Flash upon that inward eye
Which is the bliss of solitude.
టీనేజీ ఉరుకుల పరుగులలో ఈ వాక్యం మొదటి సారి విన్నప్పుడు ఆ solitude గానీ, ఆ inward eye గురించి గాని నాకు పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ, ఆ వాక్యం విన్నాక Wordsworth గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. బాహ్యజీవితం అంత హుషారుగా అనిపించని ఆ కాలంలో నేను Wordsworth చేతివేలు పట్టుకొని ఏవేవో వూహారణ్యాల్లో దారి తప్పే వాణ్ని, అతనే చెప్పిన ఆ inward eye మెరుపులు చూపుల్ని వెలిగిస్తూ వుండగా!
నిజమే, జీవితం ఎవరికీ సాఫీగా వుండదు. పోనీ అని, సూఫీగానూ వుండలేం! కుదుపులు వుంటాయి, వొళ్లు కదుము కట్టే దిగుళ్లూ వుంటాయి. కానీ, వాటిని కూడా ఉత్సాహంగా తీసుకునే శక్తి సంపాదించుకుంటే…అప్పుడేం చేస్తుందీ పాడు బతుకు?!
అలా ఉత్సాహంగా తీసుకునే శక్తి వూరికే రాదు, inward eye తో మన లోపలి లోకాల్లోకి ప్రయాణాలు చేస్తున్నప్పుడే అది సాధ్యం! ఈ లోప్రయాణం ఎలా వుంటుంది? నిజంగా ఈ ప్రయాణానికి మనం ఎప్పుడేనా సిద్ధంగా వుండగలమా? వున్నా, ఆ ప్రయాణం తుదకంటా వెళ్లగలమా? వెళ్ళినా తిరిగి రాగలమా? రాగలగినా అంతకు ముందులాంటి జీవితాన్ని జీవించగలమా? ఇవి తేలికగా అనిపించే గట్టి ప్రశ్నలు. సమాధానాలు ఎవరిదగ్గిరా సిద్ధంగా వుండవు, సిద్ధంగా వున్న సమాధానాలు ఎవరినీ సమాధాన పరచలేవు. ఎందుకంటే, ఎవరి ప్రయాణం వాళ్ళదే! ఎవరి అనుభవం వాళ్ళదే! కానీ, అనుభవమున్న ఇంకో పూర్వయాత్రికుడు కొన్ని వెలుగురేఖలు చూపించవచ్చు. వేలు పట్టి నడిపించకపోయినా, ముందుకు నడిపించే వొక సంకేతాన్ని అందించవచ్చు. ఇలాంటి వొక సంకేతశిల్పి సాయికిరణ్! గత నెల రోజులుగా ఈ శిల్పి చెక్కిన వొక ‘అంతర్యాన’ చిత్రపటం చేతుల్లో పెట్టుకొని నేను గడిచివచ్చిన కొన్ని దారుల్ని చూపించాలని ఇక్కడ నా ప్రయత్నం. ఇది కేవలం నా దారి, నా ప్రయత్నం. మీ మీ ప్రయాణాలకు వాటి దిగుళ్ళకీ నేను ఏ రకంగానూ పూచీపడడం లేదు.
2
ఎక్కడయినా వొంటరిగా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వొకట్రెండు పుస్తకాలూ, కొన్ని ఆలోచనల్ని తోడు తీసుకెళ్ళడం నాకు అలవాటు. పోయిన నెల Raleigh-Durham వెళ్తూ, సాయికిరణ్ కవిత్వం ‘అంతర్యానం’ తోడు దొరికింది. ఇక ఆలోచనలు బోలెడు!
ప్రయాణం మొదలయిన కొద్ది సేపటికి ఆకాశ మార్గంలో విమానం కొన్ని మబ్బుల్లో చిక్కుకుంది. తలెత్తి చూస్తే మబ్బులు హడావుడిగా పరుగులు తీస్తున్నాయి. మబ్బుల మెట్ల మీంచి కిందికి దిగే ప్రయత్నంలో వుంది విమానం. అప్పుడు వొక్క కుదుపు ఇచ్చింది విమానం, వొక్కసారిగా రెండు మూడు మెట్లు దూకేసే అల్లరమ్మాయిలాగా! “ఎందుకింత తొందరా?!” అనుకుంటూ నేను అప్పటిదాకా నా లాప్ టాప్ లో చదువుతూ వున్న సాయికిరణ్ కవిత్వ పుస్తకాన్ని పక్కన పెట్టాను. కాసేపు నిబ్బరంగా వున్నాను కానీ, విమానంలోని అనౌన్సర్ ప్రకటనలూ, నా ఇరువేపులా ప్రయాణికుల కంగారూ చూసి నేనూ కాస్త కంగారు నటించక తప్పలేదు. అవును, నటనే! “ఏం ఈ మాత్రం కుదుపులు భరించలేమా?” అన్నది నా లోపలి పొగరుమోతు మోటు సమాధానం! ఆ సమాధానానికి లోపల్నించి సాయికిరణ్ వత్తాసు!
మబ్బుల రాపిళ్లకు
ఆకాశం
రంగు మార్చే లోపు
నీడ పొడవు
నిర్ధారించుకోవాలి.
అంటున్నాడు సాయికిరణ్. వూరికే అనడం లేదు, జీవితంతో చాలా పెద్ద లెక్క తేల్చుకోడానికి సిద్ధపడే ఇంత మాటా అంటున్నాడు. ఇలా అనడానికి సాఫీగా సాగే జీవితాన్నే కాదు, తట్టుకోలేని కుదుపుల్ని కూడా ఎన్నో చూసి వుండాలి సాయి. ఎంతో తట్టుకొని నిలబడితే తప్ప ఈ నిబ్బరపు పాఠం మనకి చెప్పలేడు కదా మరి! ఈ కాలపు కవిత్వంలో ఇదే సాయిమార్గం!
మీరు ఇప్పటికే ఈ పుస్తకం చూసి వుండకపోతే – వొక విషయం మీకు ముందే చెప్పాలి. ఈ పుస్తకాన్ని నేను వెనక నించి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పిన కవిత ఈ పుస్తకానికి ‘ముగింపు.’ నాకూ సాయికి (?) కొన్ని సాధారణ అసాధారణ లక్షణాలున్నాయి. అందులో వొకటి: కవిత్వ పుస్తకాన్ని వెనక నించి చదవాలన్న తిక్క. అయితే, నేను వొకే పుస్తకాన్ని అనేక సార్లు చదివే అలవాటు వున్న వాడిని కాబట్టి, మొదటి సారి చదివినప్పుడు తిక్కగా వెనక నించి చదివి, రెండో సారి చదివేటప్పుడు చక్కగా ముందు పేజీ నించి చదువుతాను. ఈ అలవాటుకి కారణమేమిటంటే: నా మటుకు నాకు సస్పెన్సు తట్టుకునే శక్తి లేకపోవడమే! చివరికేమిటీ గొడవ అన్నది మొదలే తేలిపోయిందనుకోండి – సినిమా కవిగారెవరో చెప్పినట్టు- ‘మనసు కాస్త కుదుటపడతది.’ ఇలాంటి అసాధారణ లక్షణాన్ని సాయికిరణ్ చాలా అందంగా కవిత్వం చేశాడు ఇక్కడ –
పుస్తకంలా
విచ్చుకున్న ఆకాశం
ఎగురుతున్న కాగితంలా
సముద్రం
పాతుకుపోయిన కాళ్ళు
పెరుక్కోలేని చెట్టులా
నేను
ఎటు నుంచి చదవాల్సిన
పుస్తకం ఇది?
ఈ కవితలో మొదటి రెండు – ఆకాశమూ, సముద్రమూ(అంటే – పుస్తకమూ, కాగితమూ) చలనశీలమైనవి కవి దృశ్యీకరించిన ప్రకారం చెట్టు (అంటే, ‘నేను’) చలనరహితం. మామూలుగా చెట్టు చలనరహితం కాదు. కాళ్ళు పెరుక్కోలేని తనం వున్నప్పటికీ చెట్టు నిలువునా కదులుతుంది. అయితే, ఈ కవితని కేవలం ఈ వాచ్యార్ధాలలో తేల్చుకోలేం. ఈ కవిత ప్రకృతిలో మన ఉనికి కంటే కూడా ఎక్కువగా మొత్తంగా కవిత్వ అనుభవంలో లేదా జీవిత అనుభవంలో మన ఉనికికి సంబంధించింది. కవిత్వం అనే అనుభవ మంటపంలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కునే కవిత ఇది.
ఆ కవిత చదువుతున్నప్పుడు అందులోని వాక్య సముదాయాలు రేపే సంచలనం ముందు మనం కాసేపు నిశ్చలనంగానే వుండిపోవాలి. తప్పదు. తను ఆ అనుభవాన్ని ఎటు నించి చూడాలన్నది కూడా సందిగ్ధమే. అదీ తప్పదు. కవిత్వంలోని రహస్యం ఏమిటంటే అది అనేకర్ధాల తలుపులు తెరుచుకోడానికి సిద్ధంగా వుంటుంది. వాటిని మనస్ఫూర్తిగా వొప్పుకోవడంతో సాయి ‘అంతర్యానం’లోని వొక చిక్కుముడి ఇట్టే విడిపోతుంది మనకి! ఈ పుస్తకంలోని ఏ కవితనయినా మీరు వొకసారి చదివి పక్కన పెట్టలేరు. ఆ వొకసారి చదివిన అనుభవాన్ని అలా జాగ్రత్తచేసుకుంటున్నప్పుడే సాయి ఇంకోసారి చదివింపజేసుకొని ఇంకో అనుభవద్వారాన్ని తెరుస్తాడు. అందుకే, నేను ఈ కవిత్వాన్ని ఆగి ఆగి చదివాను. ముందుకీ వెనక్కీ వెళ్తూ చదివాను. కానీ, ప్రతిసారీ ‘ఎటు నించి చదవాల్సిన పుస్తకం ఇది?” అన్న ప్రశ్న నాకు మిగిలిపోయింది. తమ్ముడు ఇక్బాల్ చంద్ ఈ కవిత్వాన్ని ‘ప్యూర్ పొయెట్రీ’ అంటున్నాడు. అలా అంటున్నప్పుడు ఆ purity ని తమ్ముడు ఎలా అర్థం చేసుకున్నాడో తెలీదు కానీ, నాకు మాత్రం ఈ పఠనం వల్ల కలిగే వొక స్వచ్చమయిన మెరుపు -పొద్దుటి కొద్దిపాటి వానలో తడిసిన ఆకు – మాదిరిగా అనిపిస్తుంది.
3
సాయి కవిత్వంలో ఇంకో అందం ఏమిటంటే: అది మన అనుభవ క్షేత్రంలోనే సంచరిస్తుంది. ఈ నలభై పైగా కవితల్లో ప్రతీదీ మన అనుభవమే; వొక వేళ మన అనుభవంలో లేని విషయం ఏదన్నా చెబితే, దాన్ని వెంటనే మన అనుభవంలోకి తీసుకు వచ్చే సరళమయిన మనసూ, నిండయిన భాషా సాయి దగ్గిర వున్నాయి. ఉదాహరణకి: ‘వలయాలు’ లాంటి కవితలు.
చినుకు పోట్లకి
ఛిద్రమయిన సెలయేరులా
నా వలయంలో
నేను తిరుగుతూనే వుంటాను
చీకటి తెలియని
రాత్రి కోసం.
చదవడానికి తేలికగా అనిపించే కవిత ఇది. కానీ, ఇందులో శబ్ద/ అర్థ వలయాలు చుట్టుకుంటూ వెళ్తే, భారతీయ తత్వశాస్త్ర చరిత్ర అంతా కనిపిస్తుంది. చదువరి మనసు/ ఆలోచన రెండూ ఎంత దూరం వెళ్తే అంత దూరం లాక్కు వెళ్ళడం మంచి కవిత్వ లక్షణాల్లో వొకటని నా నమ్మకం. సాయి కవిత్వంలో అలాంటి ఉదాహరణలు చాలా దొరుకుతాయి. వూరికే వొక్క సారి చదివినప్పుడు సాయి మంచి అనుభూతి శకలం పట్టుకున్నాడే అనిపిస్తుంది. కానీ, ఆ శకలాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే, పెద్ద డొంక ఏదో కదులుతుంది. అయితే, ఇది ముళ్ళ డొంక కాదు. జీవితాన్ని కంటి ముందు దృశ్యంలా పరచి అర్థాలు వెతుక్కోమనే పూలూ ముళ్లూ రాళ్లూ కలిసిన దారి. ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియాలంటే మీరు సాయి రాసిన ‘అంతర్యానం’ కవిత రెండు మూడు సార్లు చదవాలి. ఇందులో నాకు బాగా నచ్చిన పంక్తి ఇది:
సందేహ సముద్రంలో
చంద్రుడినై
అలల రాపిడి మధ్య
కాసేపు అస్తిత్వం కోల్పోతా.
ఈ వాక్యం నేను నాలోని భిన్న మానసిక/ భౌతిక స్థితులకు అన్వయించుకుంటూ కనీసం అరడజను సార్లు చదువుకున్నాను. గాయమ్మీద లేపనం రాసే వేళ్ళల్లో వుండే శక్తి ఏదో ఈ వాక్యాల్లో వుంది.
కవిత్వ వాక్యం మీద సాయికి చాలా పట్టింపు. వొక్క అనవసరమయిన పదమూ పడకుండా రాసింది కన్నా చెరిపింది ఎక్కువ అన్న భావం గట్టిగా కలుగుతుంది మొత్తం కవిత్వం చదివాక! ఇలాంటప్పుడు కూడా పునరుక్తి/ recurring images దొరక్కపోలేదు. పుస్తకం, జ్నాపకం, మబ్బు…ఇవి లేకుండా సాయి కవిత్వం రాయలేడా అనిపించింది కొన్ని సార్లు! ప్రతి రచయితకీ కొన్ని hanging words వుంటాయని బుచ్చిబాబు ఎక్కడో రాశాడు; అంటే, రచయిత ఉద్దేశపూర్వకంగానో, నిరుద్దేశపూర్వకంగానో కొన్ని పదాలలో repeat అవుతాడు. సాయి ‘అంతర్యానం’లో కూడా అలాంటి పదాలు దొరుకుతాయి. కానీ, అవి పంటి కింద రాయిలా తగలకుండా చూసుకోవడం సాయికి తెలుసు. అయినా సరే, అలాంటి పునరుక్తి లేని పునర్యానం కోసం ఎదురుచూస్తున్నా.
“కవిత చదువుతున్నప్పుడు అందులోని వాక్య సముదాయాలు రేపే సంచలనం ముందు మనం కాసేపు నిశ్చలనంగానే వుండిపోవాలి. తప్పదు. తను ఆ అనుభవాన్ని ఎటు నించి చూడాలన్నది కూడా సందిగ్ధమే. అదీ తప్పదు. కవిత్వంలోని రహస్యం ఏమిటంటే అది అనేకర్ధాల తలుపులు తెరుచుకోడానికి సిద్ధంగా వుంటుంది.”
-కవిత్వం లోకి చేసే అంతర్యానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వాక్యాలు చాలు-
అఫ్సర్,
అంతర్యానం మనకు మనం చేస్తే ఒక వింత అనుభూతినిస్తే, మీలాంటివాళ్ళతో అంతర్యానం చేస్తే ఒక గైడ్ సహకారంతో కొన్ని వస్తువుల్ని సందర్శిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు కోట్ చేసిన కవితలో “ఎగురుతున్న కాగితంలా సముద్రం” అన్న పదచిత్రం, అరిగిపోయిన ఉపమానాలకంటే భిన్నంగా, దాని నావెల్టీ నాకు బాగా నచ్చింది. (విశాఖపట్నం వాడ్ని గదా, కొంత నాస్టాల్జియాకూడా దానికి కారణం అయి ఉండొచ్చు).
మీకు వచ్చిన సందేహమే నాకూ వచ్చింది ఇక్బాల్ చంద్ ప్యూర్ పొయిట్రీ అని ఎందుకన్నట్టా అని. అయితే, పుస్తకం చదివేక, ఏ ఇజాల ఘోషా, నీతిసూత్రాలూ, పాఠకుడికి పాఠాలుచెప్పడాలూ వంటీ అనేకానేక బాదరబందీలు లేకుండా, తను చూసిన ప్రకృతికి తన స్పందనలను రికార్డు చేసినందుకేమో ఇక్బాల్ చంద్ అలా అని ఉండొచ్చని నాకు నేను సమాధానం చెప్పుకున్నా. అదే నిజమయితే, నే నతనితో ఏకీభవించకుండా ఉండలేను.
ఈ మధ్య చదివిన వాట్లో నిస్సందేహంగా మంచి పుస్తకం. కిరణ్ గారికి అభినందనలు.
“ఏ కవితనయినా మీరు వొకసారి చదివి పక్కన పెట్టలేరు. ఆ వొకసారి చదివిన అనుభవాన్ని అలా జాగ్రత్తచేసుకుంటున్నప్పుడే సాయి ఇంకోసారి చదివింపజేసుకొని ఇంకో అనుభవద్వారాన్ని తెరుస్తాడు.”
ఇంతకంటే కిరణ్ గారి కవిత్వాన్ని గురించి నేనూ ఎక్కువ చెప్పలేను.. ఈ లోపలి ప్రయాణం సులభవవ్వడానికి మనతో పాటు ప్రకృతిని తోడు పంపిస్తారు —
“ఆకాశం అంచున
ఆఖరి చినుకు
నా గుండెలో శబ్దమై
జ్ఞాపకాల కదలికతో
నాలో నేను నిశ్శబ్దమై..”
అప్పటి వరకూ ఆ చినుకునే పట్టుకు వెళ్తున్న మనకి అది ఎప్పుడు ఈ నిశ్శబ్దంలోకి అతి సున్నితంగా జారవిడుస్తుందో తెలీనే తెలీదు!!
అభినందనలు కిరణ్ గారు! భావుకత, తాత్వికతల మేళవింపు మీ కవితల్లోనే నాకు పరిచయం అయ్యాయి.
అఫ్సర్ జీ, మీ పరిచయం ఇంకొన్ని కొత్త కోణాలు చూపించింది. థాంక్యూ!
“అంతర్యానం”ను కన్నడంలోకి అనువదించి చూద్దామని ఓ ఐదు కవితల్ని ప్రయత్నించాను. ఎంతో సులువుగాను, ఒద్దికగానూ ఒదిగిపోయాయి.
చెప్పదల్చుకున్న విషయమేమిటంటే, ఏ భాషలోకైనా ఇమడగలిగే కవిత్వం pure poetry అని, ఇక్బాల్ గారి ఆ మాటకు నేను ఊహించగలిగే నిర్వచనమిదేనని.
అఫ్సర్ గారు అంతర్యానంలో మునిగిపోయి వ్రాసిన ఈ విశ్లేషణ బావుంది. భారీగా కూడా ఉండి పాఠకుల్ని సైతం అంతర్యానపు లోలోతుల్లోకి లాక్కెళ్ళి త్వరగా తేలే అవకాశనివ్వడం లేదు.
అఫ్సర్ గారు,
మీ విశ్లేషణ చాలా బావుంది.
“మబ్బుల రాపిళ్లకు
ఆకాశం
రంగు మార్చే లోపు
నీడ పొడవు
నిర్ధారించుకోవాలి.”
ఈ లైన్లు చదవగానే అంతర్యానం ఎప్పుడు చదివేద్దామా అన్న ఆత్రుత మొదలైంది. పుస్తకం ఇప్పుడే నా చేతుల్లోకి వచ్చింది. అంతర్యానికి నాంది పేజీ చదివాక ‘అణువులో పొదగబడిన మరో అనంతవిశ్వం’ ఇప్పుడు నా ముందు ఉన్నట్టనిపించింది. అంతర్యానం చెయ్యాలిక…
సర్ ఒక మంచి కవిని, కవితా పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.మీ లోతైన విశ్లేషణ చదివాక వారి కవిత్వం చదవాలన్న ఆసక్తి పెరుగుతుంది .
Wordsworth “Daffodils” నాకెంతొ ఇష్టమైన కవిత. అది నెను చదివిన మొట్టమొదటి ఆంగ్ల కవిత కూడా.ఇప్పుడు ఈ అంతర్యానం విశ్లేషణలొ నేనూ మునిగి తేలడానికి ప్రయత్నిస్తున్నాను.”మబ్బుల మెట్ల మీంచి కిందికి దిగే ప్రయత్నంలో వుంది విమానం.” లాంటివాటిని రెండు మూడుసార్లు చదువుకుని ఆస్వాదించాను. అఫ్సర్ చాలా ఇష్టపడిరాసిన విశ్లెషణ అనుకుంటున్నా. ఇక పుస్తకం చదవటమే మిగిలింది. పుస్తకం విజయవంతమైనందుకు సాయిగారికి అభినందనలు
కిరణ్ గారి కవిత్వం నేను చదవలేదు. ఇప్పుడు మీ మాటల్లో స్పర్శించాను. లోపలి ప్రయాణం, సాహసమే కాదు, ఆసక్తిదాయకం కూడా .. అలాంటి ఒక ప్రయాణానికి మ్యాప్ లా ఉంది మీ పరిచయం. చదవాలి . థేంక్ యు కిరణ్ గారూ. అలతి పదాల తెలుగు , నిజంగా అచ్చమైన కవిత్వం. థేంక్ యు అఫ్సర్ జీ, గాయాల లేపనమే కాదు.. ఉపశమింప చేసే చేసే నెమలీక కూడా కవిత్వంలో ముఖ్యమైనది .. మన అంతర్యానాన్ని మనమే మొదలు పెట్టటానికి .
Enjoyed both… the poetry and the prose:-)
కవిత్వం బయటి ప్రపంచం మీద ,లోపలి ప్రపంచం మీద వుంటుంది. బయటి ప్రపంచం మీద రాసినప్పుడు కవి అనుభవం తో పాటు పాఠకుడి అనుభవం కలిసిపోయే అవకాశం ఎక్కువ . లోపలి ప్రపంచం మీద అలాంటి సందర్భం చాలా తక్కువ. ఇక్కడే కవికి పరీక్ష. అంతర్ మూలాల్లోకి వెళ్లి, కనపడని అక్షర సాము చేసి గెలువాలే. ఏకాగ్రత, నిశిత పరిశీలన , నేర్పరితనం, మధనం, ఇత్యాది అంశాలతో పాటు ఒక రుషి తపస్సానంతరం లోకాన్ని చూసే దృక్ వైశాల్యం వెరసి’ అంతర్యానం’ గా అర్థం చేసుకున్న. సాయిచరణ్ , అఫ్సర్ గార్లకు ధన్యవాదాలు. పుస్తకం ఇక తీసుకోక తప్పదు మరి.
అఫ్సర్ గారు – మీ సమీక్షకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి వాక్యంలోనూ నాపై మీకున్న అభిమానం కనిపిస్తున్నది. నేను చేస్తున్నది సాహసయాత్ర అని తెలుసు. మీ సమీక్ష నాకు ధైర్యాన్నిచ్చే పలకరింపు. ఈ పుస్తకాన్ని మెచ్చిన మిత్రులకు, చదవాలనుకునే మిత్రులకు కూడా మరిన్ని కృతజ్ఞతలు. పుస్తకం కావలసినవారు, నాకు మీ అడ్రసుతో మెయిల్ పంపితే, సాధ్యమైనంత త్వరగా పుస్తకం పంపగలను. నా మెయిల్ అడ్రసు :kskk@rediffmail.com
W/Regards – Saikiran
అఫ్సర్….
‘అంతర్యానం’ – తప్పకుండా సంపాదించి, చదవ వలసిన కొత్త పుస్తకాల జాబితాలో చేర్చారు …
ముఖ్యంగా, మీరు కోట్ చేసిన వాటిల్లో “చినుకు పోట్లకి / ఛిద్రమయిన సెలయేరులా / నా వలయంలో / నేను తిరుగుతూనే వుంటాను / చీకటి తెలియని రాత్రి కోసం” లాంటి మరిన్ని కవిత్వ వాక్యాల కోసమైనా ….
“కుదుపులు వుంటాయి, వొళ్లు కదుము కట్టే దిగుళ్లూ వుంటాయి. కానీ, వాటిని కూడా ఉత్సాహంగా తీసుకునే శక్తి సంపాదించుకుంటే…అప్పుడేం చేస్తుందీ పాడు బతుకు?!”….బాగా చెప్పారు….
సందర్భమో, అసందర్భ మో నాకు తెలియదు గానీ, ఒక కవిత్వ విద్యార్థిగా నాకున్న కొన్ని సందేహాలను మీ ముందు పెడుతున్నాను. నా అవగాహనలో ఏవయినా లోపాలు వుంటే సదిద్దుకుంటాను. ఈ సందేహాలకూ, ‘అంతర్యానం’ కవిత్వానికీ సంబంధం లేదు….కేవలం, మీ ఆర్టికల్ నేపధ్యం లోనే, ఈ కొత్త (పాత?) ప్రశ్నలు…
(1) కేవలం ‘ఇలాంటి’ కవితల ప్రస్తావన వొచ్చినపుడు మాత్రమే, ‘శుద్ధ కవిత్వం’ అనే మాటను ఎందుకు వాడుతున్నాము?….మరి మిగతా కవిత్వం?….’శుద్ధ కవిత్వం కానిది’ గా పరిగణించాలా?…లేక, ‘శుద్ధ కవిత్వం’ అన్న విశేషణాన్ని ఇంగ్లీష్ బడిలో ఇచ్చే O ** గ్రేడ్ లాగా పరిగణించి, తక్కిన కవిత్వాన్ని ఆ తరువాత గ్రేడుల్లోకి నేట్టేయాలా?
(2) అలాగే, ‘లోపలి ప్రయాణం’ లాంటి మాటల్ని కూడా ఇక్కడ మీరు ప్రస్తావించిన కవిత్వం (లేక ఇలాంటి కవిత్వం) విషయం లో మాత్రమే వాడడం గమనించాను. అంటే, మిగిలిన కవిత్వాలలో ఇలా లోపలికి ప్రయాణించడం అంటూ ఉండదా?
-ఒక వేళ, మీరు చెప్పినట్టు ‘శుద్ధ కవిత్వం’ ; ‘లోపలి ప్రయాణం’ వంటివి ఈ తరహా కవిత్వానికి మాత్రమే పరిమితమైనవి అయితే…..
(అ) ‘తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరే దాకా కవి చేసే అంతర్-బహిర్ యుద్ధారావమే కవిత్వం’ అంటూ, శ్రీ శ్రీ ‘మహా ప్రస్థానం’ కావ్యానికి, ‘చెలం’ యిచ్చిన ‘యోగ్యతా పత్రం’ ని నేను ఎలా అర్థం చేసుకోవాలి?
(ఆ) ‘దారి పక్క / చెట్టు కింద / ఆరిన కుంపటి విధాన’ కూర్చున్న ముసలి బిచ్చగత్తె ని చూసి, బాధతో మహా కవి శ్రీ శ్రీ చెప్పిన కవిత లోనైనా ; ‘దేవుడా రక్షించు నా దేశాన్ని / అమ్మల నుండి , బాబాల నుండి ‘ అని ఆవేదనతో తిలక్ చెప్పిన కవిత లోనైనా …… ’47 దగ్గరే ఎలా విరిగానో మీరెవరూ చెప్పలేదుగా’ అంటూ 1996 లో బాధపడిన ‘అఫ్సర్’ చెప్పిన కవితలోనైనా ….. ‘కవి’ లోపలి లోకాల్లోకి ప్రయానించలేదా? …. సరే, ఆ సంగతి పక్కన పెట్టి, నేనిక్కడ ఉదహరించిన ఈ మూడు కవితల్ని ఒక కవిత్వ విద్యార్థిగా ఎలా వర్గీకరించాలి ?….’శుద్ధ కవిత్వం కానివి’ అనాలా?…లేక, ‘O ** గ్రేడ్’ తరువాతి గ్రేడులు పొందిన కవిత్వం గా పరిగణించాలా?
[O ** గ్రేడ్.....కేవలం నా సందేహాలని మీ ముందు పెట్టే క్రమం లో సౌలభ్యం కోసం వాడిన మాట]
విజయ్: నేను నీ ప్రశ్నలకు విడిగా మళ్ళీ ఆనవాలు శీర్షికలోనే సమాధానం ఇద్దామని ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వచ్చాను. కానీ, విడిగా ఎట్లాగూ వివరంగా రాయక తప్పదు. ఇక్కడ క్లుప్తంగా ముక్తసరిగా చెప్పనీ ఇప్పటికి!
1. శుద్ధకవిత్వం అనే మాట మీద నాకు అభ్యంతరాలు వున్నాయి. ఇక్బాల్ చంద్ ఏ సందర్భంలో ఎందుకు వాడాడో ఈ ముందు మాటలో స్పష్టంగా అర్థం కాలేదు నాకు.
నా మటుకు నాకు శుద్ధకవిత్వం అంటూ లేదు. వున్నదల్లా ‘కవిత్వం’ ‘అకవిత్వం’ మాత్రమే! సామాజిక స్పృహతో రాయడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. కానీ, కవిత్వ కళ అనేది లేకుండా కేవలం సామాజికత నిలబడదు అనుకుంటాను. అలాగే, వొట్టి అనుభూతి మాత్రమే కవితగా నిలబడదనీ నా నమ్మకం. ఆ రెండీటీ మధ్య వంతెన కట్టినప్పుడే మంచి కవిత్వం అవుతుంది.
2. ప్రతి కవీ లోపలి ప్రయాణం చేస్తాడు నిస్సందేహంగా! నేనేమంటున్నానంటే, మనం బయటికి ఎంత దూరం ప్రయాణం చేస్తామో, లోపలికీ అంతే దూరం ప్రయాణించగలగాలి. సాయికిరణ్ లాంటి కవులు ఇంకో మైలు అదనంగా నడుస్తారు, లోపలి రహస్యాలు రాబట్టడానికి! ఆ అదనంగా నడిచే మైళ్ళ వల్ల కవిత్వ గాఢత పెరుగుతుంది. నా మటుకు నేను ఈ పని ‘రక్తస్పర్శ’లో చేసినంత బాగా తరవాతి కవిత్వంలో చేయలేకపోయాన్న అసంతృప్తి వుంది. శివారెడ్డి గారి “మోహనా, ఓ మోహనా!”లో కూడా ఈ లోపలి ప్రయాణం గాఢంగా వుంటుంది. ఆయన తరవాతి కవిత్వంలో ఆ లోపలి ప్రయాణపు తీవ్రత తగ్గుతూ వచ్చిందని నా అభిప్రాయం.
(అ) చెలంతో నాకు గొడవ లేదు, అంతర్-బహిర్ యుద్ధాల మధ్య వీలయినంత సామరస్యం కుదరని కవులతోనే నాకు పేచీ!
(ఆ) మీరు ప్రస్తావించిన ఆ ముగ్గురూ- శ్రీ శ్రీ, తిలక్, అఫ్సర్- లోపలి లోకాల్లోకి ప్రయాణించిన వారే. కానీ, నాకు ఆ ముగ్గురు లోపలి లోకయాత్ర మీద పూర్తి సంతృప్తి లేదు.
విషయం ఏమిటంటే: ఇప్పుడు గొడవంతా శుద్ధ కవిత్వం గురించి కాదు, అసలు కవిత్వం గురించే! అనేక రకాల రాజకీయాల వల్ల, వ్యక్తిగత కీర్తి కలహాల మధ్య, అంతర్జాలపు నకిలీ హడావుడి వల్ల ఇప్పటి కవిత్వం బలహీనపడుతున్నదని అనిపిస్తోంది. ఈ బలహీనత పైకి కనిపించడం లేదు ఇప్పుడు…నెమ్మది మీద తెలుస్తుంది, మనం ఏం కోల్పోయామో! కవిత్వం మనకి ఎంత దూరమాయిందో!
అఫ్సర్ సార్!
స౦కలన౦లో ఒక కీలకమైన అ౦శాన్ని ఒడిసి పడతారు. దాని చుట్టూ మమ్మ్లల్ని తిప్పుకు౦టూ పొతారు. మధ్యలో బుక్ మార్క్ లను అ౦ద౦గా ఒక నెమిలీక తోనో, ఒక ఫ్లాప్ తోనొ ఉ౦చుతారు. మీ అ౦తర౦గ౦లోకి ఆ కవిని, ఇటు మమ్మల్ని తీసుకుపోతారు. ఆ పుస్తకన్ని ఎలాగోలా చదివేలా చేస్తారు. అనన్యసామన్యమైన మీ ప్రతిభ అద్వితీయ౦……!కవిగారి ప్రతిభ ను ఏమి చెప్పాలనుకొన్న బహుశా మీ పదాలనో మీ భావాన్నో కాపీ చేయాల్సి వస్తు౦ది. ఆయన (ఆ కవి) జన్మ ధన్య౦. గ్రేట్!!!
అఫ్సర్ గారు Raleigh-Durham కు వెళ్తున్నప్పుడు తోడుగా దొరికి, తేలికవి అనిపించే కొన్ని ప్రశ్నలను ఆయన చేత వేయించిన ‘అంతర్యానం’ నిజంగా పస వున్నదే అనిపించింది. కవికి అభినందనలు. లలితలలితమైన ఊహలను వెలార్చే సున్నిత కవిత్వాన్ని పరిచయం చేస్తున్నప్పుడు అఫ్సర్ గారు దానికి నప్పే రీతిలోనే చక్కగా, హృద్యంగా రాయటం మనం గమనించవచ్చు. అందుకు వారూ అభినందనీయులే. కోడూరి విజయకుమార్ గారికి కలిగిన సందేహాలు అసలైన కవిత్వపు తత్వం పట్ల ఆయనకు గల జ్ఞానతృష్ణను సూచిస్తున్నాయి. నిజమే. కేవలం ఒక రకమైన వస్తువు ఉన్నందువల్లనో, లేక ఒక రకమైన శైలి/రచనా విధానం ఉన్నందువల్లనో మాత్రమే కొన్ని కవిత్వాలు మనకు నచ్చుతున్నాయా అనే సందేహం కలుగుతుంది అప్పుడప్పుడు. ఆకాశం, సముద్రం,మబ్బులు, వెన్నెల మొదలైన వాటిని వస్తువులుగా తీసుకునే కవులకు ఈ కాలంలో కూడా కొంత added advantage వుంటున్నదనుకుంటాను. మంచి కవిత్వం వివిధ రకాలకు (categories కు) చెందిన రచనల్లో ఉండే అవకాశం లేదా అనిపించటం సహజమేనేమో.
ఎలనాగ గారు: మీరన్న ఈ మాట గురించి ఆలోచిస్తున్నా–”కేవలం ఒక రకమైన వస్తువు ఉన్నందువల్లనో, లేక ఒక రకమైన శైలి/రచనా విధానం ఉన్నందువల్లనో మాత్రమే కొన్ని కవిత్వాలు మనకు నచ్చుతున్నాయా అనే సందేహం కలుగుతుంది అప్పుడప్పుడు. ఆకాశం, సముద్రం,మబ్బులు, వెన్నెల మొదలైన వాటిని వస్తువులుగా తీసుకునే కవులకు ఈ కాలంలో కూడా కొంత added advantage వుంటున్నదనుకుంటాను. ”
- నా మటుకు నాకు ప్రకృతి గురించి రాసే కవిత్వమంతా కేవలం ప్రకృతి గురించి అనిపించదు. objective correlative అనే మాట మీరు విని వుంటారు కదా! ఈ రకమయిన కవిత్వం రాసే వాళ్ళు – నాతో సహా- కేవలం ఆకసమూ,సముద్రమూ, మబ్బుల గురించి రాయరు. వాటికి తమ మూడ్ ని ఆపాదిస్తారు. అలా మూడ్ ని ఆపాదించడంలో వాళ్ళ విజన్ కూడా దానికి తోడవుతుంది. అలా అయినప్పుడే అది మంచి కవిత అవుతుందని నాకు అనిపిస్తుంది.
దాసరాజు రామారావు గారు ఏమంటున్నారంటే- “బయటి ప్రపంచం మీద రాసినప్పుడు కవి అనుభవం తో పాటు పాఠకుడి అనుభవం కలిసిపోయే అవకాశం ఎక్కువ; లోపలి ప్రపంచం మీద అలాంటి సందర్భం చాలా తక్కువ. ఇక్కడే కవికి పరీక్ష….”…
మరి కవి ‘ఎలనాగ’ ఏమంటున్నారు….”ఆకాశం, సముద్రం,మబ్బులు, వెన్నెల మొదలైన వాటిని వస్తువులుగా తీసుకునే కవులకు ఈ కాలంలో కూడా కొంత added advantage వుంటున్నదనుకుంటాను”
అఫ్సర్….ఇక మీరు రంగం లోకి దిగి తీర్పు వెలువరించక తప్పదు సుమా!
జీవితం ఎవరికీ సాఫీగా వుండదు. పోనీ అని, సూఫీగానూ వుండలేం!
ఈ వాక్యం తో మొదలైన మీ విశ్లేషణ.. మళ్ళీ మళ్ళీ.. అలా అంతర్యానం చేయిస్తూనే వుంది.
పితృవాత్సల్యం తో కూడిన ఒక మంచి విశ్లేషకుడి ఆదరణ పొందిన పసిపాప లాంటి కవిత్వ యానం గురించి ఇంకా ఎన్ని సార్లు సహయానం చేస్తూ వుంటానో చెప్పలేను.
“కిరణ్ ప్యూర్ పొయెట్” అని పేర్కొంది ఇక్బాల్ చంద్ గారు. కానీ ప్రశ్నలను సంధిస్తున్నదేమో అఫ్సర్ గారి పైన
సమాధానాలు, వివరణలు, తీర్మానాలు, తీర్పులూ అన్నింటినీ అఫ్సర్ గారి నుంచే డిమాండ్ చేయడం ప్రజాస్వామికంగా అనిపించడం లేదు )
అవ్విధంగా ఇక్బాల్ గారిని సేఫ్ జోన్ లోనే వదిలేసి, అఫ్సర్ గారిని విట్నెస్ బోన్ ఎక్కడమనడం కూడా బాగోలేదు ))
అఫ్సర్ గారూ.. సాయికిరణ్ గారి కవిత్వాన్ని మీరు తాకిన తీరు హృద్యంగా ఉంది. వ్యాసం ఇంకా కొనసాగితే బాగుండును అనిపించేంత బావుంది.
ఈ వాక్యాలతో మిమ్మల్ని మరింత సన్నిహితంగా తెలుసుకొన్నట్టు అనిపించింది. ‘ఈ లోప్రయాణం ఎలా వుంటుంది? నిజంగా ఈ ప్రయాణానికి మనం ఎప్పుడేనా సిద్ధంగా వుండగలమా? వున్నా, ఆ ప్రయాణం తుదకంటా వెళ్లగలమా? వెళ్ళినా తిరిగి రాగలమా? రాగలగినా అంతకు ముందులాంటి జీవితాన్ని జీవించగలమా? ఇవి తేలికగా అనిపించే గట్టి ప్రశ్నలు. సమాధానాలు ఎవరిదగ్గిరా సిద్ధంగా వుండవు, సిద్ధంగా వున్న సమాధానాలు ఎవరినీ సమాధాన పరచలేవు. ఎందుకంటే, ఎవరి ప్రయాణం వాళ్ళదే! ఎవరి అనుభవం వాళ్ళదే! కానీ, అనుభవమున్న ఇంకో పూర్వయాత్రికుడు కొన్ని వెలుగురేఖలు చూపించవచ్చు.’
మంచి వ్యాసం
పుస్తకం పంపించండి సారు అని అడిగిన వెంటనే నాపై ఎంతో ప్రేమతో అంతర్యానాన్ని పంపిన కిరణ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు
బ్లాగుల్లో ఎంతో నిష్కర్షగా, సూటిగా, కవిత్వంపై తన అభిప్రాయాల్ని వెలువరించే కిరణ్ గారి పుస్తకంలో కవిత్వం ఎలాఉంటుందోనని ఆతృతగా పేజీలు తిప్పిన నాకు, అద్బుతమైన పఠనానుభవం కలిగింది.
ఒక్కో కవితా సానబట్టి, సానబట్టి తయారుచేసిన వజ్రాల్లా అనిపించాయి.
ఒక్క పదాన్ని తొలగించామా ఈ పద్యం కుప్పకూలుతుందా అనిపించేత క్లుప్తతా, గాఢతా కనిపించాయి.
అనుభవాన్ని, చిక్కని భాషతో ఆవిష్కరించటం సామాన్యమైన విషయం కాదు.
మూర్తిగారిచ్చిన నిర్వచనం ప్రకారం ఇది శుద్ధకవిత్వమే. ఎక్కడా గోడలు లేవు, ఎక్కడా మన అనుభవానికి రాని విషయాలు లేవు, ఏ కవితా ఇది నాకు సంబంధించినది కాదు అననిపించలేదు.
ఈ కవి తన లోపల్లోకంలో ఎంతెంత దూరాలు తిరిగి కొన్ని వాక్యాలు రాసాడో నాకు తెలియదు కానీ, కొన్ని కవితలు నన్ను నా లోపల్లోకంలో అలసిపోయేటంత వరకూ పరుగులెట్టించాయి. ఉదా. ఈ వాక్యాలు చూడండి..
నన్ను నేను దాటాలనే
ప్రయత్నంలో
నాలోకే నేను
కూరుకు పోతాననే
భయం. (దోసిట్లో నవ్వులు)
అసలే మూగది
అందుకేనేమో ముఖాన్ని
అడ్డుపెట్టుకొంది
ఒలికిపోయిన వెన్నెలను
ముఖానికి పులుముకొని మరీ (పిచ్చిమనసు)
చాలా కవితల్లో వాన భిన్న రూపాలలో, పదచిత్రాలలో, నూతన ఉపమానాలతో అబ్బురపరచింది.
చాన్నాళ్ళుగా హాంట్ చేస్తున్న నా ఫీలింగ్స్ ను పంచుకొనే అవకాశం కల్పించిన వాకిలి/అఫ్సర్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.
కిరణ్ గారికి అభినందనలు.
బొల్లోజు బాబా
బాబా గారు – మీ అభిమానానికి, ఔదార్యానికి చాలా థాంక్సండి.