్తుంది. కొన్ని సార్లు ప్రత్యక్ష ఆగ్రహ వాక్యాల కన్నా ఈ అలక వాక్యాలే సున్నిత మనస్కులైన చదువరులకు తీవ్రంగా గుచ్చుకుంటాయి.

‘నాకే జన్మభూమీ లేదు’ అన్న శీర్షికతో పద్యాన్ని ఎత్తుకోవడంలోనే మనకు ఈ సంగతి తెలిసిపోతుంది.

నాకే జన్మభూమీ లేదు – అఫ్సర్

శూన్యం తల కింద
నేనేదో ఒక అవయవాన్ని

నేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
47 దగ్గరే ఎలా విరిగానో
మీరెవరూ చెప్పలేదుగా

దేవుడి అంగాంగాన్నీ
కోసుకుని పంచుకునీ
లేదంటే, దోచుకునీ
వెళ్లిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగా

నేను శరీరం లేని నీడని
లేదంటే, ఏ గోడ మీంచో
రహస్యంగా పారేయబడిన ఆత్మని

దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు

ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలను
కుంకుమ చేతులు కోసుకెళ్లి పోయాయి
అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడుతున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది

రెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు
నా వొళ్ళు వొక అల్ కబీర్

నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయి నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను
నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలియదు

నిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడైనా ఎప్పుడైనా ప్రవాసిని
నాలో సగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని

నా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాడిని
అగ్ర రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాడిని

శవమయి దాక్కోవడానికి వున్నా లేకున్నా
తల దాచుకోవడానికి చారెడు నెల చాలంటాను
ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో ఆంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటాను

నలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించమంటాను

నా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.

నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.

విభజించి పాలించే నా శత్రువులారా,
నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు

తీవ్రమైన కత్తిపోట్లకు గురైన బాధితుడు ఇరుకు గల్లీలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ చెప్పిన మాటల్లా ‘శూన్యం తల కింద నేనేదో ఒక అవయవాన్ని’ అని ఆకస్మికంగా పద్యం మొదలవుతుంది. ఆ తరువాత, ఆ బాధితుడు కాసింత స్థిమితపడి తన గోడుని వెళ్ళబోసుకున్నట్టు ఒక్కొక్క పొరనే విప్పుతూ సాగుతుంది ఈ పద్యం.

బాబ్రీ మజిద్ విధ్వంసం పైన ప్రముఖ మరాటీ కవి ఆనంద్ గైక్వాడ్ రాసిన పద్యం రోడ్ల మీది చెత్తను ఊడ్చి వేసే ఒక దళితుడికి, ఖుల్ఫీ ఐస్ క్రీం అమ్ముకునే ఒక ముస్లిం యువకునికి నడుమ సంభాషణగా సాగుతుంది. డిసెంబర్ 6 వ తేదీన ఎదురుపడిన తన దళిత మిత్రుడిని ‘ఇవాళ నువ్వు ఖుల్ఫీ తినడం లేదా?’ అని ముస్లిం యువకుడు అడిగినపుడు ‘ఇవాళ బాబా సాహెబ్ నిర్వాణ దినం’ అని బదులిస్తాడు. ‘మరి నువ్వెందుకు ఇవాళ ఖుల్ఫీ బండి నడపడం లేదు?’ అని తిరిగి ఆ దళిత మిత్రుడు తన ముస్లిం మిత్రుడిని అడిగినపుడు ‘ఇవాళ బాబ్రీ మజిద్ ను ధ్వంసం చేసిన రోజు’ అని అతడు బదులిస్తాడు. ఇక్కడ సంభాషణను ఆపివేసి, ఆ మరాటీ కవి పద్యాన్ని ఇట్లా ముగిస్తాడు – ‘ భయానక నిశ్శబ్దం వీధిని ముంచెత్తింది / మిత్రుల చుట్టూ వాతావరణం ఖుల్ఫీ డబ్బాలా గడ్డ కట్టుకుపోయింది’.

అఫ్సర్ రాసిన ఈ తెలుగు పద్యం చదువుతూ ముందుకు సాగినపుడు శరీరమంతా అట్లాంటి గడ్డకట్టిన గగుర్పాటుకు లోనవుతాము. ‘దేవుడి అంగాగాన్నీ కోసుకునీ పంచుకునీ’ అని చెప్పడంలో దేవుడి ఒక్కో అంగంలోంచి ఉద్భవించిన కుల సమూహాలుగా దేశ ప్రజలను విభజించిన మనుధర్మ శాస్త్రాన్ని నిష్టూరమాడడంతో పాటు, ఈ విభజనలో తనకు ఏ స్థానమూ ఇవ్వని కుట్రని ఈసడించుకోవడం కూడా ధ్వనిస్తుంది. ఈ కుట్ర వల్లనే, తనను ఆకస్మికంగా 47 దగ్గర పరాయిని చేసి, ‘గోడ మీంచి విసిరేయబడిన ఆత్మని చేశారు’ అని వాపోతున్నాడు.

పద్యాన్ని కొంత దూరం పరోక్షంగా చెప్పిన కవి, ‘ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలను / కుంకుమ చేతులు కోసుకెళ్లి పోయాయి / అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా / రెపరెపలాడుతున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది’ అన్న పంక్తుల నుండి 6 డిసెంబర్ 1992 తన జీవితంలో తీసుకు వచ్చిన పెను మార్పుల గురించి ప్రత్యక్షంగా ఏకరువు పెడుతున్నాడు.

‘కుంకుమ చేతులు’ అని అనడంలోనే తన జీవితాన్ని అతలాకుతలం చేసిన శక్తుల ప్రస్తావన తెచ్చాడు. ‘అక్కడెక్కడో’ ‘ఇక్కడెక్కడో’, ‘నా దేహమ్మీద సమాధి కడుతోంది’ అనడంలో గోపురాల కూల్చివేత అంతిమ లక్ష్యం ఏమిటో వివరిస్తున్నాడు. అందుకే, ఆ వాక్యాలకు కొనసాగింపుగా ‘నా వొంటి మీది చల్లని మాంసాన్ని/ఎవరెవరో అపహరిస్తున్నారు’ అనీ, ‘బొంబాయి నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను’ అనీ అంటున్నాడు.

మరింత ముందుకు వెళ్లి, తన చుట్టూ జరిగే రాజకీయాలను కూడా ప్రస్తావిస్తూ ‘నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని / నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలియదు’ అంటాడు.

ఈ పద్యంలో గమనించవలసిన మరొక అంశం- ముస్లిం సంప్రదాయాల పరోక్ష ప్రస్తావన.

నాలో సగాన్ని చీకట్లో ముంచి / ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని’ అంటున్నాడు. ‘శవమయి దాక్కోవడానికి వున్నా లేకున్నా / తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను’ అంటున్నాడు.

పద్యమంతా తన వేదనని వివిధ సంగతులతో ప్రస్తావించిన కవి, చివరలో ‘నలభై ఏడుతో కాదు / నాతో నన్నే భాగించమంటాను’, ‘నన్నెవరూ రెండుగా చీల్చలేరు’ అన్న వాక్యాలతో తనను ఈ దేశ పౌరుడిగా, సాటి మనిషిగా చూడమని చెబుతున్నాడు.

పద్యం చదవడం పూర్తి చేసిన తరువాత, భారత రాజ్యాంగ విలువల్ని విశ్వసించే సున్నిత మనస్కుడైన ఈ దేశ పౌరుడిగా ‘ప్రతీ 6 డిసెంబర్ నాడు చదవ వలసిన పద్యం ఇది’ అని మీరు భావిస్తే, అందుకు ఈ పద్యం రాసిన కవిని బాద్యుడిగా ప్రకటించవలసి వుంటుంది!

**** (*) ****