కాలం నిరంతర ఝరి, కాలం లయకారి
అది స్థితి గతులను రచిస్తూనే
వినాశనాన్ని విరచిస్తుంటుంది
ముందు అన్నీ సమకూర్చు కుంటూ పోతుంటుంది
వెనుక సర్వం పూడ్చు కుంటూ వస్తుంటుంది
కాలం చరిత్ర అవుతుంటుంది!
* * *
పాళీ ప్రాకృత ప్రాక్తన క్షేత్రాలు దాటి
ప్రాభవం కోల్పోయిన శ్రమణం,
కర్మ కాండల ‘కాల చక్ర’ ముగ్గుల్లో చిక్కువడ్డ బౌద్ధం,
స్కై బరియల్స్ లో దేహఖండా లవుతున్న వజ్రయాన శవం,
విగ్రహాలలో స్తాణువైన సిద్దార్థం –
స్వీయ భారం తో కుంగిన హిమాలయం!
శతాబ్దాల డెడ్వేట్ కింద శిథిలమైన గ్రీకు సంస్కృతి,
మిల్లో డెబ్రి మధ్య విరిగిన వీనస్ శిల్ప ఖండం,
లాటిన్ సీలింగ్ కు వేలాడుతున్న మైకలాంజలో బూజు,
గ్లాడియేటర్ రాక్షస క్రీడలో చిందిన ఆటవిక రుధిరం,
ఆఫ్రికన్ బానిస రంగ భూములను రక్తసిక్తం చేసిన
వెనేటర్ రోమన్ బురద,
కూలిన కలోసియం,క్రుంగిన లేప్టిస్ మాగ్నా
నిన్నటి నీలి నీడల సాక్షీభూతం
నీరోడుతున్న ఆల్ప్హ్స్ హిమ శిఖరం!
సూర్యుడు అస్తమించని సామ్రాజ్య ఆధిపత్యం
కిరణ శకలాల ప్రోగులో అహంత అస్తిపంజరం,
హద్దులు దాటిన రాజ్య విస్తరణ దుష్ట కాంక్ష
స్వీయాశ్వ పద ఘట్టనలో అలగ్జాన్డర్ ఆఖరి శ్వాస,
పిరమిడ్ల చీకటి గదుల్లో చిట్లిన ఫేరో మమ్మీల తలలు,
అరబ్బు ఆయిల్ లో మునిగిన టైటానిక్ నౌకలు,
చరిత్ర పుట్టల్లో నలుగుతున్ననెమిలీకలు !
మహంజొదారొ మట్టిపోరల కింద
విశ్లథమైన మహా నాగరికత,
విస్మృతిలోకి జారిన ఒలంపియన్ జీస్ టెంపుల్,
సముద్రపు అగాధాలలో సమాధి ఐన అట్లాంటిస్ నగరం,
మటుమాయమైన ‘మాయా’ సంస్క్రతి
కాల గర్భంలో నిక్షిప్తమైన అగణిత శిథిల చరిత్రల పరంపర!
శకలాలైన ప్రాగ్ యుగాల శిథిలాల అట్టడుగున
శిలాజమైన మానవ డి.ఎన్.ఎ –
ఘనీభవించిన శిలాశ్వాస
అశేష శేష ప్రశ్నల అవశేషాలు చరిత్ర శిథిలాల కింద!
* * *
కృష్ణ బిలం పాలపుంతను మింగినప్పుడు
ఆన్రోమేడా సర్పిల గెలాక్షి మిల్కీవేను డీకొన్న నాడు
మన ధరిత్రి చరిత్ర విశ్వధూళిలో లవలేశమై పోతుందో?
అనంత దూర గ్రహాంతర వాసుల చరిత్ర పుటల్లో
అక్షరత్వం పొందుతుందో? ఏమో మరి !
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్