కవిత్వం

జుమ్మె రాత్ బజార్

02-మే-2013

పురాతన వస్తువుల అంగడి
మనస్సు
ఒక విధమైన
చోర్ బజార్
తనని తానే దొంగిలించి
అమ్ముకుంటుంది
సరైన కొనుక్కునే వాళ్ళు అరుదు
అందుకే వారం వారం
సంతలా
మారుతుంది

ఈ సారి
మనస్సుని బుడగలొ పెట్టి
వదిలేస్తాను
తస్సాదియ్య
అందినోడి చేతిలొ
కోరికలదారం గాజుపెంకులై
గుచ్చుకుంటాయి
అన్నీ కొని పెకలించవచ్చన్న
వాడి గుండె ధైర్యం విరిగి
రెండు పొరలనడుమ రంద్రమవుతుంది

దిక్కుతోచక
రక్త పిపాసి
వీధిన పడి
ఇక బతకడానికి
వుబికి వచ్చే
రక్తాన్ని
వేలంలో అమ్ముకొవాలి

అప్పుడు తొలిజాము కూతలా
మనస్సు పురాతన ఛాయల నుండి
వెలుతురు
మస్జిద్ నుండి వెలువడే
ప్రార్ధనా గీతమవుతుంది

చోర్ బజార్ వునికి రంగు మారుతుంది