మహానగరాలలోనూ,
పల్లెల్లోని సందుల్లోనూ
ఒక్కణ్ణే తిరుగులాడేను.
పిచ్చిగా వాహనాలు పరుగులెత్తే రోడ్డు మధ్యలోంచి
తీరిగ్గా నడుచుకుంటూ వెళ్ళేను
ఏ వాహనమైనా నన్ను
చచ్చిపడేలా గుద్దెయ్యకపోతుందా అన్న ఆశతో.
గురుత్వాకర్షణశక్తిని ధిక్కరిస్తూ
ఆకాశాన్నందుకొంటున్న ఓక్ చెట్టు కొనకొమ్మమీద
కాళ్ళు బారజాపుకుని పడుక్కున్నాను
అగ్నిగుండంలో దూకాను
మంచుపలకలమధ్య రోజులతరబడి పడుక్కున్నాను.
అయినా ఏం ప్రయోజనం లేదు.
అంతరద్దీగా ఉన్న రాదారిమధ్యనుంచీ
చెక్కుచెదరకుండా బయటపడ్డాను.
ఓక్ చెట్టు కొమ్మ ఆశించినట్టుగా
వంగలేదు, విరగలేదు.
మంటల్లోంచి నల్లగా మాడిపోయినా
మంచుకి గడ్డకట్టుకుపోయినా
క్షేమంగా తిరిగివచ్చేను.
ఎదురుగానున్న నిలువుటద్దంలో
నన్ను నేనొకసారి నిశితంగా పరీక్షించుకున్నాను:
బయటా లోపలా
ఇంకా నీ గురుతులు నన్ను వదిలిపెట్టలేదు.
లేదు …
నేను పూర్తిగా నీ ప్రభావంనుండి విముక్తిణ్ణి కాలేదు.
ఇప్పటికీ…
***
మలయాళం: సుధీష్ కొట్టెంబ్రం
ఆంగ్లానువాదం: రాహుల్ కొచ్చిపురంబిల్
తెలుగు అనువాదం: నౌడూరి మూర్తి
Courtesy: poetrans.wordpress.com
Possessed by Sudheesh Kottembrum.
బాగుంది మూర్తి గారు