లోపలి మాట

వేదన పలచ బడిన గీతం

29-మార్చి-2013

కవిత్వానికి”లోపలి మాట” ను చెప్పడమంటే ఒక విధంగా చాలా కష్ట సాధ్యమే. కవిత ఎంపిక దగ్గర్నించి కవిత్వపు సారాంశం నమిలి మింగే వరకూ.

అసలు ఏ కవితని ఎలా ఎంచుకోవాలి? చదివిన ప్రతి కవితలోనూ కొన్ని లోపాలు, కొన్ని అద్భుతాలూ కనిపిస్తూంటే-ఒకోసారి అయ్యో మనిమిలా రాయలేకపోయామే అని దిగులు, ఆశ్చర్యం! ఎంత బాగా రాసారన్న ఆనందం! కవితలు చదూకుంటూ పోతూ, కవిత్వమే నిబిడాంధకారాన్ని తొలగించే రాత్రి చేతి దీపమై నడచుకుంటూ పోతూంటే ఎక్కడో ఒక ముల్లు కాలికి గుచ్చుకున్నట్లు ఒక కవిత వ్యధ పెడితే అది నిన్ను వదలకుండా వేధిస్తే అది నిజంగా ఒక కవిత-

అయినా కొన్ని కవితలు విసిగిస్తే ఆ కవితకున్న పేరు ప్రఖ్యాతులు మన్ని భయపెడితే లోపలి మాటని అక్కడే గొంతు నులిమేస్తే ఇక నిజమనేదేముంది! బయటి మాటే లోపలి మాట నిజంగా అయ్యే ధైర్యం లేనివాడికీ పాట్లెందుకో!!

అసలు ఎలా చదవాలి కవిత్వాన్ని? ఏ తూనిక రాళ్లతో తూచాలి?

ఒక వేడి కన్నీటి బొట్టు…, తాదాత్మ్యం అంత కాకపోయినా స్పందించిన హృదయం, కలిగిన ఆర్ద్రత, మళ్లొక్కసారి చదవాలన్ని కుతూహలం ….ఇవేనా అర్హతలు!!

ఎలా పట్టుకోవాలి కవిత్వ”అంతర్రహస్యాన్ని” “అంతస్సూత్రాన్ని”!!

కవి పేరుని బట్టి కవిత్వం కానిదల్లా కవిత్వమని మెచ్చుకునే తీరే లోక సహజపు విమర్శ చేయాలా! అలాగని పేరున్న వారి పేరు కావాలని తీసి గంగలో కలపాలా!

ఖచ్చితంగా ఇవన్నీ అవసరం లేదు- అయితే మొహమాటమెందుకు! ఇన్ని గోలలెందుకు?

కవితకి పేరు తీసి చదివితే పోలా! చివరి వరకూ పేరుని దాచిపెడితే వచ్చే అనుభవమేదో చెపితే పోలా! అసలది కవిత్వం కాదనీ, పోనీ అందులో ఎక్కడో ఏదో లోపించిందని అనిపిస్తే చాలదూ! నాలుగు మాటలు చెప్పడానికి- హమ్మయ్య ఒక కొలిక్కి వచ్చింది సమస్య-

అవును అదే ప్రయత్నంలో కవిత్వం చదవడం మొదలు పెట్టిన తర్వాత ముందు కవిత చదివి, ఆ తర్వాత పేరు చూసేక కలిగిన బోల్డు ఆశ్చర్యాలెన్నో-

విచిత్రంగా,అత్యంత ఆశ్చర్య కరంగా …కవిత్వం లో పసలేని జాబితాలో మొదటివి “పేరున్న” కవులవి.

పేరు ప్రఖ్యాతులున్నాయి కదా రాసిందల్లా కవిత్వమే అనుకునే ఒక నిర్లక్ష్యమో, లేదా ప్రతి కవికీ ఉండే అత్యవసరత్వపు,బలవంతపు కవిత్వాల్లో అదీ ఒకటి కావడం వల్లనో, సంవత్సరాల తరబడి కవిత్వం చదవకుండా, కవిత్వం లో ఉన్న ఆర్ద్రతను ఆదిలోనే మర్చిపోయి, నే రాసిందే కవిత్వం అనుకునేతనం వల్లనో-

ఇక ఈ కవితను చూడండి-

“కుప్పం కాబ్లర్“ వేదనా గీతం. వెనక్కి తిరిగి చూడని వేదనా గీతం. కవితలో ప్రాసల పాట్లని వదిలించుకోలేని తనాన్ని పక్కన పెడితే వేదన పలచ బడిన గీతం.

నిజానికీ కవిత సామాజిక వస్తువులే కవిత్వం, ప్రేమగా హృదయం స్పందించింది కవిత్వం కాదు అనుకునే వాళ్లు రాయాల్సింది కాదు. కన్నీటికి భేదం ఉండదు, అది నీ కంట్లోనైనా, ఎదుటి వాడి కంట్లోనైనా రుచి ఒక్కటే, వెనుక వ్యధ పడే హృదయం ఒక్కటే.

కవిత పేరుతోనే ప్రాస కోసం పడ్డ బాధ ప్రారంభమవుతుంది. ఇక కవిత నడక లో కవిత్వం కంటే వచనం పాలు ఎక్కువ. అయితే ఒక విధంగా ఈ కవిత లోని కాబ్లర్ అదృష్ట వంతుడు.ఒకప్పటిలా “నీ చావు నువ్వు చావు, నా చావు నేను ఛస్తాను” అని అస్పష్ట ప్రేలాపనగా కాకుండా కవిత సాగినందుకు.

కవిత ఎత్తుగడ చూడండి ఎంత సాదా సీదాగా ఉందో-

“ఈచెట్టు కిందే

మాతాతగూటం పాతాడు

దీనినీడలోనే మా అయ్య నడిచాడు

నేనూఇక్కడే పాతుకు పోయాను పాతికేళ్ళుగా”

అని చెప్పులు కుట్టే పెద్దమనిషి స్వగతం ప్రారంభమవుతుంది-

పొట్టపోసుకోవడానికే వృత్తి ప్రారంభించిన వ్యక్తికి

తన దగ్గరికి చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ల మీద విపరీతమైనకసి ఉంటుంది తర్వాతి వాక్యాల్లో-

“అరిగినచెప్పుల్ని చదవగలను నేను

తెగినఉంగటాలు చూసి చెప్పగలను

మీరెలాంటివాళ్ళో

మీ బూట్లకి పాలిష్ చేస్తున్నప్పుడు వినగలను

మీ పాదాల వంకర నడకలను

వాటికిఅడుగులు వేస్తున్నప్పుడు చూడగలను

మీ నడతలోని తప్పు ఒప్పుల్ని

మీరునాకిస్తున్న రూపాయనూ

ఇవ్వడానికిచాచిన చేతులనూ

దర్శించిచెప్పగలను మీ వ్యక్తిత్వాలను”

తెగినచెప్పులు, పాలిష్ చేసే బూట్ల వెనుకఉన్న వ్యక్తిత్వ విశ్లేషణలో ఏదో అతణ్ణి అందరూ చిన్నచూపు చూస్తున్నారన్న భావనా ఈ వాక్యాల్లో కనిపిస్తుంది-

పోనీ అదే నిజమనుకుంటే- అక్కడి దాకా కొంత వరకుఒక పద్ధతిలో నడిచిన కవితలో ఏం రాయాలో తెలీకరాసినట్లు వచ్చే తర్వాతి వాక్యాలుచూడండి-

మళ్లీప్రాస కోసం పాట్లు-

“ఎందుకేసుకుంటారయ్యామీరు చెప్పులు?

మరెందుకుతొడుగుతారయ్య బూట్లు?”

“నన్నుచూడండి

దసలకుండామెసలకుండా ఇక్కడే కూర్చుంటాను

నేనుమీలా ఏ హాజరుపట్టికల్లో సంతకంపెట్టను

అసలుస్వేచ్ఛంటే నాది

ఇష్టమైతేఈ చెట్టు కిందకొస్తాను”

చెప్పులువేసుకుని ఊరంతా తిరిగే వాడికిలేని(?) ఇంగిత జ్ఞానం తనకుందనిచెబ్తూ “నన్ను చూడండి ” అంటూ” దసలకుండా మెసలకుండా” కూర్చుంటాను.

హాజరుపట్టికల్లో సంతకాలు పెట్టను అంటాడు.

ఇక్కడకవి స్వగతం లోకి “కాబ్లర్” జొరబడతాడు.

కదలకుండాకూర్చోవడం అతని కేదో ఇష్టమైనపని అన్నట్టు,

“స్వేచ్ఛగా నచ్చితేవస్తాను, లేకపోతే లేదు” అనే స్టేట్ మెంటులో ఆకలి తో ఉన్నచెప్పుల వాడి ఆక్రోశం ఏకోశానా కనబడదు.

అసలు”ఓ చెప్పుల మనస్తత్వ శాస్త్రవేత్త ఆత్మవెత “ అని చెప్పుకున్నకవి నిజంగా అతని మనస్తత్వాన్ని ఎంత నిశితంగా చదవాలి? అదెక్కడా కవితలో కనబడదు. అతను వేళకి రాకపోవడానికి కారణాంతరాలు ఎన్నెన్ని ఉన్నాయో- అతని జీవితం లోకితొంగిచూస్తే ఏమేమి కారణాలు ఉండిఉండేవో- అదేమీ లేకుండా స్వేచ్ఛగాఉండాలనుకోవడం మాత్రమే కారణమని ఊహించడం అసంబద్ధం. ఒకవేళ అదే నిజమైతేఆ సదరు వ్యక్తి వచ్చినకాస్తో కూస్తో ఆదాయాన్ని సాయంత్రానికి పీకెల దాకా తాగి(తాగడానికి ఎన్ని గొప్ప కారణాలోఉంటాయి మళ్లీ సానుభూతి దారులకి)పొద్దెక్కిన వరకూ లేవని వట్టిసగటు మనిషి అయి ఉంటాడు.అప్పుడూ వాడి వెనక కుటుంబంపడే బాధ ఒకటి ఉంటుంది.

హాజరుపట్టికల్లో సంతకం పెట్టే వాడిజీవితం తో చెప్పులుకుట్టే వాడి స్వేచ్ఛను పోల్చాల్సిన అవసరం కవితలో ఎక్కడా కనిపించదు.

అలాంటివే కవితలో నిర్లక్ష్యాలకు తార్కాణాలుగా కనిపిస్తాయి-

ఇక కవి ఒకడు “దాపురించిన”బాధ, తన మీద కవితగట్టే వాడి కవిత్వానికి పాడెగడతానని అతని చేత చెప్పించడంకవితలో మళ్ళీ అసందర్భాలు-

కవితమొదటిలో ఉన్న స్వగతమూ పోగా,కవిత మధ్యలోని మనుషులపైని ఆక్రోశమూ పోగా కవిత కవిమీదకు మళ్లుతుంది.

“ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడు నాకు

నన్నుగమనించే వాడంటే నాకు పడదు

నన్నుపరికించే వాడంటే నాగ్గిట్టదు

కవితగడతానంటాడు వాడు నా మీద

పాడెగడతానంటానువాడి కవిత్వానికి నేను”

అసలుకవిత అప్పుడు మొదలవుతుంది-

“నన్నురాయటానికేముంది?

అరిగినబతుకులేసుకుని తిరుగుతారు మీరు

నాతోబేరాలాడతారు మీరు

రేపిక్కడేటాటావాడు మీకు స్వాగతం చెపుతాడు

రిలయెన్సోడుబూటు క్లినిక్‌ తెరుస్తాడు

నాకొడకల్లారా!

ఇక తిరగండి వాడి చుట్టూ

ఎందుకుబతుకుతార్రా

నన్నుబతికించుకోకుండా?

ఎట్లాబ్రతుకుతార్రా

నా నీడను సైతం చంపి”

……

నన్నురాయటానికి ఏముంది?

అరిగినబతుకులేసుకుని తిరిగే వాళ్లైన అందరూ అంటూ

టాటాలు,రిలయన్సులు… పేరున్న గొప్ప గొప్ప షూమార్టులు

మామూలుచెప్పులు కుట్టుకునే వాడి జీవితాన్ని ఎలాఛిద్రం చేసాయో

పెద్ద షాపుల్లో బేరమాడలేని జనం చెప్పులు కుట్టే వాడి దగ్గర ఎలా బేరమాడతారో అతనికి వచ్చే ఆదాయమెంత ని ఎలా ఆలోచించుకోరో చెపుతూ,

చేతి వృత్తులు,చిన్న చిన్న పనుల్తో పొట్ట పోసుకునే వాళ్ల బతుకులు ఎలా నాశన మవుతున్నాయో అతని ఆక్రోశం లోనే చెప్పడం తో కవిత పూర్తవుతుంది.

కవితని మొత్తం చదివాక ఇంత కంటే బాగా చెప్పగలిగితే, చివర్లో ఉన్న కవితాత్మ మొదట్నించీ కనిపించి ఉంటే ఎంత బావుణ్ణు! అని అనిపించక మానదు- కవితలో ప్రపంచీకరణ పై పళ్లునూరుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత అతని జీవితం వెనుక కన్నీటి పై కూడా ఉండి ఉంటే మంచి కవిత అయి ఉండేదేమో!

ఒక కొత్త కవి ఏదైనా రాస్తే కవితకి తీసుకున్న”బలమైన వస్తువుని” సరిగా చెప్పడం రాలేదని అంటాం. లేదా దీన్ని కవిత్వం చేసే పని మళ్లీ చెయ్యమని పురమాయిస్తాం.

మరి ఈ కవితకి ఏమని చెప్పాలో!

…………………

కుప్పంకాబ్లర్

ఈ చెట్టు కిందే
మాతాత గూటం పాతాడు
దీని నీడలోనే మా అయ్య నడిచాడు
నేనూ ఇక్కడే పాతుకు పోయాను పాతికేళ్ళుగా
అరిగినచెప్పుల్ని చదవగలను నేను
తెగిన ఉంగటాలు చూసి చెప్పగలను
మీరెలాంటి వాళ్ళో
మీ బూట్లకి పాలిష్‌ చేస్తున్నప్పుడు వినగలను
మీ పాదాల వంకర నడకలను
వాటికి అడుగులు వేస్తున్నప్పుడు చూడగలను
మీ నడతలోని తప్పు ఒప్పుల్ని
మీరు నాకిస్తున్న రూపాయనూ
ఇవ్వడానికి చాచిన చేతులనూ
దర్శించి చెప్పగలను మీ వ్యక్తిత్వాలను
ఎందుకేసుకుంటారయ్యా మీరు చెప్పులు?
మరెందుకు తొడుగుతారయ్య బూట్లు?
నన్ను చూడండి
దసలకుండా మెసలకుండా ఇక్కడే కూర్చుంటాను
నేను మీలా ఏ హాజరుపట్టికల్లోసంతకం పెట్టను
అసలు స్వేచ్ఛంటే నాది
ఇష్టమైతే ఈ చెట్టు కిందకొస్తాను
ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడునాకు
నన్ను గమనించే వాడంటే నాకు పడదు
నన్ను పరికించే వాడంటే నాగ్గిట్టదు
కవిత గడతానంటాడు వాడు నా మీద
పాడెగడతానంటాను వాడి కవిత్వానికి నేను
నన్ను రాయటానికేముంది?
అరిగిన బతుకులేసుకుని తిరుగుతారు మీరు
నాతో బేరాలాడతారు మీరు
రేపిక్కడే టాటావాడు మీకు స్వాగతం చెపుతాడు
రిలయెన్సోడు బూటు క్లినిక్‌ తెరుస్తాడు
నాకొడకల్లారా!
ఇక తిరగండి వాడి చుట్టూ
ఎందుకు బతుకుతార్రా
నన్ను బతికించుకోకుండా?
ఎట్లా బ్రతుకుతార్రా
నా నీడను సైతం చంపి

………………..

- సీతారాం

(ఓ చెప్పుల మనస్తత్వ శాస్త్రవేత్త ఆత్మవెత)