సిలికాన్ లోయ సాక్షిగా

స్పానిష్షూ- ఉష్షూ

02-మే-2013

అమెరికా వచ్చి వారం రోజులైంది. సూర్య ఆఫీసుకి పొద్దుటే బాక్సు తీసుకుని వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నాడు.

‘ఇంట్లో కూర్చుని కునికి పాట్లు పడకుండా అలా పార్కుకి వెళ్లి రారాదూ- నీకూ ఎవరైనా కనిపించినట్లవుతారు, నిధికి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది ‘అన్నాడు.

“నాకు ప్రపంచమంతా కలో, నిజమో అర్థం కాని భ్రాంతిగా ఉంది ఇంకా” అన్నాను.

ఓ కమాన్ ప్రియా! “అదే జెట్లాగ్ మరి” అని

పోన్లే నిద్రొస్తే మరి కాస్సేపు పడుకో “అలారం పెట్టుకుని ” అని వత్తి పలుకుతూ బైటికెళ్తూ తలుపు లాకు వేసెళ్లేడు.

నిజానికి బోల్డు పనులు ఉన్నాయి. కొత్తగా ఒక ప్రాంతానికి పెట్టే, బేడా సర్దుకుని వచ్చి మళ్ళీ జీవితాన్ని పున: ప్రారంభించడమంటే పన్లు ఎలా లేకుండా ఉంటాయి?
అయినా లేవడం, కాస్తవండుకుని తినడం, మళ్లీ నిద్రపోవడం గా గడుస్తోంది రోజు మొత్తం. ఇక ఎప్పటికీ ఇలా పగలు, రాత్రి నిద్రపోతూంటే ఇదే అలవాటవుతుంది. ఎలాగైనా పగలు మెలకువగా ఉండితీరాలని నిర్ణయించుకున్నాను.

తను వెళ్లగానే స్నానం చేసి బయటికి వచ్చి నుంచున్నాను బాల్కనీలో. ఎంతసేపు చూసినా ఎవరూ కనిపించరే- పెద్దగా ఏదో భాషలో పాటలు మాత్రం వినిపిస్తున్నాయి. బహుశా పక్కిల్లో, అటు పక్క ఇల్లో.

అమెరికాకు వస్తున్నామని కొనుక్కున్న కొత్త బట్టల్లో మంచి పాంటు, చొక్కా ఇస్త్రీ చేసి, వేసుకున్నాను.

మెట్లు దిగుతూండగా పొట్టిగా, లావుగా ఉన్నామె నన్ను చూసి కనిపించీ కనిపించనట్లు నవ్వింది.

నేను “హల్లో” అన్నాను.

‘ఓలా’ అంది.

“ఎక్కడ ఉంటారు?” అన్నాను ఇంగ్లీషులో.

సమాధానంగా మా పక్క మరో రెండు నంబర్లు దూరం చూపించింది.

నేను మా నంబరు చూపించాను.

తెలుసన్నట్లు తలూపింది.

ఇంక మరేదో మాట్లాడబోతుండగానే మెట్లెక్కి వెళ్లిపోయింది. ఒక పక్క నిధి చెయ్యి పట్టుకుని లాగేస్తూ ‘పార్కు- పార్కు ‘ అంటోంది. ఇక నేనూ వచ్చేసాను.

అపార్టుమెంటుని ఆనుకుని రోడ్డుకావలగా ఉంది పార్కు.

సూర్య మరీ మరీ చెప్పెళ్లేడు “ఇక్కడ రోడ్లని ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చెయ్యకూడదు. సిగ్నల్ దగ్గరే దాటు”. అని.

సిగ్నల్ దగ్గర మాతో బాటూ దాటి మరొకామె ఇద్దరు పిల్లల్తో అదే పార్కుకి వెళ్తూంది. నిధి “మమ్మీ ఎత్తుకో” అని పేచీ పెట్టడం తో ఆమెని పలకరించే అవకాశం రాలేదు.

పదకొండు అవుతోంది. ఎండ చాలా కాంతివంతంగా ఉంది. కానీ విసురుగా గాలి వీస్తోంది. బాగా చలిగా అనిపించింది. బేగ్ లోంచి స్వెట్టరు తీసి వేసుకుని, మఫ్లర్ చెవులకి కట్టుకున్నాను. ఖాళీగా ఉన్న పార్కులో అప్పుడప్పుడు ఒకళ్లు ఇద్దరు పిల్లలతో వస్తూ పోతూ ఉన్నారు. రకరకాల మొహాలు. రకరకాల భాషలు.

మళ్లీ మర్నాడు ఒకరిద్దర్ని పలకరించుదామని ప్రయత్నించాను కానీ వాళ్ల భాష నాకు, నా భాష వాళ్లకు రాదు. అమెరికాలో అందరికీ ఇంగ్లీషు రాదని మొదటిసారి అర్థమైంది నాకు.
ఒక నోట్ బుక్ తీసుకుని అనిపించిందల్లా రాయడం మొదలు పెట్టాను.

“హల్లో” అన్న పిలుపుకి పక్కకు చూసాను. నిన్న రోడ్డు క్రాసింగ్ దగ్గర కనిపించినామె. ఇద్దరు పిల్లలు- నిధి కంటే చిన్న వాళ్లు.
చూస్తే యూరోపియన్ లా ఉంది.

“నేనిక్కడ కూర్చోవచ్చా?” అంది నేను కూర్చున్న బెంచి వైపు చూపిస్తూ.

హమ్మయ్య ఈవిడకు ఇంగ్లీషు వచ్చని సంతోషంగా నేనూ మాట్లాడ్డం మొదలు పెట్టాను.

“నా పేరు కాథరీన్, వీడు పాల్ , ఇది సేమీ” అంది.

పిల్లలు తెల్లని జుత్తు, నీలి కళ్లతో షాపుల్లో బొమ్మల్లా ఉన్నారు. అప్పటికే నిధి వాళ్లతో బిజీగా ఆడేస్తూంది ఇసుకలో.

“కొత్తగా వచ్చేరా?” అంది.

“అవును- ఎలా తెలిసింది”

“ఏప్రిల్ నెలలో ఇక్కడెవరూ చెవులకి కట్టుకోరు”

నిజమే అంతా సమ్మర్ లాగ సగం సగం బట్టలు వేసుకుని ఉన్నారు. కానీ మండే ఎండల్లోంచి వచ్చిన నాకు ఇక్కడి వాతావరణం చల్లగా అనిపిస్తూంది మరి. అదే చెప్పాను.

“మీరిక్కడ ఎందుకున్నారు?” అంది.

“మా ఆయన ఉద్యోగ రీత్యా” అన్నాను.

“అది కాదు- మౌంటెన్వ్యూ లో -సాధారణంగా ఇండియన్సు సన్నీవేల్ నో, కూపర్టీనో నో ప్రిఫర్ చేస్తారు”

” మౌంటెన్వ్యూ లో ఎందుకుంటున్నారు” అంది మళ్లీ.

నిజానికి నాకా ప్రశ్నకు అప్పుడు సమాధానం తెలీక నవ్వి ఊరుకున్నాను.

“చాలా మంది ఈ ఏరియా లో ఉండరు. ఆ అపార్టుమెంటు లో అసలే ఉండరు. అక్కడంతా స్పానిష్ వాళ్లు -అదే మెక్సికన్లు మాత్రం ఉంటారు” అంది.

“అలాగా- ఎందుకు వేరే వాళ్లు ఉండరు?” అన్నాను.

“పోను పోను నీకే తెలుస్తుందిలే. ఎవరైనా మీ చుట్టు పక్కల వాళ్లు పరిచయమయ్యారా? అని, నేను “ఇంకా లేద”నగానే

“గుడ్” అని “మా ఇంటికి నువ్వెప్పుడైనా రావొచ్చు. ఇది నా ఫోన్ నంబర్” అంది.

వెళ్తూ వెనక్కి తిరిగి “జాగ్రత్త! ఎవరితో పడితే వాళ్లతో స్నేహం చెయ్యొద్దు” అని చెప్పింది.

ఇంటికి తిరిగి వస్తూంటే చాలా ఇళ్లల్లోంచి స్పానిష్ మాటలు వినిపిస్తున్నాయి. నాకు వాళ్ల భాష నేర్చుకోవాలనిపించింది. చిన్నప్పటి నించి నాకు రకరకాల భాషలంటే పిచ్చి. మా పల్లెటూళ్లో ఎప్పుడైనా వేరే భాషల వాళ్లు కనపడితే వాళ్ల ఇంటికి వెళ్లి, ఆ భాషని ఎంతో కొంత నేర్చుకునే దాన్ని.

ఒక రోజు వరండా చివర చిన్న పిల్లని ఎత్తుకుని నైటీ వేసుకుని చంటి పిల్లకి అన్నం తినిపిస్తూ ఒకావిడ కనిపించింది. వెంటనే దగ్గరకు వెళ్లి పలకరించాను. నల్లపూసలు వగైరాలతో చూడగానే ఇండియన్ అని తెలిసింది. వాళ్లు తెలుగు వాళ్లు పైగా. నా ఆనందానికి అంతే లేదు.

తన పేరు వైష్ణవి అనీ, హైదరాబాదు నించే వచ్చాననీ పరిచయం చేసుకుంది. కానీ నా ఆనందం ఎంతో సేపు మిగల లేదు. తనతో మాట్లాడినంత సేపూ చుట్టూ స్పానిష్ వాళ్ల గురించే చెప్పింది.

“నిన్న రాత్రి సరిగా నిద్ర లేదండీ మా అమ్మాయి ఒకటే ఏడుపు- ఎందుకనుకున్నారు? బయట ఒకటే పాటలు, రొద. మాకిందనింట్లో రాత్రంతా ధమక ధమా చిందులు” మీకు వినపళ్లేదా? అంది.

అసలు నన్ను వాళ్లతో మాట్లాడొద్దని, వాళ్లు చిన్న చిన్న పనులు చేసుకుని బతికే వాళ్లని, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆ ఏరియా లోంచి వాళ్లు త్వరలోనే మారిపోతామని చెప్పింది.

నేను “జాగ్రత్త గా ఉండడమంటే” అని అడిగాను.

“అదేలెండి మీకు చెప్పేదేముంది? డబ్బు కోసం ఏదైనా చేస్తే?!” అంది మళ్లీ-

అప్పటికే మొదట కనబడ్డ అలీసియా వాళ్లు పరిచయమయ్యారు నాకు. వచ్చీ రాని ఇంగ్లీషులో ఏదేదో చెప్పేది నాకు.

తనని మా ఇంటికి పిలిచి కాఫీ కలిపి ఇచ్చాను. చాలా సంతోషపడింది. కప్పుని కడిగి పెట్టబోయింది. నేను వద్దని లాక్కున్నాను.

ఎంతో ఆత్మీయంగా నన్ను వాళ్ల ఇంటికి పిలిచింది. వాళ్లిల్లు మా ఇల్లంత బావుండదని సంశయంగా సైగ చేసింది. నేను పర్లేదు వస్తానని చెప్పాను.

గత 15 ఏళ్లుగా అదే అపార్టుమెంటులో ఉంటున్నారట వాళ్లు. లోపల ఒకరకమైన దుర్గంధం. మాసి, బాగా నలుపుదేరిన కార్పెట్. ఎక్కడివక్కడే చిందర వందరగా దొర్లుతున్న బట్టలు, చెప్పులు.. ఏవేవో. నాకు అవన్నీ అలవాటు కావడానికి కాస్సేపు పట్టింది. అప్పుడు చెప్పింది ఆ ఇంట్లో తను, వాళ్లాయన, వాళ్లాయన తమ్ముడి కుటుంబం, పెద్ద కూతురు, ఇద్దరు పిల్లలు, చిన్న కొడుకు మొత్తం 11 మంది ఉంటారని. అందరూ తలో పనీ చేసి పొట్ట నింపుకుంటారని. పనులు ఒక్కో సారి వరసగా దొరకవని, అలాంటప్పుడు పని చేసిన వాళ్లు మొత్తం కుటుంబాన్ని ఆదుకుంటారని, తను వంగుని ఏ పనీ చెయ్యలేనని, రెండేళ్ల కిందట ఏక్సిడెంట్ అయ్యిందని చెప్పింది.

చాలా చిన్న గదులు రెండు, ఒక చిన్న హాలు కం కిచన్ అంతే అపార్టుమెంట్. లోపలి అపరిశుభ్రత వల్ల మరీ ఇరుకుగా అనిపిస్తోంది. నిజానికి మాదీ అదే. కానీ మా ముగ్గురికీ అది చాలా పెద్ద ఇల్లు.
అందరూ తలా ఒక వంద అపార్టుమెంటు అద్దెగా కడతామని చెప్పింది. నాకు బాగా దు:ఖం వచ్చింది. ఏమీ మాట్లాడలేకపోయాను. నా ముఖం చూసి అయ్యో! ఇవన్నీ ఈ దేశంలో మామూలే అంది.

వాళ్ల కుటుంబ సభ్యులు పరిచయమయ్యారు నాకు. అందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు.

మేం ఆ వారంలో ఫర్నిచరు కొని తెచ్చుకున్నాం. కష్టపడి మెట్ల మీంచి మేమిద్దరం మోసుకురావడం చూసి అలీసియా లోపలికి వెళ్లి పిలిచింది.
వాళ్ల పిల్లలూ, ఆయనా కలిసి రెండంతస్థుల పైన మా ఇంట్లోకి అన్నీ మోసుకొచ్చేరు పాపం. వాళ్లకు మేం ఏమవుతామని?

నిధిని స్కూలు లో జాయిన్ చేద్దామని ఏరియా ఎలిమెంటరీకి వెళ్లాను. స్కూలు ఆవరణలో ఇండియన్ పేరెంట్సు ఒకరిద్దరు కనబడ్డారు.
అక్కడా ఇదే తంతు.
స్పానిష్ వాళ్లు ఎక్కువ ఈ స్కూలుకి వస్తారు కాబట్టి అసలు స్కూలే మంచిది కాదని, వచ్చే ఏడాది మరో మంచి స్కూలు ఉన్న ఏరియాకి మారిపోతామనీ చెప్పారు.

ఇక్కడ ఏ ఏరియాకు ఆ ఏరియా లో ఒక గవర్నమెంట్ స్కూలు ఉంటుంది. ఆ స్కూలు ఏరియాలోకి వచ్చే వాళ్లంతా తప్పనిసరిగా అదే స్కూలుకి అటెండ్ కావాలి. ప్రతి మైలు రేడియస్ లో ఒకో స్కూలు ఉంటుంది. మంచి ఫెసిలిటీస్ తో ఉన్న ఆ ఏరియాని, ఎంతో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఉన్న అలాంటి స్కూలుని చూసి కేవలం స్పానిష్ వాళ్లు ఉన్నారని మారిపోవడం అవివేకం అనిపించింది నాకు.

అయినా అసలు వాళ్లతో వచ్చిన చిక్కేమిటో తెలుసుకోవాలని అనిపించింది.

స్పానిష్ వాళ్లుగా ద్వేషించబడే వీళ్లంతా మెక్సికో, సౌత్ అమెరికా ల నించి వచ్చి కాలిఫోర్నియాలో అక్రమంగా నో, సక్రమంగానో స్థిరపడ్డ వాళ్లు. వీళ్లు ఎక్కువగా చదువుకున్న వాళ్లు కాదు. గంటకు పది డాలర్ల నించి, ఇరవై డాలర్ల వరకు తీసుకుని పెయింటింగ్, గార్డెన్ కటింగ్, ఇళ్లల్లో పనులు వగైరా చేసే శ్రమజీవులు వీళ్లు. కాకపోతే రిజిస్టర్డ్ సంస్థల ద్వారా పనిచేసే వాళ్ల కన్నా బైట ఎవరికి వాళ్లు పనిచేస్తూ వీళ్లు చవకక్గా పనికి దొరుకుతారు. వీళ్లు భారతీయుల్లా పై చదువుల కోసం వచ్చి ఇక్కడ ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లు కాదు. అమెరికా లో మధ్యతరగతి, ధనిక వర్గం గా భావించ బడే కాకేషియన్లు మొదలైన వాళ్లు వీళ్లని కలుపు కోరు. మధ్య తరగతి వాళ్లైన ఇండియన్ల పరిస్థితి ఇదన్న మాట.

నేను నల్ల జాతీయుల పట్ల వివక్ష గురించి చిన్నప్పుడుటెక్స్టు పుస్తకాల్లో చదువుకున్నాను. మా చుట్టు పక్కల ఈ ప్రాంతంలో నల్లజాతీయులు ఒక శాతం కంటే తక్కువే. వారిపట్ల వివక్ష ఇప్పుడు ఎవరూ కనపరచరు ఇక్కడ. కాబట్టి అమెరికా లో ఇప్పుడు వివక్ష లేదనుకున్నాను. కానీ రోజులు గడిచే కొలదీ నాకు ఇక్కడ వర్గ వివక్ష బాగా కనిపించడం మొదలైంది.

చివరికి నేనా భాష నేర్చుకోవడం కూడా తప్పన్నట్లు మాట్లాడే వాళ్లు ఎక్కువయ్యారు. అయినా నేను అలిసియా కుటుంబంతో, మిత్రులతో మాట్లాడుతూ కాస్త కాస్తగా వాళ్ల భాష అర్థం చేసుకోగలుగుతున్నాను.

సూర్య ఆఫీసు నించి ఒక ఇండియన్ ఫామిలీ మా ఇంటికి భోజనానికి వచ్చారు ఆ ఆదివారం.

“అదేమిటండీ వచ్చి వచ్చి ఆ స్పానిష్ వాళ్ల పిల్లలతో ఆడుతోంది మీ అమ్మాయి?” అందావిడ.

” మా ఫామిలీ ఫ్రెండ్స్ వాళ్ల పిల్లలు” అని నవ్వుతూ సమాధానమిచ్చేను.

ఆవిడ కొంచెం మొహం చిట్లించి ఇలా రండి చెప్తాను అని పక్కకి పిల్చి

“మా పిల్లాడు వీళ్ల స్కూలుకి నాల్రోజులు వెళ్లి వచ్చి మధ్య వేలు పైకెత్తి చూపించాడు మా వారికి- ఆయనేదో కసిరారారని “గుసగుసగా అంది.
“అలాంటి కల్చర్ నేర్చేసుకుంటారు మన పిల్లలు. వీలైనంత త్వరగా వచ్చేయండి మన ఏరియాకి” అంది.

మాటల మధ్యలో వాళ్లాయన “మీరు ఎన్నైనా చెప్పండి సూర్యా! చుట్టూ ఉన్న వాళ్ల పూర్వ పరాలు తెలుసుకోకుండా స్నేహం చెయ్యడం ఈ దేశంలో చాలా ప్రమాదకరం. మీకు తెలుసో లేదో అక్రమంగా వచ్చి ఈ దేశం లో ఉంటున్న వాళ్లు ఏదైనా నేరం చేసి పట్టుబడితే వాళ్ల స్నేహితులమైన మనమూ వీసాను కోల్పోవలసి వస్తుంది తెలుసా” అన్నాడు.

వాళ్లు వెళ్లేక సూర్య ఆలోచనలో పడ్డాడు. నాకేదో చెప్పబోయాడు. ఇంతలో అలీసియా వచ్చి “రా” అని పిలవడంతో నేనటు వెళ్లేను. మరలా వచ్చేసరికి తను కొంచెం ముభావంగా కనిపించాడు.

ఆ రాత్రి నాకు నేను వచ్చిన మొదటి వారం గుర్తుకు వచ్చింది.

నేను వచ్చేటప్పుడు నా లగేజ్ రాలేదు. మూడు రోజుల తర్వాత వచ్చింది. తను ఆఫీసుకెళ్ళాక తెచ్చి మెట్ల కింద సూట్ కేసులు పెట్టి వెళ్లిపోయారు. అక్కడ్నించి ఒక సూట్ కేసు రెండతస్థులు మోసేసరికి తల తిరిగిపోయింది నాకు. వీలుంది కదా అని రెండ్రెండు- నాలుగు సూట్కేసులు, ఒక్కోటి ముప్పైరెండు కేజీలు తెచ్చినందుకు నా పనయ్యింది.

నా తెలుగు మిత్రురాలి భర్త బైటికెళ్తూ నా వైపోసారి చూసి, అసలేమీ చూడనట్టు వెళ్లిపోయాడు.

ఇంతలో నా వెనక నించి ఒక స్పానిష్ ఆయన మెట్లు ఎక్కుతూ వచ్చి నా అవస్థ చూసి టకటకా మిగతా సూట్ కేసులు పైకి తీసుకెళ్లి మా గుమ్మం దగ్గర పెట్టి వెళ్లిపోయేడు. నేను చెప్పే ‘థాంక్సు ‘ వినిపించుకోకుండానే.

అలీసియాని అడిగేను “అతనెవరని”.
తనకి తెలీదని చెప్పింది. “అయినా నువ్వు కష్టపడి మోస్తూంటే ఎలా చూస్తూ వెళ్లిపోతారు ఎవరైనా?” అంది.

అమ్మ ఫోను చేసింది. ఫోను మాట్లాడినంత సేపు మామూలుగానే ఉన్నా, పెట్టగానే బాగా ఏడుపొచ్చింది నాకు. “ఏవిటింత దూరానికి వచ్చేసాను?” ఎంత ఆపుకుందామన్నా దు:ఖం ఆగడం లేదు. ఇంతలో వేగంగా పరుగెత్తుకొచ్చింది అలిసియా. నిధి అలీసియా చెయ్యి పట్టుకుని ఉంది.

ఏదేదో స్పానిష్ లో అంటూ నా తలని తన గుండెలకి హత్తుకుంది. భాష అర్థం కాకపోయినా , భావం మాత్రం ‘మేమున్నామని ‘ అన్నట్లు అర్థమైంది.
నాకా క్షణం కలిగిన ఓదార్పు ఎప్పుడూ మర్చిపోలేను.

“మనం మారి తీరవసిందేనా ఇక్కడి నుంచి. నిజానికి దేశం కాని దేశం లో ముక్కూ మొహం తెలీని నన్ను నా భాష తెలిసిన వాళ్ల కంటే తెలీని వీళ్లే ఎక్కువగా ఆదరిస్తున్నారు.” అన్నాను సూర్యతో ఆ సాయంత్రం.

“ఆదరణ వేరు. వాళ్లతో పక్క పక్కన కలిసి జీవించడం వేరు. ఈ సమాజం గురించి తెలీనంత వరకూ ఓకే. తెలిసాక మనమ్మాయీ ఇందులో భాగస్వామి కావడం గురించి ఒకసారి ఆలోచించు.” అన్నాడు.

ఏమాలోచించాలి? దిగువ తరగతి జీవితాలు ప్రతి దేశం లోనూ ఒక లాగే ఉంటాయి. వారి వేష భాషల్లో, జీవితంలో ప్రతి అడుగులో పేదరికం. బైటి ప్రపంచం వీళ్లని చూసి భయపడుతుంది, ద్వేషిస్తుంది. ఇందులో ఎవరో ఒకరు తప్పు చేస్తే మొత్తం సమూహాన్నే వెలి వేస్తుంది. నిజానికి దోపిడీలు అన్ని వర్గాల్లో జరిగినా పైకి కనబడవు కదా అవన్నీ.

“ఆరు నెలల లీజు అయ్యేంత వరకూ తప్పని సరి, ఆ తర్వాత మారుతున్నాం”. అని తను అన్నప్పుడు
నేను “ససేమిరా” అన్నాను.

“ఇంత అద్దె పెట్టి మా ఆఫీసుకి ఇంత దూరంలో ఎందుకు చెప్పు? నాకు ఈ చల్లని బాక్సు పట్టుకెళ్లి తినాలనిపించడం లేదు. వాకింగు డిస్టెన్సులో మంచి అపార్టుమెంట్స్ ఉన్నాయట. చక్కగా లంచ్ కి ఇంటికి రావొచ్చు నేను. మరో నెలరోజుల్లో ఖాళీ అవుతున్న అపార్టుమెంటుకి అడ్వాన్సు అప్లై చేసాను.” అన్నప్పుడు ఏమీ అనలేక పోయాను.

మనసంతా దిగులు దు:ఖం కమ్ముకుంది నాకు.

మర్నాడు వరలక్ష్మీ వ్రతం తాంబూలానికి నన్ను, మరో ఇద్దరు ముగ్గురు తెలుగు ఆడవాళ్లని పిలిచింది వైష్ణవి. తాంబూలంగా ఒకో అరటి పండు చేతిలో పెట్టి కాళ్లకు నమస్కరించింది.

మా పక్కింటి వాళ్లు ‘స్పానిష్ …..’ అంటూ వాళ్లకి ఏదో చెప్తూంది. ఇక అక్కడ ఉండలేక ఇంట్లో పనుందని వచ్చేసాను.

బైటికి రాగానే అటుగా వస్తూ అలిసియా ఎదురు పడింది. ఆ పండు తన చేతులో పెట్టి కాళ్లకు నమస్కరించేను.

అదేమిటో తనకు అర్థం కాకపోయినా నవ్వుతూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

*** * ***