కవిత్వం

మనిద్దరమొక పద్యం

12-జూలై-2013

అలా నీలోకి
ఒక వాక్య తరగనై ప్రవహించాలన్నా
నీ కనురెప్పల కింద
కలా విచిత్రమై దోబూచులాడాలన్నా
నీ నాలుక చివర
తేనేతెట్టెనై పూ ర్ణించుకోవాలన్నా

నేను నిప్పుల మీద సలసలా మరిగే కన్నీరవ్వాల్సిందే -

నీ పక్కన మూగి
బుడిబుడి అడుగుల ధ్వనిసరాగం వినిపించాలన్నా
నీ ఉసూరనే వేళల
సన్నని వానతుంపరై చక్కిలిగిలి పెట్టాలన్నా
నీ పాదాలలసిన తొవ్వల
చెమట నద్దే పాటగా స్పృశించాలన్నా

నేనీ మట్టిపొరల కింద రాచిరంపాన పెట్టుకోవాల్సిందే-

నీ చెంప కానించిన
కొనగోటి సమయాల్లోకి
దుర్లభ కవిసమయమై దూరాలన్నా
నీ ముడేసిన పెదాల వృత్తంలో
శబ్ధాలంకారమై పులుముకోవాలన్నా
చంద్రాంశ తొంగిచూడని నీ ముఖ వర్చస్సులో
వేయి పున్నమల పోయెమై నిండిపోవాలన్నా

ఎన్నో కాళరాత్రుల కొరడాలతో హింసింపబడాల్సిందే -

నీ తల మీద మోస్తున్న జ్ఞాపకాల బుట్టలోకి
మధురోహనై తొంగిచూడాలన్నా
నీ కనుకొనల జారిన భాష్పవలయం చుట్టూ
పరితప్త కందిరీగనై గిరికీలు కొట్టాలన్నా
నీ చాచిన చెయ్యిలోంచి
భవిష్యత్ మాధుర్యాలను కలుగునై, తోడుకోవాలన్నా

జుట్టుపట్టుకొని సముద్రంలోకి లాక్కెళ్ళి
నన్ను నేను వందసార్లు ముంచుకోవాల్సిందే-

నీ నుదురొక అరణ్యమై విస్తరిస్తే
విల్లెక్కుపెడుతున్న బంజారాగీతమై కలియతిరగాలన్నా
నీ హృదయమెక్కడో కాటగలసిపోతే
దారుల దిగ్భంధనంలో
పోగయ్యే సామూహిక వేదనాభరిత వేదికపై
నిన్ను కనుగొనాలన్నా
జీవిత మెక్కడో కుంటుతున్న కుక్కపిల్లై
కాళ్ళకడ్డం పడితే
అమ్మ కడుపులోకెళ్ళి మమకారాన్నింత మోసుకురావాలన్నా

నాకు నేనే పుల్లలు పుల్లలు గా విరుచుకొని
కట్టగట్టుకొన్న మోపుగా
కొత్తగా అవతరించాల్సిందే -

ఇప్పుడు చెప్పనా
నువ్వెవరివో
నేనెవరినో

నువ్వు
నూరంకెలు లెక్కబెడుతున్న బతుకుచుట్టూ
మూగిన ఆశయానివి
నీ అడుగులకు మరింత
నూరేళ్ళ బలాన్నద్దుతున్న నేను
శిల్పాన్ని …!