కవిత్వం

ప్రవాస కోకిల

ఏప్రిల్ 2014

పూలకారు మీద కోకిల షికారు
కొమ్మ కొమ్మన పుప్పొడి పొట్లం
ఆమని మీటిన కలకంఠం
అడవి పూచిన పూల పాట.

వసంత గీతాన్ని మోసుకుంటూ
వచ్చింది వలస కోకిల
కొత్తపూలను హత్తుకోవాలని.

ఇక్కడ మావిళ్లు లేవు
వేపలు లేవు, పలాశలు లేవు
లేవు మధుమాసపు మల్లెలు.

ఐనా,
వాడలేదు కోకిలమ్మ మొఖం!
స్వర్ణ వర్ణ గోల్డెన్ రాడ్
ఎర్రని పూల తివాసి పరచింది
నీలి రేకుల బ్లూ బోనెట్
స్నేహ హస్తం అందించింది
ఒళ్ళంతా తెలి పూల పొంగై
ఆపిల్ చెట్టు పలకరించింది
‘తొలి చిగురును’చూసేందుకు
వలస పక్షి రాబిన్ తిరిగొచ్చింది
ఆకు పచ్చని ఆహ్వానపత్రమై
పొరుగు చైత్రం చిగురించింది.

వసంత గీతమై వచ్చిన వలస కోకిల
కొత్త పూలను గుండెకు హత్తుకుంది!

March 22, 2014 6:58 PM
(జయభేరి మొదటి భాగం – కవిత 8)