సిలికాన్ లోయ సాక్షిగా

డిపెండెంటు అమెరికా

12-జూలై-2013

సాయంత్రం ఏటవాలు కిరణాలతో దేదీప్యమానంగా మెరుస్తూంది. ఇంట్లో అద్దాలలోంచి చూస్తే బయట వెచ్చగా ఉన్నట్లు అనిపిస్తూంది. కానీ విసురు గాలి వీస్తూ అతి చల్లగా ఉంది.
ఆకాశం లో ఒక పక్క చంద్రుడు పగటిని తరుముకొస్తున్నాడు. రెండు గదుల ఇంట్లో అక్కడక్కడే తిరుగుతూ ఎడతెరిపిలేకుండా మనసుని మెలికలు తిప్పుతున్న ఏవేవో ఆలోచనలు.
“అవునూ కాథరీన్ అట ఎవరో నా సెల్ కి ఫోన్ చేసేరు. నేను ఇంటికి వెళ్లగానే నీతో ఫోన్ చేయిస్తానని చెప్పేను” అన్నాడు సూర్య ఇంట్లోకి వస్తూనే.
“అవును. పార్కులో కలిసిన ఫ్రెండు. వెనక వీథిలో ఉంటారట. నేను నిన్న సాయంత్రం ఫోన్ చేసేను. తనీవేళ చూసుకున్నట్లుంది. నీ సెల్ నించి చెయ్యడం వల్ల తను మరలా అదే నంబరుకి చేసినట్టుంది. ఈ గురువారం వాళ్లింటికి వస్తానని మెసేజ్ పెట్టేను.” అన్నాను.
“గురువారం ముహూర్తమేమిటో.”
“తనకి గురువారాలు ఖాళీ అని చెప్పింది. అయినా తమరు గురువారాలు మీటింగులని లేటుగా వస్తారుగా.” అన్నాను.
“అమ్మా, తల్లీ, ఊరికే అన్నాన్లే సర్దాకి. వెళ్లిరా! నువ్వు ఎవరితోనైనా ఫ్రెండ్ షిప్ చేస్తే నాకూ మంచిదే. ఉద్యోగం, సద్యోగం అని నా బుర్ర తినకుండా ఉంటావు.”
నవ్వుతున్న తనని చూసి తల అడ్డంగా ఊపేను. తనిక మారడన్నట్టు.

***

పిల్లల్ని మురిపెంగా చూస్తూ “పిల్లలు ఎంత త్వరగా నేస్తాలయిపోతారో” అంది కాథరీన్.
మూడంతస్థులుగా ఉన్న “టౌన్ హౌస్” వాళ్లది. ప్రతీ ఫ్లోరు విశాలంగా లేకపోయినా తీర్చిదిద్దినట్లు అందంగా ఉంది. పరిమితంగా, ఆధునికంగా ఉన్న ఫర్నిచరుతో.
“నీదీ, నీకు అమెరికా నచ్చిందా”
“నిధి కి చాలా సిగ్గు ఎక్కువ. కొత్త వాళ్లతో సరిగా మాట్లాడదు.” అన్నాను.
“వాళ్ల యాసలో ఇంగ్లీషు రావడానికి ఇంకా సమయం ఎంత పడుతుందో నిధికి” అని మనసులో అనుకుంటూ.
నా ఆలోచనలని కనిపెట్టినట్లు “ఫర్వాలేదులే. పిల్లలు చాలా త్వరగా అన్నీ నేర్చుకుంటారు” అంది.
“నిధి కి స్కూల్లో అడ్మిషన్ దొరికింది, ఆగస్టు నించి వీళ్లిలా ఆడుకోవాలంటే సాయంత్రం వేళే కుదురుతుంది” అన్నాను.
“ఫర్వాలేదులే మనకెలా వీలయితే అలా “ప్లే డేట్” లు పెడదాం పిల్లలకి. నిజానికి నా కాలేజీకి ఈ సెమిస్టర్ కి గురువారాలు మాత్రమే ఖాళీ. వచ్చే సెమిస్టర్ కి నా స్కెడ్యూల్ ఎలా ఉంటుందో నాకే తెలీదు. కాలేజీకి వెళ్లే రోజుల్లో పిల్లలని నేను బాగా మిస్సవుతాను. అందుకే ఈ ఒక్కరోజూ పూర్తిగా పిల్లలతోనే గడుపుతాను.” అంది.
“కాలేజీ లో ఏం ఉద్యోగం ?” అన్నాను.
“ఉద్యోగం కాదు, చదువుతున్నా. అకౌంటెన్సీ మేజరు, చివరి సంవత్సరం. ఈ సమ్మర్ లో సెమిస్టరు మానేసి ఏదైనా ఉద్యోగం చేద్దామని చూస్తున్నా.” అంది.
“అవునూ నువ్వు పీజీ వరకు చదివేవు కదా, ఉద్యోగానికి ప్రయత్నం చెయ్యడం లేదా” అంది మళ్లీ.
నేను ఒక్క నిమిషం ఆలోచించడం చూసి “అయినా ఈ దేశం లో చిన్న పిల్లలున్న వాళ్లకు ఉద్యోగం చెయ్యడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సంపాదించేదంతా పిల్లల డేకేర్ కే ఖర్చవుతుంది.” అంది.
“నేనిక్కడ ఉద్యోగం చేసే అవకాశం లేదు నాకు. ఈ స్థితి నుంచి బయట పడే మార్గం కోసం అన్వేషిస్తున్నాను” అన్నాను.
“అంటే?”
“నాకిక్కడ ఉద్యోగం చేసే వీసా లేదు.”
“ఓహ్! అదా! నా దృష్టిలో అది పెద్ద సమస్య కాదు. నేనిలా చెప్పకూడదు కానీ ఈ దేశం లో అందరూ నీలా అనుకుంటే పనులు సగం కూడా కావు. ఇక్కడ డబ్బుని నోట్ల రూపం లో ఇచ్చి పని ఇచ్చేవారు బోల్డు మంది ఉన్నారు. ఉదాహరణకి నేను బయటికి వెళ్లినపుడు మా పిల్లల్ని చూసుకోవడానికి వచ్చే బేబీ సిట్టర్ కి, మా లాన్ కత్తిరించడానికి వచ్చే వ్యక్తికి, ఇంట్లో ఏది పాడైనా పిలిచే మెకానిక్ లకి డబ్బు చెక్కులో, క్రెడిట్ కార్డో ఇవ్వాల్సి వస్తే మా ఆయన జీతం మా ఇంటి మార్టిగేజ్ కట్టంగా తినడానికి కూడా సరిపోదు.”
“రిజిస్టర్డ్ కంపెనీ కంటే తక్కువ డబ్బుకి పనిచేస్తారన్న మాట వీళ్లు. మరి సరిపోతుందా వాళ్లకి?”
“సరిపోతుందో, లేదో అదలా ఉంచు.లీగల్ గా పనిచేస్తే సంపాదించిన దాంట్లో టాక్సుకి పోగా వాళ్లకు మిగిలేదానికంటే ఇదే బెటర్. కొందరు ఇలా వారానికి నాలుగైదు ఉద్యోగాలు చేసి పొట్ట పోసుకుంటారు.”
“ఉహూ- అదంతా మా వీసాలతో కష్టం కాథరీన్, ఏదైనా సమస్య వస్తే మా ఆయన ఉద్యోగానికి ఎసరు వస్తుంది.” అన్నాను.
“నువ్వు బహుశా: ప్రశాంటీ ని కలిస్తే బావుంటుంది, నాకు కిందటి వారం పార్కులో కనిపించింది, తనూ నీలా కొత్తగా వచ్చింది అమెరికాకి, నువ్వేమని చెప్పేవు- ఆ… సౌత్ ఇండియా కదా, తనూ అదే చెప్పినట్లు గుర్తు ” అంది కాథరీన్.
“అలాగా కలిస్తే తప్పకుండా మాట్లాడుతాను.”అన్నాను సంతోషంగా.
“మీ దేశమ్మీద బాగా బెంగ పడ్తున్నావా?” అంది నా ముఖం లోకి చూసి.
“అవును, చాలా ఎక్కువగా. మరీ ముఖ్యంగా నా స్నేహితులని, కొలీగ్స్ ని బాగా మిస్సవుతున్నా” అన్నాను సెలవు తీసుకుంటూ.
“వచ్చే గురువారం లైబ్రరీకి వెళదాం, అంది “బై” చెప్తూ.

***

లైబ్రరీ లో కి అడుగు పెడ్తూనే “వావ్ – నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఇక్కడే ఉంది” అంది కాథరీన్, పాంటు పై ఇండియన్ లాంగ్ టాప్ వేసుకుని పుస్తకాల అరల మధ్య నుంచి మా వైపే వస్తున్న అమ్మాయిని చూపించి.
“హాయ్! కాథరీన్”అని అంటూ నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది.
“నా పేరు ప్రియ” అన్నాను.
“హాయ్, ఇండియా లో ఎక్కడి నుంచి వచ్చారు?” అంది ప్రశాంతి.
నేను చెప్పిన సమాధానం వినగానే
“అబ్బా, భలే కలిసార్లే, యూ నో కాథరీన్ మేమిద్దరం ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లం” అంది ప్రశాంతి.
“మీరు కబుర్లు చెప్పుకొంటూ ఉండండి, నేను పిల్లలని అలా చిల్డ్రన్ సెక్షనుకి తీసుకెళ్తాను.” అంది కాథరీన్.
నిధి అటుగా పరుగు తీసింది.
నేను “మీరూ వస్తారా, కాథరీన్ మీద నిధి బాధ్యత వదిలేయడం మరీ బాగోదేమో- అన్నాను.”
“నేనిక్కడ ఇదే సెక్షన్ లో ఉంటాను. వెళ్లి రండి. నేను ఎక్కువగా లైబ్రరీలోనే గడుపుతానండీ. మా ఇల్లు ఇక్కడికి వాకబుల్. లైబ్రరీ వెనక అద్దాల తలుపు వైపు చూపించి, ఆ పక్కన పార్కులోనే నేను కాథరీన్ ని కలిసేను. రోడ్డుకావల మా అపార్ట్ మెంటు కనిపిస్తూందా” అంది దూరంగా చూపిస్తూ.
గలగలా మాట్లాడుతున్న ప్రశాంతి ఎందుకో చూడగానే నాకు బాగా నచ్చింది. భలే చురుకైన, విశాలమైన కళ్లు. కానీ తన కళ్లల్లో ఏదో లోపించిందని అనిపించింది. తనతో మాట్లాడిన రెండో సారీ అదే అనిపించింది.
“మరి….” అంటూ కాథరీన్ చెప్పిన “డబ్బు” చెల్లించే ఉద్యోగాల గురించి చెప్పబోయాను ప్రశాంతికి.
“నాకు తెలిసి మన వీసాల వాళ్లం అలాంటి ధైర్యం చెయ్యలేం, ఒక వేళ ధైర్యం చేసినా ఎంత సంపాదిస్తాం చెప్పండి మహా అయితే నెలకి మేగ్జిమం అయిదు వందలు. అలా సంపాదిస్తే వచ్చే లాభం కంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చే నష్టమూ, మనస్తాపమూ ఎక్కువ. పైగా అవేవీ వైట్ కాలర్ జాబ్స్ కావు. మనమలా పనిచెయ్యలేం.” అంది.
తన వైపు ఆశ్చర్యంగా చూసేను. “పైకి చాలా అమాయకంగా కనిపించే ఈ అమ్మాయి ఎంత కరెక్టుగా ఆలోచిస్తూంది! “అని.
ఆ మాటే చెప్పాను తనకి.
సమాధానంగా చిర్నవ్వు నవ్వింది. తన కళ్లల్లో లోపించినదేమిటో ఈ మధ్యాహ్నం తెలిసింది. ఉత్సాహం లోపించిన తన నవ్వు. ఆ విశాలమైన కళ్లల్లో దు:ఖం, నిస్తేజం తప్ప సహజంగా నవ్వురానితనం.

***

“ఆ చెయిన్ బిజినెస్ వాళ్లు మనల్ని బిజినెస్ చేస్తారా అని అడిగితే వెనకా ముందూ ఆలోచించకుండా బయలుదేరాం కానీ, నీకొకటి తెలుసా?” అన్నాడు సూర్య ఆ సాయంత్రం వస్తూనే.
“ఏవిటోయ్ మూడీగా ఉన్నావ్ ?” ముఖంలోకి తదేకంగా చూసాడు.
“ప్రియా- నిన్నే-” చేతిలో పుస్తకం వైపు కాకుండా ఎటో చూస్తున్న నన్ను కుదిపి
“ఎప్పుడూ లేనిది అంత దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయావేంటి? కొంపదీసి మన ఇంటికి, గొడ్ల చావిడికి ఆస్బెస్టాస్ రేకులు వెయ్యాలనా?!” అన్నాడు నవ్వుతూ.
“ఏమిటి, ఏదైనా చెప్తున్నావా?” అన్నాను తల విదిలించి.
“మన ఇంటికీ, గొడ్ల చావిడికీ…..”
“అదికాదు- ఇంకేదైనా అన్నావా?”
“ఆ- అదేలే- మొన్నటి చెయిన్ బిజినెస్ లు వగైరాలు ఇక్కడ నువ్వూ చెయ్యకూడదు, నేనూ చెయ్యకూడదు తెలుసా?!”
“అవున్లే బబిత చెప్పింది. లీగల్ గా తనిక్కడ జాబ్ చేయకూడదు కాబట్టి వాళ్లాయన మొదలు పెట్టి తనను చూసుకోమన్నాడట.”
“అదే మరి. లీగల్ గా చెప్పాలంటే అతను కూడా ఏ ఉద్యోగం ద్వారానైతే వర్క్ వీసాను పొందాడో అది తప్ప మరో పనేదీ చెయ్యకూడదు. ఇవన్నీ తెలియకుండా అందులో దిగి ఉంటే బాగా ఇరుక్కునే వాళ్లం…….”
సూర్య మాటలు ఏవీ వినబడ్డం లేదు నాకు.
మధ్యాహ్నం ప్రశాంతి మాటలు పదేపదే గుర్తుకు వస్తున్నాయి.
“దిక్కుమాలిన వీసా నిబంధనల వల్ల నాకు పిచ్చి పడుతుందేమోనని అనిపిస్తోంది. కాళ్లు, చేతులు కట్టి పడేసినట్లు ఇరవై నాలుగ్గంటలూ ఇంట్లోపడి ఉండడం దిక్కుతోచకుండా ఉంది.”
తన కళ్లల్లో నీటికి అర్థం నాకూ తెలుసు. కానీ ఏం చెయ్యగలను?
నేనూ అదే పరిస్థితిలో ఉన్నాను. అసలు నేనీ దేశానికి ఎందుకొచ్చాను? సూర్య ఉద్యోగం కోసం. అతని కెరీర్ కోసం. వచ్చేటప్పుడు అతనితో కలిసి ఉండడం గురించి మాత్రమే ఆలోచించాను. మరో కొత్త దేశం చూడడం, వెళ్లి స్థిరపడబోతున్నామన్న ఆనందంలో అసలింకేదీ ఆలోచించలేదు.
“ఏవిటోయ్ మరలా దీర్ఘాలోచనలో పడ్డావ్?”
“ఏమీ లేదులే. చెప్పినా నీకు అర్థం కాదు.”
“మళ్లీ నీ ఉద్యోగం గురించిన ఆలోచనేనా?!”
“ చూడు ప్రియా! హాయిగా రెస్టు తీసుకో. చక్కగా టీవీ చూసుకో. ఇండియాలో ఉన్నన్నాళ్లు నా మాట వినకుండా ఏదో పిచ్చి ఉద్యోగం వెలగ బెట్టావ్. ఇప్పుడైనా మంచి అవకాశం వచ్చిందని సంబరపడు.” సూర్య మాటలు అసలేమీ పట్టనట్లు కూర్చున్నాను.
తనకి అంతే అర్థం అవుతుందో, కావాలని అలా మాట్లాడతాడో తెలీదు. పిచ్చిదో, గొప్పదో ఒక ఉద్యోగం చేసి నాకు నేను స్వతంత్రంగా బతకడం మొదట్నించీ అలవాటు అయ్యిపోయింది. ఇప్పుడీ దేశంలో ఇలా డిపెండెంటుగా బతకడం ఎంత నిరాశగా ఉందో ఎలా చెప్పాలి తనకి?
మధ్యాహ్నం ప్రశాంతితో ఇలా వంటింటి భార్యగా బతకడం నాకు హాయిగా ఉందని చెప్పానే కానీ అదే విషయం రోజూ ఆలోచిస్తున్నాను నిజానికి.
“మొదట్లో నాకీ విషయమంతా తెలీదు. అసలు మేం నా వీసా గురించి, నిబంధనల గురించి అసలెప్పుడూ మాట్లాడుకోలేదు.”అంది ప్రశాంతి.
“అదేమిటి అక్కడుండగా మీరు ఈ విషయాలెప్పుడూ ఆలోచించలేదా ?” అన్నానే గానీ నాకు మాత్రం ఏం తెలుసు ముందు? వివరంగా పరిస్థితి ఇక్కడికి వచ్చి పరిశోధన చేసే వరకు తెలీదు.
“ఒకరిద్దరితో వచ్చే ముందు మాట్లాడాను ప్రియా! ఈ దేశం ఒక గొప్ప స్వర్గధామమని, ఇక్కడుండడమే అదృష్టమని గొప్ప చెప్పేవాళ్లే కానీ ఇక్కడి సమస్యలంటూ ఏవైనా చెప్పే వాళ్లున్నారా అసలు. ఇక అక్కడ మన దేశం లో ఉండి ఇక్కడి జీవితాల గురించిన గొప్ప ఊహాగానాలు వేరే చెప్పాలా. ” అంది.
మళ్లీ తనే “అయినా ఏమిటో ప్రియా, మన ఆడవాళ్లం అక్కరలేని విషయాల గురించి బాగా ఆలోచించి, అసలు అవసరమైనవి చాలా ఇలా నిర్లక్ష్యం చేస్తాం”
సూటిగా అన్న తన మాటలకి నేను నిజాయితీగా తలాడించాను.
“ఈ దేశంలో ఏ బట్టలు వేసుకోవాలి, మొదటి ఆరు నెలలు మందులూ అవీ ఏవి పట్టుకెళ్లాలి? పచ్చళ్లు, పొడులు ఏం తీసుకెళ్లాలి? ఇవే నా బుర్ర నిండా ఇక్కడికొచ్చేంత వరకు” అన్నాను.
“వస్తూనే ఇవన్నీ తెలియక ఉద్యోగం కోసం అప్లై చేద్దామని సూపర్ మార్ట్ దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ మొదలు పెట్టాను. సరిగ్గా నాలుగోలైనులో నా సోషల్ సెక్యూరిటీ నంబరు దగ్గర అప్లికేషన్ ఆగిపోయింది. దానికెలా అప్లై చేయాలో ఇంటికొచ్చి సైటులోకెళ్లి చూసేసరికి బుర్ర తిరిగింది. అసలు డిపెండెంటు వీసాకు అటువంటి నంబరే ఇవ్వరు ఇక్కడ.”అంది.
“అవును ప్రశాంతీ, లీగల్ గా ఇక్కడ ఏ పని చేయాలన్నా సోషల్ సెక్యూరిటీ నంబరు కావాలి. అది ఉండాలంటే వర్క్ వీసా కావాలి. మనలా కొన్ని రకాల వీసాల డిపెండెంట్లు డబ్బు వచ్చే ఏ పనీ చేసే అవకాశం లేదు. అయినా మీ పరిస్థితి ఇంకా కాస్త మెరుగు. ఏ దేశానికైనా పనికి వచ్చే ఎమ్మెస్సీ మీది, నేను చదివిన ఎమ్మే తెలుగు తో ఇక్కడేం చెయ్యాలో అర్థం కాకుండా ఉంది.”
“మీకు బియీడీ ఉందిగా – అదేమైనా పనికొస్తుందనుకుంటా టీచింగ్ కి”
“మన బియ్యీడీలు ఇక్కడెందుకూ పనికి రావు. ఇక్కడ మరేవో టెస్ట్ లు పాసవ్వాలి.” అప్రయత్నంగా నవ్వుతూ అన్నాను.
“అయినా మనకిప్పుడు ఎటువంటి ఉద్యోగం చేసే క్వాలిఫికేషన్ ఉన్నా, చేసే అవకాశం లేదు కదా” దీర్ఘంగా నిట్టూర్చింది.
“సమయం పొద్దుపోవడానికి, ఎలాగూ పనివాళ్లు ఉండరు కాబట్టి ఇక్కడి హౌస్ వైఫ్ లు తళత్తళ్లాడేటట్లు ఇంటి పని ఎప్పుడూ చేస్తూనే ఉంటారట. మొన్నొక గుడిలో కలిసిన గ్రూప్ లో విన్నాను.
గుళ్లో వాలంటీరు చెయ్యమని అడిగారు. నాకేమో విశేషణాలు తప్ప విశేషం లేని సహస్ర నామాలు జపించడం కంటే పనికొచ్చే పనేదైనా చేస్తే బావుణ్ణనిపిస్తుంది. మరి గుడికెందుకు వెళ్లానని ప్రశ్న వచ్చుండాలే మీకు.” అని, “మా ఆయనకు పిచ్చి దైవ భక్తి” గొంతు తగ్గించి గుస గుస చెప్పింది.
“మీరు భలే మాట్లాడుతారండీ. నిజంగా ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళితే మీకు ఉద్యోగం గారంటీ.” అన్నాను.
“టాలెంటు ఎంత ఉండి ఏం లాభం ప్రియా!” అని పెదవి విరిచి “వాలంటీరు చేద్దామని లైబ్రరీలో అప్లై చేసేను.” అంది.
నేను కుతూహలంగా చూసేను.
“అక్కడ రాబోయే మూడు నెలల వరకు ఖాళీ లేదట. ఇంతకీ అక్కడ చేసేది పుస్తకాలన్నీ రాక్ లలో నీట్ గా సర్దే పని.”
“చదువుకునే ఆప్షన్ గురించేమంటారు?” అన్నాను.
“నిజం చెప్పనా! ఇండియాలో ఉండగా బతుకంతా చదివి, చదివి విసుగుపుట్టింది ప్రియా. నా వల్ల కాదు ఇక్కడ కాలేజీల వెంబడి తిరగడం.” అని,
“రోడ్లపై మధ్యాహ్నాలు గ్రూప్ లు గా… ఉద్యోగాలు చేసే వాళ్లు ఏ లంచ్ కనో తిరుగుతూ కనిపించినప్పుడల్లా నా మనసు కొట్టుకుంటుంది నిజంగా. జీవితంలో ఎప్పటికైనా అవకాశమేదైనా వస్తుందో రాదో. మంచి డ్రెస్సులు వేసుకోవాలనిపించదు, కాస్సేపు సమయం పెట్టి తయారవ్వాలనిపించదు. ఎవరు ఎవర్నీ పట్టించుకోని ఈ దేశం లో గది గోడలు జైలు గోడల్లా అనిపిస్తున్నాయి. అయినా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు.”అంది గద్గదంగా.
“అవును. అన్ని వైపులా తలుపులు మూసుకుపోయి ఉన్నట్లు” అన్నాను.

***

నిన్న ప్రశాంతి తో మాట్లాడిన సంగతులు నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు.
న్యూజెర్సీ లో ఉన్న జ్యోతి కి ఫోన్ చేసాను. తనతో నాకు ముఖతా పరిచయం లేదు. తను ఇండియాలో నాతో పాటూ పని చేసిన టీచర్ కి అక్క. అమెరికాలో వాళ్లు గత అయిదేళ్లుగా ఉంటున్నారట.
“మీరు ఈ దేశంలో వీసా నిబంధనల వల్ల డబ్బు సంపాదించే ఏ ఉద్యోగమూ చెయ్యలేరు. కానీ వాలంటీరుగా పని చెయ్యొచ్చు. ఇక్కడి లైబ్రరీలు, పార్కులు మొదలైన వాటిల్లో వాలంటీరుగా తీసుకుంటారు.
మీకు చదువుకునే ఓపిక, డబ్బులు ఉంటే కాలేజీలో చేరి చదువుకునే అవకాశం ఉంది. మీకు డబ్బు సంపాదించే స్టేజీ రావాలంటే మీ వీసా స్టేటస్ మారాలి. మీరు కాలేజీ లో చేరి మీ వీసాను స్టూడెంటు వీసా గా మార్చుకోవడం లేదా మీ వీసా ను వర్క్ వీసా గా మార్చే స్పాన్సర్ కంపెనీని వెతుక్కోవడం లేదా మీ ఆయన గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకుంటే మీకు EAD వచ్చే వరకు వేచి చూడడం…ఇలా అతి కొద్ది ఆప్షన్లు ఉన్నాయి. అంత వరకు మీరు ఇండిపెండెంటు కావాలన్న ఆలోచనని మర్చిపోండి. అది మిమ్మల్ని దహిస్తుంది, స్థిమితంగా బతక నివ్వదు.” అంది.
“అవునండీ, పాపం నా స్నేహితురాలు ప్రశాంతి అదే ఆలోచిస్తూ చాలా మథనపడ్తుందెప్పుడూ.” అన్నాను నా బాధని గొంతులో వినిపించనివ్వకుండా.
” ఈ దేశం లో మీకు అన్నిటికన్నా ముఖ్యంగా మనసుకు నప్పే స్నేహితులు దొరకడం కష్టం. మీరు మీ కష్టం గురించి మీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ప్రశాంతి ఉండడం అదృష్టం, ఆ అమ్మాయికి మనసుని మళ్లించుకునే మార్గాలు చెప్పి ధైర్యం చెప్పండి.” అంటూ” నేనూ మీలా వచ్చినదానినే. నిన్నా మొన్న మాకు EAD వచ్చే వరకూ నా పరిస్థితీ ఇదే. నేను పుస్తకాలు బాగా చదువుతాను. ఇక ఇంటర్నెట్టు ముందు కూర్చుంటే ఇట్టే కాలం గడిచిపోయేది. కిందటి ఏడాది టాక్సు ఫైలింగుకి సంబంధించి కోర్సొకటి చేసాను. నా బీకాం ఇందుకు పనికి వచ్చింది. ఇప్పుడు చిన్న ఉద్యోగం చేస్తున్నాను. పార్ట్ టైమయినా మనసుకి కాస్త స్థిమితంగా ఉంది. మా పిల్లలు స్కూలుకి వెళ్లొచ్చే సమయం, నా ఉద్యోగం సరిగ్గా సరిపోతాయి నాకు. మీరో పని చెయ్యండి. మరో పాపనో, బాబునో ప్లాన్ చేసుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు వీసా స్టేటస్ మారే సమయానికి పిల్లలకూ స్కూలుకి వెళ్లే వయసొస్తుంది.” అంది నవ్వుతూ.
మరుసటి వారంలో
“నీకో గుడ్ న్యూసోయ్, మనకి గ్రీన్ కార్డ్ ప్రోసెస్ రేపు మా కంపెనీ వాళ్లు మొదలుపెడుతున్నారు.” అన్నాడు సూర్య.
“అంటే మరో అయిదేళ్లు పడుతుందన్నమాట మనకు గ్రీన్ కార్డ్ రావడానికి” అన్నాను సాలోచనగా.
“అమ్మో, విషయాలు నా కంటే నీకే ఖచ్చితంగా తెలిసి పోతున్నాయి , ఇంచు మించు అంతేననుకో, ఇంకాస్త ఎక్కువ కూడా పట్టొచ్చని ఉవాచ ”
“అంటే ఇక నేను ఇంటర్నేషనల్ స్టూడెంటు వీసా ఆలోచన మానుకోవాలన్న మాట.” అన్నాను.
“హమ్మయ్య అర్థం చేసుకున్నావు. లేకపోతే ఇద్దరం చెరో వీసా తో కష్టాలు పడాలి.”
“నేను తెలుగు పీజీ కాకుండా ఏ ఇంజనీరింగో చదువుకున్నాననుకో నాకు ఏదైనా కంపెనీ వర్క్ వీసా స్పాన్సర్ చేస్తుందా” ఆశగా అడిగేను.
“చూడమ్మాయ్, అవన్నీ నాకు తెలియవు. అయినా నీ సంతోషం కోసం ఎవరినైనా అడిగి చూస్తాను. ఇవన్నీ ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోకు. మనది కాని జీవితంలో జీవించడమెందుకు చెప్పు” అనునయంగా అన్నాడు.
తను కనుక్కోడు. స్పష్టంగా అర్థం అయ్యింది నాకు. ఇలాంటి విషయాలు తనతో మాట్లాడడం కూడా అనవసరం అనిపించింది.
“భోజనానికి బయటికి వెళ్దాం, పొద్దుటి కూరతో మళ్లీ తినాలని అనిపించడం లేదు” అన్నాను.
“ఇది అమెరికా. వారానికొకసారే వంట చేసుకునే వాళ్లున్నారు తెలుసా? మా కొలీగ్ వాళ్లావిడ మరో రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుంది. నెలకు ఒక్క సారే వచ్చి వెళ్తుంది. అప్పుడే నెలకి సరిపడా సాంబారో, పప్పో చేసి ఫ్రిజ్ లో పెట్టినది అతను రోజుక్కాస్త వేడి చేసుకుని తింటాడట తెలుసా. అన్నాడు” నవ్వుతూ.
“అంటే వచ్చి నాలుగు నెలలైనా ఇంకా నేను అమెరికనైజ్ కాలేదంటావ్” అన్నాను. పైకి అన్నానే గానీ “చూసేవా, భార్యా, భర్తా ఉద్యోగస్తులైతే వచ్చే కష్టాలివీ అని నాకు అర్థం కావడానికి చెప్తున్నాడా, లేక నిజంగానే ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాడా?” అని సందేహం కలిగింది నాకు.
నా ముఖంలోని సీరియస్ నెస్ చూసి “అయ్యో, ఊరికే సరదాకి అన్నాన్లే, బయట తినాలనుందని ఫోన్ చేసి చెప్తే, వచ్చేటప్పుడు పార్శిల్ తెచ్చేవాణ్ణిగా” అంటూ
“అన్నట్లు మర్చిపోయాను, మా ఆఫీసులో పాట్లాక్ ఉంది. మనం ఈ శుక్రవారం సాయంత్రం వెళ్లాలి. నీ చేత్తో మాంచి ఘుమఘుమలాడే గారెలు చెయ్యవోయ్.” అన్నాడు.
పార్టీ లో చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న సూర్యని, కొలీగ్స్ ని చూసి భలే అసూయ పుట్టింది నాకు. వచ్చిన ఫామిలీస్ ఏదో మొక్కుబడికి వచ్చినట్లు ఎవరి పిల్లలతో వాళ్లు సతమతమవుతున్నారు. నాకు గంట తర్వాత విసుగు పుట్టడం ప్రారంభమైంది.
తిరిగి వచ్చేటప్పుడు ముభావంగా ఉన్న నన్ను చూసి “నీకేమీ నచ్చినట్లు లేదు అక్కడ, కొత్త వాళ్లని పరిచయం చేసుకుని ఈ సారి మాట్లాడితే వచ్చే ఏడాదికి వాళ్లే ఫ్రెండ్సవుతారు. మళ్లీసారి పార్టీ నీకు నచ్చుతుందిలే” అన్నాడు.
ఏం చెప్పాలి? నాకు లేనిదేదో నన్ను బాధిస్తూందని. కారు దిగేక “నేను కాస్సేపాగి ఇంట్లోకి వస్తాను” అని చెప్పాలనిపించింది.
అంతలోనే ఇక్కడెంత సేపు కూర్చున్నా సమస్య పరిష్కారమయ్యేదేమీ లేదనిపించి, “అహ.. అదేమీ లేదు. కాస్త తలపోటుగా ఉంది” అని నడిచాను ఇంట్లోకి.

***

అక్టోబరు నెల ప్రవేశించింది. చెట్లన్నీ పసుపుగా, ఎర్రగా మారి చిత్రకారులెవ్వరో కాలాన్ని కుంచెగా మార్చి అదే పనిగా వర్ణ చిత్రాలు గీస్తున్నట్లున్నాయి.
సూర్య సమాధానం చెప్పని “స్పాన్సర్ షిప్” గురించి ఇంటర్నెట్ లో వెతకడం మొదలు పెట్టాను. రెండు మూడు నంబర్లకి ఫోన్ చేసాను కూడా.
ఒక్క నంబరు కలిసింది.
“వేలమందికి ఉద్యోగాలు పోతున్నాయి. రిసెషన్ అవుతుందేమోనని భయపడ్తున్నాం. చాలా మంది వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇంజనీరింగులు చదివిన వాళ్లకే వర్క్ వీసాలు రావట్లేదండీ.” అంది ఫోన్లో అవతలి గొంతు.
ఆ సాయంత్రం ప్రశాంతి వచ్చింది.
“ఈ పిల్ల చెప్పిన మాట అస్సలు వినడం లేదు ప్రశాంతీ, ఎప్పుడూ వద్దన్న పనే చేస్తుంది” నిధి ని చూపిస్తూ అన్నాను.
“మనం మాత్రం ఏం చేస్తున్నాం? వద్దన్నదే ఆలోచించట్లేదూ! మానవ నైజమే అంతేమో ప్రియా! మనల్ని ఏదైనా పని చెయ్యొద్దని ఎవరైనా నిర్బంధిస్తే అది ఖచ్ఛితంగా చేసి తీరాలనుకునే మొండితనం మనస్సులో మొలకెత్తుతుంది. నా వరకూ నేను నిరంతరం అదే ఆలోచిస్తాను. చిత్రంగా మన దేశంలో ఎన్నో అవకాశాలున్నా అక్కడ ఉద్యోగం చెయ్యకుండా కేవలం హౌస్ వైఫ్స్ గా బతకడం లేదా కొంత మంది. ఇక్కడ అలా మనమెందుకు ఆలోచించలేకపోతున్నాం? ఇక్కడి నిబంధనలను నిర్బంధంగా ఫీల్ కావడం వల్లనా? లేక ముందంతా స్వతంత్రులుగా బతకడం వల్లనా?”
ప్రశ్నలే కానీ సమాధానాలు లేని ఆకాశం లోకి చీకటి ఆవరిస్తూంది.
నాలుగు నెలలు నలభై నెలలు గా మారాయి.
ఆన్లైన్ లో డిపెండెంటు ఫోరం లో సైన్ అప్ చేసాను.
వేల ప్రశాంతిలు, వేల ప్రియలు….అవే ప్రశ్నలు, అవే ఎదురు చూపులు.