వొక పచ్చని ఆకు చిర్నవ్వుతూ కనిపిస్తే సత్యశ్రీనివాస్! వొక మందారం సిగ్గుల్ని చెక్కుకున్నట్టు ఎర్రగా కనిపిస్తే సత్యశ్రీనివాస్! వొక మల్లియ స్వచ్ఛంగా నవ్వితే సత్య శ్రీనివాస్! వొక అడవిలోని చెట్ల మీద వెన్నెలో సూర్యుడో మెరుపై మెరిస్తే సత్యశ్రీనివాస్! వొక కవి జీవితంలో ప్రకృతి అంతగా ఎలా అల్లుకుపోయింది? ప్రకృతి నించి స్నేహితుల మధ్యకు ప్రవహిస్తున్నప్పుడు అతని భాష ఎలా మారుతుంది? అతని అక్షరాలు కొమ్మల మధ్య కోయిలలు ఎలా అవుతాయి? వినండి ఏమంటున్నాడో ఈ నడిచే పూల చెట్టు!
మీ కవిత్వంలో ప్రకృతి ఒక ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. ఎందుకు?
చిన్నప్పటి నుండి ఇంట్లో పచ్చదనంతో వుండడం,మొక్కలు పెంచడం ఒక భాగం.ఇందతా ఒక ఎత్తయితే అమ్మ జి.కమలమ్మ పాట పొద్దున మొదలైతే రాత్రి పడుకునే వరకు సాగేది. అన్ని పాటల్లోనూ అంతర్లీనంగా ప్రకృతి అంశాలుండేవి. ప్రకృతి బీజం నాటిన మొదటి గురువు అమ్మే!
ఈ నేపధ్యంలో బాల్యం ప్రభావం ఎక్కువగా వుంది. పుట్టిపెరిగింది హైద్రాబాద్. చిన్నప్పుడు కాలానుగుణంగా ఆటలు ఆడుకునే వాళ్ళం. సంక్రాంతికి పతంగులు, ఎండాకాలంలో గోలీలు,కోతికొమ్మచ్చి,దాగుడుమూతాటలు. కోతికొమ్మచ్చి వెల్ఫెర్ సెంటర్ దగ్గర చింతల తోట వుండేది.(ప్రస్తుతం యన్.యం.డి.సి. కార్యాలయం). దాగుడు మూతలు బీర్ బన్ బాగ్(ప్రస్తుతం క్యాసిల్ హిల్స్). ఇక పతంగుల కోసం విజయనగర్ కాలనీ నుంచి మల్లేపల్లి,ప్రకాష్ నగర్, నాంపల్లి,చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంతా తిరిగేవాళ్ళం. అలా బాల్యం ఆటలు పక్షులకి,జంతువులకి వుండే రేడియస్ని కల్పించింది. కొత్తమిత్రులతో పరిచయాలు, అలా తిరుగుబోతు అవ్వడానికి పునాదులు వేశాయి! ప్రకృతిని వివిధ రూపాల్లో చూడ్డం అన్నది ఇలా జరిగిందేమో!
1984 నుండి చదువుకుంటునప్పుడు మా చిన్నన్నయ్య బి.వి.సుబ్బారావ్ తో కలిసి పని చేసేవాడిని, డిజైనింగ్,ప్రింటింగ్. ఈ పనిలో భాగంగా ఆటవీశాఖ చేపట్టిన పర్యావరణ విద్యాకేంద్రాల డిజైనింగ్ లో అన్నయ్యకు సహకరించా, అలా శ్రీశైలం, మెదక్,అదిలాబాద్,మదనపల్లి అడవుల్లో తిరగడం,అడవుల జీవావరణం తెలుసుకొవడం మొదలైంది. ఇంకే ముంది, పచ్చనిగాలి సోకింది!
1989 నుండి అదే పనిలోపడ్డా, బాగా నచ్చింది. అసలు చెప్పాలంటే పచ్చదనం సోకింతర్వాత ఉద్యోగజీవితం అలవాటు కాలేదు. కొంత కాలం పర్యావరణం ప్రచారం పైన పని చేశా తర్వాత అంతా అడవులు,గిరిజనుల అంశాల దిశగా పయనం. అప్పటినుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో,ఇతరప్రాంతాల్లో తిరగని అడవీలేదు,ఊరూ లేదు, అలా నాలోని సంచారత్వం కొనసాగింది . ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చదనం లేని దృష్టిని ఉహించుకోలేను.
తాటిచెట్టు
నా తనువు
నేల మీది
మోనొలిత్
(6.6.96)
కవిత్వంలో మీ తొలిరోజులు? ఎప్పుడు ఎలాంటి వాతావరణంలో మీరు రాయడం మొదలు పెట్టారు?
నా తొలి రోజులంటే 1984. అప్పుడు డిగ్రీ చదువుతున్నా. హైద్రాబాద్లో రాజకీయలబ్దికోసం మత కల్లొలాలను సృష్టించారు. అది నన్ను చాలా కలిచివేసింది. నా హైద్రాబాద్ కాదనిపించింది. అప్పుడు మొదటి కవిత రాశా. అది హిందిలో ,బహుశా ఆ కవిత శీర్షిక కర్ఫ్యూ.హిందీ కవితలు మిత్రులకి,కొన్నిటిని నాన్న గారు గుడ్ల వలేటి రామారావు గార్కి( జర్నలిస్ట్), చెల్లెలు అరుణా(అరుణా భిక్షు) కి వినిపించేవాడ్ని మేచ్చుకునెవారు. ఖధీర్ బాబు నా హిందీ కవిత్వం గురించి రాసారు.
అసలు తెలుగులో రాస్తాననుకోలేదు. అప్పట్లో నాకు తెలుగు కంటే హిందీ పైన పట్టు ఎక్కువగా వుండేది. తెలుగులో కవిత్వ పరంగా ఆలోచించలేకపోయేవాడ్ని. ఇదంతా మిత్రుల ప్రోత్సాహంతోనే.
పతంజలి శాస్త్రి గారు, నేను కలిసి 89 నుండి 96 వరకు పనిచేశాం. అలా ప్రకృతి, సాహిత్యం ,ఎందరితోనో పరిచయాలు పెరిగాయి. 1992 నుండి నామాడి శ్రీధర్, ఒమ్మి రమెష్ బాబు, శశి, శివాజి, మధుకర్, ఎం. యస్. నాయుడు, సిద్దార్థ, అనంత్, పెద్ది రామా రావు, అఫ్సర్, వసిరా,భిక్షు తో పరిచయాలు. శ్రీధర్, ఒమ్మి రమెష్ బాబు, శశి వాళ్ళప్పుడు ‘కంజీర ‘ ద్వారాకొత్త కవులని పరిచయం చేసేవారు. వాళ్ళే నన్ను తెలుగులో రాయడానికి ప్రోద్భలించిన ముఖ్య కారకులు. తెలుగులో 1995 లో మొదలుపెట్టా. అచ్చులో వున్నవి తెలుగులొనే.టి.శివాజి గారు చాలా ప్రోత్సాహనిచ్చారు.
పని పరంగా 89-95 ఒక దశ,95-2004 ఒక తీరు. 2004 -2008 ఒక దశ. 2004 నుండి ఇప్పటి వరకు ఒక తీరు. నా కవిత్వం తీరుమారింది, 95 నుండి అడవి నాలోకి చొచ్చుకువచ్చేసింది. ప్రపంచం మారింది. ఇప్పుడు మూడు భాషల్లో రాస్తున్నా తెలుగు, హిందీ, ఆంగ్లం. అందుకే అన్నీ తొలి రొజులే.
అసలు కవిత్వమే మీ వాహిక ఎందుకు అయింది?
అది నాలోని పచ్చని మోటు బావి. బహుశా ఈ మాధ్యమం ద్వారా నన్ను నేను లోతుగా అన్వేషిస్తూ, వ్యక్త పర్చుకొగలుగతానేమో.
మీరు ఇతర భాషల కవిత్వం కూడా చదివారు కదా, ఆ ఇతర భాషల కవులు ఎవరు మీకు నచ్చారు? ఎందుకు?
నాకు సాహిత్యం తెలిసింది పాటల ద్వారా,చదవడం వల్ల. ఇంట్లో అందరికీ సంగీతం ఇష్టం. మా మూడో అన్నయ్య ఉదయ భాస్కర్ వల్ల ఉర్దూ, హిందీ పాటలు వినడం అబ్బింది. పాటలు వినడమే కాక పాడడం ఇష్టం(బాత్రూం సింగర్నండి). కనుక అందులోని సాహిత్యాన్ని రాసుకోడం ,కంఠస్తం చేయడం అలవాటైంది, అలా ఉర్దూసాహిత్యం మీద ప్రేమ,పిచ్చ ఇష్టం. నాకు గాలిబ్ చాలా ఇష్టం. ఇక లిస్ట్ పెద్దది. కొందర్ని చెప్పగల్గుతా, మజాజ్, సాహిర్, నిదాఫాసిల్, బషిర్ బద్ర్, మఖ్దూం, షెహరియార్, ఫైయాజ్ , గుల్జార్, అమ్రితాప్రీతం, నాగార్జున, బద్రినారాయణ్. ఇక సుఫి లో అమీర్ ఖుష్రో,బుల్లెషా.కబీర్. అనువాదకుల్లో, అరవింద కృష్ణ మెహరోత్రా, ఏ.కే.రామానుజం (ఈయన ఫోక్ టేల్స్ చాలా ఇష్టం). వీళ్ళవి ఒక ఆడియో విజువల్ ఇన్ సైట్స్..ఇవికాక ప్రపంచ ఫొక్ లోర్స్, హైకు, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ సాహిత్యం ఇష్టం.
సాహిత్యంతోబాటు నాకు ఇకలాజికల్ హిస్టరీ చాలా ఇష్టం , ఇది ఏర్పడ్డానికి కారణం బాల్య మిత్రుడు చింతా శ్రీనివాస రెడ్డి. సాహిత్యం, ఇకలాజికల్ హిస్టరి సైమల్టెనీయస్ గా చదువుతూ వూళ్ళు తిరుగుతున్నప్పుడు దీనిని మెకన్సి గ్రామచరిత్రల(కైఫియత్, అంటే ఉర్దూలో మనసులొని మాట.) లా చూసి అర్ధం చెసుకునే ప్రయత్నం చేస్తా. అలా నాకు అంతా సాహిత్యమే.
మీ కవిత్వ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన కొన్ని మంచి/ చేదు అనుభవాలు?
ఇందాక చెప్పిన విశేషాలే! అచ్చులోకి దింపింది నాయుడు, నా కవిత్వాన్ని మొదట విశ్లేషించింది సతీష్ చందర్ గారు. నా మొదటి పుస్తకం “ఇంకా సగం”కి మంచి స్పందన వచ్చింది, అఫ్సర్ , వసిరా గార్లు క్రిటికల్ రెవ్యూలు రాశారు. జీవితంలో చేదు అనుభవాలున్నాయి కాని ఈ విషయంలో లెవు. నేను ఒక అనానిమస్ కవి అవ్వడంవల్ల కూడా కావచ్చు. సి.వి.కృష్ణా రావు గారి నెలనెల వెన్నెల ఒక మంచి వెదికగా దోహదపడింది. ఆయనే నా పుస్తకవిష్కరణ బల్వంతాన సభ పెట్టి జయంతి మహపాత్రో గారి తొ ఆవిష్కరణ చేయించారు.అప్పటికే పుస్తకం పంచడం అయ్యింది. అలా ప్రోత్సాహకరంగానే వుంది.
నా కవిత్వానికి బ్లాగ్ రూపమిచ్చింది గాలి ఉదయ్ కుమార్, సవరించింది జ్యోతి వల్లబోజి గార్లు. నా రేండవ పుస్తకం నేలకన్ను(ఇ బుక్) కి డిజైనింగ్ చేసింది ఉదయే.
నా నేలకన్ను పుస్తకాన్ని ఆ ఇంటికి అంకితమిచ్చా.2002 నుండి వ్యక్తిగత స్తబ్తత వచ్చింది ఒక 5 ఏళ్ళు కవిత్వం అంతా ఇంటి చుట్టూ తిరిగింది. ఈ కాలంలో నాకు తోడుగా వున్నది మాధవి,శిశిర్.
కవిత్వం కాక ఇంకోటేదయినా- చిత్ర కళ, ఫోటోగ్రఫీ- మీ భావాలకు తగిన వాహిక అని మీరెప్పుడయినా అనుకున్నారా? అసలు కవిత్వమే రాయలేని స్థితి వుంటే, అది మీకెలా వుంటుంది? ఇన్ని ఆలోచనలూ అనుభూతులూ ఏమయి పోయేవి?
నేను చిత్రలేఖనం లో ముఖ్యంగా వృద్ధ మహిళల ముఖచిత్రాలు వేస్తాను, గిరిజన, గ్రామీణ వృద్ధ మహిళలవే, ఇక అమ్మలు,అమ్మమ్మలు, అదీ వాటర్ కలర్స్ లో, వీళ్ళు పంచి పెట్టే గుణానిచ్చారు, ఆ గుణం వాళ్ళు అంతరించిపోతున్నారు. వాళ్ళకు నివాళివ్వాలని.
ప్రకృతిని ఫొటొగ్రఫి ద్వారా బంధిస్తా.వీటి ద్వారా నే తిరిగే ప్రాంతాల్ని, వ్యక్తుల్ని డాక్యుమెంట్ చేస్తా. ఒక విధంగా ఆర్కైవ్స్లాంటివి.నా కవితల్లో డేట్ లైన్ వుంటుంది.ఎందుకంటే అక్కడ ఆ కవిత పుట్టింది. ఆ సృహనిచ్చిన ఆ నేలకి నేను తెలుపుకునే కృతజ్ఞత.
కవిత్వం అంటే నాకు కేవలం రాయడం కాదు, జీవితాన్ని అర్ధం చేసుకుని వ్యక్త పరుచుకునే సాధనం. మా ఇల్లుని కవితలా కట్టుకున్నా ననుకుంటా. కనుక కవిత్వం రాయకుండా వుండడమనేది లేదు. అచ్చువేస్తానా లేదా అన్నదే ప్రశ్న. హైద్రాబాదీ గా చెప్పాలంటే సవ్వాలిచ్ పైదా నహి హొతా (ప్రశ్న పుట్టదు). పోయేముందు ఒక చెట్టు నీడన నా సమాధి పలక మీద ఒక కవిత రాసి పెడతా విత్ బ్లాగ్ డీటైల్స్….(అహ,అహా….)
మీరు బలమయిన సామాజిక రంగాల్లో వున్నారు. అయినా, మీ కవిత్వంలో ఒక అంతర్ముఖీనత బలంగా కనిపిస్తుంది. ఎందు చేత?
నా విషయంలో వాస్తవం. కాని ఈ ప్రశ్న లోతైన మూలాలకి సంబంధించినది . ఎందుకంటే నాకు కవిత్వం పైన్ వృక్షాల వేర్లని వెతికే హాన్ బిల్ల్ కన్ను. ప్రపంచ వ్యాప్తంగా వున్న సిద్ధాంతాలు ప్రకృతిని ముడిసరుకుగానే జమకడతాయి. స్టేట్స్ కూడా. ఇవన్ని ట్రేడబుల్ కమాడిటిస్. రేవు దాటిన కంపెనిల ఓడ మరొక రేవుకి చేరినకాలమ్నుండి నేటి వరకు ప్రకృతిని దోచుకునే గుణం పెరుగుతూనేవుంది. అంతకుమునుపు కూడా వుంది అందుకే మూలవాసులని రాక్షసులుగా చిత్రీకరించారు. యుద్ధం అనేది మూలవాసులకి దిన చర్య. వాళ్ళు అనాదిగా వాళ్ళ అస్తిత్వంకోసం పోరాడూతూనే వున్నారు. అది ఎప్పటికీ కొనసాగుతుంది.ప్రకృతి సమతుల్యత వుండాలంటే భూ మి పైన 33% శాతం ఆడవులుండాలంటారు అంటే అక్కడ వుండే వాళ్ళు వుండకూడదా? వాళ్ళ వల్లే అడవులు నాశనం అవుతాయంటూ దుష్టప్రచారం. దేవుడికి మాన్యం కావాలి, ప్రకృతిలొ మమేకమై విగ్రహ ఆరాధనలేకుండా ప్రకృతిని పూజించే వారు తిరిగుబాటుదారులు.
ఏడుకౌండల్లో వున్న స్థానికుల జీవిత చిత్రాలు ఎంతమందికి తెలుసు. అభయారణ్యం,జాతీయ పార్కులో జీవించే వార్కి హక్కులుండవు. వున్నట్టుండి ఇల్లు,గ్రామం ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటిస్తారు (అంతటా జరిగింది). ఈ విషయాలు వాళ్ళతో చరిస్తున్నప్పుడు ఉద్రేకం తన్నుకొస్తుంది, ఏక కాలంలో పరిపరి విధాల వ్యూహాలు రచించాలి. ఇందంతా కవిత్వంలో చేప్పలెనూ కాని చెప్పాలి కవిత్వం నాకు అన్వేషించే మార్గాన్ని, వివిధ రకాలుగా వ్యక్తపరిచే తీరుని,వ్యుహ రచనల్ని నేర్పించింది. నాకు కవిత్యం నినాదం కాదు. నేను కవిత్వ ఆలోచనా రూపానికి ప్రతీకనవ్వాలన్న కాంక్ష!.’కవిత ‘ నాకు లోతైన దృష్టిని క్లుప్తంగా వ్యక్తపర్చే ఇంధనం. అది లేతాకుపచ్చని ఎరుపురంగు..
యుద్ధంలో మరో రోజు
ఈరోజూ నీది
రేపు నాది ఇకపై
రోజుకొకటి చొప్పున
ఇళ్ళల్లో
చేలల్లో
మన బొమ్మలు
మనమే నాటుకుందాం
గర్భంలోని శిశువుల్లా
నేలను దున్నుకుందాం
వాళ్ళ కళ్ళను
బోర్లించిన మట్టికుండలోని
శూన్యంగా మార్చుదాం
పుడమి చిట్లిన శబ్దం
మన
యుద్ధ సంకేతం
(కాంతి పార్వతికి,18-11-97)
ప్రకృతిని అర్ధంచేసుకోవడం చాలా అవసరం. అది కేవలం ఒక పాఠ్యాంశం కాదు. ఆడవిలో చెట్లని నాటాల్సిన అవసరంలేదు. ఒక చిరుజల్లుకి మోడువారిన కూట్లలోని పచ్చదనం మళ్ళీ చిగురిస్తుంది. ఆ చిగురించే కాలాన్ని ,వ్యవధిని ప్రకృతికి ఇవ్వాలి. మనలో అంత ఓపిక ఎక్కడ వుంది? అందుకే ఓపిక గా చెప్పడానికి వ్యాసాలని మాధ్యమంగా ప్రయోగిస్తాను. అంతేకాక క్షేత్రస్థాయి కార్యకర్తలకు రాయడంలో మెలకువలు, నైపుణ్యం పెంచే ప్రయత్నాలు చేస్తాను. ఎప్పటికైనా పచ్చదనం గిరిజనుల రాతల ద్వారా పరివ్యాప్తి చెందాలని. చివరాఖరి మాట ప్రకృతిని పర్యాటకుడిగా చూడలేను, గిరిజనుడి ధృక్కోణంతో చూడాలన్నది నా వాంఛ.
nijayati nindina interview.Pachhani motubavi anna vyakthikarana dwara Srinivas tana satyanni chatukunnaru.Vakiliki dhanyavadalu.
hi satya. your bio-poetical interview is astonishing and simple. i wish you to strengthen yourself to reach your desires.
“నా కవితల్లో డేట్ లైన్ వుంటుంది.ఎందుకంటే అక్కడ ఆ కవిత పుట్టింది. ఆ సృహనిచ్చిన ఆ నేలకి నేను తెలుపుకునే కృతజ్ఞత.”….బాగా చెప్పారు సత్యా!….
* కవిత ‘ నాకు లోతైన దృష్టిని క్లుప్తంగా వ్యక్తపర్చే ఇంధనం.
* ఒక చిరుజల్లుకి మోడువారిన కూట్లలోని పచ్చదనం మళ్ళీ చిగురిస్తుంది. ఆ చిగురించే కాలాన్ని ,వ్యవధిని ప్రకృతికి ఇవ్వాలి. మనలో అంత ఓపిక ఎక్కడ వుంది?
నిజమే మనిషికి అంతా పరుగే.. ఆ పరుగే నాగరికత అన్న భ్రమ
మన నాగరిక భేషజాలకి ప్రకృతికి వున్నంత ఓపిక ఎప్పుడొచ్చేనో
good
Oka manchi anubhavam.. education
“కవిత్వం అంటే నాకు కేవలం రాయడం కాదు, జీవితాన్ని అర్ధం చేసుకుని వ్యక్త పరుచుకునే సాధనం. మా ఇల్లుని కవితలా కట్టుకున్నా ననుకుంటా. కనుక కవిత్వం రాయకుండా వుండడమనేది లేదు. అచ్చువేస్తానా లేదా అన్నదే ప్రశ్న. హైద్రాబాదీ గా చెప్పాలంటే సవ్వాలిచ్ పైదా నహి హొతా (ప్రశ్న పుట్టదు). పోయేముందు ఒక చెట్టు నీడన నా సమాధి పలక మీద ఒక కవిత రాసి పెడతా విత్ బ్లాగ్ డీటైల్స్….(అహ,అహా….)” సత్య గారి కవిత్వం ఇంతకుముందు చదివినా ఈ చెట్టుకవిని పూర్తిగా చదవటం మహద్భ్యాగ్యం.I thank Vakili team for this.
Thanks to every one or their encouraging comments
సలాం సాబ్…