జీవితం వేసవి గాలుల వలయంలో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నపుడు
దిగులు మేఘమొకటి కమ్ముకుంటుంది
ముందస్తు కబురేదీ లేకుండానే
తడియారిన దేహాత్మలు
నిలువెత్తు దాహమై
మరీచికల వెంట
పరుగులు పెట్టే జీవితం
ఈ దిగులు మేఘం ఇప్పటిదేనా?
నా పురా స్వప్నాలు కరిగీ, కరిగీ
నన్ను వెన్నంటే తిరుగుతోన్న
నా అనాది వేదన కాదు గదా?
ఆకాశం, వొచ్చి వెళ్ళిపోయే మేఘాల
నడుమ శాశ్వత నిర్మల నీలమా?
ఎప్పుడూ వెన్నాడే మేఘాల
నడుమ తళుకులీనే నీలి తరంగమా?
స్నేహమో, ప్రేమో, మరి ఏ బంధమో
పోగొట్టుకున్న ప్రతిసారీ
కమ్ముకున్న దిగులు మేఘం …..
‘కాలం మాన్పిన గాయాలు’ వొట్టి భ్రమేనా?
ఇంతా చేసి, ఇది దిగులు మేఘమేనా?
నా బతికిన క్షణాలను కడుపులో
దాచుకుని, అదృశ్యంగా నాతో సాగుతోన్న
నా ఆదిమ మిత్రుడా?
ఆకాశాన్ని పూర్తిగా కమ్మేసిన మేఘం
కిటికీలోంచి చల్లని కబురు పంపించి
వీధి లోకి ఆహ్వానించింది
తడిసి పొమ్మని …. తరించి పొమ్మని …
చేతుల్లోని కాగితపు పడవల్ని
సుతారంగా నీళ్ళ లోకి వొదులుతూ
కిలకిలల సంగీతంతో పిల్లలు కొందరు…
ఇక నేనూ ఒక కాగితం పడవనై పోవాలి
GOOD POEM KODURI
ఎత్తుగడనుంచి ముగింపుకి పయనం,మధ్యలొ కొన్ని పురాజ్ఞాపకాల ప్రస్తావన, పాజిటివ్ నోట్ తో కాగితప్పడవలా ఆనందంగా తుళ్ళుతూ కాలాన్ని సాధించాలనుకోవటం నచ్చిన విషయాలు. మంచి పద్యం విజయ్ గారు
హృద్యంగా వుంది సార్…
ముందస్తు కబురేదీ లేకుండానే
దిగులు మేఘమొకటి
కమ్ముకుంటుంది అంతరంగాన్ని.
ఆత్మీయ వచనమేదో
పిలువని పేరంటమై
తటాలున మురిసి
మెరిసి పలుకరిస్తుంది.
పెదవులపై మెరిసిన
నవ్వేమో(ము)నను
వదలనంటుందీ.
చిరు నగవుల శ్రీమతి
చిద్విలాసంగా జీవితాన్ని
ముందుకు తీసుకుపోదామంటుంది.
వాసుదేవ్ గారు; లింగారెడ్డి గారు; వర్మ గారు; రామాచారి గారు….థాంక్ యు …
దిగులు అనేది కేవలం మేఘం మాత్రమే అని తెలుసుకోగలిగిన వారికి,
చల్ల గాలి, వర్షం, కాగితపు పడవల అనుభూతి సొంతమవటం
అంతా Spontaneous గా జరిగిపోతుందేమో?
బాగుంది విజయకుమార్ గారు..
నారాయణ గరిమెళ్ళ.
విజయ్,
పోయెమ్ చక్కగా ఉంది.
“తడియారిన దేహాత్మలు
నిలువెత్తు దాహమై
మరీచికల వెంట
పరుగులు పెట్టే జీవితం”
“మరీచిక” పదం విని చాలా రోజులైంది.
చివరి పాదం బాగా కుదిరింది.
-రవి
Chala bagundi Vijay garu…
విజయ్: అనుబంధాల అల్లికలో నీ అక్షరాలు అందంగా వెలుగుతాయి!
చూడు ఈ వాక్యాలు: “స్నేహమో, ప్రేమో, మరి ఏ బంధమో
పోగొట్టుకున్న ప్రతిసారీ
కమ్ముకున్న దిగులు మేఘం …..
‘కాలం మాన్పిన గాయాలు’ వొట్టి భ్రమేనా?”
బంధాల్ని ఇంత తడిగా చెప్పడం రామానుజన్ తరవాత నీకే సాధ్యమా అనిపిస్తుంది చాలా సార్లు!
దిగులు మబ్బుల పూర్తిగా కురిసిపోయాక, సంతోషపు పడవల ప్రయాణం మొదలైనట్లుంది,.బాగుంది సార్,..
రవి!…’మరీచిక’… తెలియని ఆకర్షణ ఏదో వుంది కదా ఈ మాటలో!
సంపత్…భాస్కర్ …థాంక్ యు!
అఫ్సర్!….అంత గొప్ప కవి, ఎ. కె. రామానుజన్ తో పోలిస్తే నా లాంటి అల్ప జీవి తట్టుకోవడం కష్టమేమో !
ఆత్మీయతతో మీరు చెప్పిన మాటలకు ధన్యవాదాలు…
నేను సరైన దారిలోనే వెలుతున్నానన్న నమ్మకాన్ని, మరింత నమ్మకంతో ఈ దారిలో వెళ్ళగలిగే శక్తినీ ఇచ్చిన మాటలు !