దినం బహూకరించిన కానుక
పలుకు పలుకుగా అందింది పక్షి నుండి పక్షికి .
పచ్చికలను తొడుక్కొని పక్షాలు విప్పిన దినం
తరలి వెళ్ళింది మురళి నుండి మురళికి.
విహంగ యానాలు తెరచిన అనిల సొరంగం చివర
చిక్కని నీలి గాలిని తవ్వుతున్నవి పక్షులు.
అక్కడ ప్రవేశించింది రాత్రి.
నేను పలు ప్రయాణాలు చేసి తిరిగొచ్చినపుడు
సూర్యునికీ భౌగోళికతలకూ మధ్య
నేను పచ్చగా వేలాడుతున్నాను .
గమనించాను నేను
రెక్కలెలా పనిచేస్తాయో
కోమల తూలికా తంతీ వార్తా వాహకంగా
పరిమళాలెలా ప్రసారమౌతాయో.
నేను చూచాను పై నుండి తోటలను ,
వసంతాలను, వలలను విసిరే మత్స్యకారులను,
ఇంటి పైకప్పు పెంకులను,
నీటి పొంగుల నురగలను.
ఇదంతా నేను వీక్షించాను నా హరితాకాశం నుండి.
ఎగురుతున్న చిట్టి పిట్టల నోళ్ళకందే చిరుతిండ్లు తప్ప
నా అక్షరానికేవీ అందకుంటున్నవి
నిప్పు రంగు రెక్కల మీద మెరిసే నీటి బిందువులా
పూధూళిలో పక్షి మెరపు నృత్యం చేస్తున్నది
మూలం : పాబ్లో నెరూడా (బర్డ్ )
తెలుగు సేత : నాగరాజు రామస్వామి.
మూల విధేయత అద్బుతంగా ఉంది.
గ్రాంధిక ఛాయలు ఎక్కువైనట్లు అనిపించింది.
Thanks For your kind comment.